మైక్రో ఫైనాన్స్‌ను ఆశ్రయించొద్దు
●విజన్ బిల్డింగ్ శిక్షణలో వెలుగు పీడీ శ్రీధర్‌రెడ్డి
కోవెలకుంట్ల: ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించి అధిక వడ్డీలకు రుణాలు తీసుకుని ఆర్థికంగా నష్టపోవద్దని వెలుగు పథకం పీడీ శ్రీధర్‌రెడ్డి సూచించారు. స్థానిక వెలుగు కార్యాలయంలో మంగళవారం మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ప్రమీలమ్మ అధ్యక్షతన పొదుపు మహిళలకు ’విజన్ బిల్డింగ్’పై శిక్షణ ఇచ్చారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పశుపోషణ, వైద్యం, ఆస్తుల సృష్టి, సుస్థిర జీవనోపాధులు, సామాజిక భద్రత, ప్రవర్తనల మార్పు వంటి అంశాలపై మహిళలకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా పీడీ మాట్లాడుతూ.. మహిళలు ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరారు. బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి, ఉన్నతి, సీఐఎఫ్ తదితర రుణాలను పొందిన మహిళలు వాటిని జీవనోపాధుల నిమిత్తం ఉపయోగించుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని పేర్కొన్నారు. విజన్ బిల్డింగ్ కార్యక్రమంలో భాగంగా 2026–27 సంవత్సరానికి ముందస్తు ప్రణాళికలను తయారు చేసుకోవాలని సూచించారు. ఎనిమిది రకాల అంశాల్లో బడ్జెట్ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. పొదుపు సంఘాల్లోని ప్రతి సభ్యురాలు తక్కువ వడ్డీకి రుణాలు పొంది జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఆ పథక జిల్లా ప్రాజెక్టు మేనేజర్ హనుమా నాయక్, కోవెలకుంట్ల క్లస్టర్ ఏరియా కో ఆర్డినేటర్ చంద్రశేఖర్, మాస్టర్ ట్రైనర్ అంబమ్మ, ఏపీఎం పుణ్యవతి, ఏపీఎంలు పాల్గొన్నారు.


