టెండర్‌కు వెనకడుగు
● రహదారి నిర్మాణానికి రూ. 3.50 కోట్లు విడుదల ● టెండర్ దాఖలకు ముందుకు రాని కాంట్రాక్టర్లు
శిరివెళ్ల: ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గ ప్రజల రహదారి కష్టాలు ఇప్పట్లో పరిష్కారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కర్నూలు – కడవ జాతీయపై శిరివెళ్ల మెట్ట నుంచి గోస్పాడు మండలం యాళ్లూరు వరకు ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. వీరారెడ్డిపల్లె, కోటపాడు, యాళ్లూరుకు చెందిన వేలాది మంది ప్రజలు ఈ రోడ్డుపై అతి కష్టం మీద ప్రయాణాలు సాగిస్తున్నారు. శిరివెళ్ల మెట్ట నుంచి గోస్పాడు వరకు 10 కిలో మీటర్ల మేర రోడ్డు విస్తర్ణకు కేంద్ర ప్రభుత్వం రూ. 23 కోట్ల నిధులు మంజూరు చేసింది. కాంట్రాక్టర్ సకాలంలో పనులు మొదలు పెట్టక పోవడం, ఈ లోగా సాధా రణ ఎన్నికలు రావడంతో ఎవరూ పట్టించుకోలేదు. చంద్ర బాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత సింగిల్ లైన్ రోడ్డు నిర్మాణానికి రూ. 3.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. గత నెలలో టెండర్లు పిలిచారు. ఈ నెల 9వ తేదీన టెండర్ల బాక్స్ తెరిచారు. అయితే ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు. దీంతో అధికారులు తలలు పట్టుకున్నారు. మళ్లీ రెండవ సారి టెండర్లు ఆహ్వానించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే శిరివెళ్ల – రుద్రవరం రస్తాలో శిరివెళ్ల 3వ వాగు నుంచి చిన్న కంబళూరు మెట్ట వరకు రోడ్డు దుస్థితి అంతా ఇంతా కాదు. రోడ్డు నిర్మాణానికి రూ.1.30 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పర్సెంటేజీలకు భయపడి కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఆర్‌అండ్‌బీ రోడ్లు గుంతలమయంగా మారి నడవడానికి నరకప్రాయంగా మారాయి. రహదారులు అభివృద్ధికి నోచుకోకపోవడంతో రాత్రి వేళలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రహదారులపై ప్రయాణం అంటే జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. త్వరగా రహదారి నిర్మాణం చేపట్టి కష్టాలు తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


