రెండు చుక్కలతో నూరేళ్లు రక్షణ
● చిన్నారులందరికీ పోలియో
చుక్కలు వేయించండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
గోస్పాడు: చిన్నారులందరికీ రెండు పోలియో చుక్కలు వేయించి వారి బంగారు భవిష్యత్తుకు నిండు నూరేళ్లు రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణం నూనెపల్లి ప్రాంతంలోని ఠాగూర్ పురపాలక ప్రాథమిక పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, రాష్ట్ర వైద్యశాఖ జాయింట్ డైరెక్టర్ దేవసాగర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలియో రహిత దేశంగా భారత్ నిలవాలన్నదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమన్నారు. పోలియో వ్యాధి మూడు రకాలుగా (టైప్–1, టైప్–2, టైప్–3) ఉంటుందని, ఇందులో టైప్–2, 3 రకాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పూర్తిగా నిర్మూలించబడినట్లు తెలిపారు. అయితే టైప్–1 రకం ఇప్పటికీ కొన్ని చుట్టుపక్కల దేశాల్లో కనిపిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడా ది జిల్లాలో 2. 38 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. ప్రయాణాల్లో ఉన్న పిల్లల సౌకర్యార్థం బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్ ప్రాంతాలు తదితర ప్రాంతాల్లో 46 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రయాణాల్లో ఉన్న చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.
జిల్లాలో 96 శాతం పూర్తి
జిల్లాలో 96 శాతం పల్స్ పోలియో చుక్కలు వేసినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకటరమణ ఆదివారం తెలిపారు. జిల్లాలో 2,38,404 మంది 0–5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలి యో చుక్కలు వేయాల్సిన లక్ష్యం కాగా అందులో 2,28,356 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయగా 96 శాతం మందికి పూర్తయిందన్నారు. మిగిలిన చిన్నారులకు సోమ, మంగళ వారాల్లో వైద్య సిబ్బంది గ్రామాలలోని ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు.


