ఇతరుల జీవితాల్లో ఆమె భాగ్యవంతురాలు
నంద్యాల జిల్లా శ్రీశైలంలోని కొత్తపేటకు చెందిన భాగ్యమ్మ(50) భర్త సామేలు పదిహేనేళ్ల క్రితమే మరణించారు. అప్పటి నుంచి ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడిని ఆమె పెంచి ప్రయోజకులను చేశారు. గత అక్టోబర్ నెల 18వ తేదీ రాత్రి ఉన్నట్లుండి ఆమెకు ఫిట్స్ వచ్చి, మెదడులో రక్తస్రావం అయ్యింది. శ్రీశైలం దేవస్థానం ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి అనంతరం కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె అదే నెల 21న బ్రెయిన్ డెడ్ అయ్యింది. జీవన్‌దాన్ ట్రస్ట్ సభ్యుల సూచన మేరకు అవయవదానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకు వచ్చారు. దీంతో ఆమె ఒక కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులను సేకరించి అవసరమైన ఆసుపత్రులకు తరలించారు. తాను మరణించి కూడా ఇతరు జీవితాల్లో ఆమె వెలుగులు పంచింది.


