శ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. మూడు విడతలుగా పలువురు భక్తులు ఆన్‌లైన్ ద్వారా స్పర్శ దర్శనం టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం నిర్వహించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్ని కిటకిటలాడాయి.
పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలి
నంద్యాల(అర్బన్): ఇంటర్ విద్య కీలకమని, విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలని జిల్లా సోషల్ వెల్ఫ్‌ర్ అధికారిణి చింతమణి సూచించారు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆదివారం నంద్యాల, కోవెలకుంట్ల, నందికొట్కూరు ప్రాంతాలకు చెందిన విద్యార్థిఽనిలకు ప్రేరణ, శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా చింతమణి మాట్లాడుతూ.. ఏకాగ్రత ద్వారానే లక్ష్యలను సాధించవచ్చని, తద్వారా ఉజ్వల భవిష్యత్త్ పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఏఏఎస్ డబ్ల్యూఓ అబ్దుల్ జలీల్, అధ్యాపకులు శర్మ, రఘునాథ్‌రెడ్డి , వసతి గృహపర్యవేక్షకుల శంకరమ్మ, అమ్మనిబాయి, అంబటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు కలెక్టరేట్‌లో ప్రజా వినతుల స్వీకరణ
గోస్పాడు: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఈనెల 15వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.
టీడీపీ నమ్ముకుంటే ముంచేశారు!
డోన్: టీడీపీని నమ్ముకుంటే నట్టేట ముంచేశారని టీడీపీ ప్యాపిలి మాజీ కన్వీనర్ గండికోట రామ సుబ్బయ్య విమర్శించారు. తన కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో కష్ట నష్టాలు గురైన టీడీపీ కార్యకర్తల త్యాగాలను మరచి ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి నామినేటెడ్ పదవులు కేటాయిండం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఐదేళ్లు టీడీపీ మండల కన్వీనర్‌గా పని చేసిన తనను కాదని ఇటీవల కాలంలో ఇతర నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని ప్యాపిలి మండల ఇన్‌చార్జ్‌గా నియమించడాన్ని తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోట్ల సమీప బంధువులైన పత్తికొండ నియోజకవర్గానికి చెందిన ఎద్దులదొడ్డి ప్రభాకర్‌రెడ్డి పేరు ప్రస్తావించకుండానే ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి నామినేటెడ్ పదవులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లు నమ్మించి గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశాడు.
నేడు డయల్ యువర్ ఎస్‌ఈ
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ భవన్‌లో ఈ నెల 22వ తేదీన డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్.ప్రదీప్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలను ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు 7382614308 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పవచ్చన్నారు. కాగా.. సోమవారం నిర్వహించాల్సిన డయల్ యువర్ ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లోతేటి శివశంకర్ తెలిపారు.


