యువకుడి అవయవదానం
ఆత్మకూరు: రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి యువకుడు ప్రశాంత్ మృతి చెందడంతో కుటుంబ సభ్యుల కోరిక మేరకు అవయవదానం చేశారు. ఆత్మకూరు పట్టణం తోటగిరిలో నివాసం ఉంటున్న ప్రశాంత్ అనే యువకుడు గత శుక్రవారం హుసేనాపురంలో బంధువుల దగ్గరికి వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ యువకుడు కర్నూలు నగరంలోని కిమ్స్ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుతూ శనివారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు అవయవదానం చేశారు. ప్రశాంత్ గుండెను తిరుపతికి, ఊపిరితిత్తులు బెంగళూరుకు, కిడ్నీలు కర్నూలుకు, లివర్ అనంతపురానికి, కళ్లు కర్నూలు వైద్యశాలలకు అందజేశారు. ఆదివారం మృతదే హాన్ని ఆత్మకూరుకు చేర్చి అంత్యక్రియలు నిర్వహించారు. పాములపాడు మండలం బానుముక్కల టర్నింగ్ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రశాంత్ తలకు తీవ్ర గాయాలై చికిత్స ఫలించక మృతిచెందాడని సీఐ రాము తెలిపారు. ప్రశాంత్ మరణం కుటుంబానికి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు.
కెరీర్ ఫెస్ట్‌కు సన్నద్ధం
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు పాఠశాల స్థాయిలో కెరీర్ ఫెస్ట్‌ను పకడ్బందీగా నిర్వహించాలని నంద్యాల జిల్లా సమగ్ర శిక్ష శాఖ అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త నిత్యానంద రాజు, జీసీడీఓ నాగసువర్చలు అన్నారు. స్థానిక కార్యాలయంలో కెరీర్ ఫెస్ట్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 6వ తేదీ నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో స్వీయ అవగాహన, నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్తు కెరీర్ ప్రణాళిక, సామర్థ్యాలను పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. 15న విద్యార్థుల్లో స్వీయ అవగాహన, కుటుంబ సభ్యుల వృత్తులపై అవగాహన కార్యక్రమాలు, 16న పదవ తరగతి, ద్వాదశ తరగతి, చిత్రాలు, చార్ట్‌లు, నిపుణుల ఉపన్యాసాల ద్వారా విద్యార్థులకు అవగాహన, 17న భవిష్యత్తులో అవసరమైన నైపుణ్యాలపై దృష్టి, జీవన నైపున్యాల అభివృద్ధికి కార్యకలాపాలు, 18న పాఠశాల స్థాయి కెరీర్ ప్రదర్శన, విద్యార్థుల ప్రతిభా ప్రదర్శనలు, ఉత్తమ నమూనాల ఎంపిక, బహుమతుల అందజేస్తామన్నారు.
పతనమైన కొత్తిమీర ధర
గోనెగండ్ల: ఈ ఏడాది సాగుచేసిన పంటలకు ఆశించిన మేర ధరలు లేకపోవడంతో రైతులు బోర్లు బావుల కింద కొత్తిమీర సాగు చేశారు. గత 20 రోజుల క్రితం ఒక మడి ధర రూ.800 ఉండగా నేడు రూ.100కు పడిపోయింది. ఒక్కసారిగా ధర పతనం కావడంతో రైతులు విలవిల్లాడుతున్నారు. ధర లేకపోవడంతో వ్యాపారులు రైతులకు కనిపించకుండా పోతున్నారు. కొత్తిమీర పంట తక్కువ కాలంలోనే వస్తుందని గోనెగండ్ల మండలంలో వెయ్యి ఎకరాలలో సాగుచేశారు. ఒక ఎకరాకు రూ.25వేల నుంచి రూ.30వేల వరకు పెట్టుబడి అవుతుందని రైతులు తెలుపుతున్నారు. ఎకరాలో 200 నుంచి 220 వరకు మడులు వేస్తా రు. ఆదివారం ఒక మడి ధర రూ.100 పలుకుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
యువకుడి అవయవదానం


