ఎట్టకేలకు కార్మికులకు బస్సు సౌకర్యం
శ్రీశైలంటెంపుల్: దేవుడు వరమిచ్చినా పూజారి కరు ణించడు.. అన్నట్లుగా తయారైంది సున్నిపెంట నుంచి వెళ్లి దేవస్థానంలో పనిచేసే పారిశుద్ద్య కార్మికుల పరిస్థితి. దేవస్థానం ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని చెబుతుంటే పద్మావతి ఏజెన్సీ మాత్రం డీజిల్ ఖర్చులు మేము భరించలేమంటూ కార్మికుల మీద నెట్టేసింది. దీంతో కార్మికులే తమకు వచ్చే వీక్లీ ఆఫ్‌ల డబ్బులు డీజిల్‌కు చెల్లించేలా ఒప్పుకోవడంతో ఎట్టకేల బస్సు సౌకర్యాన్ని దేవస్థానం బుధవారం నుంచి పునరుద్ధరించింది. దేవస్థానంలో పద్మావతి ఏజెన్సీ కింద సున్నిపెంటకు చెందిన సుమారు 200 మందికి పైగా కార్మికులు శానిటేషన్, హౌస్‌కీపింగ్‌లలో పనిచేస్తున్నారు. వీరికి బస్సు సౌకర్యం కల్పించాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చొరవ తీసుకుని దేవస్థానం, కార్తికేయ ఏజెన్సీ ఎండీతో సంప్రదించారు. దేవస్థానం ఉచితంగా బస్సును ఏర్పాటు చేసేలా, బస్సుకు అయ్యే డీజిల్ ఖర్చు ఏజెన్సీ ఎండీ చెల్లించేలా వారిని ఒప్పించి కార్మికులకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. అయితే గత అక్టోబరు నెల నుంచి శానిటేషన్, హౌస్‌కీపింగ్ టెండర్ దక్కించుకున్న పద్మావతి ఏజెన్సీ డీజిల్ భారం భరించలే మని నవంబరు నెల నుంచి ఉచిత బస్సు సౌకర్యాన్ని తీసివేసింది. ఈ నేపథ్యంలో దేవస్థాన అధికారులకు కార్మికులు మొరపెట్టుకున్నారు. దీంతో కార్మికులకు నెలలో వచ్చే నాలుగు వీక్లీ ఆఫ్‌లలో రెండు వీక్లీ ఆఫ్‌కు వచ్చే డబ్బులను డీజిల్‌కు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఉచిత బస్సు సౌకర్యాన్ని దేవస్థానం పునరుద్ధరించింది.
దేవస్థానం బస్సు సర్వీసు
పునఃప్రారంభం
డీజిల్ డబ్బులు చెల్లింపునకు
పద్మావతి సంస్థ ససేమిరా
కార్మికుల వీక్లీ ఆఫ్ డబ్బులు సర్దుబాటు


