breaking news
Anakapalle District Latest News
-
ఆకలి తీర్చని ని‘బంధనాలు’
బుచ్చెయ్యపేట: రెండు కళ్లు లేని తనకు, వృద్ధురాలైన తన తల్లికి రెండు నెలలుగా రేషన్ బియ్యం, సరకులు ఇంటికి అందించకపోవడంపై రాజాం గ్రామానికి చెందిన దివ్యాంగుడు నడిపల్లి సన్యాసినాయుడు సోమవారం అధికారులకు ఫిర్యాదు చేశారు. పుట్టుకతోనే రెండు కళ్లు లేని తనకు, 80 ఏళ్లు వయస్సు కలిగిన తన తల్లికి రెండు నెలలుగా గ్రామానికి చెందిన రేషన్ డీలరు ఇంటికొచ్చి సరకులు ఇవ్వక పస్తులుంటున్నామని ఆయన తహసీల్దార్‌కు ఇచ్చిన అర్జీలో ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులు, దివ్యాంగుల ఇంటికెళ్లి నిత్యావసర వస్తువులు అందించాలని ప్రభుత్వం చెబుతున్నా తమ గ్రామ రేషన్ డీలర్ అమలు చేయడం లేదని వాపోయారు. గత నెలలో కూడా రేషన్ సరకులు ఇవ్వకపోవడంతో తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశానని, అయినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని తహసీల్దార్‌కు నేరుగా, కలెక్టర్, సీఎం, డిప్యూటీ సీఎం, పౌరసరఫరాల శాఖ మంత్రిలకు పోస్టులో ఫిర్యాదు చేశానన్నారు. తహసీల్దార్ లక్ష్మిని దీనిపై వివరణ కోరగా దివ్యాంగుడైన సన్యాసిరావుది సింగిల్ కార్డు కాదని, ఇతని కార్డులో అతని తల్లి పేరు కూడా ఉందని, ఆమె వయస్సు 65 సంవత్సరాలుగా రేషన్ కార్డులో నమోదైందని, అందువల్ల లిస్టులో పేరు రాకపోవడంతో డీలరు ఇంటికెళ్లి సరకులు అందించలేదన్నారు. తల్లి వయస్సు మార్పు చేయించి ఇంటికే రేషన్ సరకులు అందేలా చూస్తామన్నారు.దివ్యాంగుడు, అతని 80 ఏళ్ల తల్లికి అందని రేషన్ -
‘తాచేరు’ మరణాలు ప్రభుత్వ హత్యలే
● పేట డైవర్షన్ రోడ్డు, మిగిలిన రోడ్లు బాగు చేయకపోతే ప్రజా ఉద్యయం ● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ బుచ్చెయ్యపేట: తాచేరు నదిలో కాలుజారి కొట్టుకుపోయి ఇద్దరి మృతికి ప్రభుత్వమే కారణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఇటీవల భీమునిపట్నం, నర్సీపట్నం (బీఎన్) ఆర్అండ్బీ రోడ్డులో విజయరామరాజు పేట వద్ద వర్షాలకు కోతకు గురైన తాచేరు డైవర్షన్ రోడ్డు నదిలో కాలు జారి వడ్డాదికి చెందిన రైతు కాళ్ల సుబ్బారావు, పేట గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి ఆడారి రోహిత్ కుటుంబ సభ్యులను ఆయ న స్థానిక నాయకులతో కలిసి సోమవారం పరామ ర్శించారు. స్ధానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ డైవర్షన్ రోడ్డు దెబ్బతినడం వల్ల విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నిర్ల క్ష్యం వహించిందన్నారు. రోడ్డును రెండు నెలల పాటు బాగు చేయకపోవడంతో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి, వ్యవసాయ చేసుకుంటున్న రైతు రైతు తాచేరు నదిలో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారన్నారు. పోయిన ప్రాణాలను ఈ ప్రభుత్వం తీసుకురాగలదా? అని ప్రశ్నించారు. ఇవి ముమ్మా టికీ ప్రభుత్వ హత్యలేనని, బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని అన్నారు. విజయరామరాజుపేట తాచేరు డైవర్షన్ రోడ్డును బాగుచేయాలని తమ పార్టీ తరపున నాయకులతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో డైవర్షన్ రోడ్డు పనులు చేపట్టారన్నారు. పేట, వడ్డాది వంతెనలతో పాటు దెబ్బతిన్న బీఎన్ రోడ్డు, ఆర్టీ రోడ్డు, వడ్డా ది నుంచి ఘాట్‌రోడ్డుకు వెళ్లే రోడ్డు పనులు చేపట్టకపోతే ప్రజలతో కలిసి ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. జెడ్పీటీసీ దొండా రాంబాబు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ కోవెల జనార్దనరావు, వైస్ ఎంపీపీలు దొండా లలితా నారాయణమూర్తి, గొంపా చినబాబు, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
సేంద్రియ ఉత్పత్తులను వినియోగించండి
తుమ్మపాల: రసాయన ఎరువులు వాడకుండా సహజ సిద్ధంగా పండించే సేంద్రియ పంటల ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో అమృతపాల ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ–(సబ్బవరం) ఏర్పాటు చేసిన సేంద్రియ వ్యవసాయోత్పత్తుల స్టాల్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిమితికి మించి రసాయన ఎరువుల వాడకం, ఆ ఉత్పత్తుల వినియోగం వల్ల పర్యావరణం, మనిషి ఆరో గ్యం ప్రభావితమవుతున్నాయన్నారు. సేంద్రియ వ్యవసాయోత్పత్తులకు మార్కెంటింగ్ సదుపాయం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవ సాయ అధికారి మోహనరావును ఆదేశించారు. -
ఏరియా ఆస్పత్రిలో ఆరోగ్య శిబిరం
నర్సీపట్నం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నాయని, అందులో భాగంగానే మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఏరియా ఆస్పత్రిలో నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ శిబిరాల్లో మహిళలకు అన్ని రకాల స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారన్నారు. ఆయుష్మాన్– వయోవందన కార్డు ద్వారా 70 ఏళ్లు పైబడిన వారికి ఏడాదికి రూ.5 లక్షలు విలువైన వైద్య సేవలతోపాటు పెన్షన్ పొందే అవకాశం ఉందన్నారు. ఏరియా ఆస్పత్రిలో రూ.2.10 కోట్లతో వెయిటింగ్ హాల్స్ నిర్మించనున్నట్లు స్పీకర్ పేర్కొన్నారు. ఆస్పత్రిలో ఓపీ నమోదులో జాప్యం జరుగుతున్నందున అదనంగా మరో మూడు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఐసీడీఎస్ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. గర్భిణులకు నిర్వహించిన సీమంతంలో పాల్గొన్నారు. ఆర్డీవో వి.వి.రమణ, తహసీల్దార్ రామారావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ వీరజ్యోతి, ఆస్పత్రి సూపరిండెంటెంట్ సుధాశారద, హా స్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు సిహెచ్. పద్మావతి, జెడ్పీటీసీ రమణమ్మ పాల్గొన్నారు. -
చివరి మజిలీకి ఎన్ని కష్టాలో..
పెద్దేరు నది నీటిలో నుంచి మృతదేహాన్ని మోసుకెళ్తున్న కుటుంబ సభ్యులు బుచ్చెయ్యపేట: మండలంలో వడ్డాది మేజర్ పంచాయతీలో మృతదేహాన్ని ఖననం చేయడానికి బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడ్డారు. సోమవారం వడ్డాదిలో కొత్తూరుకు చెందిన ముత్యాల గణేష్ అనారోగ్యంతో మృతి చెందాడు. దళితులు, దేవాంగులు, స్వర్ణకారు లు, కమ్మర్లకు చెందిన శ్మశానవాటిక ఇక్కడ మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఎస్సీ బాలుర వసతి గృహం ఎదురుగా పెద్దేరు నది ఒడ్డున ఉంది. గతంలో పెద్దేరు కస్పా కాలువపై సిమెంట్ గొట్టాలు పరిచి రోడ్డు వేశారు. ఈ రోడ్డుపై వెళ్లి మృతదేహాలను ఖననం చేసేవారు. ఇటీవల వర్షాలకు సిమెంట్ గొట్టాల రోడ్డు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. నడుం లోతు నీటి లో నుంచి అతికష్టం మీద శ్మశాన వాటిక వరకు మృతదేహాన్ని మోసుకెళ్లి ఖననం చేశారు. ఇప్పటికై నా శ్మశాన వాటికకు వెళ్లే రహదారిని బాగు చేయడమే కాక వేరే దగ్గర తమ కులాల వారు అంత్యక్రియల నిర్వహణకు స్థలం కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
బొమ్మల కొలువు.. సంస్కృతికి నెలవు
సాంకేతికత ఎంత పెరిగినా.. కృత్రిమ మేధతో అద్భుతాలు చేస్తున్నా.. అంతరిక్షానికి వెళ్లొచ్చినా కొన్ని సంప్రదాయాలు ఎప్పటికీ పాతబడవు.. చూడ్డానికీ బాగుంటాయి.. ఆనందాన్నీ ఇస్తాయి. అలాంటిదే దసరా బొమ్మల కొలువు.. మన సంస్కృతీ, సంప్రదాయాలను సజీవంగా నిలుపుతున్న కళాత్మకమైన అందమైన వేదిక. యలమంచిలి రూరల్: జిల్లా అంతటా దసరా వేడుకలు సరదాగా సాగుతున్నాయి. బొమ్మల కొలువులు ముచ్చట గొలుపుతున్నాయి. యలమంచిలి పట్టణంలోని ఓరుగంటివారి వీధిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు సుసర్ల భాగ్యలక్ష్మి, సూర్యప్రకాష్ దంపతులు తమ ఇంట్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు విశేషంగా ఆకట్టుకుంటోంది. గత ఆరేళ్లుగా వీరు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఐదు వరుసల్లో సుమారు వెయ్యికి పైగా బొమ్మలతో పెట్టిన బొమ్మల కొలువు చూడ్డానికి గృహిణులు, పిల్లలు, విద్యార్థులు ఉపాధ్యాయ దంపతుల ఇంటికి వెళ్తున్నారు. అలాగే రాంబిల్లి మండలం దిమిలి గ్రామంలో ప్రముఖ పురోహితుడు కొట్ర దీక్షితులు ఇంట్లో గత 10 సంవత్సరాలుగా దసరా పండుగకు బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు. దీక్షితులు భార్య సూర్య గాయత్రి ప్రత్యేక శ్రద్ధతో బొమ్మల కొలువు తీర్చిదిద్దుతున్నారు. పురాణేతి హాసాల్లో కనిపించే దేవతల ప్రతిమలు, నవ దుర్గలు, త్రిమూర్తులు, హనుమ, లక్ష్మణ సమేత సీతారాములు, శ్రీనివాసకల్యాణ ఘట్టాలు, రాధాకృష్ణులు, గుడి, గ్రామం, వివాహ క్రతువు, సహపంక్తి భోజనం ఇలా.. వివిధ రకాల బొమ్మల్ని ఇక్కడ కొలువులో ఉంచారు. ఎన్నెన్నో బొమ్మలు బొమ్మల కొలువులో దేవుళ్ల బొమ్మలు, కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు కనువిందు చేస్తున్నాయి. పంచాంగం బ్రాహ్మణుడు, పచారీకొట్టు వ్యాపారి, ఆవు దూడ, జంతువులు, పక్షులు, గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టే బొమ్మలు ఇలా ఎన్నో రకాల బొమ్మలను కళాత్మకంగా అమర్చారు. ప్రతి ఏటా కొత్త బొమ్మలను జత పరుస్తున్నామని, మన సంస్కృతీ సంప్రదాయాలు భావితరాలకు తెలిసేలా చేయడమే బొమ్మల కొలువు లక్ష్యమని ఏటికొప్పాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సుసర్ల భాగ్యలక్ష్మి చెప్పారు. బొమ్మల కొలువు దసరా, దీపావళి, సంక్రాంతి పర్వదినాల్లో ఏర్పాటు చేయడం పూర్వీకుల నుంచి మనకు సంక్రమించిన సంస్కృతిలో భాగమని తెలుగు అధ్యాపకురాలు కొట్ర సూర్య గాయత్రి చెప్పారు. ఈ కాలం పిల్లలకు బొమ్మల కొలువు ద్వారా సులువుగా మన సంప్రదాయాల గురించి వివరించవచ్చన్నారు. -
వేర్వేరు చోట్ల నీటిలో జారిపడి ఇద్దరి మృతి
● తెనుగుపూడిలో చెరువులో మునిగి టెన్త్ విద్యార్థి ● బోయిలకింతాడలో శారదానదిలో పడి మరో వ్యక్తి ● రెండు ఘటనలపై పోలీసుల దర్యాప్తుదేవరాపల్లి: మండలంలో సోమవారం వేర్వేరు చోట్ల నీటిలో ప్రమాదవశాత్తు జారిపడి ఓ ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనలు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తెనుగుపూడికి చెందిన పదో తరగతి విద్యార్థి పెనగంటి మోహన్‌రావు(15), అతని స్నేహితుడు రొంగలి హేమంత్‌తో కలిసి వారి కళ్లాలకు సమీపంలో తారురోడ్డుకు ఆనుకొని ఉన్న రాజు చెరువు దగ్గరకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో మోహన్‌రావు ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో మునిగిపోయాడు. హేమంత్ కేకలు వేయడంతో స్థానికులు కొందరు చెరువులో దిగి బాలుడు ఆచూకీ కోసం గాలించారు. నీటిలో మునిగిన బాలుడిని బయటకు తీయగా అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న 108 అంబులెన్స్ సిబ్బంది వైద్య పరీక్షలు జరిపి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఇంటి నుంచి వెళ్లిన గంటల వ్యవధిలోనే ఒక్కగానొక్క కొడుకు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు రమణ, దేవి గుండెలవిసేలా రోదించారు. మృతుడి తండ్రి రమణ ఫిర్యాదు మేరకు దేవరాపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ● మండలంలోని బోయిలకింతాడలో భర్నికాన అప్పలరాజు(35) సోమవారం ఉదయం శారదానదికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారిపడి నదిలో మునిగి మృతిచెందాడు. మృతుడికి భార్య రత్నం, నవీన్, ఝాన్సీ పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య, స్థానిక విద్యా కమిటీ చైర్పర్సన్ రత్నం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ పైడిరాజు తెలిపారు. ఈ రెండు గ్రామాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. -
రేషన్ సరకుల కోసం 12 కి.మీ. నడవాలా?
దేవరాపల్లి: చింతలపూడి పంచాయతీలో ప్రత్యేక రేషన్ డిపో ఏర్పాటు చేయాలని స్థానిక గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రత్యేక రేషన్ డిపో ఏర్పాటు చేయాలని కోరుతూ చింతలపూడి, సమ్మెద, వంతెవానిపాలెం గిరిజనులు సోమవారం ఆందోళన చేపట్టారు. అనంతరం పీజీఆర్ఎస్లో స్థానిక తహసీల్దార్ పి.లక్ష్మీదేవికి వినతిపత్రం అందజేశారు. వీరి ఆందోళనకు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా పలువురు గిరిజనులు మాట్లాడుతూ తామరబ్బ, చింతలపూడి పంచాయతీలకు కొన్నేళ్లుగా తామరబ్బ పంచాయతీ పరిధిలోని ముకుందపురంలోని రేషన్ డిపోలో సరకులు పంపిణీ చేస్తుండడంతో చింతలపూడి పంచాయతీలోని 12 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వంతెవానిపాలెం, బోడిగరువు, నేరెళ్లపూడి గ్రామాలకు సుమారు 12 కిలోమీటర్ల దూరం ఉంటుందని, ప్రతి నెలా సరకుల కోసం కాలి నడకన వెళ్లి నరకయాతన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇదే అంశంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా తహసీల్దార్ విచారణ జరిపి చింతలపూడి పంచాయతీలో ప్రత్యేక రేషన్ డిపో ఏర్పాటు చేయాలని నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికై నా కలెక్టర్ జోక్యం చేసుకుని తమ సమస్యను పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డి.శ్రీను, ఎం. ఎర్రునాయుడు, డి.దేవి, డి.ఉమ, వి.వెంకటేష్, టి.రాములమ్మ, కె.గౌరునాయుడు తదితర గిరిజనులు, మహిళలు పాల్గొన్నారు.చింతలపూడిలో డిపో ఏర్పాటు చేయాలని గిరిజనుల ఆందోళన -
పీలా...ఢీలా
డాబాగార్డెన్స్: జీవీఎంసీ స్థాయీ సంఘం సమావేశం మేయర్, స్థాయీ సంఘం చైర్మన్ పీలా శ్రీనివాసరావు, బీజేపీ కార్పొరేటర్ గంకల కవిత మధ్య తీవ్ర వాగ్వాదానికి వేదికై ంది. సమావేశానికి కమిషనర్ వస్తారని మేయర్ చెప్పగా, ‘కమిషనర్ ఊర్లో లేరని మీకు తెలియదా? లేక తెలిసీ అడుగుతున్నారా?’ అంటూ కవిత నిలదీశారు. దీనికి మేయర్ స్పందిస్తూ మీరు కూర్చోండి. ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకుందాం అనడంతో వివాదం మరింత రాజుకుంది. మీతో మాకు పర్సనల్ ఏముంటాయని ప్రశ్నించారు. మీరు మేయర్‌గా కాకుండా కేవలం చైర్మన్‌గా మాత్రమే వచ్చారు. మేము కూడా ప్రజలతో ఎన్నికయ్యాం. సమావేశం సోమవారం అయితే మాకు ఆదివారం చెబుతారా? మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. దీనికి పీలా శ్రీనివాసరావు ఇది అత్యవసర సమావేశం. ఇష్టం లేని వారు వెళ్లిపోవచ్చు అని బదులిచ్చారు. అంతేకాకుండా, స్థాయీ సంఘంలో మీకు స్థానం కల్పించింది నేను, నా పార్టీ నుంచి మీకు అవకాశం ఇచ్చాను అని మేయర్ తీవ్రంగా మండిపడ్డారు. మీరు మాకు క్లాసులు చెబుతారా? మీ వ్యవహార శైలి బాగాలేదు అంటూ కవిత..మేయర్‌పై విరుచుకుపడ్డారు. జిరాయితీ భూమికి ప్లానింగ్ ఎలా? శానాపతి వసంత మాట్లాడుతూ జిరాయితీ భూమికి అధికారులు ప్లానింగ్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దానికి చైర్మన్ స్పందిస్తూ, సంబంధిత అధికారులు లేరు, ఆ విషయం వదిలేయండి.. అని చెప్పగా, సభ్యురాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో కూడా నేను స్థాయీ సంఘంలో ఉన్నాను, అప్పుడు అధికారులంతా అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు అధికారులు లేకపోతే ఎలా? అని మేయర్‌ను ప్రశ్నించారు. బంజరు భూమిలో రోడ్డు వేయగలమా అని ప్రశ్నిస్తూ, దీనిపై విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. అభివృద్ధి పనులు ఎక్కడ? అనేకసార్లు విజ్ఞప్తులు చేసినా, వార్డుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్ లేదని అధికారులు చెబుతున్నారని పలువురు సభ్యులు మండిపడ్డారు. నవంబర్‌లో జరిగే సదస్సుకు రూ. 40 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ‘నగరాభివృద్ధి, సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు. కానీ మా వార్డుల పరిస్థితి ఏమిటి? మరో నాలుగైదు నెలల్లో పదవీకాలం ముగుస్తుంది, తిరిగి ఎన్నికలకు వెళ్లాలంటే మేము చేసిన అభివృద్ధి చూపించాలా వద్దా?’ అని ప్రశ్నించారు. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా తాము విఫలమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అంశాలకు సభ్యుల ఆమోదం ఈ తీవ్ర చర్చలు, నిరసనల అనంతరం, సమావేశంలో చర్చకు వచ్చిన 91 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. వీటిలో ముఖ్యంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు–2025కు సంబంధించిన అంశాలున్నాయి. ఈ సందర్భంగా మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ రూ. 27.60 కోట్ల అంచనా వ్యయంతో నగర సుందరీకరణ, అభివృద్ధి పనులు, రూ. 5.3 కోట్ల అంచనా వ్యయంతో ఇతర ఇంజినీరింగ్ పనులకు సభ్యులు ఆమోదం తెలిపారని చెప్పారు. ప్రజా ఆరోగ్య విభాగానికి సంబంధించి పారిశుధ్య కార్మికుల జీతాలకు కూడా ఆమోదం లభించిందని తెలిపారు. సమావేశంలో ప్రధాన ఇంజినీర్ పీవీవీ సత్యనారాయణరాజు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్, జోన్–1 జోనల్ కమిషనర్ ఇప్పినాయుడు, 6వ జోన్ జోనల్ కమిషనర్ విజయశంకర్, పర్యవేక్షక ఇంజినీర్లు సంపత్‌కుమార్, రాయల్‌బాబు, గోవిందరావు, కె.శ్రీనివాసరావు, కార్యనిర్వాహక ఇం.ఇనీర్లు, ఏఎమ్వోహెచ్లు ఇతర అధికారులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ సభ్యురాలి ఆగ్రహం సమావేశం ప్రారంభానికి ముందు వైఎస్సార్ సీపీ సభ్యురాలు సాడి పద్మారెడ్డి కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, ముఖ్యంగా సెక్రటరీ మేయర్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారు. స్థాయీ సంఘం సమావేశాల విధివిధానాలు ఏమిటో తెలియజేయాలని ఆమె డిమాండ్ చేశారు. సమావేశం ఉందని సోమవారం ఉదయం తనకు ఫోన్ చేసి చెప్పారని, అజెండా అంశాలు చదవడానికి కూడా సమయం ఇవ్వలేదని ఆమె అన్నారు. గత సమావేశంలో అడిగినా ఇప్పటివరకు విధివిధానాలు తనకు ఇవ్వలేదని ఆరోపించారు. తమ వార్డులు, జోన్లలో చేపట్టే ఏ కార్యక్రమమైనా తన దృష్టికి తీసుకురావాలని అధికారులను కోరారు. ‘స్థాయీ సంఘం’లో రచ్చ రచ్చ మేయర్‌పై గుర్రుమన్న కూటమి భాగస్వామి బీజేపీ కార్పొరేటర్ పర్సనల్‌గా మాట్లాడుకుందామన్న మేయర్.. మీతో మాకు పర్సనల్ ఏంటి? అని నిలదీసిన వైనం సొంత సభ్యులతోనే మేయర్‌కు చుక్కెదురు విలీన గ్రామాలకు అన్యాయం? మరో సభ్యుడు మొల్లి ముత్యాలు జీవీఎంసీ పరిధిలోని విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రశ్నలు లేవనెత్తారు. ’జీవీఎంసీ అంటే కేవలం నగరం మాత్రమే కాదు, విలీన గ్రామాలూ ఉన్నాయి. కేవలం నగరంలోనే సుందరీకరణ, అభివృద్ధి పనులు చేపడితే విలీన గ్రామాలను ఎందుకు కలుపుకున్నట్లు? అని ఆయన ప్రశ్నించారు. శ్మశాన వాటికలకు కూడా రక్షణ లేకుండా పోయిందని, అభివృద్ధి పనులు అడిగితే బడ్జెట్ లేదని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్‌లో జరిగే సదస్సుకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడానికి మాత్రం బడ్జెట్ ఉంటుందా అని ఆయన దుయ్యబట్టారు. -
‘జూనియర్ అథ్లెటిక్స్’ చాంపియన్ విశాఖ
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో విశాఖ అథ్లెట్లు బి.ఇషానా, కె.ఆర్.వి.ఎం.కుమార్, బి.శైలజ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి వ్యక్తిగత చాంప్లుగా నిలిచారు. ఈ పోటీల్లో విశాఖ జిల్లా జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కూడా కై వసం చేసుకుంది. సోమవారంతో గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో ముగిసిన ఈ పోటీలను సబ్‌జూనియర్ (అండర్–14, 16), యూత్ (అండర్–18), జూనియర్ (అండర్–20) బాలబాలికల విభాగాల్లో ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాల్లో నిర్వహించారు. బాలికల అండర్–14 విభాగంలో ఇషానా, అండర్–18 విభాగంలో శైలజ, బాలుర అండర్–16 విభాగంలో కుమార్ తమ విభాగాల్లో వ్యక్తిగత చాంపియన్‌షిప్‌లు సాధించారు. అలాగే విశాఖ జిల్లా జట్టు 269 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. బాలుర చాంపియన్‌షిప్‌ను 156 పాయింట్లతో విశాఖ కై వసం చేసుకోగా, బాలికల చాంపియన్‌షిప్‌ను 113 పాయింట్లతో సాధించింది. -
విశాఖ– అరకు కార్వాన్ వాహనం రెడీ
మహారాణిపేట (విశాఖ): పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విశాఖ నుంచి అరకు వరకు ప్రత్యేక ప్యాకేజీ రూపంలో నడపనున్న కార్వాన్ వాహనాన్ని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ సోమవారం కలెక్టరేట్ వద్ద సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ ఆర్.డి. కల్యాణి, జిల్లా పర్యాటక శాఖ అధికారిణి జె. మాధవి, డివిజనల్ మేనేజర్ జగదీష్ కలిసి కలెక్టర్‌కు కార్వాన్ వాహనం ప్రత్యేకతలను వివరించారు. ఈ ప్రత్యేక వాహనాన్ని త్వరలోనే లాంఛనంగా ప్రారంభించి, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. -
అనధికారిక లేఅవుట్లతో పంట భూములకు నష్టం
అనధికారిక లేఅవుట్లతో వర్షపునీరు నిలిచిపోయి పంటలు మునిగిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, కలెక్టర్ తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ తుమ్మపాలకు చెందిన టీడీపీ, సీపీఎం నాయకులు, రైతులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. తుమ్మపాల సర్వే నంబర్లు 39, 316, 317లలో భూములు ఉన్న టి.అప్పారావు అనే ఆసామి తన భూమిలో అనధికార లేఅవుట్ వేసి వర్షపునీరు శారదానదిలోకి ప్రవహించకుండా రాతి గోడలు నిర్మించారని కలెక్టర్ దృష్టికి వారు తీసుకెళ్లారు. దీంతో ఎగువన ఉన్న రైతుల భూముల్లో నీరు నిలిచిపోయి పంటలు మునిగిపోతున్నాయని వాపోయారు. మండల రెవెన్యూ, పంచాయతీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇప్పటికే పలుమార్లు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని బాధిత రైతులు చెప్పారు. సుమారు 370 ఎకరాల్లో పంట నష్టం జరుగుతుందని, కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు బొడ్డపాటి చినరాజారావు, గొంతిని గంగాజలం, ఎస్.రాజు, పీలా బుజ్జి, గంగిరెడ్ల రమణ, బొడ్డపాటి అప్పలనాయుడు, మహిళలు పాల్గొన్నారు. -
అర్జీలకు సకాలంలో పరిష్కారం
● కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశం ● పీజీఆర్ఎస్కు 232 అర్జీలు తుమ్మపాల: పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు సకాలంలో సరైన పరిష్కారం చూపాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆమెతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలు రీఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. మొత్తం 232 అర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూ శాఖ 128, పంచాయతీ రాజ్ 23, పోలీస్ 17, పలు శాఖలకు మిగిలిన అర్జీలు నమోదయ్యాయి. కూటమి అరాచకాలపై ఫిర్యాదుల వెల్లువ కూటమి నాయకుల అక్రమాలతో తీవ్ర ఇబ్బందులకు గురైన పలువురు బాధితులు కలెక్టరేట్‌కు వచ్చి నిరసన తెలిపారు. సోమవారం జరిగిన పీజీఆర్ఎస్కు పలు గ్రామాల ప్రజలు తరలివచ్చి కూటమి నాయకుల అనధికారక వ్యవహారాలపై ఫిర్యాదులు చేశారు. ఏడాది కాలంగా గ్రామాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు పెరిగిపోయాయని, కంపెనీల పేరుతో బాధితులకు చెల్లించే నష్టపరిహార జాబితాల్లో అనర్హులైన కూటమి నాయకుల పేర్లు చేర్చేసి అర్హులను తొలగిస్తున్నారని పలువురు ధ్వజమెత్తారు. అధికారులు కూడా కూటమి నాయకుల తొత్తులుగా మారుతున్నారంటూ కలెక్టరేట్ ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. నిర్వాసితులకు రైల్వేలో ఉద్యోగమివ్వాలి రాజుపాలెం రైల్వే వంతెన నిర్మాణంలో భాగంగా భూమి, భవనం కోల్పోతున్న నిర్వాసితులకు ప్రభుత్వ మార్కెట్ విలువకు ఐదు రెట్లు నష్టపరిహారంతో పాటు నిరుద్యోగులైన తమ పిల్లలకు రైల్వేలో ఉద్యోగం అవకాశం కల్పించాలంటూ జీవీఎంసీ విలీన గ్రామం కె.ఎన్.ఆర్.పేటకు చెందిన బాధితుడు గైపూరి భాస్కరరావు కలెక్టర్‌ను వేడుకున్నారు. కష్టాలు పడి నిర్మించుకున్న ఇంటికి నామమాత్రపు నష్టపరిహారం చెల్లించి తమను రోడ్డున పడేసే ప్రయత్నాలకు అంగీకరించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం పునరాలోచన చేసి భూములు కోల్పోతున్న రైతులకు చదరపు గజాల్లో విలువ కట్టి నష్టపరిహారం చెల్లించాలని, తమకు మరో చోట పునరావాసం కల్పించాలని కోరారు. ఆర్టీసీలో ప్రత్యేక సీట్ల కోసం వినతి అనకాపల్లి: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు ప్రత్యేక సీట్లు కేటాయించి, రాయితీలు కల్పించాలని జిల్లా వయో వృద్ధుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు కాండ్రేగుల అప్పారావు కోరారు. ఈ మేరకు సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్ విజయకృష్ణన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సీ్త్రశక్తి పథకం అమలు చేయడం వల్ల వృద్ధులకు బస్సుల్లో సీట్లు లేకుండాపోయాయన్నారు. వృద్ధులకు ప్రత్యేక సీట్లు, ప్రయాణంలో 25 శాతం రాయితీ కల్పించాలని వినతిపత్రం అందజేశారు. ఎస్పీ కార్యాలయానికి 32 అర్జీలు ఆర్జీదారుల సమస్య వింటున్న ఎస్పీ తుహిన్ సిన్హాఅనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్కు 32 అర్జీలు అందాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. భూతగాదాలు–18, కుటుంబ కలహాలు–2, మోసాలకు సంబంధించి–2, వివిధ విభాగాలకు చెందినవి–10 అర్జీలు వచ్చాయన్నారు. చట్ట పరిధిలో ఉన్న అర్జీలకు 7 రోజుల్లో పరిష్కరించాలని దిగువ స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
కట్టలు తెగిన ఆగ్రహం
● గంగపుత్రుల వీరావేశం ● హోంమంత్రికి నిరసన సెగ ● వాహనం అడ్డగించిన మహిళలు ● నిలువరించలేకపోయిన పోలీసులు ● బల్క్‌డ్రగ్ పార్కు రద్దుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో శాంతించిన మత్స్యకారులు ● శుష్క వాగ్దానాలు వద్దని, పనులు ఆపితేనే మాట్లాడతామని స్పష్టీకరణనక్కపల్లి: తమ జీవితాలను నాశనం చేసే బల్క్‌డ్రగ్ పార్క్ ఏర్పాటును నిరసిస్తూ మత్స్యకారులు చేస్తున్న నిరాహార దీక్ష రెండు వారాలుగా కొనసాగుతోంది. ఉద్యమం తీవ్రతరమై వేలాదిమంది మత్స్యకారులు రోడ్డెక్కి ఆందోళన కొనసాగిస్తున్నారు. పనులు మానుకుని కుటుంబాలతో సహా నిరసన దీక్షలో పాల్గొంటున్నారు. ఈ నేపధ్యంలో మత్స్యకారులతో మాట్లాడేందుకు రాజయ్యపేట వచ్చిన హోంమంత్రి అనితకు నిరసన సెగ అంటుకుంది. ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న మత్స్యకారులను అడ్డుకోవడం పోలీసుల తరం కాలేదు. మంత్రి ప్రయాణిస్తున్న వాహనాన్ని ముందుకు వెళ్లకుండా వేలాదిగా తరలివచ్చిన మత్స్యకారులు అడ్డుకున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించి బల్క్‌డ్రగ్ పార్క్‌ను రద్దు చేయాలని నినాదాలు చేశారు. పోలీసులు పట్టుకున్న రోప్‌వేలు మత్స్యకారులను ఏమాత్రం నిలువరించలేకపోయాయి. భారీగా మోహరించిన పోలీసులు మత్స్యకారులను ఏమాత్రం అడ్డుకోలేకపోయారు. తీవ్ర వాగ్వాదాల మధ్య మత్స్యకారులను శాంతింపచేసేందుకు హోంమంత్రి తీవ్ర ప్రయత్నం చేశారు. తొలుత అధికారాన్ని ఉపయోగించి పోలీసులతో మత్స్యకారులను భయపెట్టేందుకు ప్రయత్నించినా వారు లెక్కచేయకపోగా ఆగ్రహంతో మరింత రగిలిపోయారు. చివరకు మీ నాయకులతోనే కమిటీ వేసి న్యాయం చేస్తానని, బల్క్‌డ్రగ్ పార్కును రద్దు చేసేందుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కొద్దిగా శాంతించిన మత్స్యకారులు వాహనానికి దారి ఇచ్చారు. ఆమె మాట్లాడేందుకు వీలుగా స్టేజ్ వరకు దారి ఇచ్చారు. పనులు ఆపితేనే మాట్లాడతాం.. హోంమంత్రి అనిత వేదికపై నుంచి మాట్లాడుతూ.. మీ అందరూ కొలిచే నూకతాత సాక్షిగా చెబుతున్నా, బల్క్‌డ్రగ్ పార్కును రద్దు చేసి సమస్యను పరిష్కారం చేసేందుకు హామీ ఇస్తున్నానని చెప్పారు. ఇందు కోసం మీ గ్రామం నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటే వారిని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళతానని హామీ ఇచ్చారు. తనను నమ్మాలని దసరా పండుగ అయిన వెంటనే కమిటీ సభ్యులతో డిప్యూటీ సీఎం, సీఎంలతో చర్చలు జరిపించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే బల్క్‌డ్రగ్ పార్కు రద్దు గురించి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో తమ నిరాహార దీక్ష కొనసాగుతుందని మత్స్యకారులు ముక్తకంఠంతో నినదించారు. బూటకపు హామీలు కాదని తక్షణమే పనులు ఆపాలని నినాదాలు చేశారు. కమిటీలు వేయాల్సిన పనిలేదని, డిప్యూటీ సీఎం, సీఎంలను కలిసే పనేలేదని తెగేసి చెప్పారు. మోసం చేసి తమ దీక్షను విరమింపజేయాలని చూస్తే సహించమన్నారు. చర్చలు జరిగేంత వరకు పనులను ఆపాలని నినాదాలు చేశారు. ఆమె పట్టించుకోకపోవడంతో హోం మంత్రి అనిత డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. -
కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్
దేవరాపల్లి: కూటమి ప్రభుత్వం అరాచకాలతో అన్యాయానికి, వేధింపులకు గురవుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలకు డిజిటల్ బుక్ అండగా నిలుస్తుందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు అన్నారు. తారువలో సోమవారం స్థానిక వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు నమోదు చేసి కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని, బాధితులందరికీ అండగా నిలిచేందుకే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిజిటల్ బుక్‌ను అందుబాటులోకి తెచ్చారన్నారు. ఈ డిజిటల్ బుక్‌లో దౌర్జన్యాలు, వేధింపులకు పాల్పడే వారి పేర్లతో పాటు బాధితుల వివరాలను, జరిగిన నష్టాన్ని పొందుపరిచేందుకు వీలుంటుందన్నారు. ప్రతి కార్యకర్త ఈ బుక్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వేధింపులకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టి తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం, వైస్ ఎంపీపీ పంచాడ సింహాచలంనాయుడు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వరదపురెడ్డి లలితానాయుడు, జిల్లా ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు కె.వి.రమణ, పార్టీ మండల అధ్యక్షుడు బూరె బాబూరావు, యువజన విభాగం అధ్యక్షుడు కర్రి సూరినాయుడు, ఉపాధ్యక్షుడు బండారు దేముడునాయుడు, ప్రధాన కార్యదర్శి గూడెపు రాము, సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు గంగవంశం సంతోష్, ఎంపీటీసీ పోతల వెంకటరావు పాల్గొన్నారు. అన్యాయానికి గురైన వైఎస్సార్సీపీ శ్రేణులు సద్వినియోగం చేసుకోవాలి మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు తారువలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ -
మాజీ మంత్రి కురసాలను కలిసిన బొడ్డేడ
మునగపాక: వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబును ఆదివారం కాకినాడలో పార్టీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిశారు. తనకు అవకాశం కల్పించడంలో సహకరించిన కన్నబాబు ఆశీర్వాదం తీసుకుని సత్కరించారు. పార్టీ నేతలు నరాలశెట్టి సూర్యనారాయణ, కాండ్రేగుల జగన్, పిన్నమరాజు రవీంద్రరాజు, ఈత బాబూరావు, బొడ్డేడ బుజ్జి, రామకృష్ణ, పెంటకోట శ్రీనివాసరావు, ఆడారి రమణబాబు, వెంకటప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
మహాత్మా నిన్ను మరిచారు...
బుచ్చెయ్యపేట: జాతిపిత మహాత్మాగాంధీ జయంతి దగ్గర పడుతోంది. ఐదు రోజుల్లో గాంధీ జయంతి వేడుకలున్నా పలు గ్రామాల్లో మాత్రం గాంధీ విగ్రహాలు శిథిలావస్థలో నే ఉన్నాయి. ఆహింసా మార్గంలో నడిచి బ్రిటిష్ వారిని దేశం నుండి విడిచి వెళ్లేలా చేసి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహాత్ముని విగ్రహాలు విరిగిపోయి దెబ్బతిని ఉండడాన్ని చూసి పలువురి మనస్సులు కలవరపడుతున్నాయి. విద్యార్థులు, నేటి యువత జాతీయ నాయకులను ఆదర్శంగా తీసుకోవాలని, వారి అడుగు జాడల్లో నడుచుకోవాలని గ్రామాల్లో వారి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ నాయకుల విగ్రహాల ఏర్పాటు తరవాత వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవడం లేదు. పొట్టిదొరపాలెంలో ఆర్అండ్బీ రోడ్డు పక్కన ఆంజనేయస్వామి విగ్రహం ముందు ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ఎడం చేయి పూర్తిగా విరిగిపోగా కుడి చేతిలో చేతి కర్ర లేదు. మేజర్ పంచాయతీ వడ్డాది కొత్తూరులో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం కుడి, చేతి కర్ర దెబ్బతిన్నాయి. అలాగే పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాలకు రంగులు పోయి రూపు రేఖలు దెబ్బతిని ఉన్నాయి. స్థానికులు రానున్న గాంధీ జయంతి వేడుకలకు ముందే దెబ్బతిన్న విగ్రహాలను బాగు చేసి రంగులు వేసి అందంగా ముస్తాబు చేస్తారని పలువురు కోరుతున్నారు.వడ్డాది కొత్తూరులో కుడిచేయి దెబ్బతిన్న గాంధీ విగ్రహం పొట్టిదొరపాలెంలో చేయి విరిగిన గాంధీ విగ్రహం -
సమ్మోహనం కూచిపూడి నృత్య విన్యాసం
మద్దిలపాలెం (విశాఖ): కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం నగరానికి చెందిన సిద్ధేంద్రయోగి కళానిలయం గురు సత్యభాను నృత్య కళాశాల 32వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో కూచిపూడి నృత్య విన్యాసం సమ్మోహన భరితంగా సాగింది. కళానిలయం వ్యవస్థాపకురాలు సత్యభాను ఆధ్వర్యంలో 120 మంది నృత్య కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సెంచూరియన్ యూనివర్సిటీ చాన్సలర్ ఆచార్య జి.ఎస్.ఎన్. రాజు మాట్లాడుతూ... ప్రతి విద్యార్థి విద్యతో పాటు సంప్రదాయ కళలను నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. లెండి ఇంజినీరింగ్ కాలేజీ చైర్మన్ పి. మధుసూదన రావు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం కళాశాలల్లో శాసీ్త్రయ కళల గురువులను నామినేట్ చేసేందుకు ఇటీవల జీవో కూడా విడుదల చేసిందని, ఇది విద్యార్థులకు సంప్రదాయ నృత్యాలు అభ్యసించడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డా. శ్రీధర్ మిత్ర, కన్నం నాయుడు, కూచిపూడి కళాక్షేత్ర ప్రిన్సిపల్ గురు హరి రామమూర్తి, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. 120 మందితో కూచిపూడి నృత్యంకూచిపూడి నృత్యం రూపకం -
సీటు దొరికేదెలా?..
కిటకిటలాడుతున్న రైళ్లు.. జనసంద్రంగా విశాఖ స్టేషన్ తాటిచెట్లపాలెం(విశాఖ): దసరా పండుగ సందర్భంగా విశాఖపట్నం నుంచి తమ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పండగ జరుపుకోవడానికి సొంత ప్రాంతాలకు బయలుదేరారు. దీంతో రెండు రోజులుగా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో తీవ్ర రద్దీ నెలకొంది. విశాఖ నుంచి విజయవాడ, హైదరాబాద్, తిరుపతి, చైన్నె, బెంగళూరు వంటి ప్రధాన నగరాలతో పాటు, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పలాస వైపు వెళ్లే రైళ్లు ప్రయాణికులతో నిండిపోతున్నాయి. దాదాపు అన్ని రైళ్లలో రిజర్వేషన్లు ముందే పూర్తికావడంతో, చివరి నిమిషంలో ప్రయాణాలు పెట్టుకున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ వందల్లో ఉండటంతో, టికెట్లు కన్ఫర్మ్ కాని ప్రయాణికులు జనరల్ బోగీలను ఆశ్రయిస్తున్నారు. దీంతో జనరల్ బోగీల్లో కాలు మోపడానికి కూడా స్థలం లేని పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు గంటల తరబడి నిలబడే ప్రయాణం చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కొన్ని ప్రత్యేక రైళ్లు ప్రకటించినప్పటికీ, అవి ఏమాత్రం సరిపోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపాలని, ఉన్న రైళ్లకే అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. -
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం
మర్రిపాలెం (విశాఖ): రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పాలన నడుస్తోందని, దీని వల్ల ప్రజలు, పలు శాఖల అధికారులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్, వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఖాదర్ బాషా అన్నారు. జీవీఎంసీ 53వ వార్డు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో కార్పొరేటర్ బర్కత్ అలీ, పలు ముస్లిం సంఘాల ప్రతినిధులతో కలిసి ఆయన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. రెడ్ బుక్ పాలన నుంచి విముక్తి కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్యూఆర్ కోడ్ డిజిటల్ బుక్‌లో నమోదు చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయా సమస్యలు తక్కువ వ్యవధిలో పరిష్కరిస్తామన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టిన అధికారులు, నాయకులపై చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఐహెచ్ ఫారూఖీ, పలువురు ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. -
టెట్ నుంచి ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలి
ఆరిలోవ: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్ష నుంచి ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు మిన హాయింపు ఇవ్వాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమంది పైడిరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం ఐదేళ్ల పైబడి సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా రెండేళ్లలో టెట్ అర్హత సాధించాలని, లేదంటే ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైందని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. 2010 అక్టోబరు 23 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులు అందరూ కచ్చితంగా టెట్ అర్హత పరీక్ష ఉత్తీర్ణులు కావాలి. రాష్ట్రంలో 1995 నుంచి వివిధ డీఎస్సీల ద్వారా నియమితులైన వేలాది మంది ఉపాధ్యాయులకు ఈ నిబంధన తీవ్ర సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. -
పాదచారిని తప్పించబోయి మృత్యు ఒడికి..
● పులపర్తి వద్ద ప్రమాదంలో నేవీ ఉద్యోగి దుర్మరణం ● మరొకరికి తీవ్ర గాయాలుప్రమాదంలో మృతి చెందిన నేవీ ఉద్యోగి రఘురామిరెడ్డి ప్రమాద స్థలంలో విరిగిపోయిన కిలోమీటరు రాయి యలమంచిలి రూరల్: దసరా పండుగకు కుటుంబంతో ఆనందంగా గడపడానికి వెళ్తున్న నేవీ ఉద్యోగిని యలమంచిలి మండలం పులపర్తి కూడలి వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై వెళ్తుండగా పాదచారిని తప్పించబోయి తాను ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని అదుపు చేయలేక రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు నేవీ ఉద్యోగి పి.రఘురామిరెడ్డి(31). ఇదే ప్రమాదంలో పులపర్తికి చెందిన పాదచారి పులి మల్లికార్జున్ (55) తీవ్రంగా గాయపడ్డారు. యలమంచిలి పట్టణ ఎస్ఐ కె.సావిత్రి అందజేసిన వివరాల ప్రకారం మృతుడు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో విశాఖపట్నం నుంచి తుని వైపు వెళ్తున్న బైక్ మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ యలమంచిలి మండలం పులపర్తి వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని తప్పించబోయి ప్రమాదానికి గురైంది. పాదచారితో పాటు డివైడర్‌ను ఢీకొట్టిన బైకు పల్టీలు కొట్టింది. బైకు నడుపుతున్న రఘురామిరెడ్డికి హెల్మెట్ ఉన్నప్పటికీ ప్రమాదస్థలంలోనే తలకు తీవ్ర గాయమై రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. రోడ్డు పక్కనున్న కిలోమీటరు రాయి సైతం విరిగిపోవడాన్ని బట్టి ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రమాదస్థలం వద్ద భయానక పరిస్థితులు కనిపించాయి. ప్రమాదం కారణంగా కొంతసేపు వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. మృతదేహాన్ని యలమంచిలి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి ఆధార్ వివరాలతో చిరునామా తెలుసుకున్న పోలీసులు అతడి భార్యకు ఫోన్ చేసి ప్రమాద సమాచారం అందజేశారు. ప్రమాదంలో పాదచారుడు మల్లికార్జున్ కాలు విరిగిపొయింది. గాయపడిన వ్యక్తికి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నారు. ప్రమాదంపై గాయపడిన మల్లికార్జున్ అన్నయ్య పులి సన్యాసినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
ఎంటీఎస్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలి
అనకాపల్లి: ఎంటీఎస్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించి, వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ఉమ్మడి విశాఖ జిల్లాల ఎంటీఎస్ ఉపాధ్యాయుల సంఘం నాయకులు పి.శ్రీనివాసరావు, వి.ఈశ్వరరావు, డి.అప్పలనాయుడు అన్నారు. స్థానిక శారదానది ఒడ్డున శాంతిపార్కులో ఆదివారం ఉమ్మడి విశాఖ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1998లో డీఎస్సీ పరీక్ష రాసి ఉద్యోగానికి ఉత్తీర్ణత సాధించగా, వైఎస్సార్సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్, కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబునాయుడు ఎంటీఎస్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి, తమని రెగ్యులర్ ఉపాధ్యాయుల మాదిరిగానే జీతాలు ఇచ్చి 62 సంవత్సరాలు సర్వీస్ పెంచాలన్నారు. 12 నెలలు ఉద్యోగం ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఏజెన్సీ మారుమూల ప్రాంతానికి 150 కిలోమీటర్లు దూరం వెళ్లి ఉద్యోగాలు అనారోగ్యాలతో చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు. రెండేళ్ల కాలంలో చాలా మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారని, పదవీ విరమణ అనతరం తమకు ఆర్థిక సౌలభ్యం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంటీఎస్ ఉద్యోగులు సీతయ్యదొర, నాగేశ్వరరావు, నాగరాజు, రమణ, కనకరాజు, మంగపతి, మేరీ పాల్గొన్నారు.ఎంటీఎస్ ఉపాధ్యాయులు -
సమ సమాజమే జాషువా ఆకాంక్ష
సీతంపేట: కవి కోకిల గుర్రం జాషువా కోరుకున్న సమ సమాజ స్థాపనకు అందరం సమష్టిగా కృషి చేయాలని రాష్ట్రపతి పురస్కార గ్రహీత, ప్రముఖ రచయిత ఆచార్య బేతవోలు రామబ్రహ్మం పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం అక్కయ్యపాలెం సాగరమాల కన్వెన్షన్స్ హాల్లో జరిగిన జాషువా జయంతి సభలో ఆయన ఆయన మాట్లాడారు. నాటక రచయితగా రచనా రంగంలో ప్రవేశించిన జాషువా, తన స్వీయ అనుభవాన్ని కవిత్వీకరించడం వల్లే మహాకవి అయ్యారని రామబ్రహ్మం కొనియాడారు. సీ్త్రని కేవలం శృంగార వస్తువుగా చిత్రీకరించే కవిత్వానికి భిన్నంగా, తెలుగు పద్య లోకాన్ని నూతన మార్గంలోకి నడిపించిన ఘనత జాషువాదని ప్రశంసించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, బుల్లయ్య కళాశాల తెలుగు విభాగాధిపతి ఎం.సుబ్బారావు, పలువురు రచయితలు, సాహితీవేత్తలు పాల్గొన్నారు. -
న్యాయవాదులకు బార్ కౌన్సిల్ శుభవార్త
విశాఖ లీగల్: న్యాయవాదుల సంక్షేమం కోసం రాష్ట్ర బార్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. న్యాయవాదులకు అందించే వైద్య సహాయాన్ని ఇకపై వారి భార్యలకు కూడా వర్తింపజేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వివరాలను కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్. కృష్ణమోహన్ విశాఖలో ఆదివారం ప్రకటించారు. గతంలో రూ.1,50,000 ఉన్న వైద్య సహాయాన్ని రూ. 2,50,000కు పెంచారు. న్యాయవాదుల జీవనభృతిని రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షలకు పెంచారు. సంక్షేమ నిధి పరిధిలో లేని న్యాయవాదులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి రూ. 5 లక్షలు చెల్లించాలని బార్ కౌన్సిల్ తీర్మానించింది. ఈ కొత్త పథకాలన్నీ అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నిర్ణయాలు బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్. ద్వారకానాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో తీసుకున్నారు. ఉపాధ్యక్షుడు కృష్ణమోహన్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కొత్త కూటమి సర్కార్ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. మృతి చెందిన సుమారు 1300 మంది న్యాయవాదుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 4 లక్షల వంతున నిధులు తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. ‘లా మిత్ర’ పేరుతో ఎన్నికల హామీ ఇచ్చిన రూ. 10,000 గౌరవ భృతిని ఇప్పటివరకు విడుదల చేయలేదని, పది వేలకు పైగా ఉన్న యువ న్యాయవాదుల జీవన సహాయ నిధిని వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు ప్రభుత్వం చెల్లించవలసిన రూ. 75 కోట్లు తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఇద్దరు భవానీ భక్తుల దుర్మరణం
● మరొకరికి తీవ్ర గాయాలు ● కాలినడకన విజయవాడ వెళుతుండగా వెనుక నుంచి ఢీకొట్టిన కారు నల్లజర్ల/నక్కపల్లి: కాలినడకన విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్న నక్కపల్లి మండలం దోశలపాడు గ్రామానికి చెందిన ఇద్దరు భవానీ మాలధారులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం వెనుక నుంచి కారు ఢీకొన్న ఘటనలో వీరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పక్కుర్తి శివ, పక్కుర్తి శ్రీను, పక్కుర్తి శేశీలు, కోనా గోవిందు భవానీ మాలలు ధరించి ఈ నెల 24న తమ స్వగ్రామమైన దోశలపాడు గ్రామం నుంచి ఇరుముళ్లు కట్టుకొని పాదయాత్రగా విజయవాడ బయలు దేరారు. వీరంతా ఆదివారం ఉదయం పుల్లలపాడు జాతీయ రహదారిపైకి వచ్చేసరికి విశాఖపట్నం నుంచి హైదరాబాదు వెళ్తున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన కారు వీరిని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ సంఘటనలో శివ చక్రాల కింద, గాలిలోకి ఎగిరి పక్కనే పంటబోదెలోకి పడిన శ్రీను అక్కడికక్కడే మృతి చెందగా శేశీలుకు రెండు కాళ్లూ విరిగిపోయాయి. ఆయనను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోవిందు ఫోన్ మాట్లాడుతూ దూరంగా ఉండటంతో క్షేమంగా బయటపడ్డాడు. మృతి చెందిన శివకు భార్య దేవి, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. శ్రీను అవివాహితుడు కాగా వీరంతా వ్యవసాయ కూలీలే. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తాడేపల్లిగూడెం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. పంటబోదెలో శ్రీను మృతదేహంపక్కుర్తి శివ, పక్కుర్తి శ్రీను (ఫైల్) -
మహాచండీదేవిగా జగజ్జనని
నర్సీపట్నం: శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. విశేషాలంకారాల్లో కొలువైన జగజ్జనని భక్తులు దర్శించుకుంటున్నారు. పట్టణంలో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయం, బలిఘట్టం దేవాలయాల్లో ఏడో రోజు ఆదివారం అమ్మవారు మహాచండీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్ ఈవోఐల రద్దుకు నేడు పోరాట కమిటీ ధర్నా ఉక్కునగరం: ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అడ్మిన్ కూడలి వద్ద ధర్నా చేయనున్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు. ఇదే సమయంలో ఉక్కు యాజమాన్యం 44 విభాగాల్లో ఈవోఐల కోసం నోటిఫికేషన్ చేసింది. యాజమాన్యం వైఖరికి నిరసనగా ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్న ధర్నాలో అన్ని కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు అధిక సంఖ్యలో హాజరై యాజమాన్యానికి తమ వైఖరిని తెలియజేయాలంటూ పోరాట కమిటీ నాయకులు జె. అయోధ్యరామ్, డి. ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్ కోరారు. ధర్నాకు అనుమతి లేదు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తలపెట్టిన ధర్నాకు పోలీసు అనుమతి లేదని స్టీల్‌ప్లాంట్ సీఐ కేశవరావు తెలిపారు. ధర్నా చేయాలనుకుంటే జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద చేసుకోవాలి తప్ప ఉక్కు అడ్మిన్ బిల్డింగ్ వద్ద అనుమతించబోమన్నారు. అనుమతి లేని చోట ధర్నా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. శాంతభద్రతల దృష్ట్యా పోలీసు శాఖకు సహకరించాలని ఆయన కోరారు. -
వీఆర్వోల సంఘం అసోసియేట్ అధ్యక్షుడిగా శ్రీనివాసరావు
పరవాడ/మునగపాక: ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవె న్యూ అధికారుల సంఘ అసోసియేట్ అధ్యక్షుడిగా పరవాడ మండలం, భరణికం గ్రామ రెవెన్యూ అ ధికారి బొమ్మిరెడ్డిపల్లి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అమరావతిలో జరిగిన రాష్ట్ర కార్య వర్గ సమావేశంలో మునగపాక మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆయనను ఎన్నుకున్నారు. అనంతరం శ్రీనివాసరావును రాష్ట్ర వీఆర్వో సంఘ నాయకులు ఘనంగా సత్కరించారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్, రెవెన్యూ సర్వీసెస్ అసో సియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ అధ్యక్షుడు కోన ఆంజనేయ కుమార్, ప్రధాన కార్యదర్శి జి.అనుపమ, విశాఖ జిల్లా పూర్వపు అధ్యక్షుడు సబ్బవరపు త్రినాథ రామదాస్, రాష్ట్ర వీఆర్వోల అధికారుల సంఘ ఉపాధ్యక్షుడు పోతుల శంకరరావు శ్రీనివాసరావును అభినందించారు. -
ఒక సార్.. ఇద్దరు బాస్‌లు
కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఉంది.. వాల్తేరు డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్(డీఆర్ఎం) పరిస్థితి. ఒక సార్‌కి ఇద్దరు బాస్‌లు ఉండడంతో ఎటు వెళ్లాలో.. ఏం చేయాలో.. తెలియక అయోమయంలోనూ.. అదే సమయంలో ఒత్తిడికి గురవు తున్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు జీఎంని ప్రకటించిన కేంద్రం.. ఇంకా గెజిట్ విడుదల చేయకపోవడంతో ఎవరికి వారే అన్న చందంగా మారింది. ఇద్దరు జీఎంల మధ్య నలిగిపోతున్న డీఆర్ఎం.. ఇదేం బాధరా భగవంతుడా అనుకుంటూ బదిలీ కోసం పాట్లు పడుతున్నారు. ● వాల్తేరు డివిజన్లో ఇద్దరు జీఎంల హడావుడి ● దక్షిణ కోస్తా జోన్ జీఎం సందీప్ మాధుర్ వరుస రివ్యూలు ● అదే సమయంలో ఈస్ట్ కోస్ట్ జోన్ జీఎం పరమేశ్వర్ పర్యటనలు ● గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతోనే తలపోటు ● ముంబై బదిలీ కోసం డీఆర్ఎం ప్రయత్నాలు ముమ్మరం సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించి ఆరేళ్లు దాటినా, క్షేత్రస్థాయిలో మాత్రం ‘మూడడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కి’ అన్నట్లుగా ఉంది. కేంద్ర, రాష్ట్ర రాజకీయాలు, రైల్వే బోర్డు నిర్లక్ష్యం కారణంగా కార్యకలాపాలు మొదలు కాలేదు. మూడు నెలల క్రితం దక్షిణ కోస్తా రైల్వే జోన్ జీఎంగా నియమితులైన సందీప్ మాధుర్ నెల రోజులుగా విశాఖలోనే ఉంటూ, గెస్ట్ హౌస్ నుంచి కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు. ముడసర్లోవ ప్రధాన కార్యాలయ పనులు పర్యవేక్షిస్తూ, డీఆర్ఎం లలిత్ బోరాతో కలిసి సమీక్షలు, పర్యటనలు చేస్తున్నారు. అయితే జోన్ ఏర్పాటు కాగితాలకే పరిమితం కావడంతో డీఆర్ఎంపై ఒత్తిడి మొదలైంది. నాకొద్దు బాబోయ్.! ఒక సార్ రివ్యూలు చేస్తూ బయలుదేరితే, మరొక సార్ ఫోన్లో ఏర్పాట్లు చేయమని ఆదేశాలు జారీ చేస్తారు. ప్రస్తుతం వాల్తేరు డీఆర్ఎం లలిత్ బోరా, డివిజనల్ అధికారుల పరిస్థితి ఇదే. ఒకవైపు దక్షిణ కోస్తా రైల్వే జోన్ కొత్త జీఎం, మరోవైపు ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం కలిసి డీఆర్ఎంతో చెడుగుడు ఆడుకుంటున్నారు. ముందు రోజు ఉదయం నుంచి రాత్రి వరకూ కొత్త జీఎం రివ్యూలతో, ఆ తర్వాత రోజు ప్రస్తుత జీఎం పర్యటనలతో డీఆర్ఎం క్షణం తీరిక లేకుండా ఇద్దరి మధ్య నలిగిపోతున్నారు. ఇటీవల ఒక జీఎం పర్యటనలో ఉన్న సమయంలోనే, మరో జీఎం ఫోన్ చేసి లైన్లు పరిశీలించేందుకు వస్తున్నానని, ఏర్పాట్లు చేయాలని హుకుం జారీ చేశారు. సమీక్షలు కూడా ఇరు జీఎంలు పోటాపోటీగా నిర్వహిస్తుండటంతో, వారికి సమాధానం ఇవ్వడంలోనూ, ఏర్పాట్లలోనూ అధికారులు ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. దీంతో అధికారుల్లో కొందరు తమ ఉద్యోగాలపై విరక్తి చెందుతూ తలలు పట్టుకుంటున్నారు. ఇక డీఆర్ఎం లలిత్ బోరా పరిస్థితి అయితే చెప్పాల్సిన పనిలేదు. కుటుంబంతో గడిపే తీరిక కూడా ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాల్తేరులో పనిచేయడం కంటే, ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం మంచిదంటూ తోటి అధికారుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆయన ముంబైకి బదిలీ చేయాలంటూ రైల్వే బోర్డును కోరినట్లు సమాచారం. గెజిట్ లేకపోవడమే అసలు సమస్య వాల్తేరు డివిజన్లో నెలకొన్న మొత్తం ‘తలపోటు’ వ్యవహారానికి ప్రధాన కారణం.. జోన్‌కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాకపోవడమే అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గెజిట్ వస్తేనే సందీప్ మాధుర్ జోన్‌కు అసలైన జనరల్ మేనేజర్‌గా వ్యవహరించగలరు.. అప్పుడు కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. గెజిట్‌తో పాటు కార్యాచరణ ప్రకటించిన తర్వాతే.. జీఎంతో పాటు అసిస్టెంట్ జీఎం, 10 విభాగాలు, వాటి ప్రిన్సిపల్ హెచ్వోడీలు, సిబ్బంది సహా మొత్తంగా దాదాపు 180 మంది అధికారుల నియామకం పూర్తవుతుంది. వీరి నియామకం తర్వాతే జోన్ ఆపరేషన్స్ మొదలయ్యే అవకాశం ఉంది. అధికారుల నియామకాలు ఒక్కొక్కటిగా జరుగుతున్నా, గెజిట్ రాకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని వాల్తేరు అధికారులు వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, దసరాకు కూడా జోన్ ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. అడకత్తెరలో పోకచెక్కలా వాల్తేరు డీఆర్ఎం లలిత్ బోరా పరిస్థితిచురుగ్గా తాత్కాలిక కార్యాలయం పనులు వీఎంఆర్డీఏ ‘ది డెక్’లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ కావడంతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. కొత్త జోన్‌కు ఇప్పటికే ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ (పీసీఎంఏ), ఎలక్ట్రికల్ విభాగంలో హెచ్ఏజీ అధికారి (హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్)తో సహా మరో ఇద్దరి నియామకాలు పూర్తయ్యాయి. వీలైనంత త్వరగా టెంపరరీ ఆఫీస్‌ను అందుబాటులోకి తెస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, ఈ కార్యాలయంలో విధులు ప్రారంభించాలన్నా గెజిట్ విడుదల తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు. దీంతో గెజిట్ ఎప్పుడొస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇది నా సంస్థానమంటూ..! దక్షిణకోస్తా రైల్వే జోన్‌కు కొత్త జీఎంను నియమించినా గెజిట్ విడుదల చేయకపోవడంతో భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోనే వాల్తేరు డివిజన్ కొనసాగుతోంది. జీఎం సందీప్ మాధుర్ జోన్ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరిస్తుండగా.. ఈస్ట్‌కోస్ట్ రైల్వే జీఎం పరమేశ్వరన్ ఫంక్వాలా కూడా హడావుడి మొదలుపెట్టారు. ఇంకా గెజిట్ రాకపోవడంతో వాల్తేరు డివిజన్‌కు తానే జీఎంనంటూ వరుస పర్యటనలతో హడావుడి చేస్తున్నారు. -
సచివాలయ సిబ్బంది మెడకు పీ4 గుదిబండ
● అధికారులకు దాతలను వెతికి పట్టుకునే పనులు ● వాళ్లు ససేమిరా అనే సరికి సచివాలయ సిబ్బందికి అప్పగింత ● బంగారు కుటుంబాలు, మార్గదర్శకుల మధ్య సమన్వయ బాధ్యతలు ● ఇప్పటికే పని ఒత్తిడితో నిరసన బాట పట్టిన సచివాలయ సిబ్బందిసాక్షి, అనకాపల్లి: గ్రామ, వార్డు సచివాల య సిబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వం పీ4 భా రం మోపింది. బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే మార్గదర్శకులను వారు వెతికి పట్టుకోవాల్సి ఉంది. పీ4 కార్యక్రమంలో బంగారు కుటుంబాలకు, మార్గదర్శులకు సంధానకర్తలుగా సచివాలయ సిబ్బందే వ్యవహరించాల్సి ఉంటుంది. ఇప్పటికే పనిభారంతో సతమతమవుతున్న సచివాలయ సిబ్బంది కొత్త బాధ్యతలతో బెంబేలెత్తుతున్నారు. అధి కారం చేపట్టిన తరువాత వలంటీర్ వ్యవస్థను ని ర్దాక్షిణ్యంగా నిలిపివేసిన కూటమి ప్రభుత్వం.. వా రు చేసే ఇంటింటి సర్వే వంటి పనులను, వాట్సా ప్ సర్సీస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సచివాలయ సిబ్బందికి అప్పగించింది. సంక్షేమ పథకాలు, గ్రామ పరిపాలన సంబంధిత పనులతో రోజంతా బిజీబిజీగా ఉండే వారికి ఇప్పుడు పీ4 గుదిబండను తగిలించారు. అధికారుల ద్వారా మార్గదర్శకులు ముందుకు రాలేదన్న కారణంగానే.. సచివాలయ ఉద్యోగులకు ఈ పని అప్పగించారని భావిస్తున్నారు. సచివాలయ సిబ్బందికి ఇటీవల కలెక్టర్ విజయ కృష్ణన్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్గదర్శులు, బంగారు కుటుంబాలతో సమావేశం ఏర్పాటు చేసి వారికి కావలసిన అవసరాలు గుర్తించి మార్గదర్శులతో అనుసంధానం చేసే బాధ్యత తీసుకోవాలంటూ హుకుం జారీ చేశారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో 522 సచివాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 80,163 బంగారు కుటుంబాలకు గాను 2,06,526 మంది కుటుంబ సభ్యులను గుర్తించారు. 6,420 మంది మార్గదర్శులు ముందుకు వచ్చారు. వారు ఇంతవరకు 47,597 కుటుంబాలను దత్తత తీసుకున్నారు. ఇంకా 32,571 కుటుంబాలను దత్తత చేసుకోవాల్సి ఉంది. ప్రభుత్వానికి సిబ్బంది నోటీసులు సచివాలయ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాము ఇంత కష్టపడుతున్నా తగిన గౌరవం దక్కడం లేదని మనస్తాపం చెందుతున్నారు. సమస్యల పరిష్కారం, ఉద్యోగుల ఆత్మగౌరవ పరిరక్షణ డిమాండ్లతో ఇప్పటికే వారు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చారు. 15 రోజుల్లోగా సమస్యలు పరిష్కరించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగనున్నట్లు ఈనెల 8న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. -
అక్రమార్కుల స్వారీ
అనకాపల్లిరంగురాళ్ల క్వారీల్లో 7సోమవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025చుట్టం చూపుగా వచ్చి పోతున్న ఫారెస్ట్ సిబ్బందిరెండు బేస్ క్యాంపులున్నా కొరవడిన నిఘా నర్సీపట్నం: క్వారీల్లో విలువైన రంగురాళ్లు.. వాటి కోసం రహస్యంగా తవ్వకాలు.. వారిని కట్టడి చేయడానికి రెండు బేస్ క్యాంపులు.. అటవీ సిబ్బంది నిఘా లేక వృథా ప్రయత్నాలు.. ఇదీ నర్సీపట్నం నియోజకవర్గంలోని రంగురాళ్ల క్వారీల పరిస్థితి.. వర్షాకాలం కావడంతో తవ్వకాలకు అనుకూలంగా ఉంటుంది. దసరా రోజుల్లో అందరూ పండగ హడావుడిలో ఉంటారన్న ఉద్దేశంతో రంగురాళ్ల వేట మొదలవుతోంది. ఇలాంటి సమయంలో నిఘాను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అటవీ శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. బేస్ క్యాంపుల వద్ద అటవీ సిబ్బంది కానరావటం లేదు. అటవీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడల్లా రంగురాళ్ల వ్యాపారులు విజృంభించడం పరిపాటిగా మారింది. గొలుగొండ మండలంలో కరక, ఆరిల్లోవ అటవీ ప్రాంతాల్లో రంగురాళ్ల క్వారీలు ఉన్నాయి. ఈ క్వారీల వద్ద పేరుకు మాత్రం బేస్ క్యాంపులు ఉన్నాయి. ఈ క్యాంపుల వద్ద రాత్రింబవళ్లు సిబ్బంది కాపలా ఉండాలి. ప్రతి బేస్ క్యాంప్ వద్ద ఐదుగురు సిబ్బంది విధి నిర్వహణలో ఉండాలి. కానీ బేస్ క్యాంపుల వద్ద కనీసం ఒక్కరు కూడా కానరాలేదు. సిబ్బంది మధ్యమధ్యలో చుట్టం చూపుగా వచ్చి చూసుకొని వెళుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది లేక బేస్ క్యాంపులు వెలవెలబోతున్నాయి. బేస్ క్యాంపులను నిరంతరం పర్యవేక్షించేందుకు ఆరుగురు సిబ్బందితో ఏర్పాటు చేసిన స్ట్రైకింగ్ టీమ్ కానరాలేదు. స్ట్రైకింగ్ సిబ్బందిని రేంజ్ కార్యాలయంలో వినియోగించుకుంటున్నారు. దీంతో రంగురాళ్ల క్వారీల వద్ద భద్రత కొరవడింది. ఉదాశీనంగా ఉంటే ప్రమాదమే.. బేస్ క్యాంపు ఉన్నప్పటికీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 2021 ఆగస్టులో కొంత మంది కరక కొండపై తవ్వకాలకు సిద్ధమయ్యారు. అప్పట్లో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించగా రంగురాళ్ల తవ్వకాలకు సహకరించిన వ్యక్తి డీఎఫ్‌వో వద్ద అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న డ్రైవర్ అని తేలింది. ఈ విషయం అప్పట్లో పెద్ద సంచలనం అయింది. ఇదే విధంగా గతంలో సిబ్బంది లేకపోవడాన్ని గమనించిన తవ్వకందారులు ఆరిల్లోవ అటవీ ప్రాంతంలో తవ్వకాలకు సిద్ధం కాగా అటవీ సిబ్బంది అప్రమత్తమై దాడులు నిర్వహించారు. ఆ సమయంలో తవ్వకందారులు అటవీ సిబ్బందిపై రాళ్లు రువ్వి తప్పించుకున్నారు. ఈ రెండు సంఘటనలు అప్పట్లో ఆగస్టు నుంచి సెప్టెంబర్ నెలల్లోనే జరిగాయి. తవ్వకాలకు దిగిన కూలీలు క్వారీలు కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ గతంలో ఉన్నాయి. ప్రస్తుతం విస్తారంగా కురుస్తున్న వర్షాలతో తవ్వకాలు మొదలైనట్టు సమాచారం. ఈ సమయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అటవీ అధికారులు నిఘాను గాలికి వదిలేశారు. ఇక్కడి క్వారీల్లో లభ్యమయ్యే అలెక్స్ రకం రంగురాళ్లకు గిరాకీ ఉంది. వీటి ధర కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఇంతటి విలువ ఉన్నందునే రంగురాళ్ల వ్యాపారులు వీటి కోసం తరచూ తవ్వకాలకు ప్రయత్నిస్తున్నారు. అటవీ అధికారులు అప్రమత్తమై క్వారీల వద్ద నిఘా కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
మనసు లఘు చిత్రానికి పుదుచ్చేరి సీఎం ప్రశంసలు
సీతంపేట (విశాఖ): నగరానికి చెందిన దర్శకుడు పైడి శంకర్రావు సుదీప్ సాయి హీరోగా రూపొందించిన లఘు చిత్రం ‘మనసు’కు అరుదైన గౌరవం లభించింది. ఈ లఘు చిత్రాన్ని పుదు చ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి వీక్షించి, చిత్ర బృందాన్ని ప్రశంసించారు. సాహిత్య అకాడమి మాజీ సభ్యుడు డాక్టర్ సుందర్ మురుగన్ ఈ లఘు చిత్రం ఇతివృత్తాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మనసు లఘు చిత్రం భారతీయుల మధ్య ఐక్యత, ప్రేమ, శాంతి, మానవతా విలువలను ప్రతిబింబిస్తూ, భావితరాలకు మెరుగైన మార్గనిర్దేశం చేసేలా ఉందని సీఎం రంగస్వామి కొనియాడారు. ఈ చిత్రం ప్రపంచ శాంతి అనే మూల సందేశాన్ని, భారతదేశ సంప్రదాయానికి నిలువెత్తు అద్దంగా ఉంటుందని, ప్రతి భారతీయుడు చూడాల్సిన చిత్రమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు పైడి శంకర్రావు, హీరో సుదీప్ సాయిలను ముఖ్యమంత్రి సత్కరించారు. చిత్ర యూనిట్ తరపున నిర్మాత పైడి సత్యమణి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.హీరో సుదీప్‌ని సత్కరిస్తున్న పుదుచ్ఛేరి సీఎం -
పారా వాలీబాల్ వరల్డ్‌కప్‌కు ఎంపిక
గణేష్‌ను సత్కరిస్తున్న దృశ్యం ఎస్.రాయవరం : పారా వాలీబాల్ వరల్డ్ కప్‌కు ఎంపికై న సోమిదేవపల్లి గ్రామానికి చెందిన అన్నం గణేష్‌ను శ్రీపజ్ఞా జూనియర్ కళాశాల యాజమాన్యం శనివారం ఘనంగా సత్కరించింది. ఈ కళాశాలలో పూర్వ విద్యార్థి అయిన గణేష్ వరల్డ్‌కప్‌కు ఎంపిక కావడం అభినందనీయని ప్రిన్సిపాల్ రాము అభినందించారు. గణేష్‌ను దుస్సాలువాతో సత్కరించి, రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించారు. కళాశాల ఉపాధ్యాయులు జోగినాథం, రమేష్, ప్రకాష్,రాజు తదితరులు పాల్గొన్నారు. -
స్థానికులకు 70శాతం ఉద్యోగాలివ్వాలి
నక్కపల్లి : వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే కంపెనీల్లో స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు కల్పించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని పలువురు కోరారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న ఆశతోనే మద్దతు ఇస్తున్నామన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు, విద్య, వైద్య, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ ఇండియా లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నక్కపల్లి మండలంలో ఏర్పాటు కాబోతున్న స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించి కలెక్టర్ విజయ్‌కృష్ణన్ అధ్యక్షతన పర్యావరణ ప్రజాభిప్రాయసేకరణ శనివారం జరిగింది. ఏఎంఎన్‌ఎస్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.రవీంద్రనాథ్ మాట్లాడుతూ నక్కపల్లి మండలం చందనాడ, డీఎల్‌పురం అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఆర్సిలర్‌మిట్టల్ నిప్పన్ ఇండియా జాయింట్ వెంచర్‌తో సమీకృత స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రావడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాల పరిధిలో 2020 ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. ఉక్కు ఉత్పత్తుల్లో మిట్టల్, నిప్పన్ గ్రూపు ప్రపంచంలో రెండో స్థానంలో ఉందన్నారు. 15 దేశాల్లో 36 ప్లాంట్లు ఉన్నాయన్నారు. నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయబోయే స్టీల్‌ప్లాంట్‌లో మొదటి దశలో ఏటా 8.2 మిలియల్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తికి గాను రూ.67వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నామన్నారు. ప్లాంట్ ఏర్పాటయితే ప్రత్యక్షంగా పరోక్షంగా మొదటి విడతలో 30 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో జెడ్పీటీసీ గోసల కాసులమ్మ మాట్లాడుతూ బల్క్ డ్రగ్‌పార్క్‌కు వ్యతిరేకంగా 14 రోజుల నుంచి మత్య్సకారులు నిరాహరదీక్ష చేస్తున్నారని, ఈ పార్క్ రద్దు చేసి స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు. మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, సూరాకాసుల గోవిందు, ఏయూ విశ్రాంత ప్రొఫెసర్ రామకృష్ణారావు, జేఎన్టీయు విశ్రాంత వైస్‌చాన్స్‌లర్, మురళీకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్, విశ్రాంత ఆర్జేడీ ప్రభాకర్, టీడీపీ నాయకులు మాట్లాడారు. ప్లాంట్ ఏర్పాటు చేసే పరిసర గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై వీసం రామకృష్ణ, తళ్ల భార్గవ్, జడ్పీటీసీ కాసులమ్మ, వైస్ ఎంపీపీ నానాజీ, ఈశ్వరరావు, మత్య్సకార సంఘాల నుంచి అమ్మోరయ్య కలెక్టర్‌కు వినతి పత్రాలు అందజేశారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ కుమారస్వామి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. నర్సీపట్నం ఆర్డీవో రమణ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పాల్గొన్నారు. -
బొడ్డేడను సత్కరించిన పార్టీ నేతలు
మునగపాక : వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్‌ను పలువురు పార్టీ నేతలు ఘనంగా సత్కరించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రెండు రోజుల క్రితం ప్రసాద్‌ను అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన విషయం తెలిసిందే. ఈమేరకు పార్టీ నేతలను కలిసి ప్రసాద్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తిరాజు, నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీలను ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిసి ఆశీస్సులు అందుకున్నారు. యలమంచిలి ఎంపీపీ బోదెపు గోవింద్ తన అనుచరులతో కలిసి ప్రసాద్‌కు పూలమాల వేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, పార్టీ నేతలు కాండ్రేగుల నూకరాజు, దాసరి అప్పారావు,నరాలశెట్టి సూర్యనారాయణ, మద్దాల వీరునాయుడు, మొల్లేటి శంకర్, కోనపల్లి రామ్మోహనరావు, మొల్లేటి వినోద్, ఆడారి కాశీబాబు, పిన్నమరాజు రవీంద్రరాజు, కాండ్రేగుల జగన్, బొడ్డేడ బుజ్జి, మురళి, రామకృష్ణ, ఇందల నాయుడు పాల్గొన్నారు. -
సబ్ జైల్లో సమస్యలపై జడ్జి ఆరా
ఖైదీలతో మాట్లాడుతున్న 12వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టు జడ్జ్ విజయలక్ష్మి అనకాపల్లి టౌన్: స్థానిక సబ్ జైల్లో సమస్యలపై 12వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి విజయలక్ష్మి ఆరా తీశారు. శనివారం ఆమె జైలును పరిశీలించారు. ఈ సందర్భంగా నిందితులతో మాట్లాడారు. ఖైదీలు కోరితే ఉచిత న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. ఖైదీలకు నాణ్యమైన ఆహారం పెట్టాలని, జైలులో పరిశుభ్రత పాటించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ కిరణ్, న్యాయ సహాయకులు సాయిరాం, తులసీ రామ్, ఎంఎల్ఎస్సీ ప్రతినిధి సంధ్య తదితరులు పాల్గొన్నారు. -
వైద్య కళాశాలల ప్రైవేటుపరం అన్యాయం
తుమ్మపాల: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయడం తీవ్ర అన్యాయమని, ప్రభుత్వం తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలంటు అనకాపల్లి కోర్టు న్యాయవాదులు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన కార్యక్రమంలో అనకాపల్లి బార్ అసోసియేషన్ ప్రతినిధులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ లీగల్‌సెల్ జిల్లా ప్రెసిడెంట్ ఆడారి స్వామి మాట్లాడుతూ పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలను ప్రైవేటు చేయడం, పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమేనన్నారు. పేద విద్యార్థుల తల్లిదండ్రుల తరపున బాధ్యతగా తమ నిరసన తెలుపుతున్నామని, ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలను అమలు చేసే ముందు ప్రజల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు దీవాకర్, యుగంధర్, జగపతి, రమేష్, మల్లేష్ పాల్గొన్నారు. -
పీహెచ్సీ వైద్యుల నిరసన
అచ్యుతాపురం రూరల్ : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక పీహెచ్సీ వైద్యులు నల్లబ్యాడ్జీలు ధరించి శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు కె.శ్రావ్య, ఐ.లిఖిత మాట్లాడుతూ సివిల్ అసిస్టెంట్ సర్జన్, డిప్యూటీ సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు 24 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు కల్పించకపోవడంతో సీనియారిటీకి విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా ఈ నెల 26 నుంచి రోజుకొక వైద్య సేవ నిలిపివేయనున్నట్టు చెప్పారు. శనివారం స్వస్థ్ నారీ సశక్త్ అభియాన్ కార్యక్రమం, 104 సంచార చికిత్స సేవలు బంద్ చేసినట్టు చెప్పారు. 28న అధికార వాట్సప్ గ్రూప్ బహిష్కరిస్తామని వారు చెప్పారు.సీనియారిటీ పదోన్నతి కల్పించాలని, ఇన్ సర్వీస్ కోటా పెంచాలని, ట్రైబల్ అలవెన్స్ ఇవ్వాలని, సంచార చికిత్స సేవలకు గాను గ్రామాలకు వెళ్లినందుకు అలవెన్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. -
ఈ సారైనా న్యాయం జరిగేనా ..?
మాకవరపాలెం: ఏళ్లతరబడి సాగులో ఉన్న రైతులకు ఈసారైనా న్యాయం జరుగుతుందో లేదోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాగుదారుల సర్వే జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడం.. చోటా నాయకుల జోక్యంతో నిజమైన సాగుదారులు ఆందోళనచెందుతున్నారు. మండలంలోని రాచపల్లి రెవెన్యూలోని 737 సర్వే నంబర్లో 1,604 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని 50 ఏళ్లకుపైగా సమీప గ్రామాలకు చెందిన వందల మంది రైతులు జీడి, మామిడి, ఇతర పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పట్టాల కోసం అనేక సార్లు వినతులు ఇచ్చారు. అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలూ చేపట్టారు. కానీ పట్టాలు అందలేదు. పరిశ్రమల పేరుతో సర్వే.. ఈ ప్రాంతంలో ఏపీఐఐసీ ఆధీనంలో ఉన్న 290 ఎకరాల భూమితోపాటు సర్వే నంబర్ 737లో ఉన్న మరో 400 ఎకరాలను పరిశ్రమల స్థాపనకు కేటాయించేందుకు ఇటీవల సర్వే చేపట్టారు. రెవెన్యూ సిబ్బంది చేసిన సర్వేలో 406.87 ఎకరాలు 466 మంది సాగులో ఉన్నట్టు గుర్తించి, జాబితాలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో సాగుదారుల ఎంపికపై గురువారం రాచపల్లిలో గ్రామసభ నిర్వహిస్తామని తెలిపిన రెవెన్యూ అధికారులు, అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ జాబితాలను రాచపల్లి సచివాలయం, యరకన్నపాలెం, రామన్నపాలెం గ్రామాల్లో ప్రదర్శించి, అభ్యంతరాలను రెవెన్యూ కార్యాలయంలో తెలపాలని తహసీల్దార్ వెంకటరమణ సూచించారు. ఫిర్యాదుల వెల్లువ జాబితాలపై సాగుదారుల నుంచి ఫిర్యాదు వెల్లువెత్తుతున్నాయి. సాగులో ఉన్నా జాబితాలో పేర్లు లేవని కొందరు, సాగులో ఎక్కువ భూమిఉన్నా తగ్గించి నమోదు చేశారంటూ కొందరు పిర్యాదు చేశారు. సాగుదారుల జాబితాలో బినామీలను చేర్చి పరిహారం కాజేసేందుకు కొందరు చూస్తున్నారని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వారం రోజుల క్రితం ఆరోపించారు. సాగుదారుల ఎంపిక వివరాలపై సమాచార హక్కు చట్టం ద్వారా తహసీల్దార్‌కు ఆయన దరఖాస్తు చేశారు. స్థానికంగా ఉన్న టీడీపీ చోటా నాయకుడు చెప్పినట్టుగా వీఆర్వో, సచివాలయ సర్వేయర్ ఇష్టం వచ్చినట్టు సాగుదారుల ఎంపికలో అనర్హులను చేర్చారని బీజేపీ నేత అడిగర్ల రాంబాబు, మరి కొందరు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. రెండు రోజులుగా ఈ ఫిర్యాదులు కొనసాగుతూనే ఉన్నాయి. 13 ఏళ్ల క్రితం పట్టాల పంపిణీ కోసం సర్వే చేయగా అనర్హుల పేర్లు అధికంగా ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో సుమారు 100 మందికిపైగా పట్టాల పంపిణీ నిలిపివేశారు. తీరా ఇప్పుడు పట్టాలు లేని సాగు భూములకు ప్రభుత్వం పరిహారం అయినా ఇస్తుందని ఎదురు చూస్తున్న నిజమైన సాగుదారులు ఆందోళన చెందుతున్నారు. సాగులో లేని వారి పేర్లను జాబితాలో చేర్చడంతో మరోసారి నష్టపోమని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా గ్రామసభను కూడా అందుకే వాయిదా వేశారని సాగుదారుల్లో చర్చ సాగుతోంది. రీ సర్వే చేయాలి 737 సర్వే నంబర్ భూముల్లో రీ సర్వే చేయాలి. ఇప్పటికే చేసిన సర్వేలో అనర్హులను జాబితాలో చేర్చి, అర్హులైన పేదల పేర్లను తొలగించారు. కలెక్టర్ స్పందించి రీ సర్వే చేపట్టి, అర్హులకు న్యాయం చేయాలి. లేకుంటే ఆందోళన చేస్తాం. – అడిగర్ల రాంబాబు, బీజేపీ నేత, రాచపల్లి భూమి మాది.. పేర్లు వేరొకరివి 40 ఏళ్లకుపైగా సుమారు ఎనిమిది ఎకరాల్లో సాగులో ఉన్న మా భూమిని వేరొకరి పేరున సర్వే జాబితాలో చేర్చారు. తనకు జరిగిన అన్యాయంపై ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఆ భూమే మాకు ఆధారం. న్యాయం చేయకుంటే చావే శరణ్యం. – కిల్లాడ లక్ష్మి, వెంకయ్యపాలెం -
తాచేరు డైవర్షన్ రోడ్డు పనులు ప్రారంభం
బుచ్చెయ్యపేట: భీమునిపట్నం, నర్సీపట్నం(బీఎన్) రోడ్డులో విజయరామరాజుపేట తాచేరు నదిపై కోతకు గురైన డైవర్షన్ రోడ్డు పనులను అధికారులు చేపట్టారు. రెండు రోజుల వ్యవధిలో తాచేరులో మునిగి ఇద్దరు మృతి చెందారు. దీనిపై పత్రికల్లో వచ్చిన కథనాలకు అధికారులు స్పందించారు. కోతకు గురైన తాచేరు డైవర్షన్ రోడ్డు వద్ద శనివారం మధ్యాహ్నం నుంచి పొక్లెయిన్‌తో పనులు ప్రారంభించారు. తాచేరు నదిలో వరదకు కొట్టుకు వచ్చిన చెట్లు, తుప్పలు,డొంకలను తొలగించారు. దెబ్బతిన్న సిమెంట్ గొట్టాలను తొలగించి, వాటిలో స్థానంలో కొత్త పైపులను వేసి,వాటిపై గ్రావెల్ వేసి రోలింగ్ చేసి తాత్కాలికంగా వాహనాల రాకపోకలు సాగేలా చర్యలు చేపట్టారు. తాచేరు డైవర్షన్ రోడ్డు కోతకు గురవడంతో విశాఖపట్నం, పాడేరు, నర్సీప ట్నం, అనకాపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు నెలలుగా బీఎన్ రోడ్డులో రాకపోకలు నిలిచిపోవడంతో మూడు జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇరుకు రోడ్డులో రాకపోకలు సాగిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. తాచేరు నది సమీపంలో దెబ్బతిన్న డైవర్షన్ రోడ్డు వద్ద నీటిలో పడి విజయరామరాజుపేటకు చెందిన 8వ తరగతి విద్యార్థి,వడ్డాదికి చెందిన రైతు రెండు రోజుల వ్యవధిలో మృతి చెందారు. పలువురు ప్రాణాలకు తెగించి తాడు సాయంతో తాచేరు నదిలో రాకపోకలు సాగిస్తున్నారు. పత్రికల్లో వచ్చిన కథనాలకు ఇప్పటికే అధికారులు స్పందించారు. తాచేరు నదిపై డైవర్షన్ రోడ్డు పనులు పూర్తి చేసి వాహనాల రాకపోకలు సాగేలా చూస్తామని చోడవరం ఆర్అండ్బీ జేఈ సత్య ప్రకాష్ తెలిపారు.విజయరామరాజుపేట తాచేరు వంతెనపై వరదలకు దెబ్బతిన్న డైవర్షన్ రోడ్డును రెండు నెలలైనా బాగు చేయకపోవడం సిగ్గుచేటని చోడవరం నియోజకవర్గ జనసేన ఇన్చార్జి పి.వి.ఎస్.ఎన్. రాజు అన్నారు. కోతకు గురైన తాచేరు డైవర్షన్ రోడ్డును శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు 20 మీటర్లు దెబ్బతిన్న తాచేరు డైవర్షన్ రోడ్డుకు మరమ్మతులు చేయడంలో అధికారులు విఫలం చెందారని చెప్పారు. -
నర్సీపట్నం టీడీపీలో లుకలుకలు
నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపాలిటీలోని టీడీపీ నేతల మధ్య లుకలుకలు బయటపడుతున్నాయి. దీనికి శనివారం జరిగిన మున్సిపల్ సమావేశం వేదికై ంది. మున్సిపాలిటీలోని టీడీపీ నేతలపై ఆ పార్టీకి చెందిన 18వ వార్డు కౌన్సిలర్ విజయాంబ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా టీడీపీకి చెందిన కొంతమంది నేతలు కుట్రపన్ని తన వార్డులో వారికి నచ్చిన పనులను అధికారులతో చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వార్డులో విలువ లేకుండా చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. వారికి అధికారులు వంతపాడుతున్నారని తెలిపారు. ఈ పరిణామమం టీడీపీ నేతల్లో విస్మయం కలిగించింది. మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి అధ్యక్షతన నర్సీపట్నం మున్సిపాలిటీ కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 18వ వార్డు కౌన్సిలర్ శెట్టి విజయాంబ తన వార్డులో జరుగుతున్న పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. తనకు తెలియకుండానే అభివృద్ధి పనులు చేపడుతున్నారన్నారు. పారిశుధ్య నిర్వహణ సరిగ్గా చేపట్టడం లేదని చెప్పారు. ఉత్తరవాహిని సమీపంలో డంపింగ్ యార్డు వల్ల నదీజలాలు కలుషితమవుతున్నాయని, యార్డును మార్చాలని తెలిపినా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. సొంతపార్టీ నాయకులు, అధికారుల తీరుకు నిరసనగా ఆమె సభ నుంచి వాక్అవుట్ చేశారు. గత పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి కౌన్సిలర్‌గా ఈమె గెలుపొందారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. ఇంతలోనే తిరుగుబాటు చేయడం టీడీపీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. తన వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి కనీసం సమాచారం ఇవ్వడం లేదని 19వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ బయపురెడ్డి చినబాబు అధికారులను నిలదీశారు. సమాచారం ఇచ్చేలా చూడాలని చైర్పర్సన్ సుబ్బలక్ష్మి కమిషనర్‌ను ఆదేశించారు. తప్పని సరిగా సమాచారం ఇవ్వాలని సిబ్బందికి చెబుతున్నామని, తాము సొంతంగా పనులు చేపట్టడం లేదని, కౌన్సిల్ నిర్ణయం మేరకు జరుగుతున్నాయని కమిషనర్ సురేంద్ర బదులిచ్చారు. పారిశుధ్యం అధ్వానంగా ఉందని మున్సిపల్ వైస్‌చైర్మన్ కోనేటి రామకృష్ణ, జనసేన కౌన్సిలర్ అద్దెపల్లి సౌజన్య తెలిపారు. అభివృద్ధి పనుల్లో కూడా వివక్ష చూపుతున్నారని రామకృష్ణ చెప్పారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు అన్ని వార్డులు సమానమేనని టీడీపీ కౌన్సిలర్ సీహెచ్.పద్మావతి తెలిపారు. ప్రాధాన్యతాక్రమంలో వార్డుల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. టీడీపీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధిపై రామకృష్ణ, టీడీపీ కౌన్సిలర్ మధు మధ్య వాగ్వాదం జరిగింది. శానిటేషన్‌పై అధికారులు దృష్టిసారించాలని, వార్డుల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో సంబంధిత కౌన్సిలర్లకు సమాచారం ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ సూచించారు. -
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై చర్యలు
మాట్లాడుతున్న డీఐజీ గోపినాథ్ జట్టి సాక్షి, అనకాపల్లి: సోషల్ మీడియాలో మహిళలను అగౌరవపరుస్తూ అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై చర్యలు తప్పవని డీఐజీ గోపినాథ్ జట్టి హెచ్చరించారు. శనివారం విశాఖ రేంజ్ పరిధిలోని ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో ప్రతీ పోస్టును క్షుణ్ణంగా పరిశీలిస్తామని, ప్రతీ జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమిస్తామన్నారు. ఆయన పర్యవేక్షణలో ప్రత్యేక బృందాల ద్వారా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అభ్యంతకర పోస్టులు పెట్టినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. తరచూ అభ్యంతకర పోస్టులు పెట్టే వారి వివరాలు సేకరించాలని, వీరికి సహకరిస్తున్న వ్యక్తులపై కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలో సామాజిక మాధ్యమాల్లో అభ్యంతకర పోస్టులు పెట్టిన వ్యక్తుల పైన ఇప్పటికే 134 కేసులు నమోదు చేసి, 106 మందిని అరెస్ట్ చేశామన్నారు. 57 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేయగా 25 కేసులకు సంబంధించి విచారణ కూడా చేస్తున్నామని తెలిపారు. డీఎస్పీలు కూడా వారి పరిధిలో నమోదైన సోషల్ మీడియా కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయా లన్నారు. అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, అల్లూరి ఎస్పీ అమిత్ బర్దర్, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం జిల్లా ఎస్పీలు, డీఎస్పీలుపాల్గొన్నారు. -
‘డిజిటల్ బుక్’తో చట్టబద్ధంగా బుద్ధి చెబుతాం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి: వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారని, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల అరాచకాలకు తగిన బుద్ధి చెప్పేందుకే ‘డిజిటల్ బుక్’ను తీసుకొచ్చారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడైనా పార్టీ శ్రేణులపై కూటమి నేతలు దాడులు చేస్తే ‘డిజిటల్ బుక్–క్యూఆర్ కోడ్’లో నమోదు చేయాలని సూచించారు. స్థానిక రింగ్‌రోడ్డు పార్టీ కార్యాలయంలో ఆపార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ‘డిజిటల్ బుక్–క్యూఆర్ కోడ్’ను శనివారం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోమవారం మండలస్థాయిలో క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు జరిగినా, భూ సమస్యలు వచ్చినా తక్షణమే క్యూఆర్ కోడ్‌లో నమోదు చేయాలని తెలిపారు. వెంటనే ఓటీపీ వస్తుందని, మళ్లీ ఎంటర్ చేయడం వల్ల యాప్‌లో అప్లోడ్ అవుతుందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులపై దాడులు పెరిగిపోయాయని, ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు మృతిచెందగా, 700 నుంచి 800 మందిపై కూటమి నేతలు భౌతిక దాడులు చేశారని చెప్పారు. సుమారు మూడు వేల మందిపై అక్రమ కేసులు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. కార్యకర్తలకు, నాయకులకు న్యాయం జరిగేవరకూ పోరాటాలు చేస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం డిజిటల్ బుక్ ఆధారంగా వారికి చట్టబద్ధంగా బుద్ధిచెబుతామని హెచ్చరించారు. కొంతమంది కూటమి ఎమ్మెల్యేలు బహిరంగంగా భూకబ్జాలు చేస్తున్నారని, కాంట్రాక్టర్ల వద్ద నుంచి అందినంత దోచుకుంటున్నారని ఆరోపించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలకు బ్రీత్‌ఎనలైజర్‌తో పరీక్షించాలన్నారు. లేని పక్షంలో తప్పని సరిగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఈ పరీక్ష నిర్వహించే విధంగా స్పీకర్ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మెగాస్టార్ చిరంజీవికి, బాలకృష్ణకు మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. 2014–19లో లేపాక్షి ఉత్సవాలు నిర్వహిస్తున్న సమయంలో చిరంజీవిని పిలవవద్దని చెప్పిన విషయాన్ని బాలకృష్ణ గుర్తుతెచ్చుకోవాలన్నారు. చిరంజీవిపై అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ విరుచుకుపడితే కనీసం జనసేన నాయకుల్లో స్పందన లేకుండా పోయిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ -
అన్నయ్య కంటే చంద్రబాబే ఎక్కువయ్యారా?
దేవరాపల్లి/మునగపాక: అసెంబ్లీ సాక్షిగా చిరంజీవిపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించకపోవడం దారుణమని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు, పార్టీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ విమర్శించారు. సొంత అన్నయ్యను వాడు.. వీడు అంటూ బాలకృష్ణ చులకనగా మాట్లాడినా పవన్ కల్యాణ్ ఆ వ్యాఖ్యలను ఖండించకపోవడంలో మర్మమేంటని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై, కేంద్ర మాజీమంత్రి చిరంజీవిపై అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముత్యాలనాయుడు.. బొడ్డేడ ప్రసాద్, పార్టీ జోన్–1 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధలతో కలిసి తారువలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ మునగపాకలో కూడా బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించారు.‘ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో మానసిక స్థితి సరిగా లేని వ్యక్తితో అమర్యాదకరంగా మాట్లాడించి సభా ప్రతిష్టకు భంగం కలిగించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో వీధిరౌడీలా చొక్కా గుండీలు విప్పుకుని, నెత్తి మీద కళ్లజోడు పెట్టుకుని, రెండు చేతులు జేబుల్లో పెట్టుకుని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని, చిరంజీవిని కించపరిచేలా మాట్లాడిన తీరును రాష్ట్ర ప్రజలంతా చూశారు.’అని అన్నారు. కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రులు, డిప్యూటీ స్పీకర్ సైతం బాలకృష్ణ వ్యాఖ్యలను ప్రోత్సహించేలా ప్రవర్తించారే తప్ప ఒక్కరూ ఖండించలేదని మండిపడ్డారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించకపోవడం చూస్తుంటే.. ఆయనకు అన్నయ్య కంటే చంద్రబాబే ముఖ్యమైనట్లు కనిపిస్తోందని విమర్శించారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు గౌరవప్రదంగా నడుచుకోవాలని, బాలకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డికి, చిరంజీవికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 2004లో స్నేహితులపై బాలకృష్ణ తన ఇంట్లో తుపాకీతో కాల్పులకు తెగబడిన ఘటనను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. మానసిక పరిస్థితి బాగోలేదని మెడికల్ సర్టిఫికెట్ తెచ్చుకున్నది నీవే కదా అంటూ నిప్పులు చెరిగారు. చిరంజీవిపై అసెంబ్లీలో బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు స్పందించడంలో పవన్ మౌనం ఎందుకు? మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి లేదు అహంకారపూరిత వ్యాఖ్యలను బాలకృష్ణ ఉపసంహరించుకోవాలి బూడి ముత్యాలనాయుడు, బొడ్డేడ ప్రసాద్ డిమాండ్ -
నేరుగా వాయిస్ మెసేజ్‌లు ఉన్నా...
‘‘ఈ నెల 10వ తేదీలోగా నా వద్దకు వచ్చి... కన్ఫర్మ్ చేసుకోండి. 10వ తేదీన జాబితా సిద్ధమవుతుంది. 11వ తేదీ నుంచి ఎవరైనా పట్టుకుంటే నాకు సంబంధం లేదు. ఫోన్ పేలు ఎవ్వరూ చేయవద్దు’’ ఇది అనకాపల్లి జిల్లాలో అధిక లోడుతో వెళుతున్న, అనుమతి లేని వాహనాల విషయంలో వసూళ్లకు సంబంధించిన ఆడియో మెసేజ్. ఈ ఆడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అసలు ఏ శాఖకు సంబంధం లేని ఒక ప్రైవేటు వ్యక్తి ధైర్యంగా ట్రాన్స్‌పోర్టు యాజమాన్యాలకు ఆడియో మెసేజ్‌లు పంపి వసూళ్లకు తెగబడుతున్నాడంటే... సదరు వ్యక్తికి ఎంతమేర అధికారుల నుంచి అండదండలున్నాయో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ప్రతి నెలా లారీకి ఇంత చొప్పున అటు మైనింగ్, ఇటు ఫ్లై యాష్.... అంతేకాకుండా సెజ్‌లకు వెళ్లే బస్సుల యాజమాన్యాలు రవాణాశాఖ అధికారులకు పైకం చెల్లించాలి. లేని పక్షంలో దాడులు చేసి కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ వ్యవహారమంతా ఒక ప్రైవేటు వ్యక్తి ద్వారా రవాణాశాఖ అధికారులు నడిపిస్తున్నారనే విమర్శలున్నాయి. -
రూ.లక్ష లేదట
వీసీ బంగ్లాకు రూ.64 లక్షలతో మరమ్మతులుడాక్టర్ క్వార్టర్కుఈ ఫొటోలో కనిపిస్తున్నది ఏయూ రిజిస్ట్రార్ మొన్నటివరకు నివసించిన బంగ్లా. ఇప్పుడు ప్రస్తుత వీసీ రాజశేఖర్ నివాసం ఉంటున్నారు. తాను నివాసం ఉండేందుకు వీలుగా వీసీ ఏకంగా రూ.64 లక్షలు వెచ్చించి మరమ్మతులు చేయించుకున్నారు. అయితే డాక్టర్ క్వార్టర్ మరమ్మతులకు రూ.లక్ష మంజూరు చేసేందుకు మాత్రం ససేమిరా అంటూ వీసీ మోకాలడ్డారు. ఏయూ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అందుబాటులో లేకపోవడానికి ఇదే కారణంగా తెలుస్తోంది. విద్యార్థి మరణం నేపథ్యంలో వీసీ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తాను ఉండేందుకు రిజిస్ట్రార్ బంగ్లాను రూ.64 లక్షలతో మరమ్మతులు చేయించుకున్న ఏయూ వీసీ రాజశేఖర్.. ఏయూ ఆరోగ్య కేంద్రంలో పనిచేసే డాక్టర్ నివాసం ఉండేందుకు లక్ష రూపాయలతో క్వార్టర్లో మరమ్మతులు చేయించాలని కోరినా పట్టించుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. విద్యార్థి మరణంపై విద్యార్థులు ఇంత తీవ్రస్థాయిలో స్పందించేందుకూ వీసీ వైఖరే ప్రధాన కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి వీసీ తన బంగ్లాలో ఉందామనుకుని.. ఐఐటీ నుంచి ప్రత్యేక టీమ్‌తో మరమ్మతులు చేయించుకునేందుకు యత్నించినట్టు తెలుస్తోంది. అయితే ఈ బంగ్లా నివసించేందుకు అంతగా అవకాశం లేదని తేల్చిచెప్పడంతో రిజిస్ట్రార్ బంగ్లాలో నివాసం ఉండాలని వీసీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అనుకున్న వెంటనే ఈ బంగ్లాలో మరమ్మతుల పేరిట భారీగా వెచ్చించేందుకు సమాయత్తం కావడంతో పాటు ఇప్పటికే రూ. 64 లక్షల మేర ఖర్చు చేసినట్టు సమాచారం. ఒకవైపు తన బంగ్లా కోసం లక్షలకు లక్షలు తగలేస్నున్న వీసీ... డాక్టర్ కోసం క్వార్టర్ మరమ్మతుకు రూ.లక్ష ఖర్చు ఎందుకు చేయలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏకంగా ఆరుసార్లు ఫైలును పంపినప్పటికీ తిప్పిపంపడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఏయూలో చోటుచేసుకుంటున్న ప్రస్తుత వివాదాలను ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తున్నవన్న మంత్రి లోకేష్ వ్యాఖ్యలను విద్యార్థులు తప్పుపడుతున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా విద్యార్థులపై నెపం నెట్టడాన్ని విద్యార్థులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. వీసీ వైఖరితోనే..! శాతావాహన హాస్టల్లో ఉంటున్న బీఈడీ రెండో సంవత్సరం విద్యార్థి మణికంఠ గురువారం ఆకస్మికంగా మరణించారు. ఊపిరి తీసుకోలేక అస్వస్థతకు గురికాగా.. సరైన వైద్యం అందించకపోవడంతోనే తమ మిత్రుడు మరణించాడంటూ సహచర విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలు శుక్రవారం కూడా కొనసాగాయి. తమ ప్రాణాలకు విలువలేకుండా పోయిందని విద్యార్థులు మండిపడుతున్నారు. అంతేకాకుండా ఏయూ ఆరోగ్య కేంద్రంలో సరైన సౌకర్యాలు లేవని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కనీసం ఆక్సిజన్ పెట్టేవారు కూడా లేరని వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉండే డాక్టర్ 24 గంటలు అందుబాటులో ఉండేందుకు వీలుగా క్వార్టర్ కేటాయించాలని అధికారులు భావించారు. ఇందుకోసం ఒక క్వార్టర్లో రూ.లక్ష వెచ్చించి మరమ్మతులు జరిపితే అక్కడ నివసించేందుకు అనువుగా ఉంటుందని భావించి ప్రతిపాదనలు సమర్పించినట్టు తెలుస్తోంది. అయితే, దీనిని కనీసం వీసీ పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా ఈ ఫైలును కనీసం 6 సార్లు వీసీ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే డాక్టరు అందుబాటులో లేకుండా పోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ డాక్టరు అందుబాటులో ఉంటే... విద్యార్థి మణికంఠ ఏయూ ఆరోగ్య కేంద్రానికి వచ్చిన వెంటనే ఆక్సిజన్ అందించడంతో పాటు అంబులెన్స్‌లో జాగ్రత్తగా తరలించే వీలు కలిగేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా సొంత భవంతికి లక్షలకు లక్షలు ఖర్చు చేసి సొబగులు అద్దుకుంటున్న వీసీ.. డాక్టర్ కోసం క్వార్టర్ మరమ్మతుకు రూ.లక్ష ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి. మొత్తంగా వీసీ వ్యవహార శైలితో ఇప్పటికే ఏయూ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. ఇప్పుడు ఏకంగా విద్యార్థుల ప్రాణాలకు కూడా సమస్యగా మారిందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. డాక్టర్ అందుబాటులో లేకపోవడానికి ఇదే కారణం ఫైల్‌ను ఆరు సార్లు పంపినా పట్టించుకోని ఏయూ వీసీ విద్యార్థి మరణం నేపథ్యంలో వీసీ వైఖరిపై విమర్శల వెల్లువ వరుసగా వివాదాలు..! కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏయూలో వ్యవహారాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఒక ప్రైవేటు విద్యా సంస్థకు మేలు చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏయూలో నియమితులైన అధికారులందరూ సదరు ప్రైవేటు సంస్థలో గతంలో పనిచేయడమూ ఇందుకు కారణం. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులు అర్ధరాత్రి సమయంలో రోడ్డు మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అన్నం సరిగ్గా లేదని ఒకసారి... కనీస సౌకర్యాలు లేవని మరోసారి.. నియామకాల్లో అన్యాయం జరుగుతోందంటూ ఇంకోసారి ఇలా వరుస వివాదాల్లో కూరుకుపోతోంది. తాజాగా విద్యార్థి మరణించిన సంఘటనతో ఇన్నాళ్లుగా వ్యక్తమవుతున్న ఆందోళన కాస్తా.. ఆగ్రహంగా మారిపోయింది. ఏకంగా తమ ప్రాణాలనే బలితీసుకునేందుకూ వెనుకాడటం లేదన్న ఆవేశం విద్యార్థుల్లో కట్టలు తెంచుకుంది. వాస్తవానికి గతంలో కోవిడ్ సమయంలోనూ ఏయూలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించారు. ఏకంగా 600 మంది విద్యార్థులకు ప్రత్యేక గదులను కేటాయించడంతో పాటు క్వారంటైన్ ముగిసిన తర్వాత వారి తల్లిదండ్రులకు జాగ్రత్తగా అప్పటి వీసీ ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో అప్పగించారు. అదేవిధంగా కోవిడ్ సమయంలో ప్రయాణానికి అనుమతి లేని 500 మంది విదేశీ విద్యార్థులకు టీకాలు లభించని సమయంలో కూడా టీకాలు వేయించి మరీ వారి ప్రాణాలకు భరోసా కల్పించే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదని వచ్చిన విద్యార్థినికి సమయానికి ఆక్సిజన్ అందించి కాపాడుకోలేని ధీనస్థితికి ఏయూను పాలకులు దిగజార్చారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
జీఎస్టీ సంస్కరణలపై విస్తృత ప్రచారం
తుమ్మపాల: జీఎస్టీ సంస్కరణలు, వాటి ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులు, మండల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. నాలుగు శ్లాబ్లున్న జీఎస్టీ పన్ను విధానాన్ని రెండు శ్లాబ్‌లకు కుదించినట్టు తెలిపారు. 12 శాతం శ్లాబ్‌లో ఉన్న 99 శాతం వస్తువులు, సేవలను 5 శాతానికి తగ్గించినట్టు చెప్పారు. 28 శాతం శ్లాబ్‌లో గల 90 శాతం వస్తువులు,సేవలను 18 శాతానికి తగ్గించినట్టు ఆమె తెలిపారు. ఈ నెల 25 నుంచి అక్టోబర్ 19 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎగ్జిబిషన్లు, ర్యాలీలు, మేళాలు, మండల, గ్రామస్థాయిలో సభలు నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు ఎం. జాహ్నవి తదితరులు పాల్గొన్నారు. -
అందరూ దోషులే!
బండరాళ్ల టిప్పర్‌తో భయోత్పాతం... ● ఈ ఏడాది మార్చి 25న అనకాపల్లి టౌన్లో విజయరామరాజు పేట వద్ద గల రైల్వే అండర్ బ్రిడ్జి గడ్డర్‌ను క్వారీ లారీ ఢీకొనడంతో భారీ ప్రమాదం తప్పింది. దీంతో రైల్వే గడ్డర్ పాక్షికంగా దెబ్బతింది.● అక్రమ మైనింగ్‌కు కొమ్ముకాస్తున్న అధికారులు ● కూటమి నేతల ధనదాహానికి ప్రజల ప్రాణాలు హరి ● భారీ రాళ్ల తరలింపుతో రోడ్లు ఛిద్రం ● పక్క జిల్లా నుంచి వస్తున్నా పట్టించుకునే వారేరీ ● మైనింగ్, పోలీసు, రవాణా అధికారులకు భారీగా ముడుపులు● కాకినాడ జిల్లా రౌతులపూడికి చెందిన సన్నిధి మినరల్స్ టిప్పరు రాంబిల్లి మండలం కొండవారపాలెం గ్రామం వద్ద శుక్రవారం ఉదయం జార విడిచిన బండరాళ్లు ఇవి. వెనుక ఎవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అధిక లోడుతో ప్రమాదకర రాళ్లతో ఎటువంటి కనీస జాగ్రత్తలు తీసుకోకుండా అంత నిర్లక్ష్యంగా ఇష్టారాజ్యంగా వెళ్లడానికి వారికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?● ఈ ఏడాది మార్చి 16వ తేదీన మునగపాకకు చెందిన టీడీపీ కార్యకర్త, ఎల్ఐసీ ఏజెంట్ గన్నారావు మైనింగ్ టిప్పరు గుద్ది ప్రాణాలు కోల్పోయారు. కంటితుడుపుగా కేసు పెట్టడం మినహా రోజువారీగా అక్రమ మైనింగ్, అధిక లోడు వాహనాల విషయంలో తనిఖీలు మాత్రం జరగడం లేదు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అనకాపల్లి జిల్లా మైనింగ్ అవకతవకలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. శుక్రవారంనాటి తాజా సంఘటననే ఇందుకు ఉదాహరణ. వాస్తవానికి రాంబిల్లి మండలంలోని కొండవారపాలెం వద్ద రెండు బండరాళ్లను విడిచిన టిప్పర్లు పక్క జిల్లా కాకినాడ నుంచి వస్తున్నాయి. తుని, పాయకరావుపేట, నక్కపల్లి, యలమంచిలి నియోజకవర్గాలను దాటుకుని రాంబిల్లి వద్ద జరుగుతున్న నావికాదళ పనుల కోసం ఈ బండరాళ్లను తరలిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని పోలీసు, రవాణా, మైనింగ్ అధికారులు తనిఖీలు జరిపితే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించే వీలుంటుంది. ప్రతి రోజూ పక్క జిల్లా నుంచి పదుల సంఖ్యలో అధిక లోడుతో టిప్పర్లు వస్తున్నప్పటికీ ఆయా స్టేషన్ల పరిధిలోని పోలీసు, రవాణా శాఖల సిబ్బంది పట్టించుకోవడం లేదు. ప్రతి నెలా భారీగా అందుతున్న మామూళ్లే ఇందుకు కారణమని వేరే చెప్పనక్కరలేదు. అధిక లోడుతో చక్కర్లు...! అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌తో టిప్పర్లు అధికలోడుతో వెళుతున్నాయి. తద్వారా రోడ్లన్నీ ఛిద్రమవుతున్నాయి. ఇప్పటికే అనేకసార్లు ప్రమాదాలు కూడా జరిగాయి. కొంత మంది ప్రాణాలను కూడా బలితీసుకున్నాయి. అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న వివిధ క్వారీల ద్వారా రోజువారీ 1,000 ట్రిప్పుల బండరాళ్లను మునగపాక మీదుగా రోడ్లపై భారీ శబ్దాలు చేస్తూ రాంబిల్లిలోని నావికాదళ పనుల కోసం తరలిస్తున్నారు. 32–36 టన్నుల సామర్ధ్యం కలిగిన టిప్పర్లల్లో ఏకంగా 50 టన్నుల మేరకు భారీ బండరాళ్లు వేసుకుని తిరుగుతున్నా అటు మైనింగ్ అధికారులు కానీ, ఇటు రవాణాశాఖ, పోలీసు, రెవెన్యూ అధికారులు కానీ కనీసం కన్నెత్తి చూడటం లేదు. అక్రమ సంపాదన నెలకు రూ.2 కోట్లు ఒక్కో ట్రిప్పునకు నెలకు రూ.22 వేల చొప్పున కూటమి నేతలు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో నెలవారీ వసూలవుతున్న మొత్తం రూ.2 కోట్లకు పైమాటే. కూటమి నేతలతోపాటు మైనింగ్, రవాణా, పోలీసు, రెవెన్యూ అధికారులకూ భారీగా వాటాలు అందుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రవాణాశాఖ అధికారులు అధిక లోడుతో వెళుతున్న వాహనాలను చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నారు. అనధికారిక క్వారీల్లో జరుగుతున్న మైనింగ్‌ను పట్టించుకోకుండా ఉండేందుకుగానూ మైనింగ్ అధికారులకూ భారీగా ముడుతోందన్న విమర్శలున్నాయి. అక్రమ మైనింగ్‌తో పాటు అధిక లోడుతో భారీగా రాయల్టీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. ఇక మైనింగ్ విజిలెన్స్ అధికారులు కనీసం ఒక్కటంటే ఒక్కసారి కూడా దాడులు చేసి అక్రమ మైనింగ్‌ను నిలిపివేసేందుకు గత 6 నెలల కాలంలో ప్రయత్నించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు స్థానిక పోలీసు, రెవెన్యూ, విజిలెన్స్ ఇలా అన్ని విభాగాల అధికారులకు వాటాల లెక్కన పంచుతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారాలన్నీ కూటమి నేత బంధువు దగ్గరుండీ మరీ చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరి వాటా వారికి ఇచ్చిన తర్వాత మిగిలిన మొత్తం భారీ స్థాయిలో సదరు కూటమి నేత బంధువు జేబులోకి వెళుతోంది. సాక్షి, అనకాపల్లి: వాహనచోదకులకు ఘోర ప్రమాదం తప్పింది. రాంబిల్లి మండలంలోని కొండవారపాలెం వద్ద నేవల్‌బేస్‌కు తరలిస్తున్న బండరాళ్ల లారీ నుంచి రెండు పెద్ద రాళ్లు అకస్మాత్తుగా రోడ్డుపైకి పడ్డాయి. శుక్రవారం ఉదయం 9:30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికులను బెంబేలెత్తించింది. ఇటీవల కాలంలో జిల్లాలోని పలు క్వారీల నుంచి బండరాళ్ల లోడుతో కూడిన లారీలు నేవల్‌బేస్‌కు ప్రమాదకర రీతిలో వెళ్తున్పప్పటికీ పలు శాఖల అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం టిప్పర్ లారీపై నుంచి కొండవారపా లెం వద్ద భారీ రాళ్లు రోడ్డుపై పడ్డాయి. అదృష్టవశాత్తూ వాహనచోదకులకు ప్రమాదం తప్పింది. రాంబిల్లి పోలీసులు కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. కాకినాడ జిల్లా రౌతులపూడికి చెందిన టిప్పర్ డ్రైవర్ దమ్ము శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి చర్యల్లో భాగంగా ఆర్టీఏ అధికారులకు సిఫారసు చేశారు. -
30.5 కిలోల గంజాయి స్వాధీనం
తాళ్లపాలెం వద్ద పోలీసులు పట్టుకున్న గంజాయి, నిందితుడు కశింకోట: మండలంలోని తాళ్లపాలెం సంత ప్రాంతంలో ఉన్న గంగాదేవి గుడి వద్ద కారులో తరలిస్తున్న 30.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఓ యువకుడి అరెస్టు చేసినట్టు సీఐ అల్లు స్వామినాయుడు శుక్రవారం తెలిపారు. మరొకరు పరారైనట్టు చెప్పారు. తాళ్లపాలెం సంత వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో వచ్చిన కారును పరిశీలిస్తుండగా దానిలో ఉన్న ఇద్దరు వ్యక్తులు పారిపోవడానికి ప్రయ త్నించినట్టు సీఐ తెలిపారు. అనుమానంతో కారు డిక్కీ తెరచి చూడగా 5 ప్యాకెట్లలో 30.5 కిలోల గంజాయి లభించినట్టు చెప్పారు. దీని విలువ రూ.3.05 లక్షలు ఉంటుందన్నారు. ప్రధాన నిందితుడైన మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం గ్రామానికి చెందిన మురుకుట్టి ఈశ్వర్ సాయి సతీష్(24)ను విచారించగా మరికొంత మంది ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర వహించినట్లు తెలిపారన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని సీఐ చెప్పారు. సతీష్ గతంలో రెండు గంజాయి కేసుల్లో నిందితుడని తెలిపారు. గంజాయి, కారును స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు. -
చిట్టీల కేసుపై డీఎస్పీ విచారణ
కె.కోటపాడు: ఇటీవల చౌడువాడలో చిట్టీల పేరుతో మోసానికి పాల్పడిన పెదిరెడ్డి పద్మజపై ఇచ్చిన ఫిర్యాదుపై శుక్రవారం కె.కోటపాడులో అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి విచారణ జరిపారు. ఫిర్యాదుదారులైన గోలగాని మురళీతో పాటు మరికొందరి నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రావణి మాట్లాడుతూ ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాలు, సేకరించిన ఆధారాలను కోర్టుకు సమర్పించనున్నట్టు తెలిపారు. అక్రమంగా నిర్వహించే చిట్టీలలో ఎవరూ పెట్టుబడులను పెట్టరాదని ఆమె తెలిపారు. చట్ట విరుద్ధంగా చిట్టీలు నిర్వహించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. చిట్టీల నిర్వహణ గురించి సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందజేయాలని డీఎస్పీ శ్రావణి కోరారు. -
డి–పట్టా భూములను వెబ్ ల్యాండ్‌లో నమోదు చేయాలి
మాడుగుల రూరల్/రావికమతం: రావికమతం మండలం ఉరవలోవ రెవెన్యూ పరిధిలో డి– పట్టా భూములను వెబ్ ల్యాండ్ రికార్డుల్లో నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన రైతులు శుక్రవారం రావికమతం మండలం కొమిర గ్రామ సచివాలయం వద్ద నిరసన వ్యక్తం చేయగా, మాడుగుల మండలం ఒమ్మిలిలో మెడకు ఉరితాళ్లు వేసుకుని ఆందోళన చేశారు. ఒమ్మిలిలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షురాలు కార్లె భవానీ, గిరిజన సంఘం ఐదవ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా కార్యదర్శి ఇ.నర్సింహమూర్తి మాట్లాడుతూ 2016–17 సంవత్సరంలో 6వ విడత భూ పంపిణీలో రావికమతం, వి.మాడుగుల మండలాల సరిహద్దులోని ఉరవలోవ కొండ ప్రాంతంలో ఈ రెండు మండలాలకు చెందిన ఒమ్మలి, వీజేపురం, కృష్ణాపురం, కొమిర, మత్స్యపురం,బుడ్డిబంద గ్రామాలకు చెందిన వారికి పట్టాలిచ్చారని చెప్పారు. ఈ భూములను వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయకపోవడంతో లబ్ధిదారులు రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఆర్థిక పరమైన ప్రయోజనాలు పొందలేకపోతున్నారని చెప్పారు. రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాలు వల్ల పేదలు త్రీవ ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ విషయమై పలు మార్లు తహసీల్దార్లు, కలెక్టర్‌కు అర్జీలు అందజేసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఈ సమస్యపై ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే తమకు ఉరితాళ్లే శరణ్యమని చెబుతూ లబ్ధిదారులు మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. కొమిర సచివాలయం వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు మాట్లాడుతూ డి–పట్టా భూముల్లో గిరిజన రైతులు జీడి తోటలు సాగుచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒమ్మిలిలో జరిగిన కార్యక్రమంలో ఇలక అచ్చియ్యమ్మ, తట్ట వెంకటలక్ష్మి, తాటికొండ చిన నాగరాజు, రాచర్ల సూరిబాబు, పైలా అప్పలనర్సమ్మ, కొండమ్మ పాల్గొన్నారు. కొమిర గ్రామ సచివాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో గిరిజన సంఘం కార్యదర్శి రాజు,వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి దేముళ్లు, అప్పలనాయుడు, గిరిజన సంఘం నాయకులు సత్యవతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
సన్యాసిపాత్రుడ్ని పరామర్శించిన కేకే రాజు
ఎంవీపీ కాలనీ: వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, విశాఖ ఉత్తర, తూర్పు నియోజకవర్గం పరిశీలకులు చింతకాయల సన్యాసిపాత్రుడు అనారోగ్య కారణంతో మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.దీంతో పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు శుక్రవారం పరామర్శించారు. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేకే రాజు వెంట ఉత్తరాంధ్ర జోనల్ ప్రెసిడెంట్స్ అంబటి శైలేష్, ముత్తి సునీల్ కుమార్, జిల్లా ట్రేడ్ యానియన్ ఉపాధ్యక్షులు గాలి ప్రసాద్ తదితరులు ఉన్నారు. -
పెళ్లి పేరుతో మోసం చేసిన యువకుడిపై ఫిర్యాదు
అనకాపల్లి టౌన్: పెళ్లి చేసుకుంటానని నమ్మంచి రాజీవ్‌గాంధీ అనే యువకుడు తనను మోసం చేశాడని ఓ యువతి అనకాపల్లి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి పట్టణ సీఐ విజయ్ కుమార్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. చోడవరం మండలం లక్కవరం గ్రామానికి చెందిన దొమ్మేసి సరూన్కు చీడికాడ మండలం బైలపూడి గ్రామానికి చెందిన కుంచెల రాజీవ్‌గాంధీతో 2021లో పెళ్లి చూపులు జరిగాయి. అయితే యువతి తండ్రికి ఇష్టం లేకపోవడంతో పెళ్లి జరగలేదు. అప్పటి నుంచి సరూన్తో రాజీవ్ గాంధీ పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అనకాపల్లిలోని చినబాబు కాలనీలో ఉన్న తన అక్క ఇంటికి సరూన్ను తీసుకువెళ్లి శారీరంగా లోబరుచుకున్నాడు. అప్పటి నుంచి పెళ్లి చేసుకోమని కోరుతున్నా వివిధ కారణాలతో దాటవేస్తున్నాడని, రాజీవ్ గాంధీతో పాటు అతని అక్క, బావ, తమ్ముడులు కూడా పెళ్లి చేస్తామని తనను మోసం చేశారని సరూన్ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సీఐ తెలిపారు. అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యం గంటల్లోనే తల్లిదండ్రులకు అప్పగింత చోడవరం: బాలిక అదృశ్యం కేసును చోడవరం పోలీసులు వెంటనే ఛేదించారు. ఆమెను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలు.. అనంతగిరి మండలానికి చెందిన బాలిక చోడవరం పట్టణంలోని ఎస్టీ కాలేజీ హాస్టల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. సెలవులు కావడంతో గురువారం సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికని బయలు దేరింది. అప్పటి నుంచి ఆ బాలిక కనిపించకపోవడంతో తండ్రి చిక్కయ్య చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సీఐ అప్పలరాజు పర్యవేక్షణలో ఎస్ఐ నాగకార్తీక్ తన సిబ్బందితో బాలిక ఆచూకీ కోసం వెతికారు. బాలిక మాకవరపాలెం వద్ద కనిపించడంతో వెంటనే పోలీసులు పట్టుకొని చోడవరం పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. వివరాలు తెలుసుకొని తహసీల్దార్ రామారావు సమక్షంలో బాలికను తల్లిదండ్రులకు శుక్రవారం అప్పగించినట్టు ఎస్ఐ నాగకార్తీక్ చెప్పారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి మునగపాక: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని జిల్లా పరిషత్ సీఈవో నారాయణమూర్తి తెలిపారు. మండలంలోని వాడ్రాపల్లిలో శుక్రవారం ఆయన పర్యటించారు. రక్షితమంచినీటి పథకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి సమస్య లేకుండా చూడాలని, పారిశుధ్యం మెరుగునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంపద తయారీ కేంద్రాల ద్వారా పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరుతుందని చెప్పారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సర్పంచ్ కాండ్రేగుల నూకరాజు, ఎంపీడీవో ఎం.ఉషారాణి,ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మానస తదితరులు పాల్గొన్నారు. -
మాజీ డిప్యూటీ సీఎం బూడిని కలిసిన బొడ్డేడ
తారువలో పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్‌ను సత్కరిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు దేవరాపల్లి: మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడును ఆ పార్టీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ సమన్వయకర్తగా నియమితులైన సందర్భంగా తారువలో ఆయనను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ముత్యాలనాయుడు, బొడ్డేడ ప్రసాద్ పరస్పరం ఒకరినొకరు శాలువాలతో సత్కరించుకున్నారు. వైఎస్సార్సీపీ జోన్–1 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ బొడ్డేడకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు తదితర పలువురు నాయకులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న నిరాహారదీక్ష
నక్కపల్లి: బల్క్ డ్రగ్‌పార్క్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్న నిరాహారదీక్ష శుక్రవారం 12రోజు కొనసాగింది. ఈ సందర్భంగా మత్స్యకారులు తమ ఆరాధ్యదైవం నూక తాత ఆలయం వద్ద ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేసి దీక్ష కొనసాగించారు. బల్క్ డ్రగ్‌పార్క్ పనులు అడ్డుకునేందుకు రోడ్డుపై మత్స్యకారులు ధర్నాకు దిగారు. అసెంబ్లీ అయిన వెంటనే వచ్చి గ్రామస్తులతో మాట్లాడతానని హోం మంత్రి వంగలపూడి అనిత వీడియో సందేశం పంపించడంతో ధర్నా విరమించి, నూకతాత ఆలయం వద్ద దీక్ష కొనసాగిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో బల్క్ డ్రగ్‌పార్క్ రద్దుచేయాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు. దీక్షకు వైఎస్సార్సీసీ నాయకులు వీసం రామకృష్ణ, జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, సీపీఎం జిల్లాకార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజులు మద్దతు తెలిపి, మత్స్యకారులతోపాటు దీక్షలోకూర్చొన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే బల్క్ డ్రగ్‌పార్క్ రద్దుచేసే వరకుపోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సూరాకాసుల గోవిందు, గంటాతిరుపతిరావు, గొర్ల గోవిందు, మాజీ ఎంపీటీసీ పిక్కి తాతీలు,ఎరిపిల్లి నాగేశు, మహిషే, సూరిబాబు,కాశీరావు,సోమేష్, రాజశేఖర్, నూకరాజు,యజ్జల అప్పలరాజు,పైడితల్లి తదితరులు పాల్గొన్నారు. -
మిట్టల్–నిప్పన్ స్టీల్‌ప్లాంట్‌పై నేడు ప్రజాభిప్రాయ సేకరణ
నక్కపల్లి: ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్‌ప్లాంట్ నిర్మాణంపై శనివారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఏపీ కాలుష్యనియంత్రణ మండలి చందనాడ సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. జపాన్‌కు చెందిన ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ కార్పొరేషన్ జాయింట్ వెంచర్‌తో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. రాజయ్యపేట, చందనాడ, డీఎల్ పురం, వేంపాడు, అమలాపురం, మూలపర గ్రామాల పరిధిలో పోర్టు ఆధారిత ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. గత ఏడాది చివరలో ప్రభుత్వం రాజయ్యపేట పరిసర ప్రాంతాల్లో సుమారు 2,200 ఎకరాలు స్టీల్‌ప్లాంట్‌కు కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. టౌన్షిప్ అభివృద్ధి కోసం మరో 440 ఎకరాలు కేటాయించాలని మిట్టల్ గ్రూపు ప్రభుత్వాన్ని కోరింది. ఏడాదికి 7.30 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యతో ఈ కంపెనీ ఏర్పాటు చేయబోతోంది. రెండోదశలో 10.5మిలియన్మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేయబోయే స్టీల్‌ప్టాంట్ కోసం మరో 3,800 ఎకరాలను కేటాయించాలని కంపెనీ ప్రభుత్వాన్ని కోరింది.మొదటిదశ 2029 నాటికి, రెండోదశ 2033 నాటికి పూర్తిచేయాలనేది నిర్ణయం. మొదటి దశలో 20 వేల మందికి, రెండో దశలో 35 వేల మందికి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. మొదటి దశ ప్రాజెక్టు కోసం భూముల కేటాయింపుపూర్తయింది. స్టీల్‌ప్లాంట్ అవసరాల కోసం ఏలేరు కాలువ నీటిని ఉపయోగిస్తారు. రోడ్డు, పైపు లైన్ల ఏర్పాటు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. సరుకు రవాణా , ముడిసరుకు ఎగుమతులు దిగుమతుల కోసం రూ.100 కోట్ల వ్యయంతో క్యాప్టి పోర్టు ఏర్పాటు చేయనుంది. ఏపి ట్రాన్స్‌కో ద్వారా రాయితీపై విద్యుత్ సరఫరా చేయనుంది. ఇక తమ్మయ్యపేటనుంచి కాగిత, చినదొడ్డిగల్లు మీదుగా గుల్లిపాడు రైల్వేస్టేషన్ వరకు కొత్త రైల్వే లైను ఏర్పాటు చేసేందుకు సర్వే జరుగుతోంది. స్టీల్‌ప్లాంట్ అవసరాల కోసమంటూ రాష్ట్రప్రభుత్వం కాగిత, నెల్లిపూడి,డిఎల్‌పురం, వేంపాడు గ్రామాల్లో మరో 2,500 ఎకరాలు భూసేకరణకు సన్నాహాలు చేస్తోంది. దీనిపై ఆయా గ్రామాలప్రజల్లో ఆందోళన, అనుమానాలు నెలకొన్నాయి. డిమాండ్లకు అనుగుణంగా నష్టపరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని రైతులు కోరుతున్నారు. స్థానికులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ మిట్టల్–నిప్పన్ స్టీల్ ప్లాంట్‌లో స్థానికులకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సీఎస్ఆర్ నిధులతో బాగా వెనుకబడిన గ్రామాల్లో తాగునీరు, విద్య, వైద్య సదుపాయాలు క ల్పించాలని కోరుతున్నారు. స్టీల్‌ప్లాంట్ కోసం ఏపీఐఐసీకి భూములు ఇచ్చిన రైతులకు ఆర్ కార్డులు మంజూరు చేసి, వారందరికీ ప్లాంట్‌లో ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నారు. పెండింగ్‌లో ఉన్న ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సమస్య రాష్ట్రప్రభుత్వం పరిష్కరించాలని, పర్యావరణానికి ఈ ప్రాంత మత్స్యకారులకు చేపల వేటకు ఎటుంటి విఘాతం హానీ కలగకుండా చర్యలు చేపట్టాలని, ఈవిషయంపై ప్రజాభిప్రాయసేకరణలో స్పష్టమైన ప్రకటన చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. స్టీల్‌ప్లాంట్ కారణంగా గ్రామాల్లో ఉపాధి కోల్పోయిన రైతులు, వివిధ రకాల చేతివృత్తులవారికి ,అనుబంధ రంగాల వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపించాలని ఆయా వర్గాల వారు కోరుతున్నారు. భారీ బందోబస్తు ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వద్ద డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు కుమార స్వామి, అప్పన్న, రామకృష్ణల ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. స్టీల్‌ప్లాంటు ఏర్పాటును వ్యతిరేకిస్తున్న కమ్యూనిస్టు నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. బల్క్ డ్రగ్‌పార్క్‌ను వ్యతిరేకిస్తూ రాజయ్యపేటలో మత్స్యకారులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మరింత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. -
ట్యాంకర్ల నుంచి పెట్రోల్, డీజిల్ చోరీ
యలమంచిలి రూరల్: యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి సోమన్నపాలెం వద్ద కొంతకాలంగా డీజిల్,పెట్రోల్ ట్యాంకర్ల నుంచి ఇంధనం దొంగలిస్తున్న నలుగురిని యలమంచిలి రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సోమన్నపాలెం సమీపంలో పాత జాతీయరహదారి పక్కన ఎస్.రాయవరం మండలం వొమ్మవరానికి చెందిన షేక్ జానీ ఒక షెడ్ ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ అక్రమంగా ట్యాంకర్ల లోంచి డీజిల్,పెట్రోల్ చోరీ చేస్తున్నారు.ట్యాంకర్లకు ఉన్న సీలు తొలగించకుండా చాకచక్యంగా తాళం తెరిచి ఇంధనం చోరీకి పాల్పడుతున్నారు.ఈ సమాచారం అందుకున్న యలమంచిలి రూరల్ పోలీసులు శుక్రవారం అక్కడకు వెళ్లి పరిశీలించి, డీజిల్ చోరీ చేస్తుండగా నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డీజిల్ లోడుతో రాంబిల్లి ఐవోసీఎల్ నుంచి తూర్పుగోదావరి జిల్లా ఎర్రవరానికి వెళుతున్న ఏపీ39యూ1389 నంబరు గల ట్యాంకర్‌ను సోమన్నపాలెం వద్ద ఆపి డీజిల్ చోరీ చేస్తుండగా నిందితులను పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్, మరో ఇద్దరు ఉన్నారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్టు యలమంచిలి రూరల్ ఇన్చార్జ్ ఎస్ఐ కె. సావిత్రి తెలిపారు. నిందితుల వద్ద నుంచి 20 లీటర్ల డీజిల్, 50 లీటర్ల పెట్రోల్‌ను స్వాధీనం చేసుకున్నారు.నలుగురు నిందితులపై కేసు నమోదు -
కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ
మాకవరపాలెం: లక్ష్మీదేవి అవతారంలో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి అమ్మవారు దర్శనమిచ్చారు. దుర్గాదేవి నవరాత్రుల్లో భాగంగా మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గల దుర్గామల్లేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఐదో రోజైన శుక్రవారం అమ్మవారితోపాటు ఆలయంలో రూ.50 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించినట్టు ఆలయ అర్చకులు మల్లికార్జునశర్మ తెలిపారు. దుర్గామల్లేశ్వర అమ్మవారు లక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వడంతో కనులారా వీక్షించి పూజలు చేశారు.లక్ష్మీదేవి అవతారంలో దుర్గామల్లేశ్వర అమ్మవారు -
ఏసీబీకి చిక్కిన సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్
మల్కాపురం : ఓ ఇంటి సర్వే నెంబర్ మార్పు కోసం రూ.30 వేలు లంచం తీసుకుంటున్న సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ములగాడ తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్‌గా రంగోలి సత్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్‌గా కర్రి నగేష్ పనిచేస్తున్నారు. ములగాడ మండల పరిధిలో బొడ్డేపల్లి రవితేజ అనే వ్యక్తి ఇంటికి సంబంధించి సర్వే నెంబర్ తప్పుగా వచ్చింది. దీంతో సదరు వ్యక్తి తన సర్వే నెంబర్ సరిచేయాలని ఇటీవల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశాడు. సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్ ఇటీవల రవితేజ ఇంటికి వెళ్లి సర్వే చేశారు. సర్వే సర్టిఫికెట్ (ఎండార్స్మెంట్ సర్టిఫికెట్) కావాలంటే రూ.30 వేలు అవుతుందని డిమాండ్ చేశారు. ఆ డబ్బును ఇచ్చేందుకు పంజాబ్ దాబా జంక్షన్ వద్ద గల సచివాలయానికి రావాలని చెప్పారు. ఈక్రమంలో రవితేజ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఏసీబీని ఆశ్రయించాడు. సదరు వ్యక్తి పంజాబ్ జంక్షన్ వద్ద సచివాలయానికి గురువారం సాయంత్రం వెళ్లి అక్కడ జూనియర్ అసిస్టెంట్ నగేష్, సర్వేయర్ సత్యనారాయణకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ములగాడ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు సర్వేయర్ రూమ్‌లో ఫైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారిని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో శుక్రవారం హాజరుపరచనున్నారు. -
వ్యాన్ ఢీకొని బాలుడి మృతి
మాడుగుల రూరల్ : డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ముక్కుపచ్చలారని బాలుడి ప్రాణం గాలిలో కలిసి పోయింది. ఈ దుర్ఘటనకు సంబంధించి ఎస్ఐ జి. నారాయణరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మాడుగుల జగ్గన్నచావిడి ప్రాంతానికి చెందిన గుంపాన జయంత్(7) జగ్గన్న చావిడి వద్ద గురువారం మధ్యాహ్నం రోడ్డు దాటుతుండగా చీడికాడ మండలం ఎల్.బి.పట్నం (బోయపాడు) నుంచి మాడుగుల జంక్షన్ వైపు వస్తున్న ఏపి35 డబ్ల్యూ 3587 నంబరు గల టాటాఏస్ గూడ్స్ వ్యాన్ డ్రైవరు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి జయంత్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో రోడ్డు మీద పడిపోయిన బాలుడి ఛాతీపై నుంచి వ్యాన్ టైరు వెళ్లిపోవడంతో అతని నోటి నుంచి రక్తస్రావం అయింది. వెంటనే కుటుంబ సభ్యులు సమీపంలో వున్న మాడుగుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, వైద్యాధికారి పరీక్షించి అప్పటికే జయంత్ చనిపోయినట్టు నిర్ధారించారు. మృతుడు తండ్రి అచ్యుతరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అచ్యుతరావుకు ఇద్దరు కుమారులు కాగా, మృతుడు రెండో కుమారుడు రెండో తరగతి చదువుతున్నాడు. అచ్యుతరావు తాపీ మేసీ్త్రగా జీవనం సాగిస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని గురువారం సాయంత్రం అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టంకు పంపించినట్టు ఎస్ఐ తెలిపారు. -
ఆక్సిజన్ పెట్టేవారు లేరు
విశాఖ సిటీ: శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆరోగ్య కేంద్రానికి సుస్తీ చేసింది. ఏటా వేలాది మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్న వర్సిటీ.. ఉద్యోగులు, విద్యార్థుల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తోంది. ఏయూ పాలకుల నిలువెత్తు నిర్లక్ష్యం అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులకు ప్రాణ సంకటంగా మారింది. ఒకవైపు వందేళ్ల సంబరాలు చేసుకుంటున్న ఏయూలో డిస్పెన్సరీ ‘ఊపిరి’ తీసేస్తున్నారు. నిత్యం వందల మంది వచ్చే ఏయూ ఆరోగ్య కేంద్రంలో కనీస సౌకర్యాలతో పాటు వైద్యులు, సిబ్బంది లేకపోవడం రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన వైద్య సదుపాయం లేని కారణంగానే ఏయూలో బీఈడీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మణికంఠ మరణించాడని విద్యార్థుల చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటన ఏయూ పాలకుల నిర్లక్ష్యాన్ని మరోసారి బట్టబయలు చేసింది. 200 మంది రోగులు.. ఇద్దరే వైద్యులు ఏయూలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర, ఇతర సిబ్బంది, విద్యార్థుల కోసం ఆరోగ్య కేంద్రం ఉంది. 24 గంటల పాటు ఇక్కడ వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ ఉంటుంది. ఈ సమయంలో రోజుకు 200 మంది వరకు రోగులు వస్తుంటారు. కానీ ఇక్కడ ఉన్నది కేవలం ఇద్దరు వైద్యులు మాత్రమే. వీరిద్దరే చాలా ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తున్నారు. మూడు షిఫ్టులు వైద్య సేవలు అందించే ఈ ఆస్పత్రిలో కేవలం ఇద్దరు నర్సులు మాత్రమే ఉన్నారు. అలాగే ఫార్మసిస్టులు ముగ్గురికి ఇద్దరు మాత్రమే ఉన్నారు. అలాగే ఒక్కో షిఫ్ట్‌లో ఒక వార్డుబాయ్ ఉంటున్నారు. వీరే మొత్తం పనిచేయాల్సి వస్తోంది. ఎవరు సెలవు పెట్టినా మిగిలిన వారిపై పనిభారం పడుతోంది. ప్రధానంగా ఆక్సిజన్ సిలిండర్లు ఆస్పత్రిలో ఒకటి, అంబులెన్సులో ఒకటి ఉన్నాయి. కానీ అంబులెన్సులో రోగిని తీసుకెళ్లడానికి సిబ్బంది వెళ్లే పరిస్థితి లేదు. రోగికి ఆక్సిజన్ పెట్టేందుకు వార్డుబాయ్ వెళితే.. ఆస్పత్రిలో రోగులకు సేవలు అందించడానికి ఎవరూ లేకుండా పోతున్నారు. ఇదే పరిస్థితి గురువారం ఎదురైంది. అస్వస్థతకు గురైన మణికంఠను అంబులెన్సులో ఆస్పత్రికి తరలించినప్పటికీ.. ఆక్సిజన్ పెట్టేందుకు సిబ్బంది లేరు. ఆక్సిజన్ పెట్టి ఉంటే మణికంఠ ప్రాణాలతో ఉండేవాడని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇలా ఆస్పత్రిలో అనేక సమస్యలు తిష్టవేసుకొని కూర్చున్నాయి. ఇక్కడి పరిస్థితులు, అసౌకర్యాలు, సిబ్బంది లోటు వంటి విషయాలను ఏయూ పాలకుల దృష్టికి పలువురు తీసుకువెళ్లినా ఇప్పటి వరకు వాటిపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. జీతాలు అరకొరే.. ఆస్పత్రిలో సిబ్బంది జీతాల పరిస్థితి కూడా దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. దశాబ్దానికి పైగా పనిచేస్తున్న నర్సుకు ఇక్కడ కేవలం రూ.10 వేలు మాత్రమే ఇస్తుండడం గమనార్హం. అలాగే ఫార్మసిస్టులకు రూ.12 వేలు మాత్రమే ఇస్తున్నారు. జీతాలు పెంచాలని సిబ్బంది ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారిని పట్టించుకున్న వారే లేకుండా పోయారు. ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపర్చాలని, సిబ్బందిని నియమించాలని గత ఏడాది కాలంగా పాలకులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివాదాల్లో ఏయూ.. ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ను ఇటీవల కాలంలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏయూ ప్రతిష్ట దిగజారుతోంది. నిత్యం ఏదో ఒక వివాదంతో ఆందోళనకు, నిరసనలకు కేంద్రంగా మారుతోంది. పాలనపై ఆరోపణలు, విద్యార్థుల వసతి సౌకర్యాలపై విమర్శలు.. పురుగుల భోజనాలతో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఏయూలో పరిస్థితులపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎప్పటికప్పుడు ఏయూ వీసీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగుతున్నారు. నిత్యం ఏదో ఒక రగడతో ఏయూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రతిసారి ఆందోళనల సమయాల్లో బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప సమస్యలను పరిష్కరించడం లేదని విద్యార్థులు మండిపడ్డారు. -
విద్యుత్‌షాక్‌తో యువకుడి మృతి
అచ్యుతాపురం రూరల్ : విధ్యుత్ శాఖ్ గురై మునగపాక మండలం, అప్పికొండవానిపాలెం గ్రామానికి చెందిన అప్పికొండ కృష్ణ (25)మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు అప్పికొండ కృష్ణ వృత్తి రీత్యా రాడ్ బెండింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మండలంలో మడుతూరు పంచాయతీ ఎరికిరెడ్డిపాలెం గ్రామంలో ఒక ఇంటికి రాడ్ బెండింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అచ్యుతాపురం సీఐ నమ్మి గణేష్ కేసు నమోదు చేసి పంచనామా నిమిత్తం అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
భవానీ భక్తులకు ప్రత్యేక బస్సులు
నర్సీపట్నం: విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భవానీ భక్తుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడుపుతామని ఆర్టీసీ డిపో మేనేజర్ ఎం.ఎస్.ఎస్.ఽధీరజ్ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఐదు రూటుల్లో ఈ బస్సులు నడుపుతున్నామన్నారు. నర్సీపట్నం నుంచి విజయవాడ వెళ్లి రావడానికి పల్లె వెలుగు రూ.800, అల్ట్రా పల్లె వెలుగు రూ.900, ఎక్స్‌ప్రెస్ రూ.వెయ్యి, అల్ట్రా డీలక్స్ రూ.1250గా టికెట్ ధర నిర్ణయించామన్నారు. ద్వారపూడి మీదుగా వెళ్లి రావడానికి పల్లె వెలుగు రూ.860, అల్ట్రా పల్లె వెలుగు రూ.970, ఎక్స్‌ప్రెస్ రూ.1070, అల్ట్రా డీలక్స్ రూ.1350, ద్వారపూడి, ద్వారకా తిరుమల మీదుగా వెళ్లి రావడానికి పల్లె వెలుగు రూ.910, అల్ట్రా పల్లె వెలుగు రూ.1030, ఎక్స్‌ప్రెస్ రూ.1140, అల్ట్రా డీలక్స్ రూ.1420 చార్జి చేస్తామన్నారు. ద్వారపూడి, గొల్లలమామిడాడ, ద్వారకా తిరుమల మీదుగా వెళ్లి రావడానికి పల్లె వెలుగు రూ.970, అల్ట్రా పల్లె వెలుగు రూ.1090, ఎక్స్‌ప్రెస్ రూ.1210, అల్ట్రా డీలక్స్ రూ.1510, భద్రాచలం మీదుగా విజయవాడ వెళ్లి ద్వారపూడి మీదుగా తిరిగి రావడానికి పల్లె వెలుగు రూ.1190, అల్ట్రా పల్లె వెలుగు రూ.1340, ఎక్స్‌ప్రెస్ రూ.1490, అల్ట్రా డీలక్స్ రూ.1850గా రేట్లు నిర్ణయించామన్నారు. 50 మంది భవానీ భక్తులు ఉంటే నర్సీపట్నం పరిసర గ్రామాల నుంచే నేరుగా బస్సులు నడుపుతామని తెలిపారు. ఆసక్తిగల వారు 9493211969, 949811855 నంబర్లను సంప్రదించాలని డిపో మేనేజర్ కోరారు. విజిలెన్స్ అవగాహన వాకథాన్ సీతంపేట (విశాఖ): సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో గురువారం విజిలెన్స్ అవగాహన వాకథాన్, సముద్రతీర శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. తొలుత ద్వారకానగర్‌లో ఉద్యోగులు, స్వచ్ఛంద కార్యకర్తలు విజిలెన్స్ వాక్‌థాన్‌లో పాల్గొని, పాలనలో జాగ్రత్త (విజిలెన్స్), పారదర్శకత ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఆర్కే బీచ్‌లో సముద్రతీర శుభ్రత కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రాంతీయ ప్రధాన అధికారి ఏవీ రమణమూర్తి మాట్లాడుతూ, సమాజ అభివృద్ధికి జాగ్రత్త (విజిలెన్స్), శుభ్రత రెండూ తప్పనిసరి అని అన్నారు. -
కేజీహెచ్‌లో సీబీఐ అధికారుల విచారణ
మహారాణిపేట(విశాఖ): విశాఖలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన పశ్చిమ బెంగాల్ విద్యార్థిని రీతి సాహా కేసుపై సీబీఐ ఆరా తీస్తోంది. గురువారం సీబీఐ డీఎస్పీ దినేష్‌కుమార్ ఆధ్వర్యంలో కేజీహెచ్‌లో విచారణ చేశారు. అనుమానాస్పద మృతి చెందడంతో అప్పట్లో నిపుణుల కమిటీ వేసి వారి చేత పోస్టుమార్టమ్ నిర్వహించారు. అప్పుడు కమిటీ సభ్యులు డాక్టర్ మమత, డాక్టర్ హయగ్రీవరావు, డాక్టర్ సత్యప్రసాద్, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ రజనీకాంతరావులు పోస్టుమార్టం జరిపారు. ఇందులో ఇద్దరు వైద్యులు మమత, రజనీకాంతరావులకు ఇటీవల బదిలీ అయ్యింది. మిగిలిన ముగ్గురు వైద్యులను గురువారం దినేష్‌కుమార్ విచారించారు. రికార్డులను, అప్పటి పోస్టుమార్టమ్ నివేదికలను పరిశీలించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన విద్యార్థిని నీట్ శిక్షణ కోసం విశాఖలో ఆకాష్ బైజూస్ కాలేజ్‌లో చేరింది. 2023, జూలై 14న రాత్రి విశాఖ 4వ పట్టణ పోలీసుస్టేషన్ పరిధి దొండపర్తిలో కాలేజీ నిర్వహిస్తున్న సాధన హాస్టల్ భవనం పైనుంచి పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే నెల 17న మృతి చెందింది. పోలీసులు తొలుత ఆమెది ఆత్మహత్యగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం ఉందని కాలేజీకి చెందిన ఇద్దరిని, హాస్టల్‌కు చెందిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అయితే ఆమె మృతిపై తండ్రి సుఖ్‌దేవ్ సాహా మాత్రం అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసుల దర్యాప్తు తీరు సక్రమంగా లేదని, కాలేజీ యాజమాన్యంతో పోలీసులు కుమ్మకై ్కపోయారని ఆరోపణలు చేశారు. అలాగే సీసీ కెమెరా పరిశీలిస్తే.. తన కుమార్తె బిల్డింగ్‌పైకి వెళ్లినపుడు ఒక కలర్ డ్రెస్ ఉందని, కింద పడిన తర్వాత మరో కలర్ డ్రెస్ ఉందని అనుమానం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన సీబీఐ అప్పట్లో విశాఖలో సంచలనం సృష్టించిన ఈ కేసులో విచారణ చేయడానికి సీబీఐ రంగంలోకి దిగింది. ఈ కేసు విషయంలో స్వయంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. దర్యాప్తు కోసం బెంగాల్ సీఐడీని విశాఖకు పంపించడం చర్చనీయాంశమైంది. తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంతో మరోసారి దర్యాప్తు జరుగుతోంది. సిటీ పోలీసులకు తలనొప్పులు విద్యార్థిని మృతి కేసు విశాఖ పోలీసుల పరువు తీసినట్టయింది. ముందు ఆమెది ఆత్మహత్యగానే పేర్కొంటూ స్వయంగా అప్పటి సీపీ త్రివిక్రమ్ వర్మ మీడియా సమావేశంలో తేల్చి చెప్పారు. బెంగాల్ నుంచి సీఐడీ దర్యాప్తు చేపట్టిన తర్వాత అప్పటి కప్పుడు సెక్షన్లు మార్చారు. దర్యాప్తు అధికారిని తప్పించి ఉన్నతాధికారికి ఆ బాధ్యతలు అప్పగించారు. అలాగే సీఐ, ఎస్ఐలపై బదిలీ వేటు వేశారు. ఇపుడు మళ్లీ అప్పటి పోలీసుల వ్యవహార శైలిపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయన్న చర్చ పోలీస్ శాఖలోనే జరుగుతోంది. విద్యార్థిని రీతి సాహా మృతి కేసులో కోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు ప్రారంభం హాస్టల్ బిల్డింగ్ పైనుంచి పడి మృతి చెందిన రీతి సాహా ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన తల్లిదండ్రులు సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్ దినేష్‌కుమార్ నేతృత్వంలో నిపుణుల కమిటీతో భేటీ -
పలు చోరీ కేసుల్లో నిందితుడి అరెస్టు
కశింకోట : జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడిన దొంగను కశింకోట పోలీసులు చాక చక్యంగా పట్టుకొని 8 తులాల నగలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ అల్లు స్వామినాయుడు గురువారం రాత్రి విలేకరులకు వివరాలు తెలిపారు. మండలంలోని అచ్చెర్ల కూడలి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా పారిపోతున్న కోటవురట్ల మండలం రామచంద్రపాలెం గ్రామానికి చెందిన కరక రాజుబాబు(46)ను తమ సిబ్బంది సహకారంతో పట్టుకున్నామన్నారు. అతన్ని విచారించగా గతంలో సుమారు 30 దొంగతనాలు చేసి 15 దఫాలు జైలుకు వెళ్లినట్టు అంగీకరించారన్నారు. మాకవరపాలెం మండలం తామరం పీఏసీఎస్‌లో దొంగతనానికి ప్రయత్నించినట్లు తెలిపాడన్నారు. అలాగే ఈ ఏడాది జనవరి 27న కశింకోటలో జరిగిన 15 తులాల బంగారం దొంగతనాన్ని తానే చేసినట్టు అంగీకరించాడన్నారు. ఈ సందర్భంగా మధ్యవర్తుల సమక్షంలో నిందితుని బ్యాగు నుంచి 8 తులాల బరువు కలిగిన పలు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. నిందితుడిని విజయవంతంగా పట్టుకున్నందుకు తమను, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారన్నారు. -
పరిశ్రమల దరఖాస్తులను త్వరగా ఆమోదించాలి
తుమ్మపాల: పరిశ్రమల ఏర్పాటు ద్వారా పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి సత్వరమే అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సహక కమిటీ (డీఐఈపీసీ) 16వ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పి.కె.పి. ప్రసాద్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎం.నరసింహారావు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గత జులై 29న జరిగిన సమావేశం తరువాత నుంచి ఇప్పటి వరకు వివిధ శాఖల అనుమతి కోసం 1,573 దరఖాస్తులు రాగా, వాటిలో 1,462 దరఖాస్తులను ఆమోదించామన్నారు. వివిధ శాఖల అధికారులతో మాట్లాడి మిగిలిన దరఖాస్తులను త్వరగా ఆమోదించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 12 పరిశ్రమలకు సంబంధించిన వివిధ రాయితీల కోసం 21 దరఖాస్తులు రాగా, రూ.7.46 కోట్ల విడుదలకు కమిటీ సమావేశంలో ఆమోదం తెలిపామన్నారు. నక్కపల్లిలో కొత్తగా వరాహ పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అలాగే 46 భారీ, అతి భారీ పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉన్నాయని, వీటి ద్వారా రూ.2,89,161.85 కోట్ల పెట్టుబడులు, 1,56,556 మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఈఈ ముకుందరావు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల జాయింట్ డైరెక్టర్ సెంతిల్ కుమార్, ఫ్యాప్ షియా జిల్లా సమన్వయకర్త వై.సాంబశివరావు, జిల్లా కర్మాగారాల ఉప ముఖ్య ఇన్స్పెక్టర్ పరమేశ్వరరావు, జిల్లా రవాణా శాఖ అధికారి మనోహర్, జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి గోవిందరావు, విద్యుత్ శాఖ పర్యవేక్షణ ఇంజినీర్ ప్రసాద్, జిల్లా రిజిస్ట్రార్ మన్మథరావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఆర్.వెంకటరమణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
వడ్డాదిలో విషాదఛాయలు
తాచేరు నదిలో పడి వడ్డాదికి చెందిన కాళ్ల సుబ్బారావు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వడ్డాది, విజయరామరాజుపేట రెండు గ్రామాలు పక్కపక్కనే ఉంటాయి. రెండు గ్రామాల మధ్యన తాచేరు నది ఉంది. నదిని ఆనుకొని రెండు గ్రామాల రైతులకు పంట పొలాలున్నాయి. బుధవారం తాచేరు నది దాటి తన పొలంలోకి వెళ్లిన సుబ్బారావు రాత్రయినా తిరిగి ఇంటికి రాలేదు. తాచేరు నది డైవర్షన్ రోడ్డు కోతకు గురవడంతో నది దాటలేక పొలంలో పాకలో ఉండిపోయి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుకున్నారు. బుధవారం ఉదయం డైవర్షన్ రోడ్డు వద్ద సుబ్బారావు మృతదేహం ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ శ్రీనివాసరావు పరిశీలించారు. సుబ్బారావు మృతదేహాన్ని నీటిలో నుంచి బైటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మితోపాటు వివాహమైన ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
స్వచ్ఛతతో ఆరోగ్యం, ఆనందం
తుమ్మపాల: ప్రతి ఒక్కరూ తమ ఇంటితోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, స్వచ్ఛత కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. పిసినికాడ శ్మశానవాటికలో గురువారం ‘స్వచ్ఛత హి సేవ’లో భాగంగా నిర్వహించిన ఏక్ దిన్.. ఏక్ గంట.. ఏక్ సాత్ స్వచ్ఛత కార్యక్రమంలో ఆమె పారిశుధ్య కార్మికులతో కలిసి పరిసరాలు, కాలువలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్తంగా నిర్వహించే స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో కూడా శ్రమదానం చేసి, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉండగలమని, అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గ్రామంలో వెంటనే ట్రాక్టర్ తొట్టి కొనుగోలు చేసి వినియోగంలోకి తీసుకురావాలని, డంపింగ్ యార్డ్ వద్ద చెత్త నిలువ ఉండకూడదని, ఎప్పటికప్పుడు తరలించాలని ఆదేశించారు. ఆర్డీవో షేక్ ఆయిషా, సర్పంచ్ రమేష్, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్తగా బొడ్డేడ ప్రసాద్
సాక్షి, అనకాపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్తగా బొడ్డేడ ప్రసాద్‌ను నియమించారు. ఈ మేరకు గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా పనిచేస్తున్న బొడ్డేడ ప్రసాద్ ఆ పదవిలో కూడా కొనసాగుతారని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఆయన వైఎస్సార్ హయాంలో ఆర్ఈసీఎస్ చైర్మన్‌గా, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. -
వెనక్కి!
వసూలు చేసిన రూ.2 లక్షలుసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అనకాపల్లి పోలీస్ స్టేషన్లోనే వసూళ్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఓ కేసులో నగదు తీసుకుంటూ ఎస్ఐ ఏసీబీకి చిక్కగా... స్టేషన్లో తీసుకున్న రూ.2 లక్షలు కాస్తా ఎవరి జేబులోకి వెళ్లాయనే కోణంలో ఏసీబీ విచారణ చేపట్టింది. ఇందుకోసం స్టేషన్ సీసీ ఫుటేజీని ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. అంతిమ లబ్ధిదారు ఎవరనే కోణంలో విచారణ ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. అయితే రూ.2 లక్షల వ్యవహారం బయటపొక్కకుండా ఉండేందుకుగానూ.. తన జేబులోకి వేసుకున్న వ్యక్తి కాస్తా తిరిగి ఫిర్యాదుదారుడికి వెనక్కి ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సదరు ఫిర్యాదుదారుడికి దూరపు బంధువైన ఓ పోలీసు అధికారి ద్వారా రాయబారం నడుపుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. తనకు రూ.2 లక్షలు ఇచ్చినట్టు చెప్పవద్దంటూ బతిమలాడుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు ఏసీబీ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చిన ఎస్ఐ కాస్తా... తిరిగి త్వరలోనే తనకు లా అండ్ ఆర్డర్ పోస్టింగు వస్తుందంటూ ప్రచారం చేసుకుంటుండటం ఇప్పుడు అనకాపల్లిలో హాట్‌టాపిక్‌గా మారింది. పేరు చెప్పొద్దు ప్లీజ్..! వాస్తవానికి ఈ కేసు వ్యవహారంలో ఎంత మొత్తం తీసుకోవాలనే డైరెక్షన్ మొత్తం ఎస్ఐ వెనుక ఉండి ‘విజయ’వంతంగా నడిపించిన వ్యక్తి ఇప్పుడు తన పేరు బయటకు రాకుండా జాగ్రత్తలో పడినట్టు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా ఫిర్యాదుదారుడితో రాయబారాలు నడిపినట్టు కూడా సమాచారం. ఈ వ్యవహారంలో తనకు సహాయంగా ఉండేందుకు సదరు ఫిర్యాదుదారుడికి దూరపు బంధువైన ఓ సీఐ సహాయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకుగానూ రూ.2 లక్షలు వెనక్కి ఇవ్వడంతో పాటు నమోదైన కేసు వ్యవహారంలోనూ సహాయం చేస్తానని హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదులో ఇప్పటికే రూ.2 లక్షలు అందజేసినట్టు స్పష్టంగా పేర్కొన్న ఫిర్యాదుదారుడు.. అంతిమంగా ఎవరికోసం ఇచ్చారనేది ఇప్పటివరకు వెల్లడించలేదని తెలుస్తోంది. ఇదే అదునుగా తన పేరు చెప్పకుండా ఉండాలంటూ తీసుకున్న రూ.2 లక్షలు తిరిగి వెనక్కి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రాకుండా నగదు రూపంలో సదరు బంధువు ద్వారా లావాదేవీలు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని కూడా ఏసీబీ లోతుగా విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే బంధువని తెలిసినా..! వాస్తవానికి బంగారం షాపు యజమాని స్థానిక ఎమ్మెల్యే బంధువు అని తెలుస్తోంది. తన షాపులోనికి రంధ్రం చేసుకుని వచ్చేందుకు ప్రయత్నించారని.. స్వయంగా సదరు బంధువు వెళ్లి కేసు నమోదు చేయాలంటూ కోరారు. అయితే దొంగతనం ఏమీ జరగలేదు కదా అంటూ.. వెంటనే కేసు నమోదు చేయకుండా తాత్సారం చేసినట్టు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే అల్లుడు కూడా ఫోన్ చేసి విచారణ చేయాలంటూ కోరినట్టు సమాచారం. అయినప్పటికీ అవతలి పార్టీ నుంచి లంచం తీసుకుని తాత్సారం చేసినట్టు తెలుస్తోంది. ఒక ఎమ్మెల్యే బంధువు వ్యవహారంలోనే పోలీసులు ఇంత ఉదాసీనంగా కేసు పెట్టకుండా అవతలి వ్యక్తుల నుంచి పైసలు తీసుకున్నారంటే పోలీసింగ్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా ఏసీబీ కేసులో ఇరుక్కున్న ఎస్ఐ తనకు తిరిగి లా అండ్ ఆర్డర్లో పోస్టింగు వస్తుందంటూ.. ఇందుకోసం సిటీలోని ఓ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే తనకు అండదండలందిస్తున్నట్టు కూడా ప్రచారం చేసుకుంటుండడం గమనార్హం. -
చల్లారని ఆగ్రహం
●రాత్రంతా కొనసాగిన దీక్ష.. 11వ రోజూ మత్స్యకారుల నిరశన ●అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాక వస్తానని హోంమంత్రి వీడియో సందేశం ●అయినా ఆందోళన కొనసాగింపు నిరాహార దీక్షకు మద్దతుగా తరలివచ్చిన మహిళలు రోడ్డుపై బైఠాయించిన మత్స్యకారులు నక్కపల్లి: బల్క్‌డ్రగ్ పార్కు ఏర్పాటును వ్యతిరేకిస్తూ బుధవారం రాత్రంతా ఆందోళన కొనసాగించిన రాజయ్యపేట మత్స్యకారులు 11వ రోజైన గురువారం కూడా నిరశన చేపట్టారు. తమ ఆవేదనకు హోం మంత్రి అనిత స్పందించకపోగా.. ఆర్సిలరీ మిట్టల్ స్టీల్‌ప్లాంటు ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలంటూ నక్కపల్లిలో సమావేశం ఏర్పాటు చేయడంతో మత్స్యకారులు అగ్గి మీద గుగ్గిలమయిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం రాజయ్యపేటలో జరుగుతున్న పనులను అడ్డుకుని రోడ్డుపై నిప్పు పెట్టి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. తెల్లవార్లూ అక్కడే ఆందోళన చేసి, గురువారం ఉదయం నుంచి నిరాహార దీక్ష కొనసాగించారు. పూరీ, కోణార్క్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిన వందలాది మంది మత్స్యకారులు రైళ్లలో, బస్సుల్లో స్వగ్రామానికి తిరిగి వచ్చి వారితో గొంతు కలిపారు. అక్కడే వంట వార్పు చేసుకొని, దీక్షలో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నాయకుడు వీసం రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు తదితరులు సంఘీభావం ప్రకటించి, వారితోపాటు సాయంత్రం వరకు నిరాహార దీక్షలో కూర్చొన్నారు. ఈ సందర్భంగా భారీగా పోలీసులు మోహరించారు. అధికారులు నచ్చచెప్పినా ససేమిరా నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ, డీఎస్పీ శ్రీనివాసరావు, మత్స్యశాఖ ఏడీ విజయలక్ష్మి వచ్చి చర్చలు జరిపేందుకు సిద్ధపడగా, మత్స్యకారులు అంగీకరించలేదు. మీతో మాకు సంబంధం లేదని, హోం మంత్రి వచ్చి సమాధానం చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. పది రోజుల నుంచి నిద్రాహారాలు మాని ఆందోళన చేస్తే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అనిపించలేదని మత్స్యకార నాయకులు మోసా అప్పలరాజు, గోసల రాజశేఖర్, పిక్కి తాతీలు, ఎరిపల్లి నాగేశు, మహేష్ కాశీరావు, జడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ తదితరులు విమర్శించారు. సహనాన్ని పరీక్షిస్తే ప్రాణాలను సైతం లెక్క చేయమన్నారు. జైళ్లకు వెళ్లడానికై నా సిద్ధంగా ఉన్నామన్నారు. వీసం రామకృష్ణ మాట్లాడుతూ మత్స్యకారులు చేసే పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, వారితోపాటు ఎన్ని రోజులైనా నిరాహార దీక్షలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీపీఎం జిల్లా నాయకుడు అప్పలరాజు మాట్లాడుతూ బల్క్‌డ్రగ్ పార్కు వల్ల ఇబ్బంది ఉండదని టీడీపీ నాయకులు, అధికారులు చెబుతున్నారని, అచ్యుతాపురం, పరవాడలలో ఇటువంటి పార్కులు ఉన్నాయని, అక్కడ ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పరిశీలన చేద్దామని, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని చెబితే స్వచ్ఛందంగా ఆందోళన విరమిస్తామన్నారు. హోం మంత్రి వీడియో ప్రకటన సాయంత్రం హోం మంత్రి అనిత వీడియో ద్వారా ప్రకటన విడుదల చేశారు. తాను అసెంబ్లీ సమావేశాల్లో ఉండటం వల్ల రాజయ్యపేట రాలేకపోయానన్నారు. సమావేశాలు ముగిసిన వెంటనే వచ్చి చర్చలు జరుపుతానన్నారు, వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. మంత్రి మాట్లాడిన వీడియోను ఆర్డీవో రమణ ఆందోళనకారులకు వినిపించారు. దీంతో మత్స్యకారులు రోడ్డుపై నుంచి ఆందోళనను నూకతాత ఆలయానికి మారుస్తున్నామని, అక్కడ ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేసుకొని దీక్ష కొనసాగిస్తామన్నారు. తమ డిమాండ్లు పూర్తిగా నెరవేర్చి సంతృప్తి చెందినతేనే ఆందోళన విరమిస్తామని, పరిష్కారం కాకపోతే నిరాహార దీక్ష మరింత ఉధృతం చేస్తామన్నారు. -
రూ.1.55 లక్షలకు లడ్డూ వేలం
చీడికాడ: అర్జునగిరి గ్రామంలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో భవానీ భక్తులు ఏర్పాటు చేసిన శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని ప్రతిష్టించారు. అమ్మవారి లడ్డును గ్రామానికి చెందిన కొప్పాక శ్రీనివాసరావు దంపతులు లక్షా 55 వేల రూపాయలకు వేలంలో సొంతం చేసుకున్నారు. ఈ నగదును వచ్చే ఏడాది జరిగే శరనవరాత్రి ఉత్సవాల్లో అంబలం పూజకు వినియోగించనున్నట్టు అమ్మవారి పీఠం గురు భవానీ భక్తులు తెలిపారు. కాగా అమ్మవారి అంబలం పూజ బుధవారం రాత్రి జరిగింది. భక్తుల ఆర్థిక సహకారంతో 50 కిలోల లడ్డూను ఏర్పాటు చేశారు. -
గోవాడ సుగర్స్‌ను ఆదుకోవాలి
కె.కోటపాడు: గోవాడ సుగర్ ప్యాక్టరీని రాష్ట్రంలో గల కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని చెరకు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేచలపు కాసుబాబు కోరారు. కె.కోటపాడులో బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఫ్యాక్టరీ పరిస్థితులపై జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్‌ను ఇటీవల కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని కాసుబాబు అన్నారు. చెరకు రైతులకు రూ.30 కోట్లు, కార్మికులకు రూ.10 కోట్లు బకాయిలు ఉన్న విషయాన్ని ఫ్యాక్టరీ పరిధిలో గల ఇద్దరు ఎమ్మెల్యేలకు తెలిసినా వారు పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. ప్రస్తుత ఫ్యాక్టరీ దీన పరిస్థితిపై ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు స్పందించి పూర్వవైభవం వచ్చేలా సహకారాన్ని అందించాలని కాసుబాబు కోరారు. కార్యక్రమంలో కొరిబిల్లి శంకరరావు, గొర్లె దేముడుబాబు, శెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. -
చిరు వ్యాపారులపై ఇదేం దౌర్జన్యం
అనకాపల్లి: రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలతో కుటుంబాన్ని నేట్టుకొస్తున్న సమయంలో పట్టణ పరిధిలో రహదారులపై చిరు వ్యాపారం, తోపుడుబండ్లు, కూరగాయల దుకాణాలు పెట్టుకొని జీవిస్తున్న దుకాణాలపై జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఉక్కుపాదం మోపడం అన్యాయమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వివి.శ్రీనివాసరావు అన్నారు. జోనల్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఽఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేపట్టారు. చిరు వ్యాపారులకు హాకర్స్ జోన్ ఏర్పాటు చేయాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఏళ్ల తరబడి రోడ్ల పక్కన చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న పేదలపై రాష్ట్ర ప్రభుత్వం, జీవీఎంసీ అధికారులు దౌర్జన్యానికి పాల్పడడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం ఉపాధి చూపక, ఏ ఆధారం లేక రోడ్ల పక్కన చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని జీవిస్తున్న వారికి ఉపాధి లేకుండా చేయడం ఎంతవరకు సమంజసం అని దుయ్యపట్టారు. పేదలను లక్షాధికారులను చేస్తానని చెబుతున్న సీఎం చంద్రబాబు జీవించడానికి చిరు వ్యాపారాలు చేసుకునే వారిని రోడ్డుపాలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. పేదలపై దౌర్జన్యాన్ని విరమించాలని, లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యాక్షుడు గంటా శ్రీరామ్, మండల కన్వీనర్ కాళ్ల తేలయ్యబాబు, శ్రీను, రమణ, లక్ష్మి, రమణమ్మ పాల్గొన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమావేశం... ఆపరేషన్ లంగ్స్ పేరుతో జీవీఎంసీ అధికారులు పట్టణ పరిధిలో బడ్డీల తొలగింపు, చిరు వ్యాపారంపై దాడులు ఆపాలలని ఏపీ వీధి విక్రయదారులు ఫెడరేషన్ (ఏఐటీయూసీ) జిల్లా కార్యదర్శి కోన లక్ష్మణ అన్నారు. స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన ముద్ర లోన్లు ,రోజువారి ప్రైవేట్ ఫైనాన్స్‌లు కట్టుకోలేక వస్తున్న ఆదాయం సరిపోక సతమతమవుతున్న విషయం అధికారులు ,ప్రజా ప్రతినిధులు గుర్తించాలని అన్నారు. సుప్రీంకోర్టు నిబంధనలను కూడా పక్కనపెట్టి వారికి అన్ని ప్రాంతాల్లో హాకర్స్ జోన్, గుర్తింపుకార్డులు మంచినీరు, టాయిలెట్స్ మరుగుదొడ్లు మంజూరు చేయాలని ఉన్నప్పటికీ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా వారిని వెల్లగొట్టే చర్యలు ఆపాలన్నారు. యూనియన్ జిల్లా నాయ కుడు నాగేశ్వరరావు, చిరు వ్యాపారులు జి త్రినాథ్, బంటు సూర్యనారాయణ, ఎ.వి. అప్పారావు, రామకృష్ణ, కొండలరావు, గురుమూర్తి ,బాబ్జి, పి ఎస్.ఆర్ రాజు, కోనేటి శ్రీనివాస్‌రావు, నాగు పాల్గొన్నారు. -
మత్స్యకారుల్లో ఆగ్రహ జ్వాల
టెంటు వేయవద్దన్నా వెరవలేదు.. మైకు పెట్టవద్దనా పట్టించుకోలేదు.. నిరశన తెలపడమే ముఖ్యమనుకున్నారు.. ముందు మండుటెండలో, తర్వాత గొడుగుల కింద, నాలుగు రోజులు గడిచాక టెంట్ల కింద శాంతియుతంగా నిరాహార దీక్షలు కొనసాగించారు. బల్క్‌డ్రగ్ పార్కు వద్దంటూ వేడుకుంటున్నారు. కానీ పది రోజులైనా తమను పట్టించుకోని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర హోంమంత్రి స్టీల్‌ప్లాంట్‌పై సమావేశం పెట్టారని తెలిశాక మాత్రం ఆగ్రహంతో ఊగిపోయారు. తమ ప్రజాప్రతినిధి నిర్లక్ష్య భావంపై రగిలిపోయారు.నక్కపల్లి: గుండెల్లో మంట ఆగ్రహ జ్వాలగా మారింది. మంట పెట్టి రహదారిని దిగ్బంధం చేసింది. బల్క్‌డ్రగ్ పార్కు పనులను అడ్డుకుంది. ఇది పది రోజులుగా నిరశన తెలుపుతున్న గంగపుత్రుల ఆవేదన. ఎన్నికల ముందు రాజయ్యపేట ఓట్ల కోసం వచ్చిన వంగలపూడి అనిత బల్క్‌డ్రగ్ పార్కుకు, సముద్రంలోకి కంపెనీల వ్యర్థ జలాల విడుదల కోసం వేస్తున్న పైపులైన్లకు తాను వ్యతిరేకమని ఓట్లు అడిగారు. ఆమెకు రాజయ్యపేట గ్రామ ప్రజలు 2 వేల మెజార్టీ ఇచ్చారు. అంత మద్దతిచ్చినా ఆమె కనీసం తమ గోడు వినడానికై నా రాలేదన్న అసంతృప్తి వారిలో నెలకొంది. అది బుధవారంనాటి పరిణామాలతో ఆగ్రహంగా మారింది. ఆర్సిలరీ మిట్టల్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుపై ఈనెల 27న నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణను విజయవంతం చేయాలని సంబంధిత గ్రామాల పెద్దలతో హోంమంత్రి అనిత సమావేశం జరిపారని తెలుసుకున్న గంగపుత్రులు మరింత కోపంతో ఊగిపోయారు. తమ ఆవేదనకు విలువ ఇవ్వనందుకు నిరసనగా బల్క్‌డ్రగ్ పార్క్ పనులు చేస్తున్న ఎస్ఆర్ఆర్ కంపెనీ వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. రోడ్డుపై నిప్పు పెట్టి రాకపోకలు బ్లాక్ చేశారు. బల్క్‌డ్రగ్ పార్క్ పనులు చేస్తున్న ఎస్ఆర్ఆర్ కంపెనీ వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నక్కపల్లి, ఎస్.రాయవరం సీఐలు కుమారస్వామి, రామకృష్ణ ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసులు గ్రామంలోకి వెళ్లారు. నూకతాత ఆలయం వద్ద టెంటు వేసి ఆందోళన కొనసాగిస్తున్న మత్స్యకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ప్రస్తుతం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మత్స్యకారులు హోంమంత్రి అనితకు వ్యతిరేకంగా ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేస్తున్నారు. వీరికి సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు మద్దతు తెలిపారు. కాకినాడ సమీపంలో బల్క్‌డ్రగ్ పార్కు ఏర్పాటుకు సిద్ధపడిన దివీస్ కంపెనీకి వ్యతిరేకంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వారు ఉప్పాడలో రోడ్డెక్కి ఆందోళన చేస్తే అక్కడి ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారని, వెంటనే కమిటీ ఏర్పాటు చేస్తానని ప్రకటించారని మత్స్యకారులు పేర్కొన్నారు. ఇక్కడ రాజయ్యపేట మత్స్యకారులు పది రోజులుగా నిరాహారదీక్ష చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యేగా అనిత ఒక్కసారి కూడా గ్రామానికి రాలేదని, తమతో చర్చలు జరపలేదని వారు ఆగ్రహంతో ఉన్నారు. రాత్రి పొద్దుపోయాక కూడా దీక్షలు కొనసాగించారు. -
గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం
బుచ్చెయ్యపేట: విజయరామరాజుపేట తాచేరు నదిలో గల్లంతైన 8వ తరగతి విద్యార్థి ఆడారి రోహిత్(13) శవమై తేలాడు. మంగళవారం సాయంత్రం తన తమ్ముడు రిషిత్తో కలిసి పేట తాచేరు నదిపై గండి పడిన తాచేరు డైవర్షన్ రోడ్డు వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తూ తాచేరు నదిలో పడిపోయి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. బుచ్చెయ్యపేట ఎస్ఐ శ్రీనివాసరావు తమ సిబ్బంది,అగ్నిమాపక సిబ్బందితో రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా రోహిత్ ఆచూకీ దొరకలేదు. బుధవారం ఎన్‌డీఎర్‌ఎఫ్ బృందంతో ఎస్ఐ గాలింపు చర్యలు చేపట్టారు. విజయరామరాజుపేట గాయత్రి కాలేజీ ఎదురుగా ఉన్న పెద్దేరు నదిలో తుప్పల్లో రోహిత్ మృతదేహం లభ్యమైంది. మంగళవారం మధ్యాహ్నం ఇంటి వద్ద అన్నం తిని ఆడుకోవడానికి వెళ్లిన తమ కుమారుడు బుధవారం శవమై తిరిగి రావడంతో బాలుడి తల్లిదండ్రులు గోపి, సూర్యలక్ష్మి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కోతకు గురైన తాచేరు డైవర్షన్ రోడ్డును బాగు చేసి ఉంటే తమ కుమారుడు బతికేవాడని మృతుడి తల్లిదండ్రులతో పాటు గ్రామ సర్పంచ్ విజయ్‌కుమార్, కోఆపరేటివ్ మాజీ అధ్యక్షుడు గోవింద, రాష్ట్ర అఖిల గాండ్ల తెలుకుల సంఘం మాజీ డైరెక్టర్ చిత్రాడ జగదీష్ వాపోయారు. -
వెర్రిగెడ్డ ఆనకట్టకు గండి
నాతవరం: వెర్రిగెడ్డ ఆనకట్ట గట్టు లోపల భాగంలో రంధ్రం పడి సాగు నీరంతా వృధాగా బయటకు పోతుంది. మండలంలో మర్రిపాలెం పంచాయతీ శివారు మాదంపూడి గ్రామ సమీపంలో వెర్రిగెడ్డ ఆనకట్ట ఉంది. ఈ అనకట్ట నీరు ఆధారంగా ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్లో రైతులు వరి పంట 5వేల ఎకరాల్లో వేస్తుంటారు. తాండవ రిజర్వాయరు ఉన్నప్పటికీ మర్రిపాలెం డి.పంచాయతీలు పరిధిలో వెన్నలపాలెం, డి.యర్రవరం, డొంకాడ, మాదంపూడి, పొట్టిపాలెం, యరకంపేట, బాపన్నపేట కొత్త ఎల్లవరం తాండవ జంక్షన్ ములగపూడి గ్రామాలకు తాండవ ప్రాజెక్టు నీరు ప్రవహించదు. ఆయా గ్రామాల పరిధిలో రైతులంతా వెర్రిగెడ్డ ఆనకట్ట నీరుపై ఆధారపడి ఖరీఫ్‌లో రినాట్లు వేస్తుంటారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొండ గెడ్డల నుంచి నీరు అఽధిక మొత్తంలో వెర్రిగెడ్డ ఆనకట్టలోకి వచ్చి చేరింది. ఆనకట్ట గట్టు మట్టితో నిర్మించింది కావడంతో గట్టు లోపల భాగంలోంచి రంఽధ్రం ఏర్పడి నిత్యం సాగు నీరంతా వృధాగా పోతుంది. రంధ్రం పడిన ప్రదేశాన్ని గుర్తించిన రైతులు దానిని మసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. ప్రస్తుతం అయకట్టు పరిధిలో రైతులంతా వరినాట్లు వేసుకుని కలుపు తీసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ జేఈ రవికిరణ్‌ను వివరణ కోరగా గండి పడిన విషయాన్ని రైతులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. తాను స్వయంగా పరిశీలించి నీటి సంఘం ప్రతినిధులతో చర్చించి నీరు వృధాగా పోకుండా చర్యలు చేపడతామన్నారు. -
పీఆర్సీ వెంటనే ప్రకటించాలి
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల ధర్నా నర్సీపట్నం: కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల 12వ పీఆర్సీని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు డిమాండ్ చేశారు. బుధవారం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. వినతిపత్రాన్ని ఆర్డీవో కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ పీఆర్సీ పెంచి జీతాలు పెంచాలన్నారు. డీఏ, సరెండర్ లీవ్‌ల బకాయిలు చెల్లించాలన్నారు. మున్సిపల్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సీఎం ఇచ్చిన హామీ మేరకు గత జూలైలో జరిగిన మున్సిపల్ కార్మికుల సమ్మె కాలపు జీతం చెల్లించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన 13 గంటల పనిదినాన్ని రద్దు చేయాలన్నారు. మహిళలతో రాత్రి పూట షిప్ట్‌లో చేయించే విధానానికి స్వస్తి పలకాలన్నారు. రిటైర్మెంట్, అనారోగ్యంతో చనిపోయిన వారి స్థానాల్లో వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పట్టణాల విస్తరణ మేరకు సిబ్బంది సంఖ్యను పెంచాలన్నారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడాలన్నారు. కార్మికుల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారం చేయకుండా మాది మంచి ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవటం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎం.లోవరాజు, బాబురావు, వి.రమణ, నూకరాజు, సంపత్, అర్జమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అగ్రిసెట్‌లో ర్యాంకుల పంట
అనకాపల్లి టౌన్: స్ధానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్ధానంకు అనుబంధంగా ఉన్న వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు 2025 అగ్రిసెట్ ప్రవేశ పరీక్ష రాష్ట్ర స్థాయి ఫలితాల్లో పలు ర్యాంకులు పొందినట్టు కళాళాల ప్రిన్సిపాల్, పరిశోధన స్ధానం ఏడీఆర్ డాక్డర్ ముకుందరావు తెలిపారు. ఎల్.స్వరూప 9వ ర్యాంకు, వి.గౌరీశ్వరి, 10వ ర్యాంకు, పి. వెంకటేష్, 19వ ర్యాంకు, జి.అనూష 43వ ర్యాంకులు సాధించగా 100లోపు ర్యాంకులు 24 మంది, మరో 12 మంది విద్యార్థులు పలు ర్యాంకులు సాధించినట్టు తెలిపారు. వీరిని వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.చారులత, బోధన సిబ్బంది అభినందించారు. -
ఏసీపీఆర్‌ఈఈ పథకంపై అవగాహన
విశాఖ సిటీ: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఏసీపీఆర్‌ఈఈ–2025(స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్) పథకంపై బుధవారం హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ కార్యాలయంలో యజమానులు, ఉద్యోగులకు ఈఎస్ఐ ఉప ప్రాంతీయ అధికారులు, గాజువాక బ్రాంచ్ మేనేజర్ అవగాహన కల్పించారు. ఈ పథకంలో ఎవరైనా చేరకపోతే తక్షణమే చేరాలని సూచించారు. ఈ ఏడాది డిసెంబరు 31 వరకు గడువు ఉందన్నారు. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉన్న కర్మాగారాలు, సంస్థలు సువిధ, ఎంసీఏ, ఈఎస్ఐసీ పోర్టళ్లలో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఈఎస్ఐ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.కె.సాహూ, అసిస్టెంట్ డైరెక్టర్ వి.శ్యామ్ ప్రసాద్, గాజువాక బ్రాంచ్ మేనేజర్ ఎల్.కృష్ణ ప్రసాద్, అసిస్టెంట్ డి.చిరంజీవి (అసిస్టెంట్), హిందూస్తాన్ షిప్‌యార్డ్ కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘మహా’ విస్తరణ
డాబాగార్డెన్స్ (విశాఖ): నగర జనాభా పెరుగుదల, సమీప గ్రామీణ ప్రాంతాల విలీనంతో ఒకప్పటి విశాఖ మున్సిపాలిటీ కార్పొరేషన్ అయ్యింది. కార్పొరేషన్ గ్రేటర్‌గా మా రింది. 32 గ్రామాల విలీనంతో 72 వార్డులున్న జీవీఎంసీ 98 వార్డులు, 8 జోన్లకు చేరింది. ఇప్పుడు గ్రేటర్ కార్పొరేష న్ మరో అడుగు ముందుకేస్తోంది. కొన్ని గ్రామీణ ప్రాంతాల విలీనంతో పాటు, 8 జోన్లను 10 జోన్లుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. పరిధి పెరగనుంది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మరింత విస్తరించనుంది. కొత్త విశాఖ జిల్లాలో కొన్ని గ్రామీణ ప్రాంతాలు జీవీఎంసీలోకి వచ్చే అవకాశముంది. విశాఖ మొత్తాన్ని జీవీఎంసీ పరిధిలోకి తీసుకురావాలని పాలకవర్గం భావిస్తోంది. దీంతో జీవీఎంసీ విస్తీర్ణం పెరుగుతుండడంతో కొత్త జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ ప్రతిపాదనను కౌన్సిల్లో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. దీనికి ప్రభుత్వం కూడా ఆమోద ముద్ర వేసినట్టు సమాచారం. 10 జోన్లకు పెంపు జీవీఎంసీ విస్తీర్ణం పెరిగితే పరిపాలన, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కష్టతరంగా మారుతుంది. ఈ సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు జోన్ల సంఖ్యను పెంచాలని పాలకవర్గం భావించింది. ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలో 8 జోన్లు ఉన్నాయి. ఒక్కో జోన్ పరిధి రెండు, మూడు నియోజకవర్గాలకు విస్తరించి ఉన్నాయి. అటువంటి పరిస్థితి లేకుండా ఉండేందుకు ఇప్పుడు ఒక్కో నియోజకవర్గం పరిధిలో ఒక జోన్ మాత్రమే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జోన్ల వికేంద్రీకరణ పూర్తి చేశారు. ఒక నియోజకవర్గంలో ఉన్న వార్డులన్నీ ఒకే జోన్ పరిధిలోకి రానున్నాయి. అలాగే ఇప్పటి జోన్లుగా పిలిచే ఈ కార్యాలయాలు ఇకపై నియోజకవర్గ పేర్లతో ఏర్పాటు కానున్నాయి. దీని ప్రకారం విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, పెందుర్తి, గాజువాక, భీమిలి, అనకాపల్లి పేర్లతో జోన్లు ఏర్పాటు కానున్నాయి. వీటితో పాటు కొత్తగా మరో రెండు జోన్లు ఏర్పాటు చేయనున్నారు. పెందుర్తిలో గ్రామీణ ప్రాంతాలు కలిస్తే పరిధి పెరుగుతుంది. దీంతో గోపాలపట్నం జోన్ కొత్తగా రానుంది. అలాగే ఆనందపురం, పద్మనాభం మండలాలు కలిస్తే ప్రస్తుతమున్న మధురవాడ జోన్ పరిధి భారీగా పెరగనుంది. దీంతో కొత్తగా భీమిలి జోన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 8 జోన్లు 10కి పెరగనున్నాయని సమాచారం. ఇప్పటికే ఈ ప్రతిపాదనలను పాలకవర్గం ప్రభుత్వానికి పంపింది. దీనిపై ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించింది. ఈ జోన్ల పెంపునకు ప్రభుత్వం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే తుది ప్రక్రియకు కసరత్తు జరగనున్నట్లు జీవీఎంసీలో చర్చ జరుగుతోంది. పరిపాలన సౌలభ్యం.. పారదర్శకతకు జీవీఎంసీ పరిపాలనలో అనూహ్య మార్పులు రానున్నాయి. పరిపాలన సౌలభ్యం, పారదర్శకతలో భాగంగా ఈ ప్రక్రియను గత కౌన్సిల్ సమావేశంలో శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు ఒక్కో జోన్ పరిధిలో 8 నుంచి 15 వార్డులు వరకు ఉన్నాయి. ఒక జోన్ పరిధిలో రెండు, మూడు నియోజకవర్గాలకు సంబంధించి ప్రాంతాలున్నాయి. దీంతో పరిపాలన సక్రమంగా ఉండడం లేదని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని మార్చాలని దీర్ఘకాలిక డిమాండ్ ఉంది. ఒక్కో నియోజకవర్గాన్ని ఒక జోన్‌గా చేయడం ద్వారా పరిపాలన సులభతరం అవుతుందని భావిస్తున్నారు. జీవీఎంసీలోకి మండలాలు.. ఉమ్మడి విశాఖ విభజన తర్వాత విశాఖ జిల్లాగా మారాక పద్మనాభం, ఆనందపురం, పెందుర్తిలో కొన్ని గ్రామాలు జీవీఎంసీకి దూరంగానే ఉన్నాయి. దీంతో ఆయా మండలాలకు జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. తాజాగా మొత్తం విశాఖ జిల్లా అంతటినీ జీవీఎంసీ పరిధిలోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబును ప్రజా ప్రతినిధులు విశాఖ పర్యటనలో కోరారు. ఎమ్మెల్యేల ప్రతిపాదనలను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ హరేందిరప్రసాద్‌ను సీఎం ఆదేశించారు. దీంతో ప్రస్తుతం మండలాలుగా ఉన్న ఆనందపురం, పద్మనాభం ప్రాంతాలను కూడా జీవీఎంసీ పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. అలాగే పెందుర్తిలో కొంత మేర జీవీఎంసీలో ఉన్నప్పటికీ మెజార్టీ విస్తీర్ణంలో ఇంకా అనేక గ్రామాలున్నాయి. వీటిని కూడా జీవీఎంసీ పరిధిలోకి తీసుకురానున్నారు. దీంతో జీవీఎంసీ విస్తీర్ణం భారీగా పెరగనుంది. -
ఉచిత విద్య, వైద్యం హామీలకే పరిమితమా..!
అనకాపల్లి: కూటమి ప్రభుత్వం మెడికల్ విద్యను పేద ప్రజలకు దూరం చేయాలనే ఉద్దేశ్యంతో పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే విద్యార్థులతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజాన దొరబాబు అన్నారు. స్థానిక నెహ్రూచౌక్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారీ తనంగా ఉండాల్సిన పాలకులు విద్య ,వైద్యం ఉచిత విద్య అనే హామీలు కేవలం కాగితాలకే పరిమితం చేస్తున్నారని, ప్రభుత్వం ఆధీనంలో ఉండాల్సిన విద్య, వైద్యా రంగాలను ప్రైవేటుపరం చేసి కార్పొరేట్ దోపిడీ వర్గాలకు అప్పగించే విధంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. రాష్ట్రంలో అందరికీ వైద్య విద్యను అభ్యసించడానికి అవకాశం కల్పించడానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్‌ను గత ప్రభుత్వం కోరిక మేరకు మన రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగ సంస్థలో నడపడానికి నిధులు విడుదల చేయడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఆరు మెడికల్ కళాశాలలు ప్రారంభించగా, మిగిలిన మెడికల్ కళాశాలలను అభివృద్ధి చేయకుండా మొత్తం 17 మెడికల్ కళాశాలలు కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు ఇస్తూ జీవో నంబర్590ని జారీ చేయడం అన్యాయమన్నారు. మెడికల్ కళాశాలలో జీవో నెంబర్ 107, 108 అమలు పరుస్తూ ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజించి ఏ క్యాటగిరి కన్వీనర్ కోటా కింద, బి కేటగిరిలో ఏడాదికి రూ.12 లక్షలు, సీ క్యాటగిరిలో ఏడాదికి రూ.20 లక్షలుగా నిర్ణయించినట్టు తెలిపారు. కూటమి అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే ఈ జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తాని ఇచ్చిన హామీ ఇచ్చి ఏంచేశారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సభ్యుడు దేవుడు బాబు, బి.బాబ్జి , సత్తిబాబు, ఆర్.శంకరరావు, సత్యనారాయణ, పోతురాజు పాల్గొన్నారు. -
నేత్రపర్వంగా వెంకన్న ధ్వజారోహణం
నక్కపల్లి: ఉపమాక శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజైన బుధవారం ధ్వజారోహణం కార్యక్రమం వైభవంగా జరిగింది. గరుదాద్రిపై మూలవిరాట్‌కు నిత్యపూజలు, అర్చనలు నిర్వహించిన అనంతరం భూదేవి, శ్రీదేవి సమేత శ్రీకల్కి వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులను, సుదర్శన పెరుమాళ్లను (చక్రత్తాళ్వార్) పెద్ద పల్లకిలో ఉంచి భేరీ పూజ నిర్వహించారు. ఆలయంలో అష్టదిక్పాలకులకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ గ్రామ తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయంలో ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించారు. ధ్వజస్తంభం వద్ద ధ్వజపటాన్ని ఎగుర వేసి స్వామివారి బ్రహోత్సవాలకు భక్తజనంతోపాటు, అష్ట దిక్పాలకులు కూడా ఆహ్వానితులేనంటూ ఈ కార్యక్రమం చేయడం జరిగిందని ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు తెలిపారు. గరుడ పొంగలి నివేదన చేసి భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టారు. సాయంత్రం సుదర్శన పెరుమాళ్లను పల్లకిలో అధిష్టింపజేసి గ్రామ బలిహరణలు పూర్తి చేశారు. రాత్రి శేషతల్ప వాహనంపై స్వామివారి తిరువీధి సేవ నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో గోదాదేవి అమ్మవారికి ప్రతిరోజు సాయంత్రం లక్ష్మీ సహస్ర కుంకుమార్చన జరుగుతుందని అర్చకులు తెలిపారు. అష్టదిక్పాలకులకు బ్రహ్మోత్సవ ఆహ్వానం -
మాజీ సైనికుల కోసం పెన్షన్ పోర్టల్ ప్రారంభం
అనకాపల్లి: కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాలో మాజీ సైనికులకు పెన్షన్ పోర్టల్ స్పర్శ్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు జిల్లా సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అగ్గాల హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త జిల్లాలో మాజీ సైనికులు సుమారు 7,100 మంది ఉన్నారని, ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు జిల్లా సోల్జర్స్ బోర్డు ఉండేదని, కొత్త జిల్లాలో తాత్కాలికంగా స్పర్శ్ సెంటర్‌ని ఏర్పాటు చేశారని చెప్పారు. మాజీ సైనికుల కోసం కేంద్ర ప్రభుత్వం స్పర్శ్ అనే ఒక పెన్షన్ వ్యవస్థని 2021లో తీసుకొచ్చిందని, ఈ డిజిటల్ ప్లాట్ఫారం ఉపయుక్తంగా ఉంటుందన్నారు. జిల్లా సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాన్ని నెహ్రూచౌక్ వద్ద ఏర్పాటు చేశామని, మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 9573043507ను సంప్రదించాలని ఆయన కోరారు. -
నెల రోజుల్లో ఆక్వా రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి
దేవరాపల్లి: ఆక్వా రైతులంతా నెల రోజుల్లోగా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకొని లైసెన్స్‌లు తీసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి జి. విజయ సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఆక్వా రైతులతో సమావేశం నిర్వహించారు. దేవరాపల్లి మండలంలో 72 చెరువులు ఉన్నాయని, సదరు రైతులంతా రిజిస్ట్రేషన్ చేయించుకొని, లైసెన్స్ పొందాలని సూచించారు. ప్రతి ఆక్వా రైతు పట్టాదారు పాసు పుస్తకం, వన్‌బీ, ఆధార్, నో అబ్జెక్షన్ ధ్రువపత్రం, పంచాయతీ తీర్మానం పత్రాలను సమర్పించాలన్నారు. చేపలకు మేతగా పౌల్ట్రీ వ్యర్థాలు, నిషేధిత ఆహార పదార్థాలు వాడితే చట్ట ప్రకారం కఠిన చర్యలతో పాటు రూ. 2 లక్షల వరకు జరిమానా విధిస్తామని ఆమె హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 1862 చెరువులు ఉన్నాయని, వీటిలో 1443 చెరువులకు అనుమతులు ఉన్నాయన్నారు. ముఖ్యంగా వెనామి రొయ్యలు, పంగసియాస్, రాంగడి, బొచ్చు చేపలను పెంచితే స్థానిక మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందన్నారు. మండల వ్యవసాయ అధికారి కాంతమ్మ, మాడుగుల మత్స్యశాఖ అభివృద్ధి అధికారి నాగమణి, మత్స్యశాఖ అధికారులు ఎ.రమణ, రజాక్ పాల్గొన్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారి విజయ సూచన -
వి–జ్యూయలరీ మార్ట్ రెండో షోరూమ్ ప్రారంభం
బీచ్‌రోడ్డు: ఆశీలమెట్ట సంపత్ వినాయగర్ ఆలయ సమీపంలో వి–జ్యూయలరీ మార్ట్ రెండో షోరూమ్‌ను శ్రీకన్య ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మేనేజింగ్ డైరెక్టర్ కె.ఎన్.వి.ఎస్.గురుమూర్తి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వి–జ్యూయలరీ మార్ట్ భాగస్వాములు కోలా బాబురావు, కాకి గంగరాజు, పట్నాల శ్రీనివాసరావు, వూన వినీత్ మాట్లాడుతూ విమార్ట్ ప్రారంభోత్సవ ఆఫర్‌గా అన్ని రకాల 22 క్యారెట్ బంగారు ఆభరణాలను గ్రాము రూ.9,987 చొప్పున తరుగు 6.96 శాతం నుంచి పొందవచ్చన్నారు. అలాగే సాధారణ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదని, జీఎస్టీని కస్టమర్ తరుపున తామే చెల్లిస్తామన్నారు. కేజీ వెండి వస్తువుల కొనుగోలుపై రూ.15,000 వరకు తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుందన్నారు. -
బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం
నక్కపల్లి: ఉపమాక వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పాంచరాత్ర ఆగమశాస్త్రా నుసారం ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాలకు మంగళవారం రాత్రి అంకురార్పణ జరిగింది. ఉదయం ఉత్సవ కావిడిని మాడవీధుల్లో ఊరేగించడంతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమయినట్లేనని ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ తెలిపారు. భక్తులు స్వామివారికి పసుపు కొమ్ములు, కుంకుమ, కొబ్బరి బొండాలు కానుకలుగా సమర్పించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులకు, సుదర్శన పెరుమాళ్లకు ఆలయ అర్చకులు గొట్టుముక్కల వరప్రసాద్, సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, భాగవతం గోపాలాచార్యులు, పీసపాటి శేషాచార్యులు ఆధ్వర్యంలో స్వప్న తిరుమంజన కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలు అలంకరించారు. క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామికి, ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం సుదర్శన పెరుమాళ్లను పల్లకిలో ఉంచి గ్రామంలో ఉత్తర ఈశాన్య దిక్కున ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి మత్స్యంగ్రహణం (పుట్టమన్ను తెచ్చే కార్యక్రమం) నిర్వహించారు. తాత్కాలిక యాగశాల వద్ద అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన చతుస్థాన అర్చనలు పూర్తి చేసి గరుడ అవాహన, గరుడ అప్పాల నివేదన కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో అక్టోబరు 2 వరకు జరుగుతాయి. ఉత్సవాల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. ధ్వజస్తంభం, బేడామండపం, వేణుగోపాలస్వామి సన్నిధిలో రంగురంగుల పెంటార్లు, లైటింగ్ ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాల్లో కల్కి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం వల్ల ఎన్నో విశేష ఫలితాలు వస్తాయని ప్రధాన అర్చకులు గొట్టుముక్కల ప్రసాదాచార్యులు తెలిపారు. సాక్షాత్తూ బ్రహ్మదేవుడే స్వామివారికి ఉత్సవాలు నిర్వహిస్తున్నందున బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారన్నారు. ఈ సమయంలో స్వామిని దర్శించుకోవడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోయి ఈతిబాధల నుంచి విముక్తి కలుగుతుందన్నారు. అంకురార్పణతో ప్రారంభం -
యర్రయ్య గల్లంతుపై త్రిసభ్య కమిటీ విచారణ
అచ్యుతాపురం రూరల్: పూడిమడక గ్రామానికి చెందిన చోడిపల్లి యర్రయ్య గల్లంతుపై మంగళవారం త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. ఈ ఏడాది జులై 2న యర్రయ్య(26) చేపల వేటకు వెళ్లి భారీ చేపకు చిక్కి బలైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంగళవారం తహసీల్దార్ జి.సత్యనారాయణ, సీఐ నమ్మి గణేష్, ఫిషరీస్ ఏడీ విజయ సచివాలయంలో హాజరై గ్రామ పెద్దలతో సమావేశమయ్యారు. గల్లంతైన యర్రయ్య మృతి చెందాడని నిర్ధారణ అవడంతో కుటుంబీకులు డెత్ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసినట్లు పంచాయతీ కార్యదర్శి సరస్వతి తెలిపారు. డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, ఇతర ధ్రువపత్రాల ఆధారంగా మృతుని కుటుంబానికి పరిహారం అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విచారణలో వీఆర్వో అప్పలరాజు, యర్రయ్య తల్లి మాయావతి, గ్రామ పెద్దలు మేరుగు ప్రవీణ్ కుమార్, వాసుపల్లి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి రవాణా అడ్డుకట్టకు ఉమ్మడి వ్యూహం
సాక్షి, విశాఖపట్నం: ప్రాంతీయ భద్రత, శాంతిభద్రతలను పెంపొందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా పోలీసుల మధ్య జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంతర్–రాష్ట్ర సమన్వయ సమావేశం జరిగింది. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సీనియర్ పోలీసు అధికారులు సరిహద్దు సమస్యలు, ముఖ్యంగా గంజాయి అక్రమ రవాణాపై చర్చించారు. గత కొన్నేళ్లుగా గంజాయి సాగు గణనీయంగా తగ్గిందని, 2021–22లో 7,515 ఎకరాల నుంచి 2024–25లో 93 ఎకరాలకు తగ్గిందని విశాఖ రేంజ్ పోలీసులు తెలిపారు. గంజాయి సాగు చేసే రైతులకు ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించడానికి చేపట్టిన చర్యలను వివరించారు. ఈ ఏడాది గంజాయి అక్రమ రవాణాలో 377 కేసులు నమోదు చేసి, 22,207 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇరు రాష్ట్రాల మధ్య నిరంతర సహకారం, సమాచార మార్పిడిని కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో కోరాపుట్ సౌత్ వెస్టర్న్ రేంజ్ డీఐజీ కన్వర్ విశాల్ సింగ్, రాయగడ ఎస్పీ ఎం. స్వాతి ఎస్ కుమార్, కోరాపుట్ ఎస్పీ రోహిత్ వర్మ, మల్కాన్‌గిరి ఎస్పీ హెచ్. వినోద్ పాటిల్, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి పాల్గొన్నారు. అంతర్ రాష్ట్ర సమన్వయ సమావేశంలో డీఐజీ గోపీనాథ్ జట్టి -
చిరు వ్యాపారుల ప్రతిఘటన
జీవీఎంసీ జేసీబీకీ అడ్డంగా కూర్చొని నిరసనఅనకాపల్లి: జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలో రహదారులు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన చిరు వ్యాపారుల బడ్డీలను జోనల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఐదు రోజులుగా తొలగిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం స్థానిక ఎన్టీఆర్ క్రీడా మైదానం రహదారిలో బడ్డీలను తొలగిస్తుండగా, అక్కడ చిరు వ్యాపారులు ప్రతిఘటించారు. జేసీబీకి అడ్డంగా కూర్చోని వాటిని తొలగించవద్దని నినాదాలు చేశారు. సుమారుగా 30 సంవత్సరాలుపైగా ఇక్కడే జీవిస్తున్నామని, ఉన్నపళంగా బడ్డీలను తొలగించడం అన్యాయమని వాపోయారు. మరో ప్రాంతంలో వ్యాపారాలు చేసుకునేందుకు స్థలం చూపించాలని నిరసన వ్యక్తం చేశారు. వ్యాపారులకు ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు కోన లక్ష్మణ్, తదితరులు మద్దతు పలికారు. -
అగ్రి సెట్ ఫలితాల్లో ర్యాంకుల పంట
స్టేట్ ప్రథమ ర్యాంకు సాధించిన రాజేష్ నర్సీపట్నం: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2025వ సంవత్సరానికి సంబంధించి అగ్రి సెట్ ఫలితాలను విడుదల చేసింది. ఇందులో బి.ఆర్.పాలిటెక్నిక్ వ్యవసాయ కళాశాల విద్యార్థి ఎస్.రాజేష్ విత్తన సాంకేతిక టెక్నాలజీ విభాగంలో 105 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. బి.బిందుశ్రీ 7వ ర్యాంక్, వీలమ్శ్రావణి 8వ ర్యాంకు, జి.సాయికుమార్ 15, జి.నాగలక్ష్మి 18వ ర్యాంకు సాధించారు. వ్యవసాయ డిప్లొమా విభాగంలో ఇ.భానుప్రకాష్ 105వ ర్యాంకు, ఎస్.రాజేష్ హర్షవర్ధన్ 109, బి.ఝాన్సీదేవి 131, ఎస్.యోగేంద్రనాయుడు 133, జి.వెంకట నవీన్ 140వ ర్యాంకు సాధించారు. -
జల దిగ్బంధం
చోడవరం: భారీ వర్షానికి చోడవరంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఆదిదేవుడైన వినాయకుడికి కూడా నీట ముంపు తప్పలేదు. మంగళవారం మధ్యాహ్నం చోడవరం పరిసరాల్లో భారీ వర్షం కురిసింది. సుమారు 2 గంటల పాటు కుండపోతగా వర్షం కురవడంతో పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. పలు చోట్ల స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పంట పొలాలు ముంపు బారిన పడ్డాయి. చోడవరం స్వయంభూ విఘ్నేశ్వరస్వామి గర్భాలయం కూడా నీట మునిగింది. స్వామివారి ప్రధానాలయం ఏనుగుబోదు చెరువు గర్భంలో ఉండడంతో భారీ వర్షాలకు చెరువు నిండిపోయింది. దీంతో స్వామివారి గర్భాలయంలో చెరువు ఊటనీరు బయటకు రావడంతో ఆలయంలో స్వామివారి మూలవిరాట్ విగ్రహం మునిగిపోయింది. గర్భాలయంలోకి ఊరుతున్న నీటిని బయటకు పంపించేందుకు మోటార్ల సాయంతో చర్యలు చేపట్టారు. పట్టణంలో బానీకోనేరు, పూర్ణా థియేటర్, రెల్లివీధి, బాలాజీనగర్, న్యూశాంతినగర్ కాలనీలు నీట మునిగాయి. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిస్థాయిలో లేకపోవడంతో వర్షం నీరు రోడ్లపై నిలిచిపోయింది. కాలువల్లో స్కిల్టు తీయకపోవడంతో రోడ్లపై నీరు కాల్వల ద్వారా బయటకు వెళ్లే దారిలేకుండా పోయింది. పూర్ణాథియేటర్, రెల్లి వీధిలో ఇళ్లన్నీ నీట మునిగాయి. రోడ్లపై ఎక్కడిక్కడ నీరు నిలిచిపోవడంతో చోడవరం–అనకాపల్లి, చోడవరం–నర్సీపట్నం ప్రధాన రహదారులపై పెద్దపెద్ద గోతులు పడి వాహనచోదకులకు ప్రాణాంతకంగా మారాయి. చోడవరం–చీడికాడ రోడ్డుపై వర్షపు నీరు ప్రవహించింది. ముంపు ప్రాంతాల ప్రజలను తహసీల్దార్ రామారావు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశాయి. -
వ్యాన్ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి
ఎస్.రాయవరం: మండలంలో జాతీయ రహదారిపై గెడ్డపాలెం జంక్షన్ సమీపంలో మంగళవారం ఓ వ్యాన్ వెనక నుంచి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ విభీషణరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.రాయవరం గ్రామానికి చెందిన సోమిరెడ్డి నాగేశ్వరరావు(48) బైకుపై వెళ్తుండగా విశాఖపట్నం వైపు వెళ్తున్న వ్యాన్ వెనక నుంచి ఢీకొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు హుటాహుటిన ఆయనను నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగా నాగేశ్వరరావు మృతి చెందారు. నాగేశ్వరరావును ఢీకొట్టిన వ్యాన్ రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
తాండవ కాలువలో జారిపడి యువకుడి మృతి
నాతవరం: తాండవ కాలువలో ప్రమాదశావత్తు జారి పడి ఓ యువకుడు మృతి చెందాడు. నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నాతవరం గ్రామానికి చెందిన దుండు తేజ(31) సోమవారం సాయంత్రం ఇండియన్ గ్యాస్ ఆఫీసు ఎదురుగా ప్రవహిస్తున్న తాండవ కాలువలోకి స్నానం చేసేందుకు వెళ్లాడు. వర్షానికి బురదమయమైన కాలువ గట్టుపై నుంచి ఆయన జారిపోయాడు. కాలువలో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. ఆ సమయంలో ఎవరూ చూడలేదు. తేజ రాత్రికి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు స్నేహితులు, బంధువులను వాకబు చేశారు. నాతవరం, గాంధీనగరం గ్రామాల మధ్య కాలువలో మృతదేహం కొట్టుకువస్తూ కర్రి రాజుబాబు పొలం వద్ద కల్వర్టులో చిక్కుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు తండ్రి రమణ ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి కల్వర్టులో వేలాడుతున్న మృతదేహాన్ని బయటకు తీశారు. అవివాహితుడైన తేజ టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చేతికి అందివచ్చిన కొడుకు మరణించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. నాతవరం ఎస్ఐ కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఆశలు గల్లంతు
బుచ్చెయ్యపేట: తమ్ముడితో కలిసి ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు నీట మునిగాడు. తీవ్రంగా గాలించినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు తల్లిడిల్లుతున్నారు. విజయరామరాజుపేట వద్ద తాచేరు నదిలో పడి ఆడారి రోహిత్ (13) గల్లంతయ్యాడు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు, గజ ఈతగాళ్లు తీవ్రంగా గాలిస్తున్నారు. గ్రామానికి చెందిన ఆడారి గోపి, సూర్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రోహిత్ 8 తరగతి, రెండో కుమారుడు రిషిత్ 6వ తరగతి చదువుతున్నారు. గోపి అచ్యుతాపురం వద్ద ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. దసరా సెలవులు కావడంతో మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసిన తరవాత గ్రామంలో ఉన్న తాచేరు వంతెన వద్దకు అన్నదమ్ములిద్దరూ వెళ్లారు. మూడు గంటల ప్రాంతంలో వర్షం వచ్చేలా ఉండటంతో కోతకు గురైన తాచేరు రోడ్డు వద్ద నుంచి ఇంటికి వస్తుండగా.. రోహిత్ కాలి చెప్పు ఒకటి ఊడిపోయి నీటిలో పడిపోయింది. దాని కోసం నీటిలోకి దిగిన ఆ బాలుడు కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న అతని తమ్ముడు రిషిత్ వెంటనే కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అప్పటికే రోహిత్ నీట మునిగాడు. స్థాకులు వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. బుచ్చెయ్యపేట ఎస్ఐ శ్రీనివాసరావు పోలీసులు, గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బందితో జోరు వానలో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరకలేదు. రోహిత్ తల్లిదండ్రుల రోదనలు చూపరులను కదిలించాయి. నిధులు మంజూరైనా ప్రారంభం కాని పనులు బీఎన్ రోడ్డులో విజయరామరాజుపేట వద్ద తాచేరు వంతెనపై ఉన్న డైవర్షన్ రోడ్డు ఆగస్టు 17వ తేదీన కోతకు గురైంది. దీంతో విశాఖపట్నం, నర్సీపట్నం, అనకాపల్లి, పాడేరు వెళ్లే ఆర్టీసీ బస్సులతో పాటు మూడు జిల్లాల ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. తాచేరు డైవర్షన్ రోడ్డు మరమ్మతు పనులకు రూ.15 లక్షలు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కె.ఎన్.ఎస్.ఎన్.రాజు సెప్టెంబర్ 6వ తేదీన శంకుస్థాపన చేశారు. 17 రోజులైనా కోతకు గురైన తాచేరు డైవర్షన్ రోడ్డు వద్ద గుప్పెడు మట్టి వేయలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థి బలైపోయాడని గ్రామస్తులతోపాటు పలు గ్రామాల ప్రయాణికులు ఆగ్రహం చెందుతున్నారు. సకాలంలో మరమ్మతు పనులు చేసి ఉంటే బాలుడి ప్రాణాలు మిగిలేవని, తక్షణం మరమ్మతు పనులు చేపట్టాలని పలువురు ప్రజలు కోరుతున్నారు. -
పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్ సిబ్బందికి వేతనాల పెంపు
అనకాపల్లి: జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)కు చెందిన నక్కపల్లి, చోడవరం పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంకుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సీనియారిటీ ప్రాతిపదికన గౌరవ వేతనాలు పెంచినట్టు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఈ మేరకు తన కార్యాలయంలో పెట్రోల్ బంకుల సిబ్బందితో ఆయన మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేతనాల పెంపుతో సిబ్బంది మరింత ఉత్సాహంతో పని చేసి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ రిజర్వ్ సీఐ బి.రామకృష్ణ, నక్కపల్లి బంక్ ఇన్చార్జ్, ఏఆర్ ఎస్ఐ వర్మ, నక్కపల్లి, చోడవరం పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్ సిబ్బంది పాల్గొన్నారు. -
‘దసరా సెలవులు ఇవ్వని విద్యా సంస్థలపై చర్యలు’
అనకాపల్లి: జిల్లాలో పలు ప్రైవేట్ విద్యా సంస్థలు దసరా సెలవులు ఇవ్వకుండా నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాబ్జి, ఫణీంద్ర ఆరోపించారు. స్థానిక కోడిగంటి గోవిందరావు భవనంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. సెలవు దినాల్లో పాఠశాలలను నడపడం వల్ల విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు. ఇప్పటికై నా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెరిచి ఉన్న పాఠశాలల వద్ద ధర్నా చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జగదీష్, జిల్లా ఉపాధ్యక్షుడు సింహాద్రి అభిషేక్, అజయ్, మణికంఠ, తదితరులు పాల్గొన్నారు. -
క్వారీ బాధితుల దీక్ష భగ్నం
నర్సీపట్నం: మాకవరపాలెం మండలం, జి.కోడూరు క్వారీ బాధితులు రెండు నెలలుగా ఆర్డీవో కార్యాలయం వద్ద చేస్తున్న రిలే నిరాహారదీక్షను మంగళవారం పోలీసులు భగ్నం చేశారు. మూడు రోజుల క్రితం బాధితుల దీక్షా శిబిరం టెంట్‌ను అధికారులు తొలగించారు. దీంతో ఆందోళనకారులు రెండు రోజులుగా గొడుగులు వేసుకుని దీక్ష కొనసాగిస్తున్నారు. టౌన్ సీఐ గోవిందరావు, ఎస్సైలు రమేష్, ఉమామహేశ్వరరావు, సిబ్బంది మంగళవారం దీక్ష వద్దకు చేరుకున్నారు. అనుమతి లేకుండా దీక్ష చేయటం సరికాదని, విరమించాలని సూచించారు. స్పష్టమైన హామీ ఇస్తేనే కానీ విరమించమని బాధితులు పేర్కొన్నారు. ఈ సమయంలో బాధితులకు మద్దతుగా నిలిచిన బీఎస్పీ నాయకులు బొట్టా నాగరాజు, కె.వి.పి.ఎస్.చిరంజీవిలకు.. పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు దీక్షలో ఉన్న వారిని బలవంతంగా లేవదీసి వ్యాన్‌లో ఎక్కించి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం విడిచిపెట్టారు. -
అర్ధ నగ్నంగా మత్స్యకారుల దీక్ష
నక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్క్‌ను రద్దు చేయాలంటూ రాజయ్యపేటలో మత్స్యకారులు చేస్తున్న నిరాహార దీక్ష పదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా మంగళవారం మత్స్యకారులు అర్ధ నగ్నంగా నిరసన తెలిపారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే బల్క్ డ్రగ్ పార్క్‌ను రద్దు చేసే వరకు పోరాటం తప్పదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని ధ్వజమెత్తారు. హోంమంత్రి అనిత వెన్నుపోటు పొడిచారని మత్స్యకార నాయకులు ఎరిపల్లి నాగేశు, పిక్కి తాతీలు, మహేష్, పిక్కి స్వామి, మైలపల్లి సూరిబాబు, తదితరులు ఆరోపించారు. కూటమి నాయకులు చేసిన మోసాన్ని మత్స్యకారులంతా తగ్రహిస్తున్నారని, సమయం కోసం వేచి చూస్తున్నారన్నారు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని గ్రామాలకు రప్పిస్తున్నామని, అందరూ వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. ఈ ఆందోళనలో బాబ్జి, కాశీరావు, మాధవరావు, తదితరులు పాల్గొన్నారు. -
15 నెలల కూటమి పాలనలో మహిళలకు అసంతృప్తి
వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి అనకాపల్లి: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిందని, కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలల్లో మహిళల హామీలు నెరవేర్చకపోవడంతో అసంతృప్తితో ఉన్నారని ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి విమర్శించారు. మంగళవారం స్థానిక రింగ్‌రోడ్డులోని అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాత ఆధ్వర్యంలో మహానేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి శోభా హైమావతి, పార్టీ జోన్–1 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జిల్లా కార్యవర్గ సమావేశంలో హైమావతి మాట్లాడుతూ కూటమి పాలనలో సూపర్ సిక్స్ పథకాలు అమలుగాక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యంగా 18 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు నెలకు రూ.1500 ఇవ్వకపోవడం మోసం చేయడమేనన్నారు. 2029 ఎన్నికల్లో మరోసారి సీఎంగా వైఎస్.జగన్మోహన్రెడ్డిని గెలిపించుకుని మరిన్ని సంక్షేమ పథకాలు అందుకోవాలని వెయ్యి నేత్రాలతో ఎదురు చూస్తున్నట్లు ఆమె జోష్యం చెప్పారు. గత పాలనలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో 50 శాతం కల్పించడం వల్ల రాష్ట్రంలో వారికి రాజ్యాధికారం వచ్చిందన్నారు. వైఎస్సార్సీపీ జోన్–1 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచి అన్ని విభాగాల్లో మహిళా కమిటీలను భర్తీ చేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించేవారని, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుని మోసపోయామని ప్రజలు తెలుసుకున్నారన్నారు. పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత మాట్లాడుతూ కూటమి పాలనలో మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయన్నారు. ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు పక్షాన వైఎస్సార్సీపీ ఎప్పుడు పోరాటాలు చేస్తుందన్నారు. అనంతరం ఈర్లె అనురాధకు లోచల సుజాత శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎ.వి.రత్నకుమారి, జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాళ్లు మర్రిపల్లి శోభ, సీలం నదియా, జిల్లాలో వివిధ నియోజకవర్గ, మండల మహిళా విభాగం అధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లా మహిళా కమిటీ సభ్యులు తేగాడ లక్ష్మి, బేతిరెడ్డి రత్నం, మాకిరెడ్డి విజయలక్ష్మి, ధనలక్ష్మి, కామిరెడ్డి లక్ష్మి పాల్గొన్నారు. -
గొడుగులతో క్వారీ బాధితుల నిరసన
నర్సీపట్నం: మాకవరపాలెం మండలం జి.కోడూరు క్వారీ బాఽధితులు మండుటెండలో గొడు గులు వేసుకుని ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. బీఎస్పీ నాయకుడు బి.నాగరాజు, సీపీఎం నాయకుడు అడిగర్ల రాజు మాట్లాడుతూ క్వారీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు 60 రోజులుగా నిరాహారదీక్షలు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోగా, దీక్షా శిబిరం టెంట్‌ను తొలగించటం అన్యాయమన్నా రు. అధికారులు ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. అధికారులకు దళితుల ఆవేదన కానరాలేదన్నారు. అధికారుల తప్పిదం ఉండటం వల్ల దొంగచాటుగా టెంట్ తొలగించారని మండిపడ్డారు. అధికారులు ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినా ఉద్యమం ఆగదన్నారు. -
భారీ గణపతికి ఘనంగా వీడ్కోలు
అనకాపల్లి టౌన్: పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సంపంత్ వినాయక కమిటీ ఏర్పాటు చేసిన 126 అడుగుల వినాయక విగ్రహం అనుపు కార్యక్రమం సోమవారం రాత్రి ఘనంగా జరిగింది. నెల రోజుల పాటు పూజలందుకున్న వినాయకుడు సోమవారం ప్రత్యేక పూజలందుకున్నారు. భారీ విగ్రహం కావడంతో నిలిపినచోటే నిమజ్జనం చేశారు. ఫైర్ ఇంజిన్‌తో సుమారు గంటపాటు నీళ్లను పంపింగ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణ ట్రాఫిక్ సీఐ ఎం.వెంకటనారాయణ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. గణేశుని నిమజ్జనాన్ని జనం పెద్దసంఖ్యలో ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బుద్ద భూలోక నాయుడు, బుద్ద భాను ప్రకాష్, సినీ డైరెక్టర్ ఆడారి సాయి మూర్తి, మళ్ళ రాము, మద్దాల భాను తదితరులు పాల్గొన్నారు. -
సురక్షితమైన డిజిటల్ లావాదేవీలు...
డిజిటల్ అరెస్ట్ చేస్తామంటూ భయపెట్టారు..● బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి లాగిన్ ఐడీ, పాస్వర్డ్, యూపీఐ పిన్, ఓటీపీ, ఏటీఎం, డెబిట్‌కార్డు, క్రెడిట్‌కార్డు వివరాలు ఎవరితోనూ పంచుకోకపోవడమే మంచిది. ● డిజిటల్ లావాదేవీలకు బార్కోడ్లు, క్యూఆర్ కోడ్లు స్కానింగ్ లేదా ఎంపిన్ లేకుండా ఉన్నవే ఎంచుకోవాలి. ● ఏదైనా ఫోన్‌కాల్, ఈ–మెయిల్ చేసి మీ కేవైసీ అప్డేట్ చేయాలని వివరాలు అడిగినా చెప్పరా దు. ఒకవేళ అలాంటి అనుమానాలుంటే బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవాలి. హోం బ్యాంక్ శాఖను సంప్రదించాలి. ● ఈమెయిళ్లు, ఎస్ఎంఎస్లలో యూఆర్ఎల్, డొమైన్ పేర్లను స్పెల్లింగ్ లోపాలుంటే జాగ్రత్తగా తనిఖీ చేయండి. ఆన్లైన్ బ్యాంకింగ్ కోసం అధికార వెబ్సైట్లనే ఉపయోగించాలి. ● ఏదైనా వెబ్సైట్, అప్లికేషన్లో మీ ఈమెయిల్‌ను యూజర్ ఐడీగా నమోదు చేస్తున్నప్పుడు మీ ఈ–మెయిల్ పాస్‌వర్డ్‌ను ‘పాస్వర్డ్’ అని పెట్టుకోవద్దు.సాక్షి, అనకాపల్లి: ఇలా ఒకరిద్దరు కాదు చాలామంది సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోతున్నారు. అవగాహన లేకపోవడంతో కొందరు, అవగాహన ఉండి నిర్లక్ష్యంతో మరికొందరు నష్టపోతున్నారు. పార్ట్‌టైం, ఫుల్‌టైం ఉద్యోగాలు, వర్క్ ఫ్రమ్ హోం అంటూ ఆన్లైన్లో ఫేక్ లింక్‌లు పెట్టి వాటిని క్లిక్ చేసేలా ఆశ చూపించి మోసం చేస్తారు. ఎక్కువగా ఆన్లైన్లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ యువతను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. ఫేక్ యాప్‌లు, ఫేక్ లింక్‌ల ద్వారా డేటాని తస్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలపై జిల్లా వ్యాప్తంగా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.నర్సీపట్నానికి చెందిన ఒక వృద్ధుడు సైబర్ మోసానికి గురయ్యారు. ముంబై పోలీసులమంటూ ఫోన్ చేసి.. మీ బ్యాంక్ ఖాతాలో అనాథరైజ్డ్గా రూ.2 కోట్ల వరకు నగదు బదిలీ అయిందని, తక్షణమే రిటర్న్ కొట్టకపోతే అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారు. తక్షణమే బ్యాంక్ ఖాతా వివరాలన్నీ చెప్పండి చెక్ చేస్తాం.. లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుందంటూ బెదిరించారు. వారి మాటలకు భయపడి బ్యాంక్ ఖాతా వివరాలు చెప్పడంతో రూ.కోటి 43 లక్షల వరకు తస్కరించారు. దీంతో ఆ వృద్ధుడు అప్రమత్తమై సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే సైబర్ నేరగాళ్ల బ్యాంక్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు. నిందితులను అరెస్ట్ చేసి, బాధితుడు పోగొట్టుకున్న నగదును రికవరీ చేశారు. -
బ్రహ్మోత్సవాలకు వేళాయె..
ఉపమాకలో నేడు అంకురార్పణ ● భారీ ఏర్పాట్లు చేస్తున్న టీటీడీస్వామివారి ఉత్సవమూర్తులుబేడా మండపం చుట్టూ భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన పందిళ్లు నక్కపల్లి: ఉపమాక వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఉపమాకలో గరుడాద్రిపై కల్కి అవతారంలో స్వయం వ్యక్తమై వెలసిన స్వామివారికి తిరుపతిలో మాదిరిగానే ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నెల 23 నుంచి అక్టోబర్ 2 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో తిరుమల వెళ్లలేని వారు ఉపమాక వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. 23న ఉదయం స్వామివారి ఉత్సవ కావిడను ఉపమాక పురవీధుల్లో ఊరేగిస్తారు. ఈ సమయంలో భక్తులు పసుపు కుంకుమలు, కొబ్బరి బొండాలు సమర్పించుకుంటారు. స్వామివారి ఉత్సవాలకు ఆహ్వానంగా ఈ ఉత్సవ కావిడను ఊరేగిస్తామని ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. విష్వక్సేనులవారిని పల్లకిలో ఉంచి మత్స్యంగ్రహణం, పుట్టమన్ను తెచ్చే కార్యక్రమం నిర్వహిస్తారు. రాత్రి అశ్వవాహనంపై స్వామివారి తిరువీధి సేవ జరుగుతుంది. రోజుకో వాహనంపై తీరువీధి సేవ బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని రోజుకో వాహనంలో ఊరేగిస్తారు. 24వ తేదీ బుధవారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. రాత్రికి శేషతల్ప వాహనంపై స్వామివారి తిరువీధి సేవ నిర్వహిస్తారు. 25న హంసవాహనంపై, 26న ఇత్తడి సప్పర వాహనంపై, రాత్రి పెద్దపల్లకిలో, 27న ఆంజనేయ, లక్క గరుడ వాహనాలపై, 28న సప్పర, రాజాధిరాజ వాహనాలపై తిరువీధి సేవ నిర్వహిస్తారు. 29న వసంతోత్సవం జరుగుతుంది. 30న పుణ్యకోటి వాహనంపై తిరువీధి సేవలు నిర్వహిస్తారు. అక్టోబరు 1న మృగవేట కార్యక్రమం జరుగుతుంది, సాయంత్రం గజవాహనంలో స్వామివారి ఉత్సవమూర్తులను ఉంచి బంధుర సరస్సు వద్దకు తీసుకువస్తారు. ఉత్సవమూర్తులకు ధనుర్బాణాలకు పూజలు చేసిన తర్వాత గజవాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. అక్టోబర్ 2న విజయదశమిని పురస్కరించుకుని ఆలయంలో నిత్యసేవాకాలం, హోమాలు నిర్వహిస్తారు. ఉదయం వినోదోత్సవం, సాయంత్రం శమీపూజ జరుగుతుంది. చివరిగా ఆస్థాన మండపంలో ఉత్సవమూర్తులను ఉంచి విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, నాళాయిర సేవాకాలం, ద్వాదశ తిరువారాధన, నిత్యసేవాకాలం, ప్రసాద నివేదనలు మంత్రపుష్పాలు, తీర్థగోష్టి నిర్వహిస్తారు. పవళింపు సేవతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. -
చోరీ కేసుల్లో అయిదుగురి అరెస్టు
మునగపాక: మండలంలోని రెండు చోరీలకు పాల్పడిన అయిదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ ప్రసాదరావు సోమవారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మండలంలో మూడు రోజుల క్రితం నాగులాపల్లిలో చల్లా వెంకయ్యకు చెందిన ట్రాక్టర్ రిమ్ములు, బెల్ హౌసింగ్‌తోపాటు చిన్న యోక్, ఆటోను నలుగురు వ్యక్తులు ఎత్తుకుపోయారు. దీంతో వెంకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మునగపాకలో వ్యవసాయ పొలాల వద్ద క్రషర్ల పనిముట్లు, పాత కత్తులు, గునపాలు, రాడ్స్, నిప్పల్ స్టిక్స్, 295 కిలోల ఇనుము చోరీకి గురయ్యాయంటూ రైతు పెంటకోట రామ నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆయా కేసుల విచారణలో భాగంగా అయిదుగురిని అరెస్టు రిమాండ్‌కు తరలించారు. -
జారిపడిన తూము షట్టర్
దేవరాపల్లి: రైవాడ జలాశయం ఎడమ కాలువ ప్రధాన తూము షట్టర్ల మరమ్మతులు చేస్తుండగా సోమవారం ఒక ఇనుప షట్టర్ కిందికి జారి పడిపోయింది. దీంతో ఈ కాలువ ద్వారా ఆయకట్టుకు సాగునీటితో పాటు జీవీఎంసీ ప్రజలకు తాగునీటి సరఫరాకు తాత్కాలికంగా ఆటంకం ఏర్పడింది. ఈ షట్టర్‌ను ఇంటెక్ చాంబర్ లోపల నుంచి ఇనుప గొలుసుల సహకారంతో బయటకు తీస్తుండగా ఒక్కసారిగా పెద్ద శభ్దంతో నీటిలో పడిపోయింది. ఈ షట్టర్ ఎడమ చాంబర్ మదుంకు అడ్డంగా ఉండిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న జలాశయం డీఈఈ జి. సత్యంనాయుడు అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని అప్రమత్తం చేశారు. రెండు షట్టర్లలో ఒక షట్టర్ మరమ్మతులు పూర్తయిన తర్వాత రెండవ షట్టర్ మరమ్మతులు చేపట్టనున్నారు. మదుంకు అడ్డంగా ఉండిపోయిన షట్టర్‌ను తీయించి తాగు, సాగు నీటి సరఫరాకు ఆటంకం లేకుండా చేస్తామని డీఈఈ సత్యంనాయుడు స్పష్టం చేశారు. -
ఆన్లైన్ ఉద్యోగం పేరుతో మోసం...
● ఖాతాల నుంచి క్షణాల్లో మాయమవుతున్న డబ్బులు ● జిల్లాలో ఏడాది కాలంలో 94 సైబర్ కేసులు నమోదు ● ఇప్పటివరకు రూ. 94 లక్షలు ఫ్రీజ్ ● అచ్యుతాపురం కేంద్రంగా నకిలీ కాల్ సెంటర్ ● డిజిటల్ అరెస్ట్ చేస్తామని భయపెట్టి కోట్లలో దోపిడీ ● అప్రమత్తతే ఆయుధమంటున్న పోలీసులు అనకాపల్లిలో గవరపాలేనికి చెందిన మణికంఠ అమెజాన్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాడు. ఈ ఏడాది జనవరి 31న వాట్సాప్‌లో కంపెనీ పేరుతో ఒక లింక్ వచ్చింది. ఇది పార్ట్‌టైమ్ ఉద్యోగమని.. ఇంటిలో కూర్చునే డబ్బు సంపాదించుకోవచ్చని చెప్పడంతో రిజిస్ట్రేషన్ కోసం రూ.1,000లు ఫోన్‌పే చేశాడు. కొద్ది రోజుల్లోనే మణికంఠ ఖాతాలో రూ.1,400 జమ అయ్యాయి. దీంతో పార్ట్‌టైమ్ ఉద్యోగం బావుందని నమ్మిన ఆ యువకుడు నిర్వాహకులు చెప్పిన విధంగా దపదఫాలుగా రూ.1.80 లక్షలు పంపించాడు. తర్వాత అటునుంచి ఒక్క రూపాయీ రాలేదు. దీంతో మోసపోయానని గమనించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి మణికంఠ ఖాతా నుంచి వెళ్లిన డబ్బులో రూ.1.20 లక్షలు ఫ్రీజ్ చేశారు. -
శరన్నవరాత్రులు ప్రారంభం
నూకాంబిక అమ్మవారి ఆలయంలో కలశ పూజ చేస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్అనకాపల్లి: గవరపాలెం నూకాంబిక అమ్మవారి కొలువులో శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కలెక్టర్ విజయ కృష్ణన్ ఉత్సవాలను ప్రారంభించి, ప్రత్యేక పూజలు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్షా సంకల్పం, రక్షా సూత్రధారణ, అఖండ దీపస్థాపనం, నవదుర్గా పీఠ స్థాపన, కలశ స్థాపన, అగ్నిప్రతిష్ట, హోమాలు, పతాక ప్రతిష్ట, నీరాజన మంత్ర పుష్పాలు, కలశ స్థాపన వంటి అనేక కార్యక్రమంలు నిర్వహించారు. మొదటి రోజు మధ్యాహ్నం అమ్మవారి ఆలయం వద్ద దాడి ఆదిశివ నూకరాజు, కాండ్రేగుల యోగవినోద్ కుమార్ ఆర్థిక సహాయంతో వెయ్యి మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. దేవదాయశాఖ సహాయ కమిషనర్ కె.ఎల్.సుధారాణి, ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ పీలా నాగశ్రీను, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
పాయకరావుపేట: మండలంలో సత్యవరం గ్రామానికి చెందిన ముయ్య రాజేష్ (25) గడ్డిమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా, సోమవారం కాకినాడలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సీఐ జి.అప్పన్న వివరాల ప్రకారం... ఎనిమిది నెలలు క్రితం మృతుడు రాజేష్ తన భార్యతో కుటుంబ ఖర్చుల విషయమై తగాదాపడ్డాడు. అప్పట్లో ఆమె ప్రత్తిపాడులో తన పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడ పోలీసు స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ప్రత్తిపాడు ఎస్ఐ అక్కడకు రాజేష్‌ను అతడి తల్లిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ నెల 5న భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దాంతో ఈ నెల 9న తన భార్యను సత్యవరం తీసుకెళ్లేందుకు రాజేష్ అంగీకరించాడు. ఇంతలో ఈ నెల 6న అతడు మనస్తాపంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తొలుత తుని ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాకినాడలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 5 గంటలకు మృతి చెందాడు. మృతుడు రాజేష్ తల్లి నాగమణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
లింగ నిర్ధారణకు పాల్పడితే క్రిమినల్ కేసులు
తుమ్మపాల: గర్భస్థ పిండ పరిస్థితి, వ్యాధుల గుర్తింపు వంటి పరీక్షలకు వినియోగించే యంత్రాలను లింగ నిర్ధారణకు ఉపయోగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్.హైమావతి హెచ్చరించారు. మాతా శిశు మరణాలు, పీసీపీఎన్డీటీ జిల్లా కమిటీ సమావేశం సోమవారం జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన చట్టాన్ని పక్కాగా అమలు చేస్తామన్నారు. అధికారులకు స్కానింగ్ సెంటర్లను విధిగా తనిఖీలు చేయాలన్నారు. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 31వ తేదీ వరకు జరిగిన మాతా శిశు మరణాలు, ఏడాది నుంచి ఐదేళ్లలోపు పిల్లల మరణాలపై సమీక్షించామన్నారు. కార్యక్రమంలో జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ శ్రీనివాస్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణారావు, కమిటీ సభ్యులు, ప్రైవేట్ వైద్యులు పాల్గొన్నారు. డీఎంహెచ్‌వో హైమావతి -
అర్జీలను నిర్లక్ష్యం చేయొద్దు
తుమ్మపాల: అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఆమెతోపాటు జేసీ ఎం. జాహ్నవి, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో వచ్చిన అర్జీలను అధికారులు వ్యక్తిగతంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల అర్జీల గురించి వెంటనే సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి సత్వరమె చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీల స్థితిగతులపై అర్జీదారులు టోల్ ఫ్రీ నంబరు 1100 కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ఈ వారం మొత్తం 241 అర్జీలు నమోదు కాగా, వాటిలో అత్యధికంగా 117 రెవెన్యూ శాఖకు సంబంధించి వివిధ రకాల భూసమస్యలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సాగు భూములకు పట్టాలిచ్చి ఆదుకోవాలి... పూర్వకాలం నుంచి సాగులో ఉంటున్న తమ భూములకు పట్టాలిచ్చి ఆదుకోవాలని కోరుతూ మాడుగుల మండలం చింతలూరు, గదబూరు గ్రామాల రైతులు కలెక్టర్‌ను వేడుకున్నారు. బీడు భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్న తమకు పంట నష్టం జరిగితే అధికారులు ఎటువంటి ప్రతిఫలం అందించలేకపోతున్నారని వాపోయారు. భూములకు సర్వే చేపట్టి సాగు ఆధారంగా తమ పేర్లతో పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని, ఆన్లైన్లో నమోదు చేయడం ద్వారా సంక్షేమ పథకాలు పొందగలమని కోరారు. అన్నదాత సుఖీభవ, ఈ –పంట, విత్తనాలు, ఎరువులు, తదితర పథకాలు అందడం లేదని వాపోయారు. 50 మందికి పైగా రైతులు అర్జీలు సమర్పించి తమ గోడును పీజీఆర్ఎస్లో వినిపించుకున్నారు. ఎలక్ట్రికల్ వాహనం మంజూరు చేయండి అంగవైకల్యంతో నడవలేని స్థితిలో ఉన్న తనకు ఎలక్ట్రికల్ ద్విచక్రవాహనం మంజూరు చేసి ఆదుకోవాలంటూ చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన దివ్యాంగుడు మువ్వల శ్రీను కలెక్టర్‌కు మొరపెట్టుకున్నాడు. చేతికర్ర, మూడు చక్రాల సైకిల్ బండితో తిరుగుతున్నప్పటికి తీవ్ర శ్రమ పడాల్సి వస్తుందని, కలెక్టరమ్మ స్పందించి ఎలక్ట్రికల్ బండి అందించాలని కోరాడు. ఎస్పీ కార్యాలయానికి 31 అర్జీలు అర్జీదారులతో మాట్లాడుతున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి: ఎస్పీ కార్యాలయానికి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి 31 అర్జీదారులు వచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను సావధానంగా తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ భూ తగాదాలు – 16, కుటుంబ కలహాలు – 03, మోసాలకు సంబంధించినవి – 03, ఇతర విభాగాలకు చెందినవి – 09 అర్జీలు స్వీకరించినట్లు ఆయన చెప్పారు. చట్టపరిధిలో సమస్యలను త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి పోలీసు సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్, ఎస్ఐ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలి అధికారులకు కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశం పీజీఆర్ఎస్కు 241 అర్జీలు -
సమస్యలు తీర్చకపోతే సమ్మె తప్పదు
అనకాపల్లి: ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యుల అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి ఆవరణలో డీఎంఅండ్‌హెచ్‌వో హైమావతికి సోమవారం సమ్మెకు సిద్ధమంటూ నోటీసును అసోసియేషన్ సభ్యులు అందజేశారు. అసోసియేషన్ అధ్యక్షురాలు ఎస్టేర్ రాణి, కార్యదర్శి తిరుపతిరావు మాట్లాడుతూ ఇన్–సర్వీస్ పీజీ కోటాను పునరుద్ధరించాలని, టైమ్–బౌండ్ ప్రమోషన్లు అమలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి బేసిక్ పే 50శాతం ట్రైబల్ అలవెన్స్ మంజూరు చేయాలని, నోషనల్ ఇనంక్రిమెంట్స్ మంజూరు చేయాలని, చంద్రన్న సంచార చికిత్స ప్రోగ్రామ్ కింద వైద్యులకు రూ.5 వేల అలవెన్స్ ఇవ్వాలని, నేటివిటీ–అర్బన్ ఎలిజిబిలిటీ సమస్యలు పరిష్కరించాలని, పీహెచ్సీలో వైద్యులకు కచ్చితమైన పని గంటలు, స్థిరమైన వారాంతపు సెలవు ఇవ్వాలని, వైద్యుల జాబ్ చార్ట్, విషపూరితమైన పని వాతావరణాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, పీహెచ్సీలో జనాభాకు తగ్గట్టుగా సిబ్బందిని నియమించాలని డిమాండ్లతో సమ్మె నోటీసును అందజేశారు. ఐదు రోజులు పాటు నల్లబ్యాడ్జీలతో నిరసన నిరసన తెలియజేస్తూ, అప్పటికీ సమస్యలు పరిష్కరించని ఎడల సమ్మె చేయడం జరుగుతుందన్నారు. గత ఏడాది సమ్మె చేస్తున్న సమయంలో ప్రభుత్వం చర్యలకు పిలిపించి, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఏడాది పూర్తి అవుతున్నా నేటికీ పరిష్కరించకపోవడంతో మారో సారి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు.డీఎంహెచ్‌వోకు పీహెచ్సీ వైద్యుల నోటీసు -
బుచ్చెయ్యపేటలో భారీ వర్షం
బుచ్చెయ్యపేట: మండలంలో సోమవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి జోరు వర్షం కురిసింది. పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు పడ్డాయి. వీటి శబ్దానికి పొలాల్లో రైతులు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు, ఇళ్లకు చేరుకున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాల్లో ఇళ్ల ముందు వరద నీరు పోటెత్తడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. బీఎన్, ఆర్టీ, పెదమదీన, పెదపూడి తదితర గ్రామాల రోడ్డు గోతుల్లో వర్షం నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బురదలో పలు వాహ నాలు కూరుకుపోయాయి. వడ్డాది పెద్దేరు డైవర్షన్ రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. బంగారుమెట్ట బీఎన్ రోడ్డులో చేరిన వరద నీటిని మాడుగుల ఆర్అండ్బీ జేఈ సాయి శ్రీనివాస్ పరిశీలించారు. వరద నీరు బయటకు పోయేలా మదుంలు ఏర్పాటు చేయాలని నాయకులు, ప్రజలు కోరారు. ఈ వర్షంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రాజాంలో చెరువు గండి పడి రాకపోకలకు అవస్థలు బుచ్చెయ్యపేట మండలం రాజాంలో అప్పలనాయుడు చెరువుకు గండి పడి రాకపోకలకు అంతరాయం కలిగింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి ఈ చెరువు పూర్తిగా నిండింది. సోమవారం కురిసిన వర్షానికి చెరువుకు గండి పడి రాజాం– తట్టబంద(ఆర్టీ) రోడ్డుపై వరద నీరు పొంగిపొర్లింది. చెరువు నుంచి రాజాం చెరుకు కాటా మూడు రోడ్ల జంక్షన్ వరకు కిలోమీటరు దూరం వరకు వరద నీరు ప్రవహించింది. ఈ రహదారిలో రాకపోకలు సాగించే అనకాపల్లి నుంచి బుచ్చెయ్యపేట, రావికమతం మండలాలకు తిరిగే ఆర్టీసీ బస్సులతోపాటు పలు గ్రామాల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీ రోడ్డులోని గోతుల్లో ద్విచక్ర వాహనదారులు పడిపోయి ఇద్దరి సెల్ ఫోన్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు -
మానవత్వం చాటుకున్న యువకులు
ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన ‘డేంజర్ గాయ్స్’ సభ్యులుమునగపాక: స్థానిక డేంజర్ గాయ్స్ యువజన సంఘం సభ్యులు మానవత్వం చాటుకున్నారు. ఒకవైపు గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతూ మరోవైపు సోషల్ మీడియా ద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని గుర్తించి వారికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. విశాఖలో గోపాలపట్నానికి చెందిన పావని, వాసు దంపతులకు కుమారుడు అయాన్తేజా. ఆ బాబు బోన్ మేరో వ్యాధితో సతమతమవుతున్నాడు. ఇందుకు గాను సర్జరీ చేయాల్సి ఉంది. బాబు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో సర్జరీ చేయించలేక ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న మునగపాకకు చెందిన యూ ట్యూబర్ సునీల్‌తో అనకాపల్లికి చెదిన యూ ట్యూబర్ మురళి.. అలాగే డేంజర్ గాయ్స్ సభ్యులు కలిసి సోషల్ మీడియా ద్వారా మరింత ప్రచారం చేసి పలువురి నుంచి రూ.1,70,500 నగదును సేకరించారు. సేకరించిన నగదును వాసు, పావని దంపతులకు అందజేశారు.ప్రమాదస్థాయికి ‘కోనాం’ నీటిమట్టం 300 క్యూసెక్కుల విడుదల చీడికాడ: కోనాం జలాశయం పరిసరాల్లో ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంతో ఇన్‌ఫ్లో భారీగా పెరగడంతో జలాశయం నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరువలో ఉందని ఇన్చార్జి ఏఈ సత్యనారాయణదొర తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు కాగా ప్రస్తుతం 99.80 మీటర్లకు చేరుకుంది. ఇన్‌ఫ్లో ఒక్కసారిగా 400 క్యూసెక్కులకు పెరగడంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఆదివారం సాయంత్రం నుంచి ప్రధాన గేట్ల ద్వారా దిగువకు 300 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇన్‌ఫ్లోను బట్టి రాత్రికి నీటి విడుదలను పెంచే అవకాశం ఉందన్నారు. -
అమ్మా.. నీవే శరణంటూ..
నేటి నుంచి శరన్నవరాత్రులు ● ఊరూరా విస్తృత ఏర్పాట్లుదేవీ నవరాత్రుల సందడి మొదలవుతోంది. సోమవారం నుంచి అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులను అనుగ్రహించనున్నారు. ఆశ్వయుజ మాసం ప్రారంభం నాటి నుంచి విజయదశమి వరకు జరిగే ఈ వేడుకల కోసం జిల్లా అంతటా ఊరూరా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అనకాపల్లిలోని గవరపాలెం నూకాంబిక అమ్మవారు, సత్యనారాయణపురం కొండపైన వెలసిన కనకదుర్గమ్మ, గవరపాలెం సతకంపట్టు కనకదుర్గమ్మలను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు రానుండడంతో అధికారులు, ఆలయ వర్గాలు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. నూకాంబిక అమ్మవారి బాలాలయంలో నిర్వహించే దసరా ఉత్సవాలను దేవదాయ సహాయ కమిషనర్ కె.ఎల్.సుధారాణి పర్యవేక్షించనున్నారు. అలనాటి మహారాజులు సంప్రదాయబద్ధంగా నిర్వహించే నవరాత్రుల కోసం మాడుగుల ముస్తాబైంది. ఇక్కడి సివిల్ ఆర్టీసీ ఆటో మోటారు ఓనర్స్, వర్కర్స్ యూనియన్, గ్రామస్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహించడానికి నిర్వాహక కమిటీ ఏర్పాట్లు చేసింది. – అనకాపల్లి/మాడుగుల -
నమో జగన్మాత..
● జోరుగా దేవీ విగ్రహాల అమ్మకాలు ● చౌడువాడలో 300 ప్రతిమల తయారీ ● ఉమ్మడి జిల్లా నుంచి వచ్చి కొనుగోలు కె.కోటపాడు: ఊరూవాడా వినాయక నవరాత్రులు ముగిశాయి. ఇప్పుడు దేవీ శరన్నవరాత్రుల వేడుకలకు సిద్ధమైంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు దుర్గాదేవి విగ్రహాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో కొలువుదీరనున్నాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన ఉత్సవ కమిటీలు చౌడువాడలో దుర్గాదేవి విగ్రహాలను కొనుగోలు చేస్తున్నాయి. ఇక్కడ పలు రూపాల్లో తయారైన ఆకర్షణీయమైన విగ్రహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో తయారైన విగ్రహాలు నాణ్యతకు గీటురాయిగా నిలుస్తాయి. తయారుదారులు సైతం సామాన్యులకు అందుబాటులో ధరలు ఉంచటంతో మంచి గిరాకీ ఉంటోంది. ఏటా వినాయక విగ్రహాల తయారీ పూర్తయిన తర్వాత దుర్గాదేవి ప్రతిమలు సిద్ధం చేస్తుంటారు. 60 మంది శిల్పులు అమ్మవారి విగ్రహాలను ఆకట్టుకునే రూపాల్లో జీవం ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ ఏడాది 300 దుర్గాదేవీ విగ్రహాలను తయారీ చేయగా, విశాఖపట్నం, అనకాపల్లి, గాజువాక, తదితర ప్రాంతాల నుంచి వచ్చి జోరుగా కొనుగోలు చేస్తున్నారు. 2 నుంచి 10 అడుగుల ఎత్తు విగ్రహాల తయారీ ఏటా విజయదశమి సందర్భంగా దేవీ విగ్రహాలను తయారీ ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నాం. 60 మంది యువకులతో పాటు మహిళలు వీటిని తయారీ చేస్తుంటారు. వివిధ రూపాల్లో దుర్గాదేవి విగ్రహాలను రెండు నుంచి పదడుగుల ఎత్తు వరకూ తయారీ చేస్తున్నాం. ఇవి రూ.3 వేల నుంచి రూ.15 వేల వరకూ అమ్ముడుపోతుంటాయి. – బత్తిన నాగరాజు, విగ్రహాల శిల్పి, చౌడువాడ -
యాసిడ్ లారీని ఢీకొట్టిన బస్సు
గ్యాస్ లీక్ ● సకాలంలో రక్షణ చర్యలు నక్కపల్లి: జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి పెద్ద ప్రమాదం తప్పింది. అనకాపల్లి నుంచి తుని వైపు సల్ఫ్యూరిక్ యాసిడ్‌తో వెళ్తున్న లారీ రిపేరు రావడంతో డ్రైవరు టోల్గేట్ సమీపంలో రోడ్డు మధ్యలో నిలిపివేశాడు. లారీలో యాసిడ్ ఉన్న విషయం తెలిసినప్పటికీ డ్రైవర్ కానీ, క్లీనర్ కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. లారీ పక్కన నిలబడి హెచ్చరించడం, అడ్డంగా ఏదైనా వస్తువులు సైతం పెట్టలేదు. లారీని పక్కన ఆపేసి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అదే సమయంలో విశాఖ నుంచి కాకినాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న మరో వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఆగి ఉన్న యాసిడ్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం బాగా దెబ్బతింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అదేవిధంగా యాసిడ్ లారీ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకై ంది. దీంతో రహదారిపై రాకపోకలు సాగించేవారు చాలా భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన వెళ్లి గ్యాస్ లీక్ కాకుండా చర్యలు చేపట్టడంతో ప్రమాదం తప్పింది. బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ సన్నిబాబు తెలిపారు. -
పోలీస్ కమిషనరేట్‌కు స్కోచ్ అవార్డు
అల్లిపురం: రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం అందించే ప్రత్యేక కేంద్రానికి ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు లభించినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్లుగా విశాఖ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసిన ఈ సహాయ కేంద్రం ద్వారా, 69 రోడ్డు ప్రమాద కేసులలో బాధితులకు రూ. 63.50 లక్షల పరిహారం అందించారు. ఈ సేవా కార్యక్రమానికి గుర్తింపుగా ఢిల్లీలో జరిగిన 102వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవంలో విశాఖ పోలీసులు ఈ అవార్డును స్వీకరించారు. ఈ విజయంతో హిట్ అండ్ రన్ కేసుల బాధితులు, వారి కుటుంబ సభ్యులు, నగర పోలీసు అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి సేవా కేంద్రం ఏర్పాటు చేసినందుకు గాను కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చికి కృతజ్ఞతలు తెలియజేశారు. -
కుదిపేసిన కుండపోత
● ఈదురుగాలులకు కూలిన చెట్లు.. తెగిపడిన విద్యుత్ వైర్లు ● నేలకూలిన ఇళ్లు.. చెట్లు పడి దెబ్బతిన్న వాహనాలుయలమంచిలి రూరల్: నియోజకవర్గంలోని యలమంచిలి, మునగపాక మండలాల్లో ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై కుండపోతగా కురిసిన వర్షానికి లోతట్టుప్రాంతాలు మునిగాయి. యలమంచిలిలో గంట వ్యవధిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పట్టణంలో పలు వీధులు,అంతర్గత రహదారుల్లో పదుల సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి.కొన్ని చోట్ల నిలిపి ఉంచిన కార్లు,బైక్‌లపై చెట్లు,చెట్ల కొమ్మలు పడడంతో ఆ వాహనాలు దెబ్బతిన్నాయి. భవనంవీధిలో విద్యుత్ స్తంభం కూలిపోయింది. పలు చోట్ల విద్యుత్ వైర్లు తెగిపడడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. లైనుకొత్తూరు వద్ద పాత జాతీయ రహదారిపై భారీ చింత చెట్టు రోడ్డుకు అడ్డంగా కూలిపోయి,హెచ్‌టీ లైన్ల వైర్లు తెగిపోయాయి.ఆ మార్గం మీదుగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.విద్యుత్,పోలీసు శాఖల అధికారులకు సమాచారం అందించినట్టు తహసీల్దార్ కె.వరహాలు తెలిపారు.కొక్కిరాపల్లిలో పిడుగు పడి కీర్తి లక్ష్మికి చెందిన గేదె మృతి చెందింది. పట్టణంలోని రాంనగర్లో ఓ ఇంటిపై చెట్టు కూలడంతో పాక్షికంగా దెబ్బతింది. కూలిన చెట్లను తొలగించేందుకు మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు, ఇంజినీర్లు గణపతిరావు, నానాజీ, సిబ్బంది పొక్లెయిన్లతో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. రోడ్లపై కూలిన చెట్లను తొలగించి, ఆదివారం సాయంత్రం 6 గంటలకు చాలావరకు రాకపోకలు పునరుద్ధరించగలిగారు. వర్షంతో కొన్నిచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో పాదచారులు నడిచి వెళ్లడానికి ఇబ్బంది పడ్డారు. పలు ప్రాంతాల్లో అరటి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. వరి,ఇతర పంటలకు ఈ వర్షం బాగా మేలు చేస్తుందని రైతులు చెబుతున్నారు. మునగపాకలో... మునగపాక: మండల వ్యాప్తంగా శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. హుద్‌హుద్ తుఫాన్ సమయంలో మాదిరిగా భారీగా గాలులు వీయడంతో పాటు కుండపోతగా వర్షం కురవడంతో పలు చోట్ల చెట్లు కూలిపోవడంతో పాటు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మునగపాక మెయిన్‌రోడ్డులో ఆడారి చంద్రమోహన్ ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ద్విచక్ర వాహనంపై కొబ్బరి చెట్టు పడడంతో వాహనం నుజ్జయింది. మునగపాక బీసీ కాలనీలో పై అంతస్తులో ఏర్పాటు చేసుకున్న షెడ్లు దెబ్బతిన్నాయి. తమకు న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్ సత్యనారాయణకు బాధితులకు విన్నవించారు.కాగా విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ ఏఈ శరగడం జగదీష్ చర్యలు తీసుకున్నారు.జిల్లాలో పలుచోట్ల జనజీవనం అస్తవ్యస్తం -
విశాఖ స్వరూపం మారుతుందా?
మహారాణిపేట: జిల్లా సరిహద్దుల మార్పుపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాన్ని పూర్తిగా, ఎస్.కోట అసెంబ్లీని పాక్షికంగా విశాఖ జిల్లాలో విలీనం చేసే ప్రతిపాదనలపై చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం జిల్లాలో జీవీఎంసీ పరిధి 89శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతం కేవలం 11 శాతం మాత్రమే ఉంది. ఈ గ్రామీణ ప్రాంతాన్ని పెంచడం, అలాగే అవకాశం ఉన్న ప్రాంతాలను జీవీఎంసీలో విలీనం చేయడం వంటి ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి పునర్విభజన అంశాలను తీసుకువచ్చారు. పెందుర్తి నియోజకవర్గంలోని పెందుర్తి మండలం ఇప్పటికే విశాఖ జిల్లాలో ఉండగా, అదే నియోజకవర్గంలోని సబ్బవరం, పరవాడ మండలాలను కూడా విశాఖ జిల్లాలో విలీనం చేయాలని ఎమ్మెల్యే కోరారు. దీనిపై పరిశీలన చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎస్.కోట విశాఖ పార్లమెంట్ పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు విశాఖ జిల్లాలో ఉన్నాయి. విశాఖ తూర్పు, విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణం, విశాఖ పశ్చిమం, భీమిలి, గాజువాక. అయితే ఎస్.కోట అసెంబ్లీ నియోజకవర్గం మాత్రం విజయనగరం జిల్లాలో ఉంది. ఈ పరిస్థితి వల్ల ప్రజల పరామర్శలు, పర్యటనలు, ఇతర కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పార్లమెంట్ సభ్యులు భావిస్తున్నారు. అందుకే ఎస్.కోటను విశాఖ జిల్లాలో విలీనం చేయడంపై అధ్యయనం జరుగుతోంది. ఒకే ఎంపీ పరిధిలోని అన్ని నియోజకవర్గాలు ఒకే జిల్లాలో ఉంటే ఎలా ఉంటుందనే దానిపై వివిధ శాఖల అధికారుల అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారు. జిల్లా భౌగోళిక స్వరూపంలో మార్పులు ఒకప్పుడు పెద్ద జిల్లాగా ఉన్న విశాఖ ఇప్పుడు చిన్నగా మారింది. గతంలో మైదాన, గిరిజన, పట్టణ ప్రాంతాలు విశాఖ జిల్లాలో భాగంగా ఉండేవి. జిల్లాల విభజన తర్వాత గ్రామీణ ప్రాంతం తగ్గి, గిరిజన ప్రాంతం పూర్తిగా లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాలు తక్కువగా ఉన్న విశాఖ జిల్లాలో అదనపు ప్రాంతాలను కలిపితే ఎలా ఉంటుందనే దానిపై అధికార యంత్రాంగం పరిశీలిస్తోంది. ఈ చర్చలు విశాఖ జిల్లా భౌగోళిక స్వరూపాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా, కొన్ని ప్రాంతాలను ఆయా జిల్లాల్లో కలపడానికి కసరత్తు జరుగుతోంది. జిల్లా పునర్విభజన కమిటీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. వాటిలో కొన్నింటిని సవరించడానికి కూటమి ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. జిల్లాల సంఖ్యను పెంచడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ప్రతిపాదనలను కూడా ఈ ఉప సంఘం పరిశీలిస్తోంది. జిల్లాల విలీనం, తొలగింపు వంటి అంశాలను ఈ కమిటీ అధ్యయనం చేస్తోంది. -
వాడనర్సాపురం తీరం నుంచి ఇసుక తరలింపు
● ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకున్న రెవెన్యూ వర్గాలు..? ● ఇసుక అమ్మకాలపై ఎస్పీకి స్థానికుల ఫిర్యాదు..! రాంబిల్లి(అచ్యుతాపురం): రాంబిల్లి మండలం వాడనర్సాపురం సముద్ర తీర ప్రాంతం నుంచి ఇసుక అక్రమ తరలింపుపై పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు ఆదివారం తెలిపారు. మూడు రోజుల నుంచి ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలు ప్రారంభించినట్లు సదరు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇసుక తరలింపుపై స్థానిక పోలీస్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోనప్పటికీ శనివారం రాత్రి ఇసుక ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇసుక తరలింపును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న పోలీస్ సిబ్బందిపై రాజకీయ ఒత్తిడి తీసుకువస్తున్నారు. గతంలోనే వెలుగులోకి తెచ్చిన సాక్షి.. గత నెల 23న వాడనర్సాపుంలో అనధికారంగా ఇసుక వేలం నిర్వహించిన అంశాన్ని సాక్షి వెలుగులోకి తీసుకొచ్చింది. రూ.3 లక్షలకు వేలం దక్కించుకున్న పాటదారునితో పాటు సహకరించిన వారికి అప్పట్లో అధికారులకు హెచ్చరికలు జారీ చేయడంతో ఇసుక తరలింపును తాత్కాలికంగా నిలిపివేశారు. మళ్లీ మూడు రోజుల నుంచి ప్రారంభించడం గమనార్హం. ఏడాదిపాటు సముద్రంలోని ఇసుకను తవ్వేందుకు, కావాల్సిన వారికి విక్రయించేందుకు హక్కులు దక్కించుకున్న పాటదారునికి అధికార పార్టీ నేతలు సహకరిస్తున్నట్లు తాజాగా పోలీస్ ఉన్నతాధికారులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.వాడనర్సాపురం తీరంలో ఇసుక తవ్వకాలు, తరలింపు కోసం ట్రాక్టర్లు కదలాడిన ప్రదేశం -
భక్తుల విశ్వాసాలకు విఘాతం
ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో జరిగే కల్యాణోత్సవాల్లో వేలాది మంది భక్తులు బంధుర సరస్సులో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకోవడం అనాదిగా వస్తోంది. ఇక్కడ స్నానం చేసి దర్శనం చేసుకుంటే సంతానం కలుగుతుందనేది భక్తుల నమ్మకం. అంత పవిత్రంగా ఈ చిన్న చెరువును భావిస్తారు. దీన్ని ఆనుకుని ఉన్న పెద్ద చెరువుపై గ్రామానికి చెందిన కొంతమంది పెద్దల కళ్లు పడ్డాయి. గ్రామాభివృద్ధి పేరుతో చేపలు పెంచుకునేందుకు లీజుకు ఇవ్వడానికి నిర్ణయించారు. చాలా రోజుల నుంచి ఈ ఆలోచన ఉన్నప్పటికీ కొంతమంది నుంచి వ్యతిరేకత రావడం, భక్తుల నుంచి కూడా విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో వాయిదా వేశారు. శనివారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా దేవస్థానం వారికి తెలియకుండా కొంతమంది పెద్దలు సమావేశమై చెరువుకు వేలం నిర్వహించినట్లు భోగట్టా. మూడేళ్ల కాలపరిమితికి రూ.7 లక్షలకు ఉపమాకకు చెందిన ఒక వ్యక్తి ఈ లీజు హక్కు దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముందుగా రూ.2 లక్షలు గ్రామ పెద్దలకు చెల్లించిన తర్వాత చెరువులో చేపపిల్లలు వేసుకోవాలనే కండీషన్ విధించి ఒప్పంద పత్రాలు కూడా రాసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. భక్తుల సెంటిమెంట్లను గౌరవించాల్సిన పెద్ద మనుషులే ఇలా అపచారానికి ఒడిగట్టడంపై భక్తులు మండిపడుతున్నారు. -
తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహాకవి
గురజాడ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న యూపీ అదనపు డీజీపీ సత్యనారాయణ నర్సీపట్నం: తెలుగు సాహిత్యాన్ని మహాకవి గురజాడ అప్పారావు సుసంపన్నం చేశారని యూపీ అదనపు డీజీపీ కిల్లాడ సత్యనారాయణ అన్నారు. స్థానిక శాఖాగ్రంథాలయంలో ఆదివారం గురజా డ అప్పారావు జయంతిని ఘనంగా నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. గురజాడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు కృషి చేసిన గొప్పకవి గురజాడ అని చెప్పారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కావలసిన పుస్తకాలు గురించి గ్రంథాలయ అధికారి దమయంతిని అడిగి తెలుసుకున్నారు. అవసరమైన పుస్తకాలను పంపిస్తానని హామీచ్చారు. గ్రంథాలయ నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రంథాలయ సేవలను పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
బలవంతపు భూసేకరణ ఆపాలి
చలో విజయవాడకు సీపీఎం నేత వెంకన్న పిలుపు కె.కోటపాడు: బలవంతపు భూసేకరణ ఆపాలని ఈ నెల 24న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఎం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వెంకన్న పిలుపునిచ్చారు. మండలంలో ఆర్లిలో చలో విజయవాడ కరపత్రాలను ఆదివారం ఆయన రైతులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతు కూటమి ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేపట్టేందుకు యత్నిస్తున్నట్లు ఆరోపించారు. రైతుల నుంచి తీసుకునే భూముల్లో పర్యావరణానికి హాని కలిగించే కంపెనీలను ఏర్పాటు చేసి కాలుష్యం వెదజల్లే చర్యలకు తెరతీయనున్నట్లు విమర్శించారు. కె.కోటపాడు మండలంలో ఎస్ఈజెడ్ ఏర్పాటుకు 1200 ఎకరాలు, బుచ్చెయ్యపేటలో 1691 ఎకరాలు బలవంతంగా సేకరించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. భూములు ఇవ్వబోమని, ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టవద్దని రైతుల నుంచి ప్రతిఘటన వస్తుందన్నారు. విజయవాడ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు యర్రా దేముడు, ఈర్లె నాయుడుబాబు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ లోపాలకు AIతో చెక్
సాక్షి, విశాఖపట్నం : విద్యుత్ వ్యవస్థలో సమస్యలను వేగంగా పరిష్కరించడానికి, ఏపీఈపీడీసీఎల్ సరికొత్త ఆవిష్కరణలను చేపడుతోంది. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, విద్యుత్ సరఫరాను మెరుగుపరచడానికి కృత్రిమ మేధస్సును వినియోగిస్తోంది. విద్యుత్ సరఫరా, స్తంభాల లోపాలు, డిమాండ్ అంచనా వంటి కార్యకలాపాల్లో ఏపీఈపీడీసీఎల్ ఇప్పటికే ఏఐని ఉపయోగిస్తోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి, క్షేత్రస్థాయి సమస్యలను కనిపెట్టడానికి కూడా ఈ సాంకేతికతను ఉపయోగిస్తోంది.ఏఐతో క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారంకొద్ది నెలలుగా ఏపీఈపీడీసీఎల్ తమ ఫ్రంట్‌లైన్ కార్యకలాపాల్లో ఏఐని ఉపయోగించి అద్భుతమైన ఫలితాలను సాధించింది. విద్యుత్ వ్యవస్థకు ఏఐ సాంకేతికతను అనుసంధానించడం వల్ల సమస్యల పరిష్కారం మరింత సులభమైంది. ఈ కొత్త వ్యవస్థను ఏపీఈపీడీసీఎల్ ఐటీ ఇంజినీర్లు, ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు, బెంగళూరుకు చెందిన జోనాయిక్ అనే స్టార్టప్ సంస్థ సంయుక్తంగా రూపొందించాయి. ఈ ఏడాది మార్చిలో ఏపీఈపీడీసీఎల్ డేటా సెంటర్లో ఒక ఏఐ సర్వర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సర్వర్‌ను స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించి, విద్యుత్ సరఫరాలో లోపాలను సరికొత్త సాంకేతికతతో పరిష్కరించే ప్రయోగాల్లో విజయం సాధించారు.స్మార్ట్‌ఫోన్ కెమెరాతో స్తంభాల లోపాలు కూడాజోనాయిక్ స్టార్టప్ సంస్థ సీఈవో శశాంక్ చిలంకుర్తి మార్గదర్శకత్వంలో విద్యార్థులు జీపీయూ ప్రోగ్రామింగ్, ఏఐ వర్క్‌ఫ్లో ఫ్రేమ్‌వర్క్‌పై శిక్షణ పొందారు. అలాగే, ఏపీఈపీడీసీఎల్ ఐటీ టీమ్‌ను కూడా వాన్ శ్రీనివాస్ సుశిక్షితుల్ని చేశారు. విద్యుత్ సరఫరాలో ఎక్కడ ఏ సమస్య తలెత్తిందో లైన్మెన్ల సహకారంతో ఏఐ ద్వారా గుర్తించడంలో 100 శాతం విజయం సాధించారు. పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు, గ్రిడ్స్ వద్ద ఎక్కడైనా లోపం ఉంటే, స్మార్ట్‌ఫోన్ కెమెరా ఉపయోగించి క్షణాల్లో కనిపెట్టే వ్యవస్థను రూపొందించారు. ఇన్సులేటర్లకు చెట్ల కొమ్మలు అడ్డుగా ఉన్నా వెంటనే ఏఐ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. ఈ స్టార్టప్ సంస్థ, ఏపీఈపీడీసీఎల్ కోసం ఒక ప్రైవేట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కోడ్‌ను రూపొందిస్తోంది. దీని ద్వారా విద్యుత్ సరఫరాలో లోపాలను ముందుగానే అంచనా వేసి, సంబంధిత ఆపరేటర్లకు సమాచారం చేరవేస్తుంది. ఈ వ్యవస్థ వల్ల సరఫరాలో లోపాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.మీటర్ల లోపాలను కూడా పసిగట్టే ఏఐస్మార్ట్ మీటర్ల డేటాను అంచనా వేయడానికి కూడా ఏఐని ఉపయోగిస్తున్నారు. ఈ డేటా సహాయంతో తప్పుడు రీడింగ్‌లు నమోదు చేస్తున్న మీటర్లను సులభంగా పసిగట్టవచ్చు. దీనివల్ల ఏపీఈపీడీసీఎల్‌కు కలిగే ఆదాయ నష్టాన్ని తగ్గించగలుగుతున్నారు. అంతేకాకుండా, ఏఏ ప్రాంతాల్లో లో–వోల్టేజ్ సమస్యలు ఉన్నాయో ఏఐ రియల్–టైమ్ మానిటరింగ్, గ్రాఫ్ విశ్లేషణల ద్వారా సమాచారాన్ని అందిస్తోంది.ఈ వ్యవస్థను సైబర్ దాడుల నుంచి రక్షించడానికి పటిష్టమైన యాంటీవైరస్ వ్యవస్థను కూడా రూపొందించారు. స్మార్ట్ మీటర్లు, ఫీడర్ నిర్వహణ, విద్యుత్ పంపిణీ ట్రాన్స్ఫార్మర్ల నుంచి సేకరించిన డేటాను ఏకీకృత డేటా లేక్ వ్యవస్థలో నిక్షిప్తం చేస్తున్నారు. ఇది ఓవర్లోడ్లను ముందుగానే గుర్తించడాన్ని మరింత సులభతరం చేసింది.పోల్ నుంచి.. డిమాండ్ సరఫరా వరకూ..రాష్ట్ర స్థాయిలో దీర్ఘకాలిక డిమాండ్ అంచనా, సామర్థ్య ప్రణాళికల కోసం ఇప్పటికే ఈపీడీసీఎల్ పరిధిలో ఏఐని విజయవంతంగా అమలు చేస్తున్నాం. భవిష్యత్తు విద్యుత్ కొనుగోళ్ల ప్రణాళిక, ఖర్చుల్ని ఆప్టిమైజ్ చేయగలుగుతున్నాం. స్మార్ట్‌మీటర్ ఇంటిగ్రేషన్‌తో ఇప్పుడు ఫీడర్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ స్థాయిలో స్థానికంగా డిమాండ్ అంచనాల్ని కూడా కనుగొనే సాంకేతికతని అందిపుచ్చుకున్నాం. ఓవర్లోడ్ని ముందుగానే గుర్తించడం, సకాలంలో లోడ్ షిఫ్టింగ్ మొదలైన అంశాలపై మరింత చురుగ్గా వ్యవహరించేలా ఈపీడీసీఎల్ నిరంతరం సేవలందించేందుకు సిద్ధమైంది. ఏఐ వినియోగం ద్వారా విద్యుత్ సరఫరాలో నాణ్యత పెరగడంతో పాటు.. సిబ్బందికి.. లోపాలు పరిష్కరించే మార్గాలు మరింత సులువవుతుండటం శుభపరిణామం.– పృథ్వీతేజ్ ఇమ్మడి, ఈపీడీసీఎల్ సీఎండీ -
ఎస్పీ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం
అనకాపల్లి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా వర్షాకాలంలో వరదలు, అంటువ్యాధులపై ప్రతి వ్యక్తి అవగాహన కలిగి ఉండాలని అదనపు ఎస్పీ ఎం.దేవ ప్రసాద్ అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో పరిసరాలను పరిశుభ్రం కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు వివిధ రకాలైన అంటు వ్యాధుల బారిన పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. శుద్ధి, వేడిచేసిన నీటిని మాత్రమే తాగాలన్నారు. దోమల పెరుగుదలకు కారణమయ్యే నిల్వ నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని కోరారు. స్టేషన్లలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించగా, వరదల ప్రభావం తగ్గించే చర్యలు, అంటువ్యాధుల నివారణ, ఫాగింగ్ వంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని పిలుపునిచ్చారు. సీఐలు టి.లక్ష్మి, బెండి వెంకటరావు, రమేష్, ఎస్ఐలు సురేష్ బాబు, వెంకన్న, మల్లేశ్వరరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
జూనియర్ కళాశాలల అథ్లెటిక్స్, రగ్బీ పోటీలు ప్రారంభం
ఏఎంఏఎల్ కళాశాలలో అథ్లెటిక్స్, రగ్బీ పోటీల ప్రారంభోత్సవంలో క్రీడాకారులు, నిర్వాహకులు తుమ్మపాల: మండలంలో ఏఎంఏఎల్ కళాశాలలో ఉమ్మడి జిల్లా జూనియర్ కళాశాలల అథ్లెటిక్స్, రగ్బీ, పోటీలను కళాశాల అధ్యక్షులు శ్రీధరాల కృష్ణ పేర్రాజు, కరస్పాండెంట్ పెంటకోట వెంకటరామారావు శనివారం ప్రారంభించారు. కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన 100మీ., 200మీ., 400మీ., 800మీ., 1500మీ., 3,4,6 కిలోమీటర్లు, షాట్ పుట్, డిస్కస్ త్రో, జావలిన్ త్రో, లాంగ్ జంప్, త్రిపుల్ జంప్, హైజంప్, రగ్బీ పోటీల్లో అండర్ 19 విభాగంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో వివిధ కళాశాలల క్రీడాకారులు తలపడ్డారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను విశాఖ జిల్లా అథ్లెటిక్ అండర్ –19 జట్టుకు ఎంపిక చేసి త్వరలో ఏలూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని ప్రిన్సిపాల్ డాక్టర్ జి.జయబాబు, ఎం.వినోద్ బాబు తెలిపారు. కార్యక్రమంలో అండర్–19 విశాఖ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వీఏ పుష్పలత, వైస్ ప్రిన్సిపాల్ టి.నిరంజన్ కుమార్, సూపరింటెండెంట్ పి.అనురాధ, స్పోర్ట్స్ కమిటీ సభ్యులు వాసిరెడ్డి బాలకృష్ణ, కె.రవీంద్ర, యు.కృష్ణ కిషోర్, పి.వి. సుధాకర్, ఫిజికల్ డైరెక్టర్లు శ్రీలక్ష్మి, ఉమ, సాగర్, తరుణ్, ప్రసాద్, సావిత్రి, డాక్టర్ కె.వి.ఎస్ నాయుడు, కె.శత్రుఘ్న పాల్గొన్నారు. -
ఆదర్శప్రాయుడు అల్లూరి
గొలుగొండ: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం చేసిన ప్రాంతంలో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించడం చాలా ఆనందంగా ఉందని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి అన్నారు. ఆయన గొలుగొండ మండలం కృష్ణదేవిపేట (ఏఎల్‌పురం) గ్రామంలో పోలీస్–ప్రజలు నడుపుతున్న అల్లూరి సీతారామరాజు మైత్రి గ్రంథాలయాన్ని సందర్శించారు. మైత్రి గ్రంథాయం వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. లైబ్రరీలో కంప్యూటర్ రూమ్‌ను ప్రారంభించారు. హైస్కూల్ విద్యార్థులకు విలువైన పుస్తకాలు అందజేశారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే యువత అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ అల్లూరి పేరున పోలీసులు, ప్రజలు మైత్రి గ్రంథాలయం నడపడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ ఈ గ్రంథాలయంలో చదువుకొని పలువురు మంచి ఉద్యోగాలు పొందడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆర్జేడీ విజయ్ భాస్కర్, మైత్రి గ్రంథాలయ వ్యవస్థాపకులు శర్మ, పూర్వపు కొయ్యూరు సీఐ సోమశేఖర్, నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, సీఐ రేవతమ్మ, పూర్వపు కృష్ణదేవిపేట ఎస్ఐ తారకేశ్వర్రావు, గొలుగొండ ఎస్ఐ రామారావు, ఎంపీపీ గజ్జలపు మణికుమారి, స్థానిక సర్పంచ్ లోచల సుజాతతోపాటు అల్లూరి మైత్రి గ్రంథాలయ సభ్యులు పాల్గొన్నారు. ఇచ్ఛాపురం వరకు సైకిల్ ర్యాలీ నర్సీపట్నం: విశాఖ రేంజ్ పరిధిలో గంజాయి నేరస్థులకు సంబంధించి సుమారు రూ.14 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశామని డీఐజీ గోపీనాథ్ జట్టి పేర్కొన్నారు. రేంజ్లో 85 మందిపై మాదకద్రవ్యాల కేసు నమోదు చేశామన్నారు. వీరిలో 14 మంది ఆస్తులు సీజ్ చేసినట్లు చెప్పారు. శనివారం నర్సీపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ముఖద్వారమైన పాయకరావుపేట నుంచి రాష్ట్ర సరిహద్దు ఇచ్ఛాపురం వరకు సైకిల్ యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. యాత్ర పొడువున విద్యార్థులు, యువతను కలిసి గంజాయి వలన కలిగే అనర్ధాలను వివరిస్తామన్నారు. అనంతరం రూరల్ పోలీసు స్టేషన్, నర్సీపట్నం సర్కిల్ కార్యాలయాన్ని డీఐజీ తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. -
లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలి
● మత్తుపదార్ధాలకు దూరంగా ఉండాలి ● విద్యార్థులతో యూపీ అదనపు డీజీపీ సత్యనారాయణనర్సీపట్నం: భవిష్యత్తులో స్థిరపడేందుకు విద్యార్థి దశలోనే లక్ష్యాలలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని ఉత్తరప్రదేశ్ అదనపు డీజీపీ కిల్లాడ సత్యనారాయణ పేర్కొన్నారు. మాదకద్రవ్యాలను సంకల్పంతో నియంత్రిద్దాం అనే అంశంపై పోలీసుశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సును శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అదనపు డీజీపీ సత్యనారాయణ, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాఽథ్ జట్టి, ఎస్పీ తుహిన్‌సిన్హా హాజరయ్యారు. అదనపు డీజీపీ మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాల ప్రభావానికి లోనుకాకుండా, తమ భవిష్యత్తును సక్రమంగా నిర్మించుకోవాలన్నారు. వేమన పద్యాన్ని ఉదహరిస్తూ విద్యార్ధులు సమాజంలో మంచిస్థానాన్ని సంపాదించుకోవాలన్నారు. డీఐజీ గోపీనాథ్ జట్టి మాట్లాడుతూ యువతను మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా చేయడమే సంకల్పం ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలో భాగంగా ఐదు జిల్లాల్లో మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు విస్తృత చర్యలు చేపడుతున్నారన్నారు. డ్రగ్స్ మాత్రమే కాదు, సైబర్ నేరాలు, సోషల్ మీడియా నేరాలు, మహిళలపై అఘాయిత్యాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో పోలీసుల నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. డిజిటల్ అరెస్టు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ పేరుతో వచ్చే కాల్స్‌ను ఎవరూ నమ్మవద్దని, అటువంటి కాల్స్ వచ్చినప్పుడు 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎస్పీ తుహిన్‌సిన్హా మాట్లాడుతూ ఒకసారి డ్రగ్స్‌ను వాడితే ఏమీ కాదన్న అపోహలో పడకూడదని, అలవాటు బారిన పడినవారు డబ్బుల కోసం చిన్న చిన్న నేరాలకు పాల్పడి, చివరికి నేరస్థులుగా మారుతున్న వాస్తవాన్ని తెలియజేశారు. హత్యా నేరానికి 14 ఏళ్లు జైలుశిక్ష విధిస్తే, గంజాయి కేసుల్లో 20 ఏళ్ల వరకు శిక్ష ఉంటుందన్నారు. అలవాటు బారిన పడిన వారు సంకోచం లేకుండా డీ–అడిక్షన్ సెంటర్లలో చికిత్స పొందాలని సూచించారు. ఏరియా ఆస్పత్రి వైద్యాధికారి ఎల్.పరమేశ్వరి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రాజు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం అదనపు డీజీపీ సత్యనారాయణను డీఐజీ, ఎస్పీ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ పి.శ్రీనివాసరావు, సీఐలు గోవిందరావు, ఎల్.రేవతమ్మ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఏడో రోజుకు మత్స్యకారుల దీక్షలు
నక్కపల్లి: బల్క్ డ్రగ్‌పార్క్ రద్దు చేయాలంటూ రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్న నిరాహరదీక్ష ఏడోరోజుకు చేరుకుంది. శనివారం మత్య్సకారుల ఆందోళనకు జాతీయ మత్స్యకార సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మోసా అప్పలరాజు సంఘీభావం ప్రకటించారు. ప్రాణభయంతోనే రాజయ్యపేటలో అన్ని సామాజిక వర్గాల వారు బల్క్ డ్రగ్‌పార్క్‌ను వ్యతిరేకిస్తున్నారన్నారు. బల్క్‌డ్రగ్ పార్క్ ఏర్పాటయితే పదుల సంఖ్యలో రసాయన పరిశ్రమలు ఏర్పాటవుతాయని పరిసర ప్రాంతాలన్నీ వాయు, జలకాలుష్యానికి గురవుతాయన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న గంగపుత్రుల గోడు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మత్స్యకార నాయకులు ఎరిపిల్లి నాగేశు, మహేష్, కాశీరావు, తాతీలు, కాసులమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం దిగి వచ్చేవరకు ఉద్యమం ఆగదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాల్సిందేనన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులు ప్లకార్డులు పట్టుకుని మోకాళ్లపై నిలుచుని నిరసన తెలియజేశారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజు మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారులను చిన్నచూపు చూస్తోందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటోందని, రెండు వేల మెజార్టీ ఇచ్చిన రాజయ్యపేట మత్య్సకారులకు ప్రాణాలను తీసే పరిశ్రమలు ఏర్పాటు చేసి రుణం తీర్చుకుంటోందన్నారు. నిరాహారదీక్షపై హోంమంత్రి అనిత ఇప్పటివరకు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో సీఐటీ యూ జిల్లా కార్యదర్శి ఎం.రాజేష్ పాల్గొన్నారు. -
బలవంతపు భూసేకరణ నిలిపివేయాలి
దేవరాపల్లి: జిల్లాలో బలవంతపు భూసేకరణను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న రైతులు, కూలీలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వెంకన్న కోరారు. దేవరాపల్లిలో శనివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పేరిట 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలోకి తొక్కి పోలీసులు, సైన్యాన్ని ప్రయోగించి రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడాన్ని వ్యతిరేకిస్తూ చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి జిల్లాలో బలవంతపు భూసేకరణ జరుగుతున్న ప్రాంతాల నుంచి రైతులు, కూలీలు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం గతంలో సేకరించిన భూములకు పరిహారం, పేదలకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బలవంతపు భూసేకరణ చేపట్టి పోలీసులతో రైతు కూలీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో రెండు పంటలు పండే భూములను గుంజుకొని పర్యావరణానికి హాని చేసే కంపెనీలను పెట్టేందుకు మిట్టల్, ఆదానీలకు వేల ఎకరాలను కట్టబెడుతున్నారని విమర్శించారు. బల్క్‌డ్రగ్ పార్కు, మిట్టల్ స్టీల్‌ప్లాంట్, దేవరాపల్లి మండలం చింతలపూడి పరివాహక ప్రాంతంలో అదాని హైడ్రో పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ కోసం 820 ఎకరాలు, కె.కోటపాడు మండలంలో ఎస్ఈజెడ్ కోసం 1200 ఎకరాలు, బుచ్చెయ్యపేట మండలంలో 1691 ఎకరాల భూములను బలవంతంగా సేకరించడానికి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. -
శివారు ఆయకట్టుకు సైతం సాగునీరు అందిస్తాం
నాతవరం: నిమ్మకట్టు ఆనకట్ట పరిధిలో ఉన్న శివారు ఆయకట్టుకు సైతం ఖరీఫ్ పంటకు పుష్కలంగా సాగు నీరు సరఫరా చేస్తామని తాండవ ప్రాజెక్టు డీఈ అనురాధ అన్నారు. రాజుపేట అగ్రహారం గ్రామ సమీపంలో తాండవ నదిలో నిర్మించిన నిమ్మకట్టు ఆనకట్టకు శిథిలమైన ప్రధాన గేట్లు రూ.7లక్షలతో ఏర్పాటు చేశారు. ఆ గేట్లను శనివారం తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కె.సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిథిలమైన గేట్ల స్థానంలో కొత్తగా ఏడు గేట్లు ఏర్పాటు చేశామన్నారు. కొత్త గేట్ల ఏర్పాటుతో లీకేజీ నీరు వృథాగా కాకుండా నిల్వ ఉంటుందన్నారు. ఖరీఫ్ పంటకు శివారు భూములకు సైతం పుష్కలంగా సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తాండవ ప్రాజెక్టు వైస్ చైర్మన్ జోగుబాబు, డీసీ మెంబరు పారుపల్లి దాసు, నీటి సంఘం అధ్యక్షుడు అప్పన దివాణం, ప్రాజెక్టు జేఈ శ్యామ్‌కుమార్, గన్నవరం పీఏసీఎస్ పర్సన్ ఇంచార్జి సింగంపల్లి సన్యాసిదేముడు, వర్క్ ఇన్స్పెక్టర్లు అప్పారావు, నాగబాబు పాల్గొన్నారు.తాండవ ప్రాజెక్టు డీఈ అనురాధ -
విద్యార్థులను కొట్టిన స్కూల్ కరస్పాండెంట్‌పై కేసు
అనకాపల్లి: స్థానిక గాంధీనగరం సాయి శక్తి ప్రైవేట్ హైస్కూల్ల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు బొబ్బిలి పవన్‌కృష్ణ, ఆకాశపు షణ్ముఖసాయి రాజ్‌లను హైస్కూల్ కరస్పాండెంట్ అన్నం రాజశేఖర్ శుక్రవారం మధ్యాహ్నం పాఠశాలలో ఇద్దరు విద్యార్థులను ఇనుప స్కేల్‌తో వీపుపై తట్టు వచ్చే విధంగా కొట్టారు. ఈ విషయాన్ని విద్యార్థులు సాయంత్రం ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు తట్టులను చూపించగా కుటుంబ సభ్యులు శనివారం ఉదయం పాఠశాలకు వచ్చి అడుగుతున్న సమయంలో కరస్పాండెంట్ అక్కడ నుంచి పరారయ్యాడు. సంఘటనా స్థలానికి డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు చేరుకుని స్కూల్‌కు సోకాజ్ నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను కొట్టడం చట్టనిత్య నేరమని, ప్రభుత్వ పరంగా స్కూల్‌పై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. విద్యార్థి తల్లిదండ్రులు అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో సాయిశక్తి హైస్కూల్‌పై, కరస్పాండెంట్ అన్నంరాజశేఖర్పై కేసు పెట్టారు. -
ఏటికొప్పాక కళాకారుడికి లేపాక్షి పీపుల్స్ చాయిస్ అవార్డు
యలమంచిలి రూరల్: లేపాక్షి సావనీర్ హ్యాండీక్రాఫ్ట్ డిజైన్–2025 పోటీల్లో జిల్లాకు చెందిన ఏటికొప్పాక హస్తకళాకారుడు పెదపాటి సుబ్రహ్మణ్యం ఏసుదాసు పీపుల్స్ చాయిస్ అవార్డ్ దక్కించుకున్నారు. ఇటీవల రాష్ట్ర లేపాక్షి హస్తకళలు, ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా హస్తకళాకారులు తమ నైపుణ్యంతో రూపొందించిన కళాకృతులను ప్రదర్శించారు. వీటిలో ఏటికొప్పాకకు చెందిన ఏసుదాసు ప్రదర్శించిన లక్కబొమ్మలతో తయారుచేసిన పచ్చదనం వెర్సస్ కాలుష్య నియంత్రణ కళాఖండానికి ఈ అవార్డు లభించింది. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ శ్రీవిశ్వ నుంచి ఏసుదాసు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఏటికొప్పాక జెడ్పీటీసీ సేనాపతి సంధ్యారాణి, వైఎస్సార్సీపీ నాయకుడు సేనాపతి రాము, పలువురు వైఎస్సార్సీపీ నాయకులు ఏసుదాసును అభినందించారు. -
చలో మెడికల్ కళాశాల విజయవంతం
పెందుర్తి: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన ‘చలో మెడికల్ కళాశాల’ కార్యక్రమం విజయవంతమైందని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, పెందుర్తి సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్ తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలిరావడంతో కూటమి ప్రభుత్వానికి ఏమీ పాలుపోవడం లేదన్నారు. పోలీసుల అడ్డంకులను దాటుకొని ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని, మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదనే నాయకుల అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి ఫొటోలు, వీడియోలు ప్రదర్శించారన్నారు. ఇప్పటికై నా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ ఇచ్చిన జీవోను తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో గిరిజన ప్రాంతంలో 500 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిందని, 70 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. -
నిరసన ఫుల్.. రిజిస్ట్రేషన్లు నిల్
ఆదివారం శ్రీ 21 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025రిజిస్ట్రార్ ఆఫీసులు.. నిత్యం కిటకిటలాడే కార్యాలయాలు.. కాసుల గలగల వినిపించే ప్రదేశాలు.. రెండు రోజులుగా వెలవెలబోతున్నాయి. అక్కడి కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించే డాక్యుమెంటు రైటర్లు తమ డిమాండ్ల సాధనకు పెన్ డౌన్ చేయడమే ఇందుకు కారణం. జిల్లాలో రోజుకు రూ.కోటికి పైగా ఆదాయం తెచ్చే శాఖకు రెండు రోజుల్లో కేవలం రూ.5.75 లక్షలు మాత్రమే వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. డాక్యుమెంట్ రైటర్ల అభ్యంతరాలేమిటి..సాక్షి, అనకాపల్లి/చోడవరం/అనకాపల్లి టౌన్: రిజిస్ట్రేషన్ల కోసం వస్తున్న ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. మంచి రోజని రిజిస్ట్రేషన్ పని పెట్టుకున్నవారు, ఇందుకోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నవారు ఉసూరుమంటున్నారు. కూట మి ప్రభుత్వ వైఖరితో విసిగిపోయిన డాక్యుమెంట్ రైటర్లు అన్ని చోట్లా ఆందోళనకు దిగారు. పెన్ డౌన్ పేరిట పనులు నిలిపివేసి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు. శుక్రవారం వీరి ఆందోళన ప్రా రంభం కాగా రెండు రోజుల్లోనే కార్యకలాపాలు స్తంభించిపోయాయి. జిల్లాలో అనకాపల్లి, యలమంచిలి, నక్కపల్లి, సబ్బవరం, కోటవురట్ల, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం, కె.కోటపాడు, లంకెలపాలెంలలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 5 వేలమంది డాక్యుమెంట్ రైటర్లు, రైటర్ అసిస్టెంట్లు, ఆపరేటర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా శుక్ర, శనివారాలలో జరిగిన రిజిస్ట్రేషన్ల ద్వారా 5 లక్షల 75 వేల ఆదాయం వచ్చినట్లు జిల్లా రిజిస్ట్రార్ మన్మధరావు ‘సాక్షి’కి తెలిపారు. జిల్లాలో ఉన్న 10 రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో శుక్రవారం 37, శనివారం 61 రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. సాధారణంగా రోజుకు సరా సరి 220 నుంచి 240 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయని, కోటి నుంచి కోటీ పది లక్షల రూపాయల వరకు ఆదాయం ప్రభుత్వానికి వస్తుందన్నారు. రెండు రోజుల్లో రూ.2 కోట్లకు పైకా రావలసిన ఆదాయం రూ.5.75 లక్షలకు పడిపోయిందంటే ప్రభావం ఏమేరకు ఉందో అర్థమవుతోంది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినా.. దస్తావేజు లేఖర్లు చేస్తున్న సమ్మె వలన ఇబ్బంది లేకుండా ప్రత్యా మ్నాయంగా కార్యాలయ సిబ్బందితో దస్తావేజులు రాయడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. అయితే ప్రజలెవరూ వీరిని ఆశ్రయించలేదు. శుక్ర, శనివారాల్లో అనకాపల్లిలో ఒక్క రిజిస్ట్రేషన్ జరగలేదని జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పి.వి.ఎస్.మాధవి కుమారి తెలిపారు. ప్రభుత్వ ఆదాయానికి గండి.. కూటమి ప్రభుత్వంలో రిజిస్ట్రార్ కార్యాలయాలు కళ తప్పాయి. ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారం పతనం కావడంతో క్రయవిక్రయాలు క్షీణించాయి. కూటమి ప్రభుత్వ హయాంలో తమ కార్యకలాపాలు కుప్పకూలిపోయాయని రియల్టర్లు వాపోతున్నారు. పెట్టిన పెట్టుబడి రాకపోగా వడ్డీలు కట్టలేక అప్పుల పాలై గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో డాక్యుమెంట్ రైటర్ల ఆందోళన గోరుచుట్టుపై రోకటి పోటులా మారింది. సర్వత్రా నిరసన జిల్లా కేంద్రం అనకాపల్లిలో దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు అయోధ్యశేషు, ఆనంద్ ప్రసాద్‌ల ఆధ్వర్యంలో జాయింట్ సబ్ రిజిస్ట్రర్ కార్యాలయం ఆవరణలో రెండవ రోజైన శనివారం పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత పద్ధతుల్లోనే రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు. చోడవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పనిచేస్తున్న దస్తావేజు లేఖర్లు శనివారం ధర్నా చేశారు. ఓటీపీ విధానం అనేక సైబర్ నేరాలకు దారితీసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఈ ఆందోళనలో సంఘ గౌరవ అధ్యక్షుడు సీతారామయ్య, ఉపాధ్యక్షుడు బొబ్బిలి చంద్రశేఖర్, కార్యదర్శి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త విధానాల వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ క్లిష్టంగా మారిందని డాక్యుమెంట్ రైటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌కు డాక్యుమెంట్ సిద్ధం చేసే సమయంలో భూమి విక్రయించే వారు మూడుసార్లు ఓటీపీ చెప్పాల్సి వస్తోంది. కొందరు విక్రయదారులు ఓటీపీ చెప్పడానికి సంకోచిస్తున్నారు. మరికొందరు చదువుకోకపోవడంతో తెలియడం లేదు. వృద్ధులు, మొబైల్స్ లేని వారు చెప్పడమే లేదు. దీంతో డాక్యుమెంట్ నిలిచిపోతుంది. ఇదే కాకుండా తీవ్ర సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆధార్ ఆధారిత ఓటీపీ సెల్‌ఫోన్‌కు వచ్చే లోపు టైమ్ అవుట్ అవుతుండడంతో మళ్లీ మొదటి నుంచి రావాల్సి వస్తోంది. ఇలా ఒక డాక్యుమెంట్ కోసం మొత్తం 7 ఓటీపీలు వచ్చేలోపు దాదాపు 30–45 నిమిషాల సమయం పడుతుంది. అలాగే పీడీఈ (పబ్లిక్ డేటా ఎంట్రీ) విధానాన్ని కూడా పూర్తిగా రైటర్ చేయాల్సి వస్తోంది. దీనిని సబ్ రిజిస్ట్రార్ తన లాగిన్‌లో చేసుకోవాల్సి ఉన్నా పట్టించుకోవడంలేదంటూ డాక్యుమెంట్ రైటర్లు వాపోతున్నారు. దీంతో పీడీఈ నమోదులో తీవ్ర తప్పులు, అలసత్వం నెలకొంటోంది. మరోవైపు మ్యుటేషన్ ప్రక్రియను కూడా రైటర్లే పూర్తి చేయాలని సూచిస్తుండడంతో ఏమైనా తప్పులు దొర్లితే తాము బాధ్యులు కావాల్సి వస్తోందని రైటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్లు, వారి సిబ్బంది చేసుకోవాల్సిన పనులను తమతో చేయిస్తుండడంతో తీవ్ర పనిభారం, సమయం వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఆయా సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో పెన్‌డౌన్‌కు సిద్ధమయ్యారు. డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్ ఎఫెక్ట్ వెనుదిరుగుతున్న ప్రజలు వెలవెలబోతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రెండు రోజుల్లో భారీగా తగ్గిన ప్రభుత్వ ఆదాయం కొత్త విధానాలతో కూటమి ప్రభుత్వం వేధిస్తోందని లేఖర్ల ఆందోళన ఎడిట్ చేయడానికి వీల్లేకపోవడంతో ఇబ్బందులు.. రిజిస్ట్రేషన్‌కు ముందు విక్రయదారులు, కొనుగోలుదారుల నుంచి సమాచారం తీసుకుని.. ఆధార్ ఓటీపీ విధానం పూర్తయిన తరువాత డాక్యుమెంట్ తయారుచేస్తున్నాం. అది సబ్ రిజిస్ట్రార్ ముందుకు వెళ్లినప్పుడు ఏదైనా పొరపాటు ఉంటే ఎడిట్ చేసుకునేందుకు వెసులుబాటు లేదు. పొరపాటు జరిగితే ఆరోజు స్లాట్‌తో పాటు డాక్యుమెంట్, రిజిస్ట్రేషన్ ఆగిపోయినట్లే. – జి.రాజులునాయుడు, డాక్యుమెంట్ రైటర్, కోటవురట్లనిలిచిన భూమి రిజిస్ట్రేషన్లు, పత్రాల ధ్రువీకరణ పాతబడిన నియమాలను సవరించాలని, సాఫ్ట్వేర్, ఓటీపీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. కక్షిదారులు, లేఖర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలన్నదే మా ఉద్దేశం. మా ఆందోళనతో భూమి రిజిస్ట్రేషన్లు, పత్రాల ధ్రువీకరణ వంటి పనులు నిలిచిపోతాయి. మా డిమాండ్లు, ప్రజల సమస్యలను ప్రభుత్వం గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలి. –సున్నం చిదంబర స్వామి, దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షుడు, నర్సీపట్నం -
వజ్ర కవచధర గోవిందా..
కశింకోటలో వజ్ర కవచాలంకృతునిగా ధ్యాన వేంకటేశ్వరస్వామి కశింకోట: స్థానిక ధ్యాన వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామిని శనివారం వజ్ర కవచాలంకృతుని చేసి, పూల మాలలు, తులసీ మాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్ణు సహస్ర నామార్చన చేశారు. నక్షత్ర హారతి ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించారు. ప్రసాద వితరణ చేశారు. ఆలయ అర్చకుడు రేజేటి రామచరణాచార్యులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అలాగే గవరపేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో కూడా అర్చకుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
న్యాయం కావాలి
వాడనర్సాపురం పైడమ్మ చెరువురాంబిల్లి (అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని పైడమ్మ చెరువు హక్కుల విషయంపై రగులుతున్న వివాదం ముదురు పాకానపడుతోంది. ఇప్పటికే ఈ చెరువుపై పట్టు సాధించేందుకు నేవల్ బేస్ ప్రయత్నిస్తుండగా, చెరువు పరిధిలో ఉన్న రెండు గ్రామాల మత్స్యకార ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ చెరువు చుట్టూ నేవల్ బేస్ చేపట్టిన ఫెన్సింగ్ పనుల్ని నిలిపివేయాలని కొత్తపేట సర్పంచ్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా, తాజాగా వాడనర్సాపురానికి చెందిన మత్స్యకార ప్రతినిధులు హైకోర్టుకు వెళ్లారు. అత్యంత సున్నితమైన సమస్యగా మారిన ఈ చెరువు నేవల్ బేస్ ప్రధాన గేట్‌కు ఎదురుగా ఉంది. ఇదే చెరువు చుట్టూ ఉన్న ప్రధాన గ్రామాల్లో వాడనర్సాపురం, కొత్తపేటలు ఉన్నాయి. సుమారు 130 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువులో 30 ఎకరాల వరకూ ఆక్రమణలు, పట్టాల పంపిణీ జరిగింది. మిగిలిన చెరువులో మత్స్యకారులు దశాబ్దాల తరబడి చేపల వేట సాగిస్తున్నారు. స్థానికంగా పెంచే పశువులకు గడ్డి, నీటి వసతికి ఇది ఆసరాగా ఉంది. అయితే వాడనర్సాపురం ఎదురుగా ఉన్న ఈ చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేస్తే నేవల్ బేస్‌కు మరింత ఆకర్షణతోపాటు, నీటి వనరుగా మారుతుందనే యోచనతో గతంలో స్థానిక పంచాయతీల ప్రత్యక్ష ఆమోదం లేకుండానే అప్పటి రెవెన్యూ అధికారులు నేవల్ బేస్‌కు దఖలు పరిచారు. దీనిని ఆసరాగా తీసుకున్న నేవల్ బేస్ అధికారులు చెరువుపై పట్టు సాధించేందుకు ఇటీవల కాలంలో ఫెన్సింగ్ వేయాలని నిర్ణయించారు. పనులు ప్రారంభించిన ప్రతిసారి మత్స్యకారులు వెళ్లి అడ్డుకోవడం, అధికారులు సర్దిచెప్పడం షరా మామూలుగా మారింది. నేవల్ బేస్ వచ్చిన తర్వాత సముద్రంపైనా, శారద నదిపైనా పట్టు కోల్పోయిన ఈ ప్రాంత మత్స్యకారులకు ఏకైక చేపల వేట వనరుగా పైడమ్మ చెరువు మిగిలింది. నేవల్ బేస్ ప్రభావిత గ్రామాల్లో కొత్తపేట, వాడనర్సాపురంతో పాటు ఏడు మత్స్యకార పల్లెలు ప్రధానంగా పైడమ్మ చెరువుపై ఆధారపడి ఉన్నాయి. తమ గ్రామాలను తరలించక తప్పని పరిస్థితి వస్తే.. ఆ తర్వాతే చెరువును నేవీకి అప్పగించాలని, తమకు ఆసరాగా ఉన్న పైడమ్మ చెరువు విషయంలో ఏ మాత్రం జోక్యం చేసుకోవద్దని నేవల్ బేస్ అధికారులకు మత్స్యకారులు మొర పెట్టుకుంటున్నారు. మరోపక్క తమకు న్యాయం చేయమని కొత్తపేట, వాడ నర్సాపురం వాసులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలు త్వరలో విచారణకు రానున్నాయి. వాడనర్సాపురం తీరంలో షెల్టర్ కింద వలలపై దిగులుగా కూర్చున్న వృద్ధ మత్స్యకారులు పైడమ్మ చెరువును కట్టబెట్టి మా పొట్ట కొట్టకండి చెరువును నేవీకి అప్పగిస్తే మేం ఎలా బతకాలి? ఇప్పటికే హైకోర్టుకు వెళ్లిన కొత్తపేట సర్పంచ్ తాజాగా వాడనర్సాపురం మత్స్యకార ప్రతినిధులుఅచ్యుతాపురం సెజ్‌తోపాటు బార్క్, నేవల్ బేస్ ఏర్పాటవుతున్న నేపథ్యంలో అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లోని తంతడి, పూడిమడక, వాడరాంబిల్లి, వాడనర్సాపురం, కొత్తపట్నం గ్రామాల మత్స్యకారులు సముద్రంపై పట్టు కోల్పోయారు. ఇటీవల కాలంలో వాడనర్సాపురానికి చెందిన వృద్ధ మత్స్యకారులు తీరంలో ఉన్న షెల్టర్‌లో పగలంతా కాలక్షేపం చేసి రాత్రి వేళ ఇంటికి పరిమితం అవుతున్నారు. పూడిమడకలో ఉప్పుటేరు కలుషితం అవుతుండగా, ఉప్పు గల్లీ భూముల బదలాయింపు ప్రక్రియకు రెవెన్యూ అధికారులు పూనుకున్నారు. ఇక వాడనర్సాపురం, కొత్తపేట మత్స్యకారులు తమకు స్వేచ్ఛ పోయిందని, ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడకు వెళ్లగలిగే తమకు అడుగడుగునా ఆంక్షలు ఎదురవుతున్నాయని కన్నీరు పెడుతున్నారు. పరిశుద్ధంగా ఉండే ఉప్పుటేరు కలుషితం కావడం, చెరువుల చుట్టూ ఫెన్సింగ్ వేయాలని అధికారులు ప్రయత్నించడం పట్ల వారు వేదన చెందుతున్నారు. పాలకులు, అధికారులు అండగా నిలవకపోవడంతో కోర్టులను ఆశ్రయించాల్సిన స్థితికి చేరామని వాపోతున్నారు. ప్రజల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు పరిశ్రమలు అవసరమే అయినప్పటికే వారి ఉనికికి భంగం కలిగించే నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థానికుల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముంది.చెరువే ఆధారం మా బతుకుతెరువు పోతోంది. సముద్రంలోకి వేటకు వెళ్తే చనిపోతున్నాం. ఆ పక్కన నిర్మిస్తున్న ఒక నిర్మాణం వల్ల మాకు ఈ గతి పట్టింది. శారద నదిలోకి ఎలాగూ వెళ్లలేకపోతున్నాం. గ్రామం ఉన్నంతకాలం చెరువే ఆధారం. మా బాధను కూడా అర్థం చేసుకోండి. మేమెలా బతుకుతామో ఆలోచించండి. –పైడిరాజు, వాడనరసాపురం గ్రామాలను తరలించిన తర్వాతే.. మా తాతల కాలం నుంచి పైడమ్మ చెరువు మీద ఆధారపడి జీవిస్తున్నాం. చేపల వేటతోపాటు మా పశువులకు కూడా ఆ చేరువే ఆధారం. ఒకప్పుడు సముద్రంలో వేటకు వెళ్లేందుకు అవకాశం ఉండేది. శారద నదిలోకి వెళ్లేందుకు ఉన్న అవకాశాన్ని అడ్డుకునేలా నేవల్ బేస్ వారు గోడలు కట్టారు. ఇప్పుడు మిగిలిన ఆధారం పైడమ్మ చెరువు. దీని చుట్టూ కూడా ఫెన్సింగ్ వేస్తే మా బతుకు తెరువు ఎలా చెప్పండి. మా గ్రామాలను తరలించిన తర్వాతే చెరువు విషయంలో నిర్ణయం తీసుకోండి. –మెరుగు నూకరాజు, వాడనరసాపురం -
తిమిరాం వారపు సంతకు దసరా శోభ
దేవరాపల్లి: మండలంలోని తిమిరాంలో శుక్రవారం జరిగిన వారపు సంత దసరా శోభను సంతరించుకుంది. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని పొట్టేళ్లు, మేకపోతులు, నాటుకోళ్లకు యమ గిరాకీ ఏర్పడింది. దసరాకు ముందు వచ్చే సంత కావడంతో జిల్లా నలుమూలల నుంచి గొర్రెపోతులు, మేక పోతులతో పాటు నాటు కోళ్లును విక్రయించేందుకు రైతులు అధిక సంఖ్యలో తీసుకువచ్చారు. వీటిని కొనుగోలు చేసేందుకు విశాఖపట్నం, విజయనగరం, పాడేరు తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు, ప్రజలు తరలివచ్చారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని మోటార్లు, మోటారు వాహనాలకు, యంత్ర పరికరాలకు పొట్టేళ్లు, నాటు కోళ్లను మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ.. ఈ నేపథ్యంలోనే ఇక్కడి వారపు సంతకు జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో కొనుగోలుదారులు రావండతో వీటి ధరలు అమాంతం పెరిగాయి. ఇక్కడి వారపు సంతలో తక్కువ ధరకు ఆరోగ్యకరమైన పొట్టేళ్లు, మేక పోతులు, నాటుకోళ్లు లభిస్తాయన్న అభిప్రాయంతో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తారు. 10 కిలోల బరువు గల పొట్టేళ్లు రూ. 25 వేలు నుంచి రూ. 35 వేల వరకు ధర పలికాయి. సాధారణ రోజుల్లో రూ. 1500 నుంచి రూ. 2000 ధర పలికే కోళ్లకు రూ. 3000 నుంచి రూ. 5 వేలు వరకు ధరలు పెరగాయి. వారపు సంతకు భారీగా వచ్చిన పొట్టేళ్లు, మేకపోతులు అమాంతంగా పెరిగిన ధరలు నాటు కోళ్ల ధరలకు రెక్కలు కొనుగోలుదారులతో కిటకిటలాడిన వారపు సంత ప్రాంగణం -
నిలిచిన పోలవరం పనులు
యలమంచిలి రూరల్: తమ ప్రభుత్వం పోలవరం ఎడమ ప్రధాన కాల్వ నిర్మాణ పనులకు అధిక ప్రాధాన్యతనిస్తోందని,ఈ ఏడాది డిసెంబరు కల్లా పనులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పలుమార్లు చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు పొంతన కుదరడంలేదు. ఇందుకు జిల్లాలో జరుగుతున్న పోలవరం ఎడమ ప్రధాన కాల్వ నిర్మాణ పనులే ఉదాహరణగా చెప్పొచ్చు. దార్లపూడి నుంచి తాళ్లపాలెం వరకు జరుగుతున్న 7వ ప్యాకేజీ పనులు నెలరోజులుగా నిలిచిపోయాయి.నిర్మాణ పనులు చేపడుతున్న కేసీఎల్ సంస్థకు రూ.20కోట్లకు పైగా బిల్లుల బకాయిలు కూటమి ప్రభుత్వం చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని ప్రకటనలు చేస్తున్నారే తప్ప పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థకు బిల్లులు చెల్లించడంలేదు.ఫలితంగా కాంట్రాక్టు సంస్థలు కూడా పనులు కొనసాగించలేని పరిస్థితి నెలకొంది.గత 7 నెలలుగా పోలవరం ఎడమ ప్రధాన కాల్వ 7వ ప్యాకేజీ పనులకు సంబంధించి చేస్తున్న పనుల బిల్లులు సుమారు రూ.20 కోట్లకు పైగా పేరుకుపోయాయి.ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి 7వ ప్యాకేజీ పనులు పట్టాలెక్కించిన కూటమి ప్రభుత్వం ఆరంభంలో పోలవరం ఎడమ కాల్వ పనులను త్వరితగతిన చేయిస్తున్నామంటూ ప్రకటనలు గుప్పించింది. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు సైతం జిల్లాలో 7వ ప్యాకేజీ పనులను పరిశీలించారు. బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తామని అధికార్లు చెప్పడంతో కాంట్రాక్టు సంస్థ బిహార్ సహా ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు,ఇంజినీర్లను రప్పించి స్ట్రక్చర్లు,అక్విడెక్టుల నిర్మాణ పనులను చేయించింది.పనులు పురోగతిలో ఉన్న సమయంలో కాంట్రాక్టు సంస్థకు బిల్లులు చెల్లింపును ప్రభుత్వం నిలిపివేసింది.సంస్థలో పనిచేసే ఇంజినీర్లు,కూలీలు,వాహనాల అద్దె,ఇతర నిర్వహణ ఖర్చులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ పనిచేయడానికి వచ్చిన కూలీలు సొంతరాష్ట్రాలకు వెళ్లిపోయారు.అద్దెకు తెచ్చిన టిప్పర్లు, ఇతర వాహనాలను యజమానులు తీసుకెళ్లిపోయారు.క్షేత్రస్థాయిలో పనిచేసే ఇంజినీర్లు,సిబ్బంది కూడా విధులకు సక్రమంగా హాజరుకావడంలేదు.ప్రస్తుతం కాంట్రాక్టు సంస్థ కార్యాలయం వద్ద రెండు,మూడు వాహనాలు మాత్రమే కనిపిస్తున్నాయి.వందమందికి పైగా కూలీలు ఉండాల్సిన చోట 10మంది వరకే కూలీలు కనిపిస్తున్నారు. పనులు చురుగ్గా జరిగేటప్పుడు ఏటికొప్పాక వద్ద కాంట్రాక్టు సంస్థ క్యాంపు కార్యాలయం వద్ద సందడిగా ఉండేది.పనులు నిలిపోవడంతో అక్కడ నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తోంది. డిసెంబరుకు పూర్తి కావడం డౌటే? జిల్లాలో పోలవరం ఎడమ ప్రధాన కాల్వ పనులు 6,7 ప్యాకేజీలుగా జరుగుతున్నాయి.వీటిలో రూ.331.73 కోట్లతో పాయకరావుపేట నుంచి దార్లపూడి వరకు సుమారు 25 కిలోమీటర్ల పొడవున 6ఏ ప్యాకేజీ పనులు బెంగళూరుకు చెందిన బీఎస్సార్ ఇన్ఫ్రా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేస్తోంది.గత ఏడు నెలల్లో 6ఏ ప్యాకేజీ పనులు 18శాతం జరిగాయి.ఈ పనులకు సంబంధించిన ఇటీవల కొంత మొత్తం కాంట్రాక్టు సంస్థకు చెల్లించారు. ఇంకా రూ.25కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది.దార్లపూడి నుంచి తాళ్లపాలెం వరకు సుమారు 26 కిలోమీటర్ల 7వ ప్యాకేజీ పనులను రూ.304.98 కోట్లతో అహ్మదాబాద్‌కు చెందిన కేసీఎల్ జేసీసీ సంస్థ చేస్తోంది.7వ ప్యాకేజీలో కొంతమేర పనులు పూర్తయినప్పటికీ ప్యాకేజీలో ముఖ్యమైన ఏటికొప్పాక వద్ద అక్విడెక్టు నిర్మాణ పనులు, కాంక్రీటు స్ట్రక్చర్లతో పాటు తాళ్లపాలెం సమీపంలో కొంత భూసేకరణ జరగాల్సి వుంది.చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు దిక్కుతోచనిస్థితిలో నిత్యం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.6వ ప్యాకేజీ పనులు వచ్చే ఏడాది జనవరి,7వ ప్యాకేజీ పనులు ఈ ఏడాది డిసెంబరుకు పూర్తి చేయాలని కాల్వ పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థలకు ప్రభుత్వం గడువు పెట్టింది.సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో నిర్దేశించిన గడువులోగా జిల్లాలో పోలవరం ఎడమ ప్రధాన కాల్వ పనులు జరగడం సందేహమే.ఈ ప్రాంత ప్రజలకు జీవనాడిలాంటి పోలవరం పనులను త్వరితగతిన పూర్తి చేసి గోదావరి జలాలలను సాగు,తాగునీరు,పారిశ్రామిక అవసరాలకు అందించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది.కేంద్రం,రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి కాబట్టి పోలవరం ప్రాజెక్టుకు నిధుల కొరత లేకుండా పనులు పూర్తయ్యేలా చూడాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.తిమిరాం వారపు సంతకు దసరా శోభ సంతకు భారీగా వచ్చిన పొట్టేళ్లు, మేకపోతులు అమాంతంగా పెరిగిన ధరలు నాటు కోళ్ల ధరలకు రెక్కలు పోలవరం ఎడమ ప్రధాన కాల్వ 7వ ప్యాకేజీ పనులకు సంబంధించి కాంట్రాక్టు సంస్థకు రూ.20కోట్ల వరకు బిల్లుల చెల్లింపులు జరగాల్సి ఉంది.ఇటీవల కాల్వ నిర్మాణ పనులు నెమ్మదించాయి.వర్షాల కారణంగా కూడా పనులు చేపట్టడానికి ఇబ్బందులు కలుగుతున్నాయి. 6ఏ ప్యాకేజీకి సంబంధించి పెండింగ్ బిల్లులు చెల్లింపులు ప్రారంభమయ్యాయి.7వ ప్యాకేజీ బిల్లులు కూడా త్వరలో చెల్లించే అవకాశం ఉంది. గడువులోగా పనులు పూర్తి చేయలేకపోతే మరోసారి గడువు పొడిగింపునకు కాంట్రాక్టు సంస్థ కోరవచ్చు. – జి.రామకోటేశ్వరరావు, ఈఈ, పోలవరం ఎడమ ప్రధాన కాల్వ 6,7 ప్యాకేజీలు నెల రోజులుగా 7వ ప్యాకేజీ పనులకు బ్రేక్ రూ.20 కోట్లకు పైగా బిల్లుల పెండింగ్ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన ఇంజినీర్లు, కూలీలు కాంట్రాక్టు సంస్థ కార్యాలయం వద్ద కనిపించని వాహనాలు డిసెంబరులోగా పనులు పూర్తి డౌటే -
వరికి ‘సుడి’ దెబ్బ
రాంబిల్లి(అచ్యుతాపురం): జిల్లాలో వరినాట్లు వేసి 20 నుంచి 30 రోజులు దాటింది. ప్రస్తుత వాతావరణ మార్పులతో వరి పైరులో సుడిదోమ, తెల్లవీపు మచ్చల దోమల ఉధృతి అధికంగా ఉంది. ఈ దోమలు వరి దుబ్బుల ద్వారా రసం పీల్చడంతో పైరంతా ఎండిపోయినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త బండి నాగేంద్రప్రసాద్ ఇటీవల రాంబిల్లి మండలంతోపాటు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆయన క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఆర్జీఎల్ – 2537( శ్రీకాకుళం సన్నాలు) రకానికి దోమల తీవ్రత అధికంగా ఉన్నట్లు గుర్తించారు. బీసీటీ 5204(సాంబమసూరి) రకానికి కొద్దిగానూ, ఎంటీయూ 1062( ఇంద్ర) రకానికి దోమల తాకిడి లేనట్లుగా గుర్తించారు. వరి పంటను ఆశించిన దోమలు, నివారణ మార్గాలు, జాగ్రత్తలపై రైతులకు పలు సూచనలు చేశారు. దోమల ఉధృతికి కారణాలు... ● అధిక తేమతో కూడిన పొడి వాతావరణం ● మోతాదుకు మించి ఎరువుల వాడకం ● దమ్ము సరిగ్గా చేయకపోవడం ● గట్లు శుభ్రం లేకపోవడం తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ● ప్రతి రెండు మీటర్ల నాట్లకు 20 సెంటీమీటర్ల కాలిబాటలు వదలాలి. ● దోమ నివారణకు మందు పిచికారీ చేసేటప్పుడు ముందుగా గట్టు చుట్టూ పిచికారీ చేసిన తర్వాత బొంగరం మాదిరిగా పొలంలో మందు పిచికారీ చేయాలి. ● పొలంలో నీటిని తీసివేసి సాయంత్రం సమయంలో మందు పిచికారీ చేయడం శ్రేయస్కరం ● పొలంలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు నీటిని తీసివేయాలి. అవకాశం ఉన్నంత వరకూ పొలాన్ని ఆరబెట్టాలి. ● సిఫారసు చేసిన మోతాదు మేరకే నత్రజని వాడాలి. ● కొన్ని రకాల మందుల పిచికారీ వల్ల దోమల ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున స్థానిక వ్యవసాయ అధికారుల సిఫారసు మేరకు వాటిని నియంత్రించాలి. నివారణ ఇలా... ప్రస్తుతం దోమల ఉధృతి అధికంగా ఉన్నందున వాటి ప్రభావం లేని పొలాల్లోనూ వేప నూనె పిచికారీ చేసుకోవాలి. ● దోమ ఉధృతి ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఎసిఫేట్ 75 ఎస్పీ 250 గ్రాములు లేదా 300 గ్రాముల చొప్పున లేదా ఇమిడాక్లోప్రిడ్ తోపాటు ఎథిప్రోల్ 80 డబ్ల్యూజీ 50 గ్రాములు లేదా ఇమిడాక్లోఫ్రిడ్ 17.8 శాతం ఎస్ఎల్ మందు 50 మిల్లీలీటర్లు లేదా బ్యుప్రొఫిజోన్ 25 శాతం ఎస్సీ 300–320 మిల్లీలీటర్లు చొప్పున ఏదో ఒక మందును ఎకరాకు చొప్పున పిచికారీ చేయాలి. ● దోమ ఉధృతి ఎక్కువగా ఉన్న మేరకు స్థానిక వ్యవసాయాధికారుల సూచనలతో తగిన మందులు పిచికారీ చేయాలి. ● పంట ప్రారంభ దశలో ఉన్నందున దోమల ఉధృతి పెరిగే అవకాశం ఉన్న మేరకు ముందుగా తక్కువ ప్రభావం ఉన్న మందుల్ని, అప్పటికే తగ్గకపోతే నెల రోజుల తర్వాత అధిక ప్రభావం ఉన్న మందుల్ని స్థానిక వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పిచికారీ చేయాలి. ● నిర్దేశించిన మోతాదుకు మంచి మందును పిచికారీ చేస్తే మళ్లీ దోమల ఉధృతి పెరిగినప్పుడు నియంత్రించడం కష్టమవుతోంది. ● రెండో సారి మందును ఉపయోగించాల్సి వస్తే మొదటి సారి వాడిన మందును కాకుండా వేరొక మందను పిచికారీ చేయాలి. పైరులో రసం పీల్చుతున్న సుడిదోమ, తెల్లవీపు మచ్చల దోమ శ్రీకాకుళం సన్నాలు, సాంబ మసూరిపై దాడి నివారణకు బొంగరం పద్ధతిలో మందుల పిచికారీ మేలు ఇంద్ర రకం వాడుతున్న రైతులు సేఫ్ -
ఏయూ అంతర్ కళాశాల క్రీడా పోటీలు ప్రారంభం
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా ఏయూ అంతర్ కళాశాల క్రీడా పోటీల్లో భాగంగా పురుషుల కబడ్డీ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఏయూ ఉపకులపతి ఆచార్య జీపీ రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని, ఏయూ జిమ్నాజియం కబడ్డీ మ్యాట్‌పై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ గుర్తింపు పొందిన కళాశాలల కబడ్డీ క్రీడాకారులు పాల్గొనడంపై అభినందనలు తెలిపారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా క్రికెట్, కబడ్డీ, ఖోఖో పోటీలు కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ పోటీల్లో ఏయూ అనుబంధ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏయూలోని క్రీడా మైదానాలను సింథటిక్ మైదానాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలని సూచించారు. అలాగే, ఈ సంవత్సరం నుంచి ఇంటర్ కాలేజియేట్ క్రీడల్లో పాల్గొనే వారికి భోజన సదుపాయంతో పాటు, ఇతర యూనివర్సిటీలకు వెళ్లే క్రీడాకారుల డీఏను పెంచినట్లు వివరించారు. ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్ మాట్లాడుతూ వివిధ జిల్లాలకు చెందిన అనుబంధ కళాశాలల నుంచి 500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. ఇందులో సుమారు 35 జట్లు ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏయూ వ్యాయామ విద్యా విభాగం హెడ్ ఆచార్య ఎ. పల్లవి, ఐఐపీఈ స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ జి. వెంకటేశ్వరరావు, పీడీలు పాల్గొన్నారు. -
పునరావాస కాలనీకి తరలిరావాలి
నక్కపల్లి: పరిశ్రమల కోసం ఏపీఐఐసీకి నివాస ప్రాంతాలను ఇచ్చిన నిర్వాసితులు ప్రభుత్వం ఏర్పాటు చేసే పునరావాస కాలనీలకు తరలిరావాలని కలెక్టర్ విజయ కృష్ణన్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం ఆమె నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వేంపాడు, డీఎల్ పురం, రాజయ్యపేట, అమలాపురం గ్రామాలకు చెందిన నిర్వాసితులతో సమావేశమయ్యారు, 750 మందిని గుర్తించి వారికి పెద బోదిగల్లం వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో ఇళ్ల స్థలాలు కేటాయించినట్టు చెప్పారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.8.98 లక్షలు ఇస్తున్నామని, ఇల్లు నిర్మించుకునే వారికి ఇసుక, సిమెంట్, ఐరన్ తక్కువ ధరకు ఇప్పిస్తామన్నారు. అలాగే కాలనీలో డ్రెయినేజీలు, రోడ్లు, తాగునీటి సరఫరా, విద్యుచ్ఛక్తి వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు. నిర్వాసితుల్లో ఎంతమంది పునరావాస కాలనీకి రావడానికి సిద్ధంగా ఉన్నారనే వివరాలను తెలుసుకున్నారు. నిర్వాసితులందరూ ఇక్కడకు వచ్చేలా అధికారులు, నాయకులు చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించే పనులు త్వరగా పూర్తిచేయాలని ఆధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వి.వి.రమణ, తహసీల్దార్ మూర్తి, డీటీ నారాయణరావు, పలువురు నిర్వాసితులు పాల్గొన్నారు.నిర్వాసితులకు కలెక్టర్ సూచన -
ఉద్యోగుల గ్రీవెన్స్‌కు 13 అర్జీలు
ఉద్యోగుల సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్ విజయ కృష్ణన్ తుమ్మపాల: ఉద్యోగుల వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగుల ప్రత్యేక గ్రీవెన్న్స్లో ఆమె ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల మూడో శుక్రవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డేకి పలువులు ఉద్యోగులు హాజరై వారి సమస్యలపై అర్జీలు అందజేశారు. న్యాయమైన, పరిష్కరించడానికి అవకాశం గల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆమె ఆదేశించారు. మొత్తం 13 మంది ఉద్యోగులు వారి సమస్యలపై అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి సుబ్బలక్ష్మి, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి విజయ్ కుమార్, పీజీఆర్ఎస్ సెల్ సూపరింటెండెంట్ సురేష్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
రూ. 6,400 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలి
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా అనకాపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు బకాయిపడ్డ రూ.6,400 కోట్లు తక్షణమే కూటమి ప్రభుత్వం విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద శుక్రవారం విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జి.ఫణీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో ఏర్పాటు చేసిన 17 మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే విధానాన్ని విడనాడాలన్నారు. రాష్ట్ర సభాపతి అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మాకవరపాలెం మెడికల్ కళాశాలను పూర్తిస్థాయిలో ప్రభుత్వమే నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.బాబ్జి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అధికారం చేపట్టిన తర్వాత గాలికి వదిలేసిందన్నారు. విద్యార్థులు సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ఎ. జగదీష్ జిల్లా ఉపాధ్యక్షుడు సింహాద్రి, జిల్లా కార్యదర్శి రాజు, విద్యార్థులు పాల్గొన్నారు. -
గంజాయి కేసులో నిందితుడి అరెస్టు
వివిధ స్టేషన్లో 8 కేసులు నమోదు గొలుగొండ: గంజాయి కేసులో తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని ఎస్ఐ రామారావు శుక్రవారం అరెస్టు చేశారు. గత నెలలో ఏజెన్సీ నుంచి కారు, బైక్‌లో 216 కిలోల గంజాయి అక్రమంగా తరలిస్తుండగా, ఏటిగైరంపేట వద్ద బుచ్చెయ్యపేటకు చెందిన చొప్పా నాగరాజు(38) అప్పట్లో తప్పించుకున్నాడు. అప్పటి నుంచి అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఎస్ఐ చాకచక్యంగా పట్టుకొని కోర్టుకు తరలించారు. అతడిపై వివిధ పోలీస్ స్టేషన్లో 8 కేసులు నమోదు కాగా, బుచ్చెయ్యపేట స్టేషన్లో రౌడీ షీట్ ఓపెన్ చేశారు. నిందితుడిని పట్టుకున్న గొలుగొండ ఎస్ఐ రామారావు, సిబ్బందిని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, రూరల్ సీఐ రేవతమ్మ అభినందించారు. -
కేజీహెచ్‌లో కమీషన్ల చిచ్చు
మహారాణిపేట: ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్ ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఆసుపత్రిలో ఉన్నతాధికారుల మధ్య కమీషన్ల పంపకాల విషయంలో తలెత్తిన విభేదాలు, కుమ్ములాటలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటు కేజీహెచ్‌లో.. అటు వైద్య ఆరోగ్య శాఖలో పంపకాల బాగోతం హాట్‌టాఫిక్‌గా మారింది. ఇటీవల ఆసుపత్రిలో ఆక్సిజన్, సర్జికల్ పరికరాలు, మందుల కొనుగోలు కోసం సుమారు రూ. 7 కోట్లు వెచ్చించారు. ఈ కొనుగోళ్లకు సంబంధించి దాదాపు రూ.42 లక్షలు కమీషన్‌గా చేతులు మారినట్లు సమాచారం. అయితే, ఈ కమీషన్ డబ్బు పంపకాల్లో తేడాలు రావడంతో పరిపాలన విభాగాల్లోని అధికారుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. వాటాల విషయంలో తలెత్తిన వివాదం ఎంతగా ముదిరిందంటే, ఒక అధికారి చాంబర్లో చెక్కులు, కాగితాలు విసిరికొట్టే స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. వివిధ విభాగాల గుమస్తాలు, అధికారుల నుంచి ఉన్నత స్థాయి వరకు పంపకాలు జరిగాయని సమాచారం. కేవలం ఈ ఒక్క సంఘటనే కాదు.. కేజీహెచ్‌లో అవినీతి వ్యవస్థీకృతంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమ్యామ్యాల ముట్టజెప్పకపోతే కొనుగోళ్లు, టెండర్లు, ఇతర పనులకు సంబంధించిన ఫైళ్లు ముందుకు కదలవని, వాటిని ఏదో ఒక మూలన పడేస్తున్నారని సిబ్బందే గుసగుసలాడుకుంటున్నారు. ప్రతి పనికి డబ్బులు లంచంగా ఇవ్వనిదే జరగని పరిస్థితి నెలకొందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ కమీషన్ల భాగోతం బయటకు పొక్కడంతో.. నీ వల్లే బయటపడింది అంటూ అధికారులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నట్లు సమాచారం. కేజీహెచ్‌లో ఈ అవినీతి జాడ్యం ముదరకముందే కలెక్టర్ జోక్యం చేసుకుని, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
హెటెరో గొడౌన్లో తనిఖీలు
తనిఖీలు చేస్తున్న యూఎస్ అధికారులు నక్కపల్లి: మండలంలో వెదుళ్లపాలెం సమీపంలో నిర్వహిస్తున్న హెటెరో గోదాముల్లో యూఎస్ ఎఫ్‌డీఏ బృందాలు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశాయి. ఇక్కడ కంపెనీ వారు అద్దె గృహాన్ని తీసుకుని ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిసింది. ఎటువంటి నేమ్ బోర్డు లేకుండా ఉన్న ఈ గోదామును, ట్రైనింగ్ సెంటరును ఢిల్లీ నుంచి వచ్చిన యూఎస్ ఎఫ్‌డీఏ బృందాలు పరిశీలించాయి. కొన్నేళ్ల క్రితం గోదాములను నిర్మించారు. అక్కడ కొన్ని ఔషధాలను ఉంచినట్లు బోగట్టా. ఈ గోదాములను కూడా ఈ బృందాలు పరిశీలించాయి. యూఎస్ డ్రగ్ బృంద అధికారి అక్తర్ ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నట్లు సమాచారం. -
అమరజీవి ఆశయ సాధనకు కృషి చేయాలి
పొట్టి శ్రీరాములు మేనల్లుడు గునుపూడి వెంకట సత్యనారాయణ అనకాపల్లి: నేటి యువత అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు కృషి చేయాలని ఆయన మేనల్లుడు గునుపూడి వెంకట సత్యనారాయణ కోరారు. స్థానిక మెయిన్‌రోడ్డులో అమరజీవి పొట్టి శ్రీరాములు భవనం 24వ వార్షికోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదవడం వల్ల ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు శ్రీరాములు ప్రాణత్యాగం గురించి వివరించారు. అనంతరం పట్టణంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు, మహిళా కళాశాల విద్యార్థినులకు 3 వేలు నోట్ పుస్తకాలను, పెన్నులు ఉచితంగా పంపిణీ చేశారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పి.వి.ఎం.నాగజ్యోతిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పోట్టి శ్రీరాములు భవన నిర్మాణ వ్యవస్థాపకుడు పిరాట్ల నరసింహామూర్తి, సభ్యులు కాండ్రేగుల దుర్గాప్రసాద్‌రావు, కాండ్రేగుల సత్యనారాయణ, గంగుపాము నాగేశ్వరరావు, ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు లావణ్య, కార్యదర్శి ఉమ, కో ఆర్టినేటర్ మంజు భార్గవి, తదితరులు పాల్గొన్నారు. -
గుంతలు పూడ్చలేకపోతే కాంట్రాక్టు వదులుకోండి
రావికమతం: బిల్లులు చెల్లించకుంటే ఇకపై రోడ్డు అభివృద్ధి పనులు చేయలేమని బీఎన్ రోడ్డు కాంట్రాక్టర్ చెప్పడంతో.. గుంతలు పూడ్చలేకపోతే కాంట్రాక్టు వదులుకొమ్మని ఆర్అండ్బి చీఫ్ ఇంజినీరు విజయశ్రీ స్పష్టం చేశారు. రావికమతం మండలం గర్నికం–మేడివాడ గ్రామాల మధ్య బీఎన్ రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతలను ఆమె శుక్రవారం పరిశీలించారు. ఈ భారీ గుంతల వల్ల వాహనదారులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను మండల ప్రజా పతినిధులు పలుమార్లు ఆర్ అండ్ బీ అధికారుల దృష్టికి వచ్చారు. దీనిపై స్పందించిన చీఫ్ ఇంజినీర్ విజయశ్రీ తక్షణమే గుంతలను పూడ్చించాలని కాంట్రాక్టర్ వెంకటేశ్వరరావును ఆదేశించారు. ప్రస్తుత పరిస్ధితుల్లో రోడ్డు పనులు చేయలేమని కాంట్రాక్టర్ చెప్పారు. బిల్లులు చెల్లించకుంటే పనులు చేయలేమని కాంట్రాక్టర్ చెప్పడంతో అతడిపై చీఫ్ ఇంజినీర్ విజయశ్రీ మండిపడ్డారు. గుంతలు పూడ్చలేని పక్షంలో కాంట్రాక్ట్ రద్దు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో చేపడుతున్న, నిర్మాణంలో ఉన్న పనులకు సుమారు రూ.130 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధుల విడుదలకు కృషి చేస్తామని చెప్పారు. అప్పటి వరకు రోడ్డుపై ఏర్పడిన గుంతలకు తాత్కాలిక మరమ్మతులు చేయాలని కాంట్రాక్టర్‌ను కోరామని తెలిపారు. బీఎన్ రోడ్డు కాంట్రాక్టర్‌కు స్పష్టం చేసిన ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజినీర్