కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీలో ఎడ్‌మెడ్ ఏఐ ఆధారిత సీబీఎంఈ పైలెట్ ప్రాజెక్టును సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతను వైద్యవిద్యలో సమర్ధ్దవంతంగా వినియోగిస్తూ విద్యార్థుల నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కళాశాలలో ఈ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. డాక్టర్ ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా అమలులో ఉన్న కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ విధానాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేయడానికి ఈ ఏఐ ఆధారిత డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టా రని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ పైలెట్ ప్రాజెక్టుకు కర్నూలు మెడికల్ కాలేజీ ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. వైద్య విద్యలో డిజిటల్ పరివర్తనకు ఇది ఒక ముఖ్యమైన అడుగు అని, విద్యార్థులు సాంకేతిక వనరులను సద్వినియోగం చేసుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలని కోరారు.
ఎడ్ మెడ్ ఏఐ ప్లాట్‌ఫామ్ ప్రత్యేకతలు
ఎడ్ మెడ్ ఏఐ ప్లాట్‌ఫామ్ ద్వారా విద్యార్థులు, అధ్యాపకులకు కింది సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. 2,695 కంటే ఎక్కువ ఎన్‌ఎంసీ గుర్తింపు పొందిన కంపెటెన్సీల ఆధారంగా రూపొందించిన డిజిటల్ లెర్నింగ్ మాడ్యూల్స్, నీట్ పీజీ, ఐఎన్‌ఐ–సీఈటీ, యుఎస్‌ఎంఎల్‌ఈ వంటి జాతీయ, అంతర్జాతీయ పరీక్షలకు ప్రత్యేక ప్రిపరేషన్ మెటీరియల్, లెక్చర్ ప్లాన్లు, ప్రజెంటేషన్సు, క్లినికల్ నోట్స్, ప్రాక్టీస్ ప్రశ్నలు, అసెస్‌మెంట్ టూల్స్, ప్రోగ్రెస్ ట్రాకింగ్ సిస్టమ్, అధ్యాపకులకు బోధనలో సులభతరం చేసే ఏఐ ఆధారిత సహాయక విధానాలు ఈ ఫ్లాట్‌ఫామ్ ద్వారా విద్యార్థుల వ్యక్తిగత అభ్యాసశైలి (పర్సనలైజ్డ్ లర్నింగ్)కు అనుగుణంగా మార్గదర్శనం లభిస్తుంది.కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీరాములు, డాక్టర్ విజయానందబాబు, డాక్టర్ సింధియా శుభప్రద, ఏఓ నాగమణి, అధ్యాపకులు పాల్గొన్నారు.


