నకిలీ ఆధార్‌తో అక్రమ రిజిస్ట్రేషన్
ఆదోని రూరల్: 23 ఏళ్ల క్రితం మృతి చెందిన వ్యక్తి పేరుపై నకిలీ ఆధార్ సృష్టించి అక్రమంగా స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంఘటన ఆదోనిలో వెలుగులోకి వచ్చింది. భార్య, భర్త పేర్లు ఒకేవిధంగా ఉండేవారిని గుర్తించి, వారి పేర్ల మీద తప్పుడు ధ్రువ పత్రాలు సృష్టించి భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన ఉదంతమిది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. మండిగిరి ప్రాంతానికి చెందిన మస్తాన్‌వలి, ఫాతిమా దంపతులు సర్వేనంబర్ 486/1లో ఆరు సెంట్ల స్థలాన్ని 1996లో (డాక్యుమెంట్ 873) ద్వారా కొనుగోలు చేసుకున్నారు. 2003 ఇంటి పెద్ద మస్తాన్‌వలి అనారోగ్యంతో మృతిచెందారు. అయితే కొందరు వ్యక్తులు మస్తాన్‌వలి, ఆయన భార్య ఫాతిమా పేర్లు కలిగిన డమ్మీ వ్యక్తులను సృష్టించి ప్లాటును అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆదోని పట్టణానికి చెందిన దీపి మస్తాన్‌వలి, దీపి ఫాతిమా పేర్ల వ్యక్తుల ఆధార్ కార్డులను సృష్టించి ఆ ప్లాటును రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాగా మృతుడు మస్తాన్ వలి భార్య ఫాతి మాబీ, కుమార్తె గౌసియా, కుమారుడు షేక్షావలి గురువారం ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుని ఈసీ తీశారు. దీంతో వారి ప్లాటు నంబర్ 36 ఇతరుల పేరు మీద బదిలీ అయినట్లు రికార్డుల్లో తేలింది. ఈ విషయంపై సబ్‌రిజిస్ట్రార్ సునంద దృష్టికి తీసుకెళ్లగా.. బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, ఫిర్యాదు కాపీని తనకు అందిస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 23 ఏళ్ల క్రితం మృతిచెందిన వ్యక్తి పేరుపై డూప్లికేట్ ఆధార్ సృష్టించి భూమి రిజిస్ట్రేషన్ చేయడంపై పట్టణంలో చర్చ జరుగుతోంది.


