ఘర్షణ ఆపడానికి వెళ్లిన వ్యక్తిపై హత్యాయత్నం
నంద్యాల: గొడవ ఆపేందుకు వెళ్లిన ఓ వ్యక్తిపై కక్ష పెంచుకొని నలుగురు బీర్ సీసాలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి నంద్యాలలో ఈసంఘటన చోటు చేసుకుంది. నంద్యాల వన్‌టౌన్ సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపిన మేరకు వివరాలు.. ఈనెల 15వ తేదీన పట్టణంలోని కిజర్ మసీదు సమీపంలో షేక్ సోహెల్, షేక్ వసీంలు, షేక్ రెహన్‌తో ఘర్షణ పడుతున్నారు. గమనించిన కటికె ఆసీఫ్ ఆనే వ్యక్తి ఇరువురు గొడవ పడకుండా విడిపించాడు. ఇది మనుసులో పెట్టుకున్న నడిగడ్డకు చెందిన షేక్‌షమీర్, షేక్ వసీం, షేక్ సోహెల్, షేక్ అప్సర్ అనే వ్యక్తులు కటిక ఆసీఫ్ నడిగడ్డలోని పబ్లిక్ లెట్రీన్‌ల సమీపంలో ఉండగా 16వ తేదీ రాత్రి తీవ్రంగా కొట్టి బీరు సీసాతో పొడిచారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆసీఫ్ ప్రస్తుతం నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హత్యాయత్నానికి పాల్పడిన నలుగురు వ్యక్తులు బుధవారం నడిగడ్డలోని వెంచర్ వద్ద ఉండగా అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు.


