ఇద్దరికి షోకాజ్ నోటీసు
జూపాడుబంగ్లా: స్థానిక కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని చితకబాదిన ఘటనలో ఎస్‌ఓ యశోద, టీచర్ ఇందిరకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అకడమిక్ మానిటరింగ్ అధికారిణి మాధవీలత తెలిపారు. పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థిని చితకబాదిన ఘటనపై శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టర్ రాజకుమారి, డీఈఓ జనార్దన్‌రెడ్డి స్పందించారు. విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని అకడమిక్ మానిటరింగ్ అధికారిణి మాధవీలత, ఎంఈఓ శ్రీనివాసులును ఆదేశించారు. ఈ మేరకు వారు పాఠశాలకు చేరుకుని ముందుగా బాధిత విద్యార్థిని హరిణిశ్రీతో మాట్లాడి శరీరంపై ఉన్న దెబ్బలను పరిశీలించారు. అనంతరం విద్యార్థిని చితకబాదిన తెలుగు టీచర్ ఇందిర, ఎస్‌ఓ యశోదతో కారణాలు తెలుసుకున్నారు. అయితే ఏఎంఓ విచారణలో వారు పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. దీంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశా రు. అనంతరం ఏఎంఓ విలేకరులతో మాట్లాడుతూ నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. ఆమె వెంట ఏఎస్‌ఓ దస్తగిరి, సీఆర్పీ కిరణ్ ఉన్నారు.


