ఫీజు అందనంత దూరం!
పేద విద్యార్థులు ఉన్నత విద్యను పూర్తి చేసేందుకు ఫీజురీయింబర్స్‌మెంట్ అందడం లేదు. ఎప్పటికప్పుడు ఫీజులను విడుదల చేయడం లేదు. చదువులకు ఎలాంటి ఆటంకం కల్పించబోమని ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఫీజు బకాయిలపై దృష్టి సారించకపోవడంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
కర్నూలు(అర్బన్): చంద్రబాబు ప్రభుత్వం ఫీజు బకాయిలపై నోరు మెదపకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని విద్యార్థులను పట్టిపీడిస్తున్నాయి. ప్రతి విద్యా సంవత్సరం నాలుగు విడతలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాల్సి ఉంది. అయితే 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి అదే ఏడాది మార్చి 2న మొదటి విడతగా జిల్లాలోని 35,618 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.23.95 కోట్లను అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జమ చేసింది. మిగిలిన మూడు విడతల ఫీజును ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన మూడు విడతల బకాయిలతో పాటు 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను బకాయి పెట్టింది.
పేరుకుపోయిన రూ.84 కోట్ల బకాయిలు
జిల్లాలోని దాదాపు 30 వేల మంది విద్యార్థుల్లో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులను మినిహాయిస్తే మిగిలిన 25 వేల మంది బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు, క్రిస్టియన్ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి కూటమి ప్రభుత్వం మూడు విడతలుగా రూ.50 కోట్లు, 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు రూ.34 కోట్లను చెల్లించాల్సి ఉంది.
పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం
జిల్లాలో వైద్య విద్యకు సంబంధించి జీఎన్‌ఎం, పారా మెడికల్, బీఎస్సీ నర్సింగ్, డెంటల్, ఎంబీబీఎస్ తదితర కళాశాలలు 36 దాకా ఉన్నాయి. ఈ కళాశాలల్లో దాదాపు 1,500 మంది విద్యార్థులకు ఫీజులను చెల్లించాల్సి ఉంది. అయితే వీరికి కూడా 2023–24, 2024–25 విద్యా సంవత్సరాలకు సంబంధించి ఫీజులను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. గత వైఎస్సార్‌సీసీ ప్రభుత్వం పక్కనున్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తూ అర్హత కలిగిన విద్యార్థులకు ఫీజులు విడుదల చేసింది. చంద్రబాబు ప్రభుత్వంలో పొరుగు రాష్ట్రాల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలను మినహాయించి మిగిలిన బీసీ, కాపు, ఈబీసీ, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ తదితర సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు కనీసం ఫీజుకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కూడా ఇంతవరకు ఆన్‌లైన్‌లో ఆప్షన్ ఇవ్వలేదు.
ఐదేళ్లలో రూ.501.60 కోట్లు విడుదల
ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో జిల్లాలోని ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ తదితర సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.501.60 కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేశారు.
బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రభు త్వం బకాయి పడిన ఫీజులను విడుదల చేసేంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. ఫీజు బకాయిలన్నింటినీ చెల్లిస్తామని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థి సంఘాలకు ఇచ్చిన హామీ నేటి వరకు నెరవేరలేదు. ఫీజులను విడుదల చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నందున కళాఽశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తీసుకువస్తున్నాయి.
– కటారుకొండ సాయికుమార్, రాష్ట్ర కార్యదర్శి, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం
ఫీజు రీయింబర్స్‌మెంట్
విడుదలలో జాప్యం
పేరుకుపోయిన బకాయిలు
రూ.84 కోట్లు
ఫీజు అందనంత దూరం!


