నేడు కలెక్టరేట్‌లో ప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఈనెల 15వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.
కొనసాగుతున్న నీటి విడుదల
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 2వేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నట్లు ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీశైలం జలాశయంలోకి 11,238 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా డ్యాంలో 880.70 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్ద 879.70 అడుగుల నీటిమట్టం నమోదైనట్లు తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ గేట్లు మూసి వేసి కేవలం ఎన్‌సీఎల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మూడు జన్‌రేటర్ల ద్వారా 1.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 2వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నీటిని బానకచర్ల నీటి నియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 1,000 క్యూసెక్కులు, జీఎన్‌ఎస్‌ఎస్ కాల్వకు 500, కేసీఎస్కేప్ కాల్వకు 500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు ఏఈ దేవేంద్ర తెలిపారు.


