ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
చాగలమర్రి (ఆళ్లగడ్డ): ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యా యులదేనని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని వైపీపీఎం ఉన్నత పాఠశాలను మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం పాఠశాలలో నిర్వహించే ప్రార్థనలో పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. పది విద్యార్థులు ప్రణాళిక రూపొందించుకుని సబ్జెక్టుల వారీగా పరీక్షకు సన్నద్ధం కావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకంతో పేదలు తమ పిల్లలను పంపుతున్నారని, ఉపాధ్యాయులు మరింత చొరవ తీసుకుని విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. అనంతరం పలు తరగతి గదులను కలెక్టర్ పరిశీలించారు. యూనిఫాం, షూస్ లేని విద్యార్థుల సంఖ్యను తెలుసుకొని వారికి సైజుల ప్రకారం అందజేస్తామన్నారు. కలెక్టర్ వెంట ఎంఈఓ శోభా వివేకవతి, ఎంపీడీఓ నూర్జహాన్, తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి, కమిషనర్ కిషోర్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.


