మహానంది: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం మహానందిలో శనివారం పదహారు రోజుల పండుగను వైభవంగా నిర్వహించారు. ఏఈఓ ఎరమల మధు ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, పండితులు, అర్చకులు యాగశాలలో అంకురాలకు విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవాల తొలిరోజు పుట్టమన్ను తెచ్చి పాలల్లో తడిపిన ధాన్యములతో చేసిన అంకురార్పణ అనంతరం వచ్చిన మొలకలను రుద్రగుండం కోనేరులో శాసీ్త్రయంగా కలిపారు. అనంతరం రథం వద్దకు చేరుకుని రథాంగ దేవతలను పూజించి వారిని స్వస్థానాలకు పంపి రథాన్ని రథమండపంలోకి చేర్చారు. పలు ప్రాంతాల భక్తులు ఓం నమఃశివాయ అంటూ భక్తిశ్రద్ధలతో రథాన్ని మండపంలోకి లాగారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్‌రెడ్డి, నీలకంఠేశ్వరరాజు, ఆలయ ఇన్‌స్పెక్టర్ నాగమల్లయ్య, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అంకురాలకు మొలకలు బాగా వచ్చాయని, ఈ ఏడాది పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని వేదపండితులు తెలిపారు.


