రోడ్డు వేయాలి.. లీజు రద్దు చేయాలి
● పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు ఇచ్చిన ప్రజలు
కర్నూలు(సెంట్రల్): దేవనకొండ మండలం నేలతలమర్రి నుంచి తిప్పతలమర్రికి రోడ్డు నిర్మించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.1.5 కోట్లు నిధులు మంజూరు చేసిందని, ఇంత వరకు పనులు మొదలు ప్రారంభించలేదని, చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరికి ప్రజలు అర్జీ ఇచ్చారు. ఆలూరు మండలం హత్తిబెళగల్ సమీపంలో 20 ఎకరాలను ఐరన్‌ఓర్ లీజుకు ఇచ్చారని, గతంలో ఐరన్ ఓర్ పేలుడులో దాదాపు 16 మంది చనిపోయారని, లీజు రద్దు చేయాలని ఆ గ్రామస్తులు కలెక్టర్‌కు విన్నవించారు. కల్టెరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. ఓర్వకల్లు మండలం హుస్సేనాపురం వెలుపల పొలాల్లో వైన్ షాపును తొలగించాలని, ఎమ్మిగనూరు క్లస్టర్‌లో మంజూరైన మినీ గోకులాలను టీడీపీ వాళ్లకు తప్ప ఎవరికీ ఇవ్వడంలేదని, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న డయాగ్నోస్టిక్ సెంటర్లను వెంటనే సీజ్ చేయాలని అర్జీలు ఇచ్చారు.


