రబీలోనూ యూరియా వెతలు!
కోవెలకుంట్ల: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రైతులు యూరియా కష్టాలు ఎదుర్కొనగా రబీ సీజన్‌లో అదే పరిస్థితులు తలెత్తాయి. వివిధ పంటల సాగులో యూరియా వినియోగిస్తుండగా ప్రభుత్వం అరకొరగా సరఫరా చేస్తుండటంతో రైతులకు కష్టాలు తప్పడంలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆయా సీజన్లలో రైతులకు కావాల్సిన యూరియా, డీఏపీ, ఇతర కాంప్లెక్స్ ఎరువులను సరఫరా చేసింది. పంటల్లో వాటిని వినియోగించి అధిక దిగుబడులు సాఽధించారు. చంద్రబాబు ప్రభుత్వంలో యూరియా కొరత వేధిస్తోంది.
అవసరం ఇలా..
జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది ఖరీఫ్ వరి కోత, నూర్పిడి పనులు పూర్తయ్యాయి. రబీలో ఎండకారు వరి సాగు చేసేందుకు సమాయాత్తమవుతున్నారు. బోర్లు, బావులు, కుందూనది, పాలేరు, కుందర వాగు తదితర నీటి ఆధారంగా 29,084 హెక్టార్లలో కర్నూలు, నంద్యాల సోనా, షుగర్‌లెస్, 555 రకాలకు చెందిన వరిని సాగు చేసేందుకు వరి నారుమడులను సిద్ధం చేసుకున్నారు. అలాగే జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో 12,032 హెక్టార్లలో మొక్కజొన్న సా గు చేయాల్సి ఉంది. అయితే లక్ష్యాన్ని మించి 12,888 హెక్టార్లలో సాగు చేయగలిగారు. 29,212 హెక్టార్లలో మహేంద్ర, హైటెక్, పచ్చజొన్న రకాలు సాగు కావాల్సి ఉండగా ఆయా మండలాల్లో 21,435 హెక్టార్లలో సాగైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా పంటలకు యూ రియా వేయాల్సి ఉండగా ఎరువు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
రైతులకు రాజకీయ ముద్ర వేస్తూ!
రైతు సేవా కేంద్రాలకు ఇటీవల కాలంలో అరకొరగా యూరియా సరఫరా అయ్యింది. అయితే టీడీపీ నాయకులు రైతులకు రాజకీయ ముద్ర వేసి యూరియా అందకుండా చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల సిఫారసు లేనిదే రసాయన ఎరువులు ఇవ్వడం లేదు. టీడీపీ నేతల ఒత్తిళ్లతో రబీ సీజన్‌లో రైతులకు యూరియా ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి. మొక్కజొన్న, జొన్న పంటల ఎదుగుదలలో ఎకరాకు కనీసం ఒక బస్తా యూరియా వినిగియోగించాల్సి ఉంది. అలాగే ఈ నెలాఖరు నుంచి వరి నాట్లు వేయాల్సి ఉంది. యూరియా రావడం లేదని అధికారులు సమాధానం ఇస్తుండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించడంతోనే ఈ సమస్య తలెత్తింది.
రబీ సీజన్‌లో నాలుగు ఎకరాల సొంత పొలంలో జొన్న పంట సాగు చేశా. ప్రస్తుతం పైరు నెల రోజుల దశలో ఉంది. మరో 10 ఎకరాల్లో ఎండకారు వరి సాగు చేసేందుకు నారుమడి సిద్ధం చేసుకున్నా. జొన్నలో ఎకరాకు రెండు బస్తాలు, వరిలో ఎకరాకు ఒక బస్తా యూరియా అవసరం. పదిహేను రోజుల నుంచి యూరియా దొరక్క అవస్థలు పడుతున్నాం. – వెంకటేశ్వరరెడ్డి, రైతు,
కంపమల్ల, కోవెలకుంట్ల మండలం
ఖరీఫ్ సీజన్ నుంచి రైతులకు యూరియా దొరకడం లేదు. గత నెలలో మూడున్నర ఎకరా సొంత పొలంలో మొక్కజొన్న పంట సాగు చేశా. పైరు ఎదుగుదలకు ప్రస్తుతం యూరియా వేయాల్సి ఉంది. రైతు సేవా కేంద్రాలకు వెళితే దొరకడం లేదు. రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. అధికారులు రైతు సేవా కేంద్రాలకు యూరియా సరఫరా చేసి కొరత తీర్చాలి.
– కుళాయప్ప, రైతు,
అమడాల, కోవెలకుంట్ల మండలం
బ్లాక్ మార్కెట్‌లో లభ్యం
రైతు సేవా కేంద్రాల్లో యూరియా దొరక్కపోవడంతో రైతులు బ్లాక్ మార్కెట్‌లో కొనాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం నిర్ణయించి ధర ప్రకారం యూరియా బస్తా రూ. 268 కాగా బ్లాక్ మార్కెట్‌లో రూ. 350 నుంచి రూ. 400 వరకు అమ్ముతున్నారు. వివిధ పంటల్లో యూరియా వినియోగం తప్పని సరి కావడంతో అంత మొత్తం చెల్లించి కొనుగోలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. సంబంధిత జిల్లా అధికారులు చర్యలు తీసుకుని రైతులకు సకాలంలో రైతు సేవా, మన గ్రోమోర్ కేంద్రాలు, సహకార సంఘాల ద్వారా యూరియాను సరఫరా చేయాలని కోరుతున్నారు.
బస్తా యూరియా కోసం
తప్పని అవస్థలు
రైతు సేవా కేంద్రాలకు
అరకొర సరఫరా
బస్తా ధర రూ. 268..
మార్కెట్‌లో రూ. 400
వరి, మొక్కజొన్న, జొన్న పంటలకు
యూరియా వినియోగం
రబీలోనూ యూరియా వెతలు!
రబీలోనూ యూరియా వెతలు!


