పశుపోషణకు గడ్డుకాలం
వరిగడ్డికి నేడు విపరీతమైన డిమాండ్ పెరిగింది. నీటిపారుదల ప్రాంతాల్లో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. వేసవిలో మేత సమస్య నుంచి కొంతమేర గట్టెక్కేందెకు రైతులు వరిగడ్డిపై దృష్టి సారించారు. వాస్తవంగా ఈ గడ్డిలో ఎలాంటి పోషకాలు ఉండవు. ఈ గడ్డిని యూరియాతో ట్రీట్‌మెంటు చేసుకుంటే 4 శాతం ఉండే అవకాశం ఉంది. యూరియా ట్రీట్‌మెంటు చేసుకునే పరిస్థితి జిల్లాలో లేదు. జిల్లాలోని తుగ్గలి, మద్దికెర, వెల్దుర్తి, క్రిష్ణగిరి, దేవనకొండ, ఆదోని, ఆస్పరి, కొడుమూరు, గూడూరు, సీ.బెళగల్ తదితర మండలాల రైతులు వరిగడ్డిపై దృష్టి సారించారు. నంద్యాల జిల్లా డోన్ నియోజక వర్గానికి కూడా పశుగ్రాసం, నీటి సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గత ఏడాది ట్రాక్టరు వరిగడ్డికి రూ.10 వేల వరకు ధర లభించింది. ఈ సారి రూ.13 వేల నుంచి రూ.15 వేల వరకు ధరలు పెరిగిపోయాయి.
కర్నూలు(అగ్రికల్చర్): పశువుల మేతకు పనికి వచ్చే పంటల సాగు ఏటా తగ్గిపోతోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో ముందస్తు వర్షాలకు 12,88,700 ఎకరాల్లో పంటలు సాగు కాగా అందులో కేవలం 2.96 లక్షల ఎరాల్లోనే పశుగ్రాసానికి పనికి వచ్చే పంటలు ఉన్నా యి. దీంతో ఈ వేసవిలో పశుగ్రాసం కొరత వేధించనుంది. ప్రస్తుతం పచ్చి మేత అందుబాటులో ఉంది. ఫిబ్రవరి, మార్చి నుంచి పశుగ్రాసం కొరతతో పాటు తాగునీటి సమస్య కూడా ఏర్పడే ప్రమాదం ఉందని వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ అధికారులు అంచనా వేశారు. తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా కొంతవరకు ఊరట కలిగించే అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు పాలనలో ఈ దిశగా ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. వేరుశనగ, కొర్ర, మొక్కజొన్న, సజ్జ వంటి పంటల సాగు విస్తీర్ణం పెరిగి తే పశుగ్రాసం సమస్య తగ్గుతోంది. ఈ పంటల సాగు ను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయడం, ధరలు పడిపోయినప్పుడు మద్దతు ధరతో కొనుగోలు చేయడం తదితర రాయితీలు ఇస్తే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. కాని 2024–25, 2025–26 సంవత్సరాల్లో చంద్రమాబు సర్కారు ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 15 ఏళ్ల క్రితం వరకు జిల్లాలో వేరుశనగ దాదాపు 5.75 లక్షల ఎకరాల్లో సాగు అయ్యేది. కొర్ర, సజ్జ తదితర పంటల సాగు విస్తీర్ణం కూడా మెరుగ్గా ఉండేది. ఇందువల్ల అప్పట్లో పశుగ్రాసానికి సమస్య ఉండేది కాదు. ప్రస్తుతం ఆహార పంటలు, పప్పుదినుసులు. నూనెగింజల పంటలకు ప్రోత్సహా కాలు లేకపోవడంతో రైతుల దృష్టి వాణిజ్య పంటలపై పడింది. ఈ ఏడాది వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరగడం, పశుగ్రాసానికి పనికి వచ్చే పంటల సాగు తగ్గిపోవడంతో పశుపోషణ భారం కానుంది.
వేసవి గట్టెక్కేదెలా...
జిల్లాలో తెల్ల జాతి పశువులు 2,35,586, నల్లజాతి పశువులు 1,26,784 ప్రకారం మొత్తం 3,62,370 ఉన్నాయి. గొర్రెలు 11,03,043, మేకలు 3,04,744 ప్రకారం 14,07,787 ఉన్నాయి. జాతీ పశువులకు రోజుకు 30 కిలోల పచ్చి మేత, 7–8 కిలోల ఎండు మేత అవసరం, నాటు పశువులకు 15 కిలోల పచ్చిమేత, 5–6 కిలోల ఎండుమేత అవసరం. రానున్న రోజుల్లో రోజుకు మేత లభించని పరిస్థితి
ఏర్పడనుంది. పశుగ్రాసం కొరత బారిన పడకుండా ఉండేందుకు కొందరు రైతులు ఇప్పటి నుంచే పశువులను తగ్గించుకుంటూ వస్తున్నట్లు సమాచారం. రెండు, మూడు వారాలుగా పశువుల అమ్మకాలు సంతల్లో 15–20 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది.
వరిగడ్డికి పెరిగిన డిమాండ్...
అధిక వర్షాలతో దెబ్బతిన్న వరి, మొక్కజొన్న
ఈ ఏడాది ఆగస్టు నుంచి కురిసిన అధిక వర్షాల వల్ల పంటలు నీట మునిగి పూర్తిగా దెబ్బతిన్నాయి. వరిగడ్డితో సహా వేరుశనగ, మొక్కజొన్న వంటి పంటలు కుళ్లిపోయాయి. వర్షాల వల్ల ఒకవైపు దిగుబడులు పడిపోగా.. మరోవైపు పశువులకు మేత లేకుండా పోయింది. ఇందువల్ల రానున్న రోజుల్లో పశుగ్రాసం కొరత ఉక్కిరి, బిక్కిరి చేసే ప్రమాదం ఉందని రైతులు ఊహిస్తున్నారు. మేత సమస్య నుంచి బయటపడేందుకు పశుసంవర్ధక శాఖ దగ్గర కనీస ప్రణాళిక లేకపోవడం గమనార్హం.
వేసవిలో మేత, నీటి సమస్య
తీవ్రంగా ఉండే ప్రమాదం
ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో
చంద్రబాబు సర్కారు విఫలం
ప్రోత్సాహకాలు లేకపోవడంతో
తగ్గుతున్న కొర్ర, వేరుశనగ,
సజ్జ, జొన్న సాగు
వరిగడ్డికి పెరిగిన డిమాండ్


