భద్రతా తనిఖీలు కీలకం
నంద్యాల: ముఖ్య కార్యక్రమాలు, పెద్ద సమావేశాలు నిర్వహించిన సమయంలో భద్రతా తనిఖీలు కీలకం అని ఎస్పీ సునీల్‌షెరాన్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం బాంబ్ డిస్పోజల్ టీం సంబంధించి రెండు రోజుల రిఫ్రెష్‌మెంట్ కోర్స్‌ను ఆయన ప్రారంభించారు. టీమ్ సభ్యులు ఆధునిక సాంకేతికతలను ఉపయోగించాలని, బాంబు డిటెక్షన్, డిస్పోజల్ పద్ధతులపై వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. అనుమానాస్పద వస్తువులు, బ్యాగులను తనిఖీ చేయాలన్నారు. స్నిఫర్ డాగ్స్, మెటల్ డిటెక్టర్లు, ఎక్స్–రే స్కానర్లతో రోప్ పార్టీలు ఏర్పాటు చేసి మార్గాలు, వేదికలను తనిఖీ చేయవచ్చన్నారు. రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు బాబు, మంజునాథ్ , సురేష్ బాబు, బాంబు డిటెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫిబ్రవరి 28లోగా లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలి
నంద్యాల(అర్బన్): పెన్షన్‌దారులు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28లోగా లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలని నంద్యాల ట్రెజరీశాఖ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ శ్రీనివాసులు కోరారు. అఖిల భారత పెన్షన్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక నిశాంత్ భవన్‌లో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లింగస్వామి అద్యక్షతన పెన్షన్ దారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పెన్షనర్ల దినోత్సవానికి కారకులైన దివంగత నాయకులు డీఎన్ నకరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే 90 ఏళ్లు పూర్తి చేసుకున్న పెన్షనర్లను సన్మానించారు. కార్యక్రమంలో ముఖ్య సలహాదారు కై ప సుబ్బరాయుడు, ట్రెజరర్ కాశీంవలి, డేవిడ్, డీకయ్య, పద్మనాగుడు, రంగనాథరావు, శ్యాముల్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలంలో జానపద గీతానికి యువతి డ్యాన్స్
శ్రీశైలం టెంపుల్: ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీశైలంలో అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పలువురు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల శ్రీశైలానికి వచ్చిన ఓ యువతి క్షేత్రంలోని సెంట్రల్ రిసెప్షన్ ఆఫీసు సమీపంలో జానపద గీతానికి నృత్యం చేస్తూ వీడియో తీసుకుంది. ఈ వీడియోను తన ఇన్‌స్ట్రాగాం ప్రొఫైల్‌లో రీల్స్‌గా అప్‌లోడ్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు, హిందూ సంఘాల నాయకులు, పలువురు భక్తులు యువతి తీరును తప్పుబడుతున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి గీతాలకు డ్యాన్స్‌లు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని విమర్శిస్తున్నారు.
పది ఫలితాల్లో జిల్లాను ముందంజలో నిలపాలి
చాగలమర్రి: పదో తరగతి ఫలితాల్లో జిల్లాను ముందంజలో నిలపాలని డీఈఓ జనార్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఆళ్ళగడ్డ పట్టణంలోని వైపిపిఎం ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖి చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజన సదుపాయాలతో పాటు తరగతి గదులలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పదవ తరగతి సిలబస్ పూర్తయిందని, ప్రస్తుతం రివిజన్ కొనసాగుతోందన్నారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. డీఈఓ వెంట ఎంఈఓ శోభావివేకవతి, వ్యాయామ ఉపాధ్యాయులు రాణి, ఉపాధ్యాయ సిబ్బంది ఉన్నారు.
ఫాస్ట్ బౌలర్ హేమంత్ నాయక్‌కు అభినందన
ఆళ్లగడ్డ వైపిపిఎం ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి హేమంత్ నాయక్ అండర్–14 సౌత్ జోన్ పోటీలలో ఫాస్ట్ బౌలర్‌గా రాణించడం పట్ల డిఈఓ జనార్ధన్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. రాబోవు రోజుల్లో మరింత మెరుగైన శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయిలో రాణించే విధంగా ప్రోత్సహిస్తామని డీఈఓ తెలిపారు.
భద్రతా తనిఖీలు కీలకం
భద్రతా తనిఖీలు కీలకం


