చెరువులో పడి మాజీ ఎంపీటీసీ మృతి
రావికమతం: మండలంలో దొండపూడి మాజీ ఎంపీటీసీ తాళ్ల సత్యారావు (65) ఆదివారం ప్రమాదశాత్తు కాలు జారి పెద్ద చెరువులో పడి మృతి చెందాడు. గతంలో ఎంపీటీసీగా పనిచేసిన ఆయన ప్రస్తుతం కిరాణా వ్యాపారం చేస్తున్నాడు. తెల్లవారుజామున స్థానిక చెక్‌పోస్టు వద్ద బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి పెద్ద చెరువులో పడి మునిగి ఊబిలో చిక్కుకుని మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. సమాచారం మేరకు రావికమతం అగ్నిమాపక సిబ్బంది వచ్చి గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. పెద్ద కుమారుడు కళ్యాణం తండ్రికి చేదోడు వాదోడుగా ఉండగా, చిన్న కుమారుడు దుర్గాప్రసాద్ హైదరాబాద్‌లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొత్తకోట పోలీసులు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరిలించారు. మృతుడు భార్య రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. అందరితో కలుపుగోలుగా ఉండే సత్యారావు మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


