బ్యాంకర్లు రైతులకు సహకారం అందించాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: రైతులు, స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగే లబ్ధిదారులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేసి ఆర్థిక బలోపేతానికి దోహదపడాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు రూ.15,120.09 కోట్ల రుణ లక్ష్యాలు నిర్దేశించగా, ఇప్పటి వరకు రూ.10,518.67 కోట్లు మాత్రమే పంపిణీ చేశారన్నారు. మిగతా లక్ష్యాలను నిర్ణీత గడువులోనే పూర్తి చేసేందుకు బ్యాంకులు ప్రత్యేక ప్రణాళికతో పనిచేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ – ఆర్థిక పథకాల ప్రయోజనాలు లబ్ధిదారులకు చేరేందుకు బ్యాంకులు ముందుకు రావాలని సూచించారు. ముఖ్యంగా పీఎం సూర్యఘర్ పథకంలో జిల్లాలో ఇప్పటి వరకు 2,200 సౌర ఫలకాలు మాత్రమే ఏర్పాటు చేసిన విషయాన్ని కలెక్టర్ గుర్తుచేశారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంకు వచ్చే భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, పెచ్చెరువు, బైర్లూటి, నాగలూటి, హటకేశ్వరం ప్రాంతాల చెంచు ప్రజలకు దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు రుణ సహాయం అందించాలని బ్యాంకర్లను సూచించారు. జిల్లాలో నిర్మిస్తున్న బహుళ ప్రయోజన గోదాములకు రహదారులు, డ్రైయింగ్ ప్లాట్‌ఫార్ములు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని, దీనిపై బ్యాంకర్లు పెట్టుబడులు, రుణ సదుపాయాల రూపంలో దృష్టి పెట్టాలన్నారు. నాబార్డ్ డీడీఎం కార్తీక్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు చెందిన పోస్టర్లను బ్యాంకుల్లో ఏర్పాటు చేయడం ద్వారా అవగాహన పెరిగి, ఎక్కువమంది లబ్ధిదారులు ప్రయోజనం పొందగలరన్నారు. అనంతరం నాబార్డు టర్మ్ రుణాలకు సంబంధించిన పుస్తకాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో ఆర్బీఐ ఎల్‌డీఓ నవీన్, నాబార్డ్ డీడీఎం కార్తీక్, డీసీసీబీ సీఈఓ రామాంజనేయులు, ఎల్‌డీఎం రవీంద్రకుమార్, అధికారులు పాల్గొన్నారు.


