కర్నూలు(అగ్రికల్చర్): పీఎం కిసాన్ 22వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 13న విడుదల చేయనుంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6వేల ప్రకారం ఆర్థిక సహాయాన్ని మూడు విడతలుగా విడుదల చేస్తోందని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రెండు విడతలుగా రూ.4వేలు రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదల చేసిందని, ఈ ఏడాదికి సంబంధించి మూడవ విడత సా యం ఈ నెల 13న విడుదలవుతుందని డీఏవో సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రైతులకు ఎలాంటి అనుమానాలు ఉన్నా సమీపంలో ని వ్యవసాయ కార్యాలయం, గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని సూచించారు.
మల్లన్న సేవలో..
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. సోమవారం ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న పీఠాధిపతికి సంప్రదాయాన్ని అనుసరించి రాజగోపురం వద్ద దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టిబోట్ల భరద్వాజశర్మ, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో భారతీ మహాస్వామి గౌరవార్థం వేదగోష్ఠి నిర్వహించారు. తరువాత గురువందన కార్యక్రమం జరిపారు. అనంతరం మహాస్వామి వారు అనుగ్రహ భాషణం చేశారు.


