ఇద్దరు మహిళల అరెస్ట్
● పోలీసు అధికారులే టార్గెట్‌గా ఫొటోల మార్ఫింగ్ ● రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం
కోవెలకుంట్ల: పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని వారి ఫొటోలు మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్, ఇన్‌స్ర్ట్రాగాం అకౌంట్లలో పోస్టు చేస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో గురువారం కొలిమిగుండ్ల సీఐ రమేష్‌బాబు అందించిన వివరాలకు మేరకు.. ఉయ్యాలవాడ మండలం మాయలూరుకు చెందిన బందెల స్పందన, ఆమె తల్లి బందెల మార్తమ్మ ప్రస్తుతం కోవెలకుంట్ల పట్టణంలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. కొన్ని నెలల నుంచి వీరిద్దరూ ఫేస్‌బుక్, తదితర సోషల్ మీడియా అకౌంట్లను ప్రారంభించి కోవెలకుంట్ల, సంజామల, రేవనూరు, ఆళ్లగడ్డ పోలీస్‌స్టేసన్ల పరిధిల్లో గతంలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న డ్రస్‌లో ఉన్న పోలీస్ అధికారుల ఫోటోలు తారుమారు చేసి వాటిల్లో పదే పదే పోస్టు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గత సెప్టెంబర్ 7వ తేదీ, నవంబర్ 26వ తేదీన కోవెలకుంట్ల పోలీస్‌స్టేషన్లలో వీరిద్దరిపై రెండు కేసులు నమోదు చేశారు. అంతేకాక ఈ ఏడాది మే 6వ తేదీన కోవెలకుంట్ల పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల విధులకు ఆటంకం కల్గించి దౌర్జన్యం చేయడంతో అప్పట్లో మరో కేసు నమోదైంది. ఆయా కేసుల్లో నిందితులుగా ఉన్న వీరిని కొలిమిగుండ్ల సీఐ తమ సిబ్బందితో అరెస్ట్ చేసి ఫొటోల మార్ఫింగ్‌కు వాడుతున్న రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలు పదేపదే నేరాలకు అలవాటు పడి ఇప్పటికీ మూడు కేసుల్లో నిందితులుగా ఉండటంతో వీరిని జిల్లా బహిష్కరణ చేయాలని జిల్లా కలెక్టర్‌కు నివేదించినట్లు సీఐ వివరించారు.


