సీనియర్ సిటిజన్లకు న్యాయ సేవలు
కర్నూలు (టౌన్): సీనియర్ సిటిజన్లు, పెన్షనర్లకు చట్టపరంగా సమస్యలు వస్తే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ టోల్ ఫ్రీ నంబర్ 15100 కు కాల్ చేస్తే వారికి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి అన్నారు. బుధవారం స్థానిక సి.క్యాంపులోని టీజీవీ కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకరప్ప ఆధ్వర్యంలో పెన్షనర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ఉద్యోగుల పెన్షన్ సౌకర్యంపై 1982 సంవత్సరం డిసెంబర్ 17న జస్టిస్ చంద్రచూడ్ ఇచ్చిన తీర్పుతో పెన్షనర్లకు భద్రత కలిగిందన్నారు. ఈ తీర్పు కోసం శ్రమించిన దివంగత డి.ఎన్.సకార జ్ఞాపకార్థం పెన్షనర్ల దినోత్సవం ప్రతి ఏటా డిసెంబర్ 17 న జరుపుకుంటున్నామన్నారు. జాయింట్ కలెక్టర్ నూరల్ ఖమర్ మాట్లాడుతూ.. విశ్రాంత ఉద్యోగుల సేవలు మరువలేనివన్నారు. విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ వారి హక్కు అన్నారు. ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ భాస్కర్ వర్మ, స్పెషల్ పోలీసు డీఎస్పీ మహబూబ్ బాషా, రిటైర్డు జాయింట్ కలెక్టర్ రామస్వామి, రాయపాటి శ్రీనివాసులు పాల్గొన్నారు.


