ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు
● అధికారులకు జిల్లా కలెక్టర్
రాజకుమారి ఆదేశం
నంద్యాల: జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో పల్స్ పోలియో కార్యక్రమంపై జిల్లాస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు పిల్లలు మొత్తం 2,38,404 మంది ఉన్నారని తెలిపారు. వీరందరికీ పోలియో చుక్కలు అందించేందుకు జిల్లా వ్యాప్తంగా 1,318 బూత్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 21న ఆదివారం బూత్ స్థాయిలో, 22, 23 తేదీలలో ఇంటింటికి వెళ్లి మిగిలిపోయిన పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సంత మార్కెట్లు వంటి జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్సిట్ పాయింట్లు (బూత్‌లు) ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. అనంతరం పోలియో చుక్కలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటరమణ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సుదర్శన్ బాబు, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ లలిత, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ప్రసన్న లక్ష్మి, డాక్టర్ శ్రీజ, డాక్టర్ శ్రీనివాసులు, అలాగే ఐసీడీఎస్, పంచాయతీరాజ్, విద్యుత్, విద్య, రవాణా తదితర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.


