గాంధీజీ అంటే ఎందుకు మీకంత ఈర్ష్య
కర్నూలు(సెంట్రల్): మహాత్మాగాంధీ అంటే మీకు ఎందుకంత ఈర్ష్య అని ప్రధానమంత్రి నరేంద్రమోదీని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి ఉన్న మహాత్మాగాంధీ పేరును తీసి వేయడం అన్యాయమన్నా రు. శుక్రవారం సీపీఐ నగర 17వ మహాసభలు కర్నూలులో నిర్వహించారు. స్థానిక సీపీఐ కార్యాల యం నుంచి సీక్యాంపు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీపీఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన కె.రామకృష్ణ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీలు సీపీఐ, కాంగ్రెస్ మాత్రమేనని.. అయితే స్వాతంత్ర పోరాటం చేయని బీజేపీ అధికారంలో ఉండడం అన్యాయమన్నారు. అధికారం ఉన్నా లేకున్నా కమ్యూనిస్టు పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌కు కొమ్ముకాస్తూ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నాయన్నారు. అందులో భాగంగా విశాఖ స్టీలు, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నట్లు చెప్పారు. దేశంలో మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ అధికారంలో కొనసాగుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పరాభావం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ విచ్చల విడిగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని, అరికట్టడంలో సీఎం విఫలమయ్యారని విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీసీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, శేఖర్, రామాంజనేయులు, సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు ఎన్,లెనిన్‌బాబు, ఎస్.మునెప్ప తదితరులు పాల్గొన్నారు.


