17న వెల్దుర్తిలో జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

17న వెల్దుర్తిలో జాబ్‌మేళా

Dec 16 2025 4:45 AM | Updated on Dec 16 2025 4:45 AM

17న వ

17న వెల్దుర్తిలో జాబ్‌మేళా

కర్నూలు(సెంట్రల్‌): నైపుణ్య అభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 17న వెల్దుర్తిలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు, నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి కోరారు. సోమవారం జాబ్‌మేళాకు సంబంధించిన పోస్టర్‌ను జేసీ నూరుల్‌ ఖమర్‌తో కలసి కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డిసెంబర్‌ 17న వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాకు 14 ప్రైవేట్‌ కంపెనీలు 500 ఖాళీల భర్తీ కోసం వస్తున్నట్లు చెప్పారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉండి పది, ఇంటర్‌, డిగ్రీ, ఐటీఐ, బీటెక్‌, పీజీ చదివివన వారు పాల్గొనాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9603303354,7981222035 లను సంప్రదించాలి కోరారు. డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, ఉపాధి కల్పన అధికారి దీప్తి నైపుణ్య అభివృద్ధి సంస్థ శిక్షణాధికారి ఆనంద్‌రాజ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

డ్వామా పీడీ వెంకటరమణయ్య బదిలీ

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ (డ్వామా పీడీ) పి.వెంకటరమణయ్య బదిలీ అయ్యారు. పంచాయతీ రాజ్‌ శాఖలో డివిజినల్‌ డెవలప్‌మెంటు ఆఫీసర్‌ అయిన ఈయన గత ఏడాది నవంబరు 20 నుంచి డ్వామా పీడీగా విధులు నిర్వహిస్తున్నారు. శిక్షణకోసం విశాఖపట్టణానికి వెళ్లగా ఉన్నట్టుండి ఈయనను అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపల్‌ కమిషనర్‌గా డిప్యుటేషన్‌పై నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్థానంలో ఎవ్వరినీ నియమించలేదు.

‘భవాని’ భక్తులను కాపాడిన డివైడర్‌

శ్రీశైలం: దోర్నాల చెక్‌పోస్టు దాటిన తర్వాత ఘాట్‌ రోడ్‌లో టూరిస్ట్‌ బస్సు డివైడర్‌ పైకెక్కింది. బస్సులో ‘భవాని’ భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. దోర్నాల పోలీసులు కథనం మేరకు.. భవాని మాలలో ఉన్న స్వాములు విశాఖపట్నంలో టూరిస్ట్‌ బుక్‌ చేసుకుని మార్గమధ్యంలోనే అన్ని క్షేత్రాలను దర్శించుకుని విజయవాడకు వచ్చారు. ఆదివారం సాయంత్రం మాల విరమణ చేశారు. అనంతరం విజయవాడ నుంచి బయలుదేరి శ్రీశైలం సందర్శించడానికి దోర్నాల ఫారెస్ట్‌ చెక్‌ పోస్ట్‌ చేరుకున్నారు. సోమవారం ఉదయం దోర్నాల చెక్‌ పోస్ట్‌ చేరుకొని అక్కడి నుంచి శ్రీశైలం బయలుదేరారు. ఘాట్‌ ఎక్కుతుండగా బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ పైకెక్కి నిలిచిపోయింది. ఆ డివైడరే బస్సులో ఉన్న 40 మంది భవాని దీక్ష స్వాముల ప్రాణాలు కాపాడినట్లు అయ్యింది. బస్సు డివైడర్‌ పై నిలబడకపోతే పక్కనే ఉన్న లోతైన లోయలో కిందపడిపోయేదని పోలీసులు తెలిపారు.

నల్లమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదం

మహానంది: నంద్యాల – గిద్దలూరు నల్లమల ఘాట్‌ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. గిద్దలూరు నుంచి నంద్యాలకు వస్తున్న డీసీఎం లారీ, బైక్‌ ఎదురెదురై ఢీకొన్నాయి. వరి కోత మిషన్‌ యంత్రాన్ని డీసీఎం లారీలో నంద్యాల వైపు తీసుకొస్తుండగా నంద్యాల నుంచి గిద్దలూరు వైపు బైకుపై వెళ్తున్న చెన్నూరుకు చెందిన రామాంజనేయులు, అయ్యలూరు గ్రామానికి చెందిన నాగేంద్రుడు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులతో పాటు ప్రయాణికులు చికిత్స నిమిత్తం 108 వాహనం ద్వారా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహానంది పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

రైలు కిందపడి టైలర్‌ ఆత్మహత్య

ఆదోని సెంట్రల్‌: గూడ్స్‌ రైలు కిందపడి టైలర్‌ రమేష్‌(45) ఆత్మహత్య చేసుకున్నట్లు ఆదోని రైల్వే పోలీసు స్టేషన్‌ హెచ్‌సీ శివరామయ్య సోమవారం విలేకరులకు తెలిపారు. కోసిగి గ్రామానికి చెందిన ఈయన కుటుంబ కలహాలతో కలత చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. స్టేషన్‌ మాస్టర్‌ సమాచారం మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

తేనెకు వెళ్లి వృద్ధుడి మృతి

వెల్దుర్తి: అటవీ తేనె కోసం వెళ్లి ఓ వృద్ధుడు మరణించాడు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని రామళ్లకోటకు చెందిన మగ్బుల్‌ (66)కు తేనె జోపడం అలవాటు. సోమవారం ఇంట్లో భార్యకు చెప్పి వెల్దురి పట్టణ సమీపంలోని బ్రహ్మగుండం క్షేత్రం వైపు తేనె కోసం వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగిరాకపోవడంతో భార్య మహబూబ్‌బీ గాలింపు చేపట్టింది. బ్రహ్మగుండం క్షేత్రంలో పాత కొనేరుకు వెళ్లే దారిలో మగ్బుల్‌ విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన కొందరు ఆమెకు సమాచారం అందించారు. తన భర్త ఆరోగ్యం సరిగా ఉండేది కాదని, అనారోగ్యంతోనే మృతి చెంది ఉంటాడని ఆమె తెలిపారు.

17న వెల్దుర్తిలో జాబ్‌మేళా 1
1/3

17న వెల్దుర్తిలో జాబ్‌మేళా

17న వెల్దుర్తిలో జాబ్‌మేళా 2
2/3

17న వెల్దుర్తిలో జాబ్‌మేళా

17న వెల్దుర్తిలో జాబ్‌మేళా 3
3/3

17న వెల్దుర్తిలో జాబ్‌మేళా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement