కర్నూలు(హాస్పిటల్): గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు చెక్‌పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. 14 ఏళ్లు నిండి బాలికలందరికీ వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉండే క్యాన్సర్ వైద్యు ల వద్దకు వద్దకు ప్రతిరోజూ 150 నుంచి 200 మంది వరకు కొత్తగా క్యాన్సర్ బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. ఆయా క్యాన్సర్ ఆసుపత్రుల్లో ప్రతిరోజూ 30 నుంచి 40 మందికి కీమోథెరపి, 50 మంది దాకా రేడియోథెరపీ చేస్తున్నారు. క్యాన్సర్ ఆసుపత్రుల్లో నిత్యం 500 మందికి పైగా ఇన్‌పేషంట్లుగా చికిత్స పొందుతున్నారు. ఇందులో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బాధితులు 20 శాతం మంది ఉన్నట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు. ఇకపై మహిళలకు ఈ క్యాన్సర్ రాకుండా చేసేందుకు కేంద్ర ప్ర భుత్వం ముందస్తుగా వ్యాక్సిన్ వేసే కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ముందుగా 14 ఏళ్లు నిండి బాలికలకు వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో 14 ఏళ్లు నిండి 15వ ఏట అడుగుపెట్టే బాలికలు 19,704 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ వేసేందుకు రంగం సిద్ధం చేశారు.
నేటి నుంచి వ్యాక్సినేషన్
జిల్లాలోని 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రాణాంతక సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించేందుకు హ్యూమన్ పాపిల్లోమా వైరస్(హెచ్‌పీవీ) వ్యాక్సిన్‌ను వేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ఈ నెల 10వ తేదీ(మంగళవారం) ఈ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. కర్నూలులో ఎ.క్యాంపులోని మెరిడియన్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎల్.భాస్కర్ తెలిపారు. 14 ఏళ్లు నిండి 15వ ఏట అడుగుపెట్టే(14వ పుట్టినరోజు జరుపుకుని 15వ పుట్టినరోజుకు ముందున్న) బాలికందరికీ ఈ వ్యాక్సిన్ వేస్తామన్నారు. గార్డిసిల్–4 వ్యాక్సిన్‌ను 0.5ఎంఎల్ మోతాదులో ఎడమ చేతికి వేస్తారని తెలిపారు. వయస్సు నిర్ధారణ కోసం ఆధార్‌కార్డు, తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రం తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. టీకా వేయించుకునే వారు యువిన్ పోర్టల్ లేదా స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. టీకా వేయించుకోవడానికి వచ్చే వారు తప్పనిసరిగా ఆహారం తిని రావాలని చెప్పారు. టీకా వేసుకున్న తర్వాత 30 నిమిషాల పాటు ఆరోగ్య కేంద్రంలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని వివరించారు.
అందుబాటులో వ్యాక్సిన్
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా టీకా
క్యాన్సర్ బాధితుల్లో
20 శాతం మందికి ఇదే సమస్య
జిల్లాలో 14 ఏళ్లు నిండిన
బాలికలు 19,704
అందుబాటులో 13,177 వ్యాక్సిన్లు


