రెండు చుక్కలు.. జీవితానికి వెలుగు
● నేడు పల్స్‌పోలియో కార్యక్రమం
● జిల్లాలో 2.38 లక్షల మంది
చిన్నారుల గుర్తింపు
గోస్పాడు: పిల్లల ఆరోగ్యం విషయంలో ముందు చూపు అవసరం. వారి ఆరోగ్యానికి టీకాలు ఎంతో కీలకం. అందులో భాగంగా రెండే రెండు చుక్కలు వారిని పోలియో బారిన పడకుండా చేస్తాయి. నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. శిశువులు పుట్టిన వెంటనే ఓరల్ పోలియో వ్యాక్సిన్ ను (ఓపీవీ) జీరో డోస్ ఇస్తారు. చిన్నారులకు అంగ వైకల్యం రాకుండా ఉండేందుకు దీన్ని వేస్తారు. అలాగే పిల్లలు పుట్టిన 24 గంటల లోపు హెపటైటిస్–బి జీరో డోస్, బీసీజీ, ఆ తర్వాత ఆరు, పది, 14 వారాలకు, ఆ తర్వాత వివిధ రకాల వ్యాక్సిన్లు వేస్తారు. ఇవన్నీ వారికి ప్రమాదకరమైన జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయి. జిల్లాలో ఐదేళ్ల లోపు ఉన్న 2,38,404 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా అధికారులు గుర్తించారు. ఇందుకో 1313 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. పల్స్ పోలియోను పకడ్బందీగా నిర్వహించేందుకు 2,626 టీములను ఏర్పాటు చేశారు. 67 మొబైల్ టీమ్‌లు, 5,252 మంది సిబ్బంది పనిచేయనున్నారు. అధిక సంఖ్యలో ప్రజలు ఉండే ప్రదేశాలైన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు తదితర చోట్లకు 46 టీమ్‌లు వెళ్లి, అక్కడ ఉంటే చిన్నారులకు వాక్సిన్ వేస్తాయి. 26 హైరిస్కు ప్రాంతాలను గుర్తించారు. ఆదివారం వ్యాక్సినేషన్‌తో పాటు సోమ, మంగళ వారాల్లో మాపింగ్ కార్యక్రమంలో భాగంగా హైరిస్క్ ప్రాంతాలను మొబైల్ టీమ్‌లో కవర్ చేస్తాయని డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి, డాక్టర్ సుదర్శన్‌బాబు తెలిపారు. ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో 52 పీహెచ్‌సీలు, 16 యూపీహెచ్‌సీల పరిధిలో నిర్వహంచన్నట్లు వివరించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు పాల్గొంటున్నట్లు తెలిపారు.


