శ్రీశైలంలో సేవా పరిమళం
భక్తుల తాగునీరు అందిస్తున్న శివసేవకులు
అన్నప్రసాద వితరణ భవనంలో సేవలు
కానుకల కౌంటింగ్‌లోనూ భాగస్వామ్యం
ఉచిత బస్సు ఏర్పాటు చేయాలి
శ్రీశైలంటెంపుల్: వారంతా ఎక్కడి నుంచో వచ్చారు. భక్తులకు సేవ చేసేందుకు అసక్తి చూపుతున్నారు. కానుకల లెక్కింపులోను శివసేవకులు తమ సేవలను అందిస్తున్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ప్రతి రోజూ లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వీరికి సేవలందించేందుకు వివిధ ప్రాంతాల నుంచి శివసేవకులు శ్రీశైలం చేరుకుంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు చెందిన పలువురు భక్తులు ముందుకు వస్తున్నారు.
మహిళలే అధిక్యం
శ్రీశైల మల్లన్న క్షేత్రానికి తరలివచ్చే భక్తులకు సేవలందించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు వస్తారు. శ్రీశైలంలో ప్రస్తుతం చీరాలకు చెందిన భ్రమరాంబికా సేవా సమితి, తెనాలికి చెందిన శ్రీగిరి సేవా సమితి, విజయవాడకు చెందిన జ్యోతిర్లింగ సేవా సమితి వారు భక్తులకు సేవలందిస్తున్నారు. రోజుకు మూడు షిఫ్ట్‌లలో సుమారు 700మంది శివసేవకులు సేవలందిస్తున్నారు. భక్తులకు సేవలందిస్తున్న శివసేవకుల్లో పురుషులు సుమారు 50మంది లోపు ఉంటారు, అత్యధికులు మహిళలే కావడం విశేషం.
దేవస్థానం అందిస్తున్న సౌకర్యాలు
శివసేవకులకు దేవస్థానం ఉచితంగా వసతి సౌకర్యాన్ని కల్పిస్తుంది. అలాగే అన్నదానం నుంచి మూడు పూటల టిఫిన్, భోజనం, రాత్రి అల్పాహారం అందిస్తున్నారు. శివసేవకులకు ఐదు రోజల పాటు విధులు చేస్తారు. విధులు ముగిసిన తరువాత వారికి ఉచితంగా మల్లన్న స్పర్శదర్శనం కల్పిస్తారు. రోజుకు 40మంది చొప్పున శివసేవకులకు ఉచితంగా మల్లన్న స్పర్శదర్శనం కల్పిస్తారు. హుండీ కౌంటింగ్‌లో పాల్గొన్న శివసేవకులకు ఒక్కోక్కరికి రెండు లడ్డూ ప్రసాదాలు ఉచితంగా అందజేస్తారు.
సేవలు ఇలా..
క్యూలైన్లలో భక్తులకు తాగునీరు సరఫరా చేస్తారు.
అమ్మవారి ఆలయం వెనుక భక్తులకు ప్రసాదం అందిస్తారు.
దేవస్థానానికి విరాళాలు అందించిన దాతల కోసం లడ్డూ ప్రసాదం, కుంకుమ, విభూతి, కంకణాల ప్యాకింగ్ చేస్తారు.
క్యూలైన్లలో భక్తులను నియంత్రిస్తారు.
శ్రీశైలం ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేయనున్న మే ఐ హెల్ప్ యు డెస్క్‌లలో తదితర చోట్ల సేవలు అందిస్తున్నారు.
దేవస్థానంలో సౌకర్యాలు బాగానే ఉన్నాయి. ఆలయం బయట ప్రాంతాలైన సాక్షిగణపతి, మల్లమ్మకన్నీరు తదితర ప్రాంతాలకు శివసేవకులు వెళ్లలేకపోతున్నారు. ఆటో చార్జీలు అదనంగా అడుగుతున్నారు. దేవస్థానం శివసేవకుల కోసం ఉచితంగా బస్సు సర్వీసును ఏర్పాటు చేస్తే బాగుంటుంది. వసతి సౌకర్యాలను కూడా కొంచెం మెరుగుపర్చాలి. – కె.రజిని, శివసేవకురాలు, మంచిర్యాల
శ్రీశైలంలో సేవా పరిమళం
శ్రీశైలంలో సేవా పరిమళం


