అవయవదానంతో ఆయువు పోద్దాం
కర్నూలు(హాస్పిటల్): అవయవదానం చేయడానికి చాలా మంది ముందుకు రావడం లేదు. కనీసం కళ్లను దానం చేయాలన్నా వెనుకాడుతున్నారు. అంతెందుకు ప్రాణాలతో విలవిలాడుతున్న వ్యక్తికి రక్తం ఇవ్వాలన్నా సమీప బంధువులు సైతం వెనుకాడుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అవయవదానంపై జీవన్‌దాన్ ట్రస్ట్ విస్తృత ప్రచారం కల్పించింది. ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబసభ్యులను కలిసి అవయవదానం గురించి అవగాహన కల్పించి ఒప్పిస్తున్నారు. ఫలితంగా అవయవదానం చేసే వారి సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. కొన్నేళ్లుగా నేత్రదానం, రక్తదానం చేసేందుకు సైతం దాతలు విరివిగా ముందుకు వస్తున్నారు. మనిషి బతికున్నప్పుడు అవయవాలు సేకరించరని, బ్రెయిన్‌డెడ్ దశలో మాత్రమే వాటిని సేకరిస్తారని వైద్యులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. అవయవదానంకు అనుగుణంగా అవయవాలను సేకరించేందుకు, మార్చేందుకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు కర్నూలు కిమ్స్ హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్‌లకు అనుమతి లభించింది. ఈ మేరకు ఆయా ఆసుపత్రుల్లో అవయవదాన, మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారు.
మరణించాకే అవయవాల సేకరణ
మృతిచెందిన, బ్రెయిన్‌డెడ్ వ్యక్తుల నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. కానీ ఇప్పటికీ చాలా మందికి బతికున్నప్పుడు అవయవాలను సేకరిస్తారనే అపోహ ఉంది. ఇది తప్పు అని జీవన్‌దాన్ ట్రస్ట్ ప్రతినిధులు ఆయా ఆసుపత్రుల్లో బ్రెయిన్‌డెడ్ అయిన వారికి వివరిస్తున్నారు. సేకరించిన అవయవాలను ఇతరులకు అమరిస్తే వేరొకరి శరీరం ద్వారా ఈ ప్రపంచంలో జీవించే అవకాశం మళ్లీ లభిస్తుంది. అంధులుగా పుట్టేవారికి దాతల నుంచి సేకరించిన నేత్రాలను అమరిస్తే వారు మళ్లీ ఈ లోకాన్ని చూడగలుగుతారు. ఏదైనా ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారు, కొన్ని వ్యాధులకు చికిత్స పొందుతూ బ్రెయిడ్ డెడ్ అయి ఉన్న వారి అవయవాలను ఇతరులకు అమర్చేందుకు సేకరిస్తారు.
ఎనిమిది మందికి పునర్జన్మ
అవయవదానానికి అంగీకరించిన వ్యక్తి నుంచి గుండె, మూత్రపిండాలు, పాంక్రియాస్(క్లోమగ్రంధి), ఊపిరితిత్తులు, కాలేయం, ప్రేగులు, చర్మం టిష్యూ, చేతులు, ముఖం, స్టెమ్‌సెల్స్, కళ్లు, ఎముకలో మూలిగను ఇతరులకు అమర్చే అవకాశం ఉంది. ఒక కిడ్నీ, కాలేయంలో కొంత భాగం, కొద్దిగా ఎముక మజ్జను బతికుండగానే దగ్గరి వారి కోసం దానం చేయవచ్చు. బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి నుంచి వారి కుటుంబసభ్యుల సమ్మతితో ఇతర అవయవాలను సేకరిస్తుంటారు. వీటి సాయంతో మరో 8 మందికి ఊపిరిపోసే వీలుంది.
ఒకరి అవయవ దానంతో
8 మందికి ప్రాణం
ముందుకు వస్తున్న జనం
బ్రెయిన్ డెడ్ తర్వాతే
అవయవాల సేకరణ
కర్నూలు జీజీహెచ్, రెండు ప్రైవేటు
ఆసుపత్రులకు అవయవ మార్పిడికి
అనుమతి
జీవన్‌దాన్ ట్రస్ట్ చొరవతో
చురుగ్గా కార్యక్రమం


