పది రోజులుగా నరక ‘వేతన’
● వ్యవసాయ శాఖకు చెందిన ఒక ఉద్యోగి కలెక్టరేట్‌లోని ఎస్‌బీఐ ట్రెజరీ బ్రాంచీ నుంచి ఏడాది క్రితం పర్సనల్ లోన్ తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాబుగారు ఉన్నారు కదా... ఒకటో తేదీ లేదా ఐదో తేదీలోపు వేతనాలు బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారనే ఉద్దేశంతో ప్రతి నెలా 5వ తేదీలోపు రూ.30 వేలు చెల్లించే విధంగా(ఈఎంఐ) ఏర్పాటు చేసుకున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం కొన్ని నెలలుగా ఉద్యోగులకు ఎప్పుడు వేతనాలు చెల్లిస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. నవంబరు నెల వేతనం డిసెంబరు 10వ తేదీ వరకు బ్యాంకు ఖాతాకు జమ కాలేదు.
.. ఈ పరిస్థితి ఒక్కరిది, ఇద్దరి కాదు... ఉమ్మడి కర్నూలు జిల్లాలో 30 వేల మంది వరకు ఉద్యోగులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
కర్నూలు(అగ్రికల్చర్): ట్రెజరీ ద్వారా వేతనాలు పొందే ఉద్యోగులు కర్నూలు జిల్లాలో 25,985, నంద్యాల జిల్లాలో 20,282 ఉన్నారు. మొత్తం 46,287 మందికి డిపార్టుమెంటు వారీగా వేతనాలు చెల్లిస్తున్నారు. ఇప్ప టి వరకు కొన్ని డిపార్టుమెంటు ఉద్యోగులకే వేతనాలు జమ అయ్యాయి. ఇప్పటికీ దాదాపు 30 వేల మందికిపైగా వేతనాలు చెల్లించిన దాఖలాలు లేవు. నవంబరు నెల వేతనాలే కాదు... ఐదారు నెలలుగా ప్రతి నెలా జీతాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతూనే ఉంది. హిందువులకు దసరా పండగ అక్టోబరు 2వ తేదీ ఉన్నప్పటికీ వేతనాలు మాత్రం ఇవ్వలేదు.
నోరు మెదపని ఉద్యోగ సంఘాల నేతలు
ఉమ్మడి జిల్లాలో 18 శాఖలకు సంబందించిన ఉద్యోగులకు వేతనాలు లేకపోవడంతో ఆయా శాఖల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వ్యవసాయం, ఉద్యానశాఖ, పట్టుపరిశ్రమ శాఖ , నీటిపారుదల, రోడ్లు–భవనాలు, రెవెన్యూ, పౌరసరఫరాలు, సర్వే, పరిశ్రమలు, సహకార శాఖ, రవాణా, సమాచార పౌరసంబంధాలు, ఐఎంఎస్–ఈఎస్‌ఐ, మైనింగ్, ఎన్‌సీసీ, ట్రైబల్ వెల్ఫేర్‌లకు చెందిన ఉద్యోగులు నవంబరు నెల వేతనాల కోసం ఎదరు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతి నెలా ఐదారు తేదీల్లోనే వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ అప్పట్లో ఉద్యోగ సంఘాల హైరానా అంతా ఇంతా కాదు. ఇపుడు పది రోజులు, ఆపైనే ఆలస్యమవుతున్నా... ఉద్యోగ సంఘాలు నోరుమెదపడం లేదు. వేతనాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నా ఏపీ ఎన్‌జీజీఎవోస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
ఈ నెల 10 వతేదీ వరకు
అందని జీతాలు
చంద్రబాబు ప్రభుత్వంపై
రగులుతున్న ఉద్యోగులు
ఉమ్మడి జిల్లాలో వేతనాలు పొందని
ఉద్యోగులు 30 వేల మంది!


