పార్థసారథి.. ఆదోనిలో అభివృద్ధి ఎక్కడా?
● ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి
ఆదోని టౌన్: ఆదోనిలో అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే పార్థసారథి పట్టణంలో ఎక్కడెక్కడా.. ఏమి చేశారో చూపించాలని వైఎస్సార్‌సీపీ ఆదోని ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆదోనికి షాపింగ్ మాల్స్ తీసుకొచ్చాను.. అభివృద్ధి చేశాను.. ఉపాధి కల్పించానని.. చెప్పుకుంటున్న ఎమ్మెల్యేకు అభివృద్ధి అంటే అర్థం తెలుసా.. అని ప్రశ్నించారు. షాపింగ్‌మాల్స్‌తో స్థానిక చిన్నచిన్న వస్త్ర వ్యాపా రులు దుకాణాలను మూసుకునే పరిస్థితి నెలకొందన్నారు. షాపింగ్ మాల్స్‌లో పనిచేసే వారికి కూడా అతి తక్కువ జీతాలు ఉంటాయని, వారు ఆ జీతాలతో బతకలేని పరిస్థితి ఉందన్న విషయాన్ని పార్థసారథికి తెలియదా అని సూటిగా అడిగారు. బసాపురం ఎస్‌ఎస్ ట్యాంకు మరమ్మతులకు ఎమ్మెల్యే పార్థసారథి నిధులు మంజూరు చేయించానని గొప్ప లు చెప్పుకుంటున్నారన్నారు. అసలు బసాపురం ఎస్‌ఎస్ ట్యాంకు మరమ్మతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు మంజూరు కాలేదన్నారు. మున్సిపాలిటీకి 16 ఫైనాన్స్, జనరల్ ఫండ్స్ నిధులు వస్తాయని, మున్సిపాలిటీకి ఎమ్మెల్యే నిధులు తెప్పించిన దాఖలాలు కూడా లేవన్నారు. ఎమ్మెల్యేగా 18 నెలల్లో ఆదోని ప్రాంత అభివృద్ధికి ఏమి చేశారో ప్రజలకు చూపెట్టాలని హితవు పలికారు. ఎమ్మెల్యేను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఇకనైనా అబద్ధాలు చెప్పడం మానుకుని ఆదోని నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.


