మొక్కల పెంపకంతో పర్యావరణ సమతుల్యత
కర్నూలు (అర్బన్) : మొక్కల పెంపకంతో పర్యావరణ సమతుల్యతను కాపాడినవారమవుతామని అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ విజయ్‌కుమార్ అన్నారు. సీఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా ఆర్‌ఈపీఎల్ సంస్థ, మేకింగ్ ది డిఫరెన్స్ ఎన్‌జీఓతో కలసి నన్నూరు సమీపంలోని చైన్‌వేజ్ 356.502 వద్ద మియా వాకి వనసంరక్షణ రెండో దశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఈపీఎల్ పీహెచ్ మదన్‌మోహన్ వంగర, ఎండీటీ వ్యవస్థాపకులు దీపక్ విశ్వకర్మ, జెడ్పీ హెచ్‌ఎస్ హెచ్‌ఎం నిర్మల, అశోక మహిళా ఇంజినీరింగ్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ అధికారి అబ్దుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ మియావాకి విధానంలో నాటిన మొక్కలు తక్కువ సమయంలో ఘనమైన అడవిగా మారి పక్షులు, సీతాకోక చిలుకలు, చిన్న జీవులను ఆకర్షించి జీవ వైవిధ్యాన్ని పెంచుతాయన్నారు. విద్యార్థులు చిన్న వయస్సు నుంచే మొక్కలు నాటి సంరక్షించే అలవాటును పెంపొందించుకోవాలన్నారు. మదన్‌మోహన్ వంగర మాట్లాడుతూ మియావాకి వన సంరక్షణ విధానం పట్టణాలు, రహదారి పరిసర ప్రాంతాల్లో తక్కువ స్థలంలో ఎక్కువ పచ్చదనాన్ని వేగంగా సృష్టించగల అత్యంత ప్రభావవంతమైన విధానమన్నారు. మియావాకి వనాలు ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడం, కార్బన్ ఉద్ఘారాలను శోషించడం, గాలి, శబ్ధ కాలుష్యాన్ని నియంత్రించడం, రహదారి పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో దాదాపు 14 వేల మొక్కలను నాటడం జరిగింది.


