ఎమ్మెల్యే కోట్లను నిలదీసిన పేదలు
డోన్ టౌన్: ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్‌రెడ్డిని పేదలు నిలదీశారు. ఇళ్ల స్థలాల కోసం పట్టణంలో సీపీఎం ఆధ్వర్యంలో పేదలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే మూడు రోజులుగా దీక్ష చేస్తున్నా పాలకులు, అధికారుల్లో చలనం లేదు. దీంతో శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోట్ల ఉన్నారని తెలుసుకుని సీపీఎం నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడటానికి బయటకు వచ్చిన ఎమ్మెల్యేను మహిళలు చుట్టుముట్టి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం పట్టణ మండల కార్యదర్శులు నక్కిశ్రీకాంత్, రామాంజనేయులు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శివరామ్, మండల అధ్యక్షులు, భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. పట్టణ సమీపంలోని 503 సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిలో ఇళ్లులేని నిరుపేదలు గుడిసెలు వేసుకుంటే వాటిని అధికారులు తొలగించారన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, ఆర్డీఓ నరసింహులు అర్హులకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చినా నేటికీ అతీగతిలేదని.. వారితో పాటు మహిళలు విమర్శించారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేస్తుందని, అప్పుడు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. ఆందోళనలో సీఐటీయూ జిల్లా సభ్యులు చిన్న రహిమాన్, ఐద్వా నాయకురాలు షమీమ్ బేగం, సిరినా, నక్కిహరి ఉన్నారు.


