పుట్టిన రోజే మృత్యుఒడిలోకి
డోన్ టౌన్: పుట్టిన రోజు ఓ బాలుడు రోడ్డు ప్రమాదానికి గురై మృత్యుఒడికి చేరాడు. బాధిత కుటుంబంలో విషాదం నింపిన ఈ ఘటన డోన్ పట్టణంలోని చాకిరేవు మిట్ట వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కన్నపకుంట గ్రామానికి చెందిన హరిది బుధవారం పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ బాలుడు అదే గ్రామానికి చెందిన స్నేహితులైన అభినవ్, జగన్‌తో కలిసి కేక్ తెచ్చుకునేందుకు బైక్‌పై డోన్‌కు బయలుదేరారు. చాకిరేవు మిట్ట వద్ద ముందు వెళ్తున్న లారీని బైక్ ఢీకొంది. ఈ ఘటనలో హరి (16) అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి సుధాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఇంతియాజ్ బాషా తెలిపారు. పుట్టిన రోజే కుమారుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.


