వేటగాళ్ల కోసం నల్లమల జల్లెడ
● ఏకకాలంలో అభయారణ్యం అంతా తనిఖీ చేస్తున్న అటవీ సిబ్బంది
ఆత్మకూరురూరల్: నాగార్జునసాగర్ – శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం పరిధిలోని నాగలూటి రేంజ్ లో టైగర్ పా స్నేర్ ( పులి పంజా ఉచ్చు) కనిపించడంతో అటవీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎఫ్‌డీపీటీ విజయకుమార్ ఆదేశాలతో అభయారణ్యం పరిధిలో సిబ్బంది మంగళవారం ఉదయం నుంచి బుధవారం తెల్లవారుజామున వరకు యాన్టీ స్నేర్ డ్రయివ్ (ఉచ్చుల ఏరివేత)లో ముమ్మరంగా పాల్గొన్నారు. రుద్రవరం రేంజ్‌లో అడవిలోకి వెళ్లే గొర్ల, పశువుల కాపర్లను పూర్తిగా తనిఖీ చేసి పంపుతున్నారు. వారి వద్ద నుంచి 45 అగ్గి పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. గిద్దలూరు డివిజన్ పాపినేని పల్లె ,ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో సబ్ డీఎఫ్‌ఓ బబిత మంగళవారం రాత్రంతా అడవులను జల్లెడ పట్టి ఉచ్చుల ఏరివేత కార్యక్రమం చేపట్టారు. వన్యప్రాణులను వేటాడేందుకు యత్నించే వారిని పట్టుకుని కచ్చితంగా జైలుకు పంపుతామని ఎన్‌ఎస్‌టీఆర్ ప్రాజెక్ట్ టైగర్ ఫీల్డ్ డైరెక్టర్ విజయకుమార్ పేర్కొన్నారు.
వేటగాళ్ల కోసం నల్లమల జల్లెడ


