వసతులు, సేవలపై మల్లన్న భక్తుల అసంతృప్తి
భక్తుల అభిప్రాయం ఇలా..
● మూడవ స్థానంతో సరిపెట్టుకున్న
శ్రీశైల దేవస్థానం
శ్రీశైలంటెంపుల్: భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల అధికారులు విఫలమవుతున్నారు. స్వామిఅమ్మవార్ల దర్శనం వేగంగా, బాగా జరిగేలా చూడటం, ప్రసాదం రుచికరంగా అందించడం, తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పించడం, పారిశుద్ద్య నిర్వహణలో నిర్లక్ష్యం చూపిస్తున్నారు. స్వామిఅమ్మవార్ల సందర్శనకు ఆలయాలకు వచ్చిన భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఫోన్లు చేసి అభిప్రాయాలు తీసుకుంటే దాదాపు 40 శాతం మంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వస్తున్న భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా నిర్వహించిన అభిప్రాయ సేకరణలో శ్రీశైల దేవస్థానం మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం దేవస్థానాల్లో భక్తులకు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం ప్రతి నెల 25వ తేదీ నుంచి మరుసటి నెల 25వ తేదీ వరకు వాట్సాప్, ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా ఈ సర్వే నిర్వహిస్తుంది. జూన్ నుంచి నవంబరు వరకు నిర్వహించిన సర్వేలో ఇందులో 72.2 శాతంతో శ్రీకాళహస్తి ప్రథమ స్థానం, 66 శాతంతో విజయవాడ చివరి స్థానంలో నిలిచాయి. శ్రీశైల దేవస్థానం 70.4 శాతంతో మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శ్రీశైల దేవస్థానం అంది స్తున్న సేవలపై 29.6 శాతం మంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తు న్నారు. దీంతో అసలు లోపం ఎక్కడుందనే చర్చ దేవస్థానంలో కొనసాగుతుంది. తరచూ శ్రీశైల దేవస్థానం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలవడం కూడా దేవస్థానం ప్రతిష్ట మసక బారడానికి కారణమి పలువురు భక్తులు విశ్లేషిస్తున్నారు.
పారిశుద్ధ్యం, మౌలిక
వసతులపై తీవ్ర అసంతృప్తి
శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ద్యం, మౌలిక వసతుల కల్పనపై తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. వీటిపైనే ఎక్కువ మంది భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ధ్యం, హౌస్‌కీపింగ్ నిర్వహణ టెండర్ తిరుపతికి చెందిన పద్మావతి హస్పిటాలిటీ అండ్ ఫెసిలీటీ మేనేజ్‌మెంట్ సంస్థ దక్కించుకుంది. అక్టోబరు 1వ తేదీ నుంచి ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఈ సంస్థ టెండర్ ప్రకారం ఇంకా పారిశుద్ద్య సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తి కాలేదన్నట్లు తెలుస్తుంది. శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ధ్యంపై 33.8శాతం మంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే శ్రీశైలం దర్శనానికి వచ్చిన భక్తులు శ్రీశైలంలోనే వసతి పొందాల్సి ఉంటుంది. క్షేత్రంలో భక్తులకు సరిపడినంత వసతి సౌకర్యాలు లేవు. అలాగే తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతుంది. తాగునీరు, మౌలిక వసతులపై 37 శాతం మంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సంతృప్తి అసంతృప్తి
స్వామిఅమ్మవార్ల దర్శనం 73.5 శాతం 26.5 శాతం
మౌలిక వసతులు 63.0 శాతం 37.0 శాతం
ప్రసాదం నాణ్యత 80.9 శాతం 19.1 శాతం
పారిశుద్ధ్యం 66.2 శాతం 33.8 శాతం
వసతులు, సేవలపై మల్లన్న భక్తుల అసంతృప్తి


