అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి
కర్నూలు: నగర శివారులోని గుత్తిరోడ్డులో ఉన్న ఎథీనా ప్రైవేటు పాఠశాలలో హాస్టల్‌లో ఉంటూ 9వ తరగతి చదువుతున్న మరెడ్డి వేదికరెడ్డి(14) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శనివారం రాత్రి రెండు గంటల సమయంలో నిద్రలో మతిస్థిమితం లేకుండా ఉండటమే గాక బెడ్‌పై మూత్రవిసర్జన చేసుకోవడంతో తోటి విద్యార్థులు గమనించి హాస్టల్‌వార్డెన్‌కు తెలిపారు. అపస్మారకస్థితిలో ఉన్న బాలిక విషయం గురించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వైద్యచికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే బాలిక మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో బాలికను ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించి భద్రపరిచారు. బాలిక గతంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతుండేదని, తరచూ ఫిట్స్ కూడా వచ్చేదని తండ్రి అశోక్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులు 198 బీఎన్‌ఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆదోని సెంట్రల్: పట్టణంలోని నెహ్రూమెమోరియల్ పురపాలక ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆదివారం 1993–1994వ సంవత్సరానికి చెందిన పదో తరగతి విద్యార్థులంతా 32 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. పాఠశాల్లో చిన్నతనంలో చేసిన అల్లరి చేష్టలు గుర్తు చేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన అలనాటి గురువులు రామృష్ణ, జయమ్మ, జనార్దన్‌లకు పాదాభివందనం చేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం ఫయాజ్, ఉపాధ్యాయులు రమేష్ నాయుడు, పూర్వ విద్యార్థులు స్వరూప్, గోనబావి గోపాల్, రంగారెడ్డి, రాజెంద్ర, వెంకటేష్, ఆశోక్ తదితరులు పాల్గొన్నారు.


