నక్కపల్లి : ఉపమాక వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. చంద్రగ్రహణం కారణంగా మంగళవారం మధ్యా హ్నం ఆలయం మూసివేసిన అనంతరం రాత్రి ఏడుగంటలకు ఆలయం తెరచి, ఆలయశుద్ధి, సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం స్వామివారి డోలోత్సవంలో భాగంగా అద్దపు సేవ నిర్వహించారు. అనంతరం స్వామివారి గర్భాలయ ప్రవేశ ఘట్టాన్ని లక్ష్మీసంవాదం, చోరసంవాదం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులను సుదర్శన పెరుమాళ్లను రథంలో ఉంచి మాడవీధుల్లో తిరువీధి సేవలు నిర్వహించారు. రథోత్సవంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. తెల్లవారు ఉపమాకలో తిరునాళ్లు జరిగాయి. తదుపరి మూడురోజుల పాటు పుష్పయాగోత్సవాలు (పవళింపుసేవలు)జరుగుతాయి. ఈ సందర్భంగా కొండపైన, దిగువన నిత్య ఆరాధనలు బాల భోగ నివేదనలు, నిత్యహోమాలు, ఆలయంలో బలిహరణలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగించారు. రాత్రికి స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వివిధ రకాల పండ్లు నివేదన చేశారు. జోలపాటలతో స్వామివారి పుష్పయాగోత్సవం(పవళింపు)సేవ మొదటి రోజు కార్యక్రమాన్ని పూర్తి చేశారు.


