ప్రభుత్వ సేవలను వేగవంతం చేయండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల(అర్బన్): ప్రభుత్వ సేవలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజా సానుకూల అవగాహన పెంపు, ఏజెంట్ స్పేస్ కోసం డాక్యుమెంట్ అప్‌లోడ్స్, సేవల విజిబిలిటీ వంటి పలు కీలక అంశాలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలపై ప్రజల అభిప్రాయాన్ని మెరుగుపరచే దిశగా నంద్యాల జిల్లా అన్ని పారామీటర్లలో రాష్ట్రంలో టాప్ టెన్‌లో నిలిపేలా అధికారులు కృషి చేయాలన్నారు. సేవల నాణ్యత, ప్రజలకు అందుతున్న ఫలితాలు, ఫిర్యాదుల పరిష్కారం, పారదర్శక వ్యవస్థ వంటి అంశాల్లో ఏ పారామీటర్‌లోనూ జిల్లా దిగువ స్థానంలో లేకుండా సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. జిల్లా ప్రజలకు మెరుగైన సేవల అందుబాటు కల్పించేందుకు అందరూ సమన్వయంతో, కట్టుదిట్టంగా పనిచేయాలన్నారు.
రబీలో ఎరువులకొరత రానీయం
నంద్యాల(అర్బన్): రబీ సీజన్‌లో ఎరువుల కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రటకనలో తెలిపారు. జిల్లాకు సంబంధించి రబీలో సాగు చేసే పంటలకు అవసరమైన 66,777 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళికలు తయారు చేశామన్నారు. అక్టోబర్ నుంచి ఈ నెలాఖరు వరకు జిల్లాకు మొత్తం 30.059 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటికే 29,047 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచామన్నారు.


