విభిన్న ప్రతిభావంతులకు అండగా ఉందాం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
గోస్పాడు: విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లో రాణించేలా ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాధారణ ప్రజానీకం – విభిన్న ప్రతిభావంతులు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ సమాన అవకాశాలతో ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. భవిత కేంద్రాలకు వచ్చే చిన్నారుల తల్లిదండ్రులకు నైపుణ్య శిక్షణలు అందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రత్యేక సెలవులు, వాష్‌రూమ్స్, ర్యాంపులు ఏర్పాటు వంటి అంశాలపై కూడా త్వరిత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ చైర్మన్ గడుపూటి నారాయణ స్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రారంభించిన ‘ఇంద్రధనస్సు’ పథకంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, టిడ్కో గృహాల్లో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు, సబ్సిడీ రుణాలు, జిల్లాలో దివ్యాంగ భవన్ ఏర్పాటు వంటి వరాలు ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ అధికారి రయిజ్ ఫాతిమా, డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి కళ్యాణి, జిల్లా నైపుణ్య అధికారి శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ గ్రేసీ తదితరులు పాల్గొన్నారు.


