ఖైదీలను కోర్టు వాయిదాలకు హాజరుపరచాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి
నంద్యాల(వ్యవసాయం): కోర్టు వాయిదాలకు ఖైదీలను కచ్చితంగా హాజరుపరచాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి అన్నారు. నంద్యాల స్పెషల్ సబ్ జైలును గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రితో కలసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఖైదీలకు ఎవరికై నా న్యాయవాదులు లేకుంటే ఉచితంగా నియమిస్తామన్నారు. అనారోగ్యంతో బాధ పడే వారికి, 70 ఏళ్లు వయస్సుపై బడిన ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. ప్రిజన్ లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్, క్లినిక్‌లో ఒక న్యాయవాది, ఒక ప్యారా లీగల్ వలంటీర్ ఉంటారని, వారు ఖైదీలకు న్యాయ సహాయాలు అందిస్తారని తెలిపారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100 పై ఖైదీలకు అవగాహన కల్పించారు. నంద్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసు, జైలు అధికారి గురుప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోర్టు భవనాల పరిశీలన
నంద్యాల జిల్లా కోర్టు భవనాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి గురువారం సాయంత్రం పరిశీలించారు. కోర్టు ఆవరణలోని ఖాళీ స్థలాల ను పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం జడ్జీల తో సమావేశం నిర్వహించారు. మూడో అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజ, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జ్ తంగమని, రెండో అదనపు జిల్లా జడ్జి కిరణ్ ,ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు, స్పెషల్ క్లాస్ మేజిస్ట్రేట్ ఏసురత్నం, ఆర్‌డీఓ విశ్వనాథ్, తహసీల్దార్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.


