ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల విచారణ
నందికొట్కూరు: పట్టణంలోని బాలికల జిల్లా పరిషత్ హైస్కూల్‌లో చాక్లెట్ల కలకలంపై నంద్యాల, ఆత్మకూరు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు వెంకటరమణ, ఖాసీంవలి శుక్రవారం విచారణ చేపట్టారు. పాఠశాలలో గురువారం చాక్లెట్లు తిన్న బాలికలు అస్వస్థతకు గురికావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. హెచ్‌ఎం సావిత్రిని చాక్లెట్ సంఘటన గురించి ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు విచారించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలికలు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను రిపోర్టు తయారు చేసి జిల్లా కలెక్టర్‌కు, అధికారులకు నివేదిక అందిస్తామన్నారు. పాఠశాల ఆవరణలో విక్రయించిన చాక్లెట్లను ల్యాబ్‌కు పంపామన్నారు. కాలం చెల్లిన చిక్కీలు విద్యార్థులకు ఇస్తే చట్ట పరమైన చర్యలు వారిపై జిల్లా అధికారులు తీసుకుంటారని తెలిపారు. వీరి వెంట టౌన్ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంఈఓ రామిరెడ్డి, ఎంఈఓ–2 శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.


