విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
సి.బెళగల్: మండల కేంద్రం సి.బెళగల్‌లో విద్యుత్ స్తంభాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. గ్రామంలోని ఎస్సీ కాలనీ దగ్గర ఎమ్మిగనూరు – గూడూరు ప్రధాన రోడ్డు పక్కన విద్యుత్ స్తంభం ఉంది. మంగళవారం ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా స్తంభం రెండుగా విరిగి విద్యుత్ తీగలు పక్కనున్న దుకాణాలపై పడ్డాయి. ఘటన జరిగిన వెంటనే విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విషయం తెలుసుకున్న మండల విద్యుత్ ఏఈ సుకుమార్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని విరిగిన విద్యుత్ స్తంభం స్థానంలో నూతన స్తంభం ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.


