విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు
● జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్
నందికొట్కూరు/పాములపాడు/జూపాడుబంగ్లా: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై వేటు పడుతుందని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ హెచ్చరించారు. నందికొట్కూరు, మిడుతూరు, బ్రాహ్మణకొట్కూరు, ముచ్చుమర్రి, జూపాడుబంగ్లా, పాములపాడు పోలీసు స్టేషన్లను గురువారం ఎస్పీ పరిశీలించారు. ఆయా పోలీసు స్టేషన్లలో పెండింగ్ కేసులపై ఆరా తీశారు. అలాగే సిబ్బంది విధుల గురించి పోలీసులను అడిగి తెలుసుకున్నారు. పోలీసుల స్టేషన్లలో రికార్డులను జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టేషన్‌లో డ్యూటీలో ఉన్న పోలీసులకు విధి విధానాలను ఎస్పీ గుర్తు చేశారు. నైట్, డే బీట్ల డ్యూటీలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలతో మంచి మెలగాలని, స్నేహ బంధాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్‌ఐలు ఓబులేసు, సురేష్, తిరుపాలు, సురేష్‌బాబు, మల్లికార్జున, ఆయన సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనాదారులకు సూచనలు ఇవ్వాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ రామాంజినాయక్, రూరల్ సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
పాములపాడు ఎస్‌ఐ ఎవరు?
పాములపాడు స్టేషన్‌ను జిల్లా ఎస్పీ తనిఖీకి గంట ముందు ఎస్‌ఐ సురేష్‌బాబు రిలీవ్ అయినట్లు సమాచారం. ఏడాదిన్నర క్రితం ఇక్కడికి బదిలీపై వచ్చిన ఈయనను హడావుడిగా రిలీవ్ కావడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. కాగా ఈయన స్థానంలో కర్నూలు తాలుకా పోలీసు స్టేషన్ నుంచి ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి, వెలుగోడు శ్రీకాంత్, బ్రాహ్మణకొట్కూరుఎస్‌ఐ తిరుపాలు పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కొత్తపల్లి ఎస్‌ఐ జయశేఖర్ గౌడు ఇన్‌చార్జిగా నియమించినట్లు తెలుస్తోంది.


