ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్
● 2.5 కేజీల గంజాయి, మారుతి కారు స్వాధీనం
నంద్యాల: పట్టణంలోని వైజంక్షన్ సమీపంలో ప్రథమనంది ఆలయ ఆర్చి వద్ద గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ మందా జావళి గురువారం తెలిపారు. ఏఎస్పీ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మహానంది మండలం బసాపురం గ్రామానికి చెందిన షేక్ మునీర్‌బాషా అరకు నుంచి గంజాయి కొనుగోలు చేసి మారుతి కారులో నంద్యాలకు తీసుకొని వచ్చారు. మునీర్‌బాషాకు వరుసకు తమ్ముడైన షేక్ మహమూబ్‌బాషాకు గంజాయిని ఇస్తుండగా ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. వీరి వద్ద నుంచి 2.5 కేజీల గంజాయి, మారుతి కారు, రెండు మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిని నంద్యాల కోర్టులో హాజరు పరిచామన్నారు.


