పరిశ్రమ పేరుతో రూ.2 కోట్ల మోసం
ఆదోని అర్బన్: పరిశ్రమ ఏర్పాటు చేస్తానని కర్నూలుకు చెందిన వ్యక్తి దాదాపు రూ.2 కోట్లు మోసం చేశాడని సీఐ రామలింగమయ్య శుక్రవారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన భీమేష్, ధనలక్ష్మి పీవీసీ పైపులు పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. వారికి కర్నూలుకు చెందిన రిజ్వాన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. పరిశ్రమ ఏర్పా టు చేస్తానని అనుమతులు కూడా తీసుకొస్తాన ని చెప్పి 2023లో రూ.కోటి ఆ దంపతుల వద్ద ఆర్‌టీజీఎస్, నగదు రూపంలో తీసుకున్నారు. అంతేగాకుండా తమ తండ్రి వద్ద పరిశ్రమకు అవసరమైన మిషనరీలు కూడా ఉన్నాయని, మిషనరీలు కోసం రూ.90 లక్షలు ఇప్పించుకున్నట్లు తెలిపారు. అయితే కొంత మేర నిర్మాణం ప్రారంభించి ఆ తర్వాత పనులు ఆపినందుకు నిలదీస్తే రిజ్వాన్ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారని, జిల్లా ఎస్పీ ఆదోని త్రీటౌన్‌కు పంపించారని, బాధితులను విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
దాడి కేసులో
వ్యక్తికి మూడేళ్ల జైలు
ఆలూరు రూరల్: దాడి కేసులో ఆలూరు మండలం మొలగవల్లి గ్రామానికి చెందిన బోయ సుధాకర్ అనే వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తూ ఆదోని కోర్టు తీర్పు వెల్లడించింది. ఆలూరు ఎస్‌ఐ మన్మథ విజయ్ తెలిపిన వివరాలు.. మండలంలోని మొలగవల్లి గ్రామానికి చెందిన కురువ నౌనేపాటి, బోయ సుధాకర్‌ల మధ్య వ్యక్తి గత కారణాలతో గొడవలు ఉండేవి. ఇందులో భాగంగానే 2015లో బోయ సుధాకర్ ..నౌనేపాటిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చార్జీషీటు కోర్టులో దాఖలు చేశారన్నారు. పదేళ్ల విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో శుక్రవారం ఆదోని సీనియర్ సివిల్, అసిస్టెంట్ సెషన్స్ జడ్జి.. నిందితుడు సుధాకర్‌కు మూడేళ్లు జైలు శిక్ష, రూ.పది వేలు జరిమానా విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
దేవస్థాన వైద్యశాలకు ‘ఈసీజీ’ విరాళం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న వైద్యశాలకు పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన బాలం సుధీర్ శుక్రవారం ఈసీజీ యంత్రాన్ని విరాళంగా అందజేశారు. వైద్యశాల జూనియర్ అసిస్టెంట్ చిన్నాకు దాత తరఫున దేవస్థాన మాజీ పర్యవేక్షకుడు మధుసూదన్‌రెడ్డి ఈ పరికరాన్ని అందజేశారు. స్థానిక భక్తులు, ప్రజల సౌకర్యార్థం దేవస్థానం అందిస్తున్న ఉచిత వైద్య సేవలకు ఈ యంత్రం ఎంతగానో దోహదపడుతుందని దాత పేర్కొన్నారు.
ఆన్‌లైన్ ఉద్యోగాలంటూ టోకరా
● రూ. 6 లక్షలు మోసపోయిన యువకులు
ఆదోని అర్బన్: పట్టణంలోని రాజరాజేశ్వరి కాలనీకి చెందిన నలుగురు వ్యక్తులు ఆన్‌లైన్‌లో ఉద్యోగాల కోసం రూ.6 లక్షలు మోసపోయారని వన్‌టౌన్ ఎస్‌ఐ సమీర్‌బాషా శుక్రవారం తెలపారు. ఎల్‌టీడబ్ల్యూ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ సంస్థలో ఆన్‌లైన్ ఉద్యోగాలు ఇస్తామంటూ విశాఖపట్నంకు చెందిన భానుప్రసాద్, లావణ్య ఆశ పెట్టారు. ఒక ఉద్యోగానికి ఒకటిన్నర లక్ష ఇస్తే ఉద్యోగం వస్తుందని ఆన్‌లైన్‌లో నమ్మ పలికారు. దీంతో రాజరాజేశ్వరి కాలనీకి చెందిన వీరేష్‌బాబుతో పాటు మరో ముగ్గురు ఒకటిన్నర లక్ష చొప్పున మొత్తం ఆరు లక్షలు ఆన్‌లైన్ ద్వారా వేశారు. 2024లో ఈ లావాదేవీలు జరిగాయని, తీరా ఉద్యోగం రాకపోవడంతో ఆన్‌లైన్‌లో, ఫోన్ ద్వారా సంప్రదించడంతో వారి ఆచూకీ తెలియకపోవడంతో మోసపోయామని తెలుసుకుని శుక్రవారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
బయలు వీరభద్రస్వామికి విశేష పూజ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలక్షేత్ర పాలకుడైన బయలు వీరభద్రస్వామికి శుక్రవారం అమావాస్య సందర్బంగా విశేషార్చన జరిపించారు. అమావాస్య రోజున భక్తులు పరోక్షసేవగా ఈ అర్చనను జరిపించుకునే అవకాశం దేవస్థానం కల్పించింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి 30 మంది భక్తులు పరోక్షసేవ ద్వారా ఈ విశేష పూజను జరిపించుకున్నారు. స్వామి ఆరాధన వలన గ్రహదోషాలు నివారించబడతాయని, అరిష్టాలన్నీ తొలగి పోతాయని, ఎంతటి క్లిష్ట సమస్యలైనా పరిష్కరించబడతాయని పండితులు తెలిపారు.
పరిశ్రమ పేరుతో రూ.2 కోట్ల మోసం


