వేస్టేజీకి రాయల్టీ చెల్లించాలా?
● పాలిస్ బండల ఫ్యాక్టరీ,
ట్రాక్టర్ యజమానులు వినూత్న నిరసన
బనగానపల్లె రూరల్: పాలిస్ బండల ఫ్యాక్టరీ నుంచి వెలువడే వేస్టేజ్‌కి కూడా రాయల్టీ చెల్లించాలని రాయల్టీ చెక్‌పోస్ట్ సిబ్బంది ట్రాక్టర్లను నిలిపివేయడంతో ట్రాక్టర్ల యజమానులు, బ్రిక్స్ తయారీ అసోసియేషన్ సభ్యులు, పాలిస్ బండల ఫ్యాక్టరీ యజమానులు రోడ్డెక్కారు. శుక్రవారం సాయంత్రం బనగానపల్లె పట్టణంలోని యాగంటిపల్లె రహదారిలో సుధాకర్ ఇన్‌ఫ్రా సంస్థకు చెందిన చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వేస్టేజీకి రాయల్టీ చెల్లించాలని చెక్‌పోస్టు సిబ్బంది ట్రాక్టర్లను నిలిపివేయడంతో ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డుగా పెట్టి సుమారు గంట పాటు ఆందోళన చేశారు. బనగానపల్లె – గుత్తి ప్రధాన రహదారి కావడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు ట్రాక్టర్ యజమానులు మాట్లాడుతూ.. పాలీస్ బండల పరిశ్రమ నుంచి వచ్చే వేస్టేజీని ఫ్యాక్టరీకి దూరంగా పారబోస్తామన్నారు. అయితే ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేసిన రాయల్టీ చెక్‌పోస్ట్ సిబ్బంది టన్నుకు రూ.120 ప్రకారం చెల్లించాలని వాహనాలను అడ్డుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వేస్టేజీ మట్టికి రాయల్టీ ఉపసంహరించుకోవాలన్నా రు. అయితే చెక్‌పోస్టు అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో చెక్‌పోస్టు షెడ్ వద్ద వేస్టేజీని వదిలి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్‌ఐ దుగ్గిరెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకొని నిరసన కారులతో చర్చించి ఆందోళన విరమింప చేశారు.
వేస్టేజీకి రాయల్టీ చెల్లించాలా?


